Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: గూర్ఖాలాండ్‌ ఆందోళనకు అసలు కారణం...?

డార్జిలింగ్‌ ప్రాంతంలో గూర్ఖాలాండ్‌ ఉద్యమం గూర్ఖా జనముక్తి మోర్చా (జిఎఎమ్‌) నాయకుడు బిమల్‌ గురుంగ్‌ నాయకత్వంలో జూన్‌ 8 నుంచి ఉధృతంగా, హింసాత్మకంగా సాగుతోంది. మిలటరీ సహాయంతో దాన్ని అదుపు చేద్దామని చూస్తున్నారు. సోషల్‌ మీడియాను ఆందోళనకారులు ఉపయోగించుకుంటున్నారనే సమాచారం రావడంతో బెంగాల్‌ ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో యింటర్నెట్‌ను నిషేధించింది. ఉద్యమం ప్రారంభమే తీవ్రస్థాయిలో మొదలైంది.

రాష్ట్రప్రభుత్వం డార్జిలింగ్‌కు కూడా ప్రాధాన్యత యిస్తోందని చూపడానికి మమతా బెనర్జీ 45 సం.ల తర్వాత జూన్‌ 8న డార్జిలింగ్‌లో గవర్నరు బంగళాలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసింది. తమ హయాంలో పర్వత ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు ఎలా చెప్పాలో చర్చించింది. ఆ బంగళాకు 200 మీ.ల దూరంలోనే వేలాదిమంది జిజెఎమ్‌ కార్యకర్తలు పోగుపడి రెండు గంటల పాటు పోలీసుల మీద, బాంబులు, రాళ్లు విసిరారు. 50 మందిని గాయపరిచారు.

పబ్లిక్‌, ప్రయివేటు వాహనాలను తగలబెట్టారు. ముఖ్యమంత్రి, తక్కిన మంత్రులు ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి, బాష్పవాయు ప్రయోగం చేసి గుంపులను చెదరగొట్టారు. దానికి నిరసనగా మర్నాడు  జిజెఎమ్‌ 12 గంటల బంద్‌ నిర్వహించింది. 10 వేల మంది టూరిస్టులు డార్జిలింగులో చిక్కడిపోవడంతో సైన్యం సహాయంతో వారిని వెనక్కి పంపిన మమతా బెనర్జీ తను మాత్రం కలకత్తా తిరిగి వెళ్లిపోకుండా ధైర్యంగా జనాల మధ్య తిరుగుతూ వారికి ధైర్యం చెప్పింది. అది గురుంగ్‌ను మరింత మండించింది.

నిజానికి లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో వున్నంతకాలం పర్వతప్రాంతాల్లో అలజడి సాగుతూనే వుంది. మమతా అధికారంలోకి వచ్చాక గురుంగ్‌తో చర్చలు జరిపి 2011లో గూర్ఖాలాండ్‌ టెరిటోరియల్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ (జిటిఏ) అనే ప్రాంతీయ మండలి ఏర్పాటు చేసి వారికి చాలా అధికారాలు కట్టబెట్టింది. అంతేకాదు అతనిపై వున్న హత్య కేసును తొక్కిపెట్టి వుంచింది. గురుంగ్‌తో విభేదించి బయటకు వెళ్లి అఖిల్‌ భారతీయ గూర్ఖా లీగ్‌ అని సంస్థ పెట్టిన మదన్‌ తమాంగ్‌ అనే అతన్ని 2010లో గురుంగ్‌ అనుచరులు నడివీధిలో నరికి చంపారు. ఆ కేసు పెండింగులో పెట్టడంతో, అధికారం దక్కడంతో గురుంగ్‌ శాంతించాడు.

మూడు దశాబ్దాల అనిశ్చిత పరిస్థితుల తర్వాత గత ఆరేళ్లగా ఆ ప్రాంతంలో శాంతి ఏర్పడింది. దానితోబాటు అభివృద్ధి కూడా బాగా జరగసాగింది. మమతా ప్రత్యేక శ్రద్ధ వహించి అక్కడి జిల్లాలను అభివృద్ధి పరిచింది. వివిధ జాతులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేసి జిజెఎమ్‌ ప్రాధాన్యతను తగ్గించింది. అందువలన తృణమూల్‌ పార్టీకి అభిమానులు పెరగసాగారు. అది గమనించి హర్కా బహదూర్‌ ఛెత్రి అనే అతను గురుంగ్‌ నుంచి విడిపోయి, తృణమూల్‌కు సహకరించసాగాడు. గురుంగ్‌కు యింకో యిబ్బంది కూడా వచ్చిపడింది. 2015లో సిబిఐ అతనితో సహా 23 మంది జిజెఎమ్‌ నాయకులపై మదన్‌ తమాంగ్‌ హత్య కేసులో కేసులు పెట్టింది. 

పరిస్థితి యిలా వుండగా మే నెలలో పర్వత ప్రాంతాల్లోని నాలుగు మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. డార్జిలింగులోని 32 సీట్లలో జిజెఎమ్‌ 31 గెలిచింది, కురసాంగ్‌లో 20లో 17, కాలింపాంగ్‌లో 21లో 19 గెలిచింది. అయితే 12 మంది జిజెఎమ్‌ నాయకులు తృణమూల్‌కు ఫిరాయించిన మిరిక్‌ మునిసిపాలిటీలో జరిగిన ఎన్నికలలో మాత్రం తృణమూల్‌ 9 సీట్లలో 6 గెలిచి నెగ్గి సొంతంగా అధికారం చేజిక్కించుకుంది. గతంలో యిలా ఎన్నడూ జరగలేదు.

వ్యవహారం యిలా సాగనిస్తే పర్వతప్రాంతంలో తన పలుకుబడి తగ్గిపోతుందని గురుంగ్‌ భయపడ్డాడు. ఇంతలో మే నెలలోనే మమతా బెంగాల్‌లో బెంగాలీని రెండవ లేదా మూడవ భాషగా తప్పనిసరిగా నేర్చుకుని తీరాలని నిబంధన పెట్టింది. ఇదే అదననుకుని జిజెఎమ్‌ జూన్‌ 1, 2 తారీకుల్లో స్కూళ్ల బంద్‌ నిర్వహించింది. వెంటనే మమతా తన అడుగు వెనక్కి తీసుకుని ఆ ఆదేశాలు డార్జిలింగ్‌, తెరాయి, దోఆర్స్‌లోని కొన్ని ప్రాంతాలకు వర్తించవని, అక్కడ బెంగాలీ ఐచ్ఛికమని సవరించుకుంది. కానీ జిజెఎమ్‌ ఆందోళన చేయడానికే నిశ్చయించుకుంది.  

జూన్‌ 8 నాటి సంఘటనల తర్వాత జూన్‌ 12 నుంచి ప్రభుత్వాఫీసుల నిరవధిక బంద్‌కు పిలుపు నిచ్చింది. దుకాణాలు కూడా మూసేయమంటే స్థానిక ప్రజలకు కోపం వస్తుందేమోనని దడిసింది. శాంతిభద్రతల అదుపుకు జూన్‌ 13 నుంచి సైన్యాన్ని దించారు. జూన్‌ 15న గురుంగ్‌ యింటిపై దాడి చేసి విల్లమ్ములతో సహా అనేక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గురుంగ్‌ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. నిరవధిక సంపూర్ణ బంద్‌కు పిలుపు నిచ్చాడు. అది యింకా కొనసాగుతోంది. జిటిఏకు జులైలో ఎన్నికలు జరగనున్నాయి.

వాటిలో తృణమూల్‌ గెలిస్తే గురుంగ్‌ పాప్యులారిటీ పూర్తిగా అడుగంటిపోతుంది. అందువలన ఎలాగైనా ఆ ఎన్నికలను వాయిదా వేయించాలని యీ ఆందోళన కొనసాగిస్తున్నాడు. ఆందోళనను పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటూ పాత డిమాండ్‌ను పునరుద్ధరించాడు. ఆ సెంటిమెంటు యింకా వర్కవుట్‌ అవుతోందిలా వుంది, ఆందోళన పెద్ద యెత్తునే నడుస్తోంది. 

జిజెఎమ్‌, కేంద్రంలో అధికారంలో వున్న ఎన్‌డిఏలో భాగస్వామి. దాని మద్దతుతోనే 2009, 2014 ఎన్నికలలో బిజెపి డార్జిలింగ్‌ పార్లమెంటు స్థానం గెలిచింది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పడదు. అందువలన మమత రాజకీయ మద్దతుకోసం కేంద్రంపై ఆధారపడకుండా సొంతంగా జిజెఎమ్‌కు ముకుతాడు వేయాలని చూస్తోంది. ఇప్పటిదాకా వారి ఆధ్వర్యంలో నడిచిన జిటిఏకు ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు ఏ విధంగా ఖర్చయ్యాయో ఆడిట్‌ చేయాలని ఆదేశించింది. జిటిఏకు 2011లో రూ. 3 వేల కోట్లు యిచ్చారు.

గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు యివ్వగా కేంద్రం 600 కోట్లు యిచ్చింది. కానీ జిటిఏ జమాఖర్చులు రాయటం లేదు. 2013-14 నుంచి దానిలో సభ్యులుగా వున్న జిజెఎమ్‌ నాయకుల ఆర్థిక నేరాల గురించి తెలుసు. అయినా యిన్నాళ్లూ వూరుకున్నారు. ఇప్పుడు బందాలు వేయాలి కాబట్టి ఆడిట్‌ను తెరపైకి తెచ్చారు. అంతేకాదు, జిజెఎమ్‌ పాలించిన మూడు హిల్‌ మునిసిపాలిటీలు - డార్జిలింగ్‌, కలింపాంగ్‌, కురసాంగ్‌ల నిధులను కూడా ఆడిట్‌ చేయిస్తోంది. 

ఇక గురుంగ్‌ ఆగ్రహం పట్టరాకుండా వుంది. మమతపై నిప్పులు కక్కుతున్నాడు, బెదిరిస్తున్నాడు. మమత బెదరటం లేదు. 'నెత్తిమీద మదన్‌ తమాంగ్‌ కేసు పెట్టుకుని నన్ను బెదిరించడానికి ఎంత ధైర్యం? ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు' అంది. గురుంగ్‌ 'ఆవిడ బెంగాల్‌కు ముఖ్యమంత్రి ఐతే, నేను గూర్ఖాలాండ్‌కు ముఖ్యమంత్రిని. బెంగాలీని ఐచ్ఛిక భాషగా కూడా యిక్కడ ఒప్పుకోము. ఆవిడ తన పవరు చూపిస్తే, నేను నా తడాఖా చూపిస్తా' అన్నాడు. చూపిస్తున్నాడు. 

కానీ అతను చేస్తున్నది పులిస్వారీ! ఇప్పుడు ఉద్యమం విరమిస్తే బలహీనుడనే ముద్ర పడుతుంది. కొనసాగిస్తే టూరిస్టులు రావడం మానేస్తారు. టూరిజమే జీవనోపాధిగా బతుకుతున్న స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు అతన్ని తిట్టుకుంటారు. ఈ యిరకాట పరిస్థితిలోంచి బయటపడాలంటే కేంద్రం చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం వహించాలి. కానీ కేంద్రం ప్రేక్షకస్థానం వదలి రావటం లేదు. (ఫోటో - బిమల్‌ గురుంగ్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  
-mbsprasad@gmail.com