cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కరుణానిధి శకం ముగిసింది

ఎమ్బీయస్‌: కరుణానిధి శకం ముగిసింది

కరుణానిధి గతించడంతో ఒక శకం ముగిసినట్లే. ఆ శకాన్ని ద్రవిడశకం అన్నా అనవచ్చు. తమిళనాట ద్రవిడోద్యమానికి పట్టుకొమ్మగా నిలిచిన టైటాన్స్‌లో ఆఖరి టైటాన్‌ కరుణానిధి. తర్వాతివాళ్లు ఆ ఉద్యమం పేరు చెప్పుకోవచ్చు. దాని వారసులమని అనుకోవచ్చు. కానీ ఎడిఎంకె విషయంలో యిప్పటికే అది జావకారి పోయింది. స్టాలిన్‌ హయాంలో డిఎంకె దానితో పోటీ పడుతుంది తప్ప కరడు కట్టిన ద్రవిడవాదాన్ని వాటేసుకుంటుందని అనుకోను. ఇందుకంటే యిప్పటికే దానికి కాలం చెల్లిపోయింది. గ్లోబల్‌ విలేజి అనే భావన పాదుకొంటున్న కొద్దీ ప్రాంతీయవాదం పలచన పడుతుంది. కొద్ది మంది రాజకీయనాయకులకు తప్ప అది వేరేవారికి ఉపయోగపడదు. కరుణానిధీ ఆ విషయం గుర్తించాడు. అయితే బాహాటంగా చెపితే యిన్నేళ్ల తన యిమేజికి భంగం వాటిల్లుతుంది కాబట్టి, ద్రవిడ వాదాన్ని మధ్యమధ్యలో పలవరిస్తూ కాలం గడిపాడు.

కరుణానిధి పేరులోనే కరుణ ఉంది. కరుణ, ఔదార్యం అనే పదాలు ఆయనకు నప్పవు. నిజానికి ఆయన వైరుధ్యాలకే నిధి. చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఎన్నడూ లేదు. అసలు ద్రవిడవాదమే గందరగోళ వాదం. రామాయణం కట్టుకథ అంటూనే రావణలీలలు జరపడమేమిటి? రాముడు మిథ్య అయినప్పుడు రావణుడు ఎక్కణ్నుంచి వచ్చాడు? అతను ద్రవిడుడని ఏ ఆధారంతో చెప్తారు? బ్రాహ్మణ వ్యతిరేకత పునాదిగా వెలసిన ఉద్యమం బ్రాహ్మణుడైన రావణుణ్ని ఆకాశానికి ఎత్తడమేమిటి? మాట్లాడితే మేం నాస్తికుల మంటారు. ఈ నాస్తికత్వమంతా హిందూ దేవుళ్లని తిట్టడం వరకే పరిమితం. ముస్లిము, క్రైస్తవుల జోలికి ఎప్పుడూ వెళ్లలేదు, చర్చిల ముందు, మసీదుల ముందు ప్రదర్శనలు చేయలేదు, భక్తులు వెళ్లకుండా అడ్డం పడుక్కోలేదు, వాళ్ల పిలకలు కోయలేదు.

హిందూ దేవుళ్లలో కూడా అగ్రకులాలు ఆరాధించే దేవుళ్లనే అవమానించేవారు తప్ప తక్కువ కులాల వారు ఆదరించే గ్రామ దేవతల జోలికి వెళ్లలేదు. బ్రాహ్మణ వ్యతిరేక సామాజిక ఉద్యమంగా మొదలుపెట్టి తర్వాత రాజకీయాల్లోకి దిగారు. అప్పట్లో కాంగ్రెసు నాయకుల్లో బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేవారు కాబట్టి వీళ్లు బ్రిటిషు వారిని సమర్థించిన జస్టిస్‌ పార్టీకి కొమ్ము కాశారు. తర్వాత కాంగ్రెసులో కామరాజ్‌, భక్తవత్సలం వంటి బ్రాహ్మణేతర నాయకులు ముఖ్యమంత్రులైనా వీరు వారిని సమర్థించలేదు. కాంగ్రెసును గద్దె దింపారు. ఇక సామాజిక సంస్కరణల మాట కొస్తే ఉద్యమ మూలస్తంభం రామస్వామి నాయకర్‌ తన కంటె ఎంతో చిన్నదాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ కారణం చూపి అణ్నా, కరుణానిధి, తదితరులు బయటకు వచ్చారు. ఆ తర్వాత కరుణానిధి, ఎమ్జీయార్‌ వంటి వారు యిద్దరేసి భార్యలను ఒకేసారి మేన్‌టేన్‌ చేశారు. అదేమి సంస్కరణో మరి! మహిళల పట్ల కరుణానిధికి ఎంత చులకనో జయలలిత పట్ల వాడిన భాషే చెపుతుంది.

స్త్రీలోలత గురించి కథనాలే ఉన్నాయి. దశాబ్దాల సంస్కరణోద్యమం తర్వాత కూడా తమిళ సమాజం 'ఎన్‌లైటెన్‌డ్‌' అయిందని చెప్పలేం. చాదస్తాలతో, మూఢనమ్మకాలతో, కరడుగట్టిన ఛాందసత్వంతో తమిళ సమాజం తక్కిన దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తీసికట్టుగానే ఉంది. వీపు మీద మోకు గుచ్చుకుని దేవుడి రథాలు లాగడాలు, నాలికలో శూలం గుచ్చుకోవడాలు యింకా చూస్తూనే ఉంటామక్కడ. అంతేకాదు, మతపరమైన పిచ్చికి తోడు రాజకీయపరమైన పిచ్చి కూడా పట్టేసింది. వ్యక్తిపూజకు పరాకాష్ఠను తమిళనాడులోనే చూడగలం. తమ ప్రియతమ నాయకుడు అవినీతి ఆరోపణలపై అరెస్టయినా సరే, ఆత్మహత్యలు చేసుకోవడాలు, వాళ్లు ఛస్తే గుండు కొట్టించుకోవడాలు, నాయకురాలి ఆరోగ్యం బాగుపడాలని మహిళా ఎమ్మేల్యేల దగ్గర్నుంచి ఆకులు చుట్టుకుని గుళ్లకు వెళ్లడాలూ అక్కడే చూస్తాం. సినిమా నటీమణులకు కూడా గుళ్లు కట్టిన సమాజమది. ఇదీ దశాబ్దాల సంస్కరణోద్యమ ఫలాలు.

ఇక కులాల పరంగా ద్రవిడోద్యమం పెద్ద యుద్ధమే చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? కులాల పరంగా పార్టీలే ఏర్పడ్డాయి. డిఎంకె పార్టీ కూడా యిప్పటివరకు బ్రాహ్మణుడికి ఒక్కడికీ టిక్కెట్టు యివ్వలేదు. కులరహిత సమాజం కోసం శ్రమిస్తున్నాం అని చెప్పుకునేవారు, కులం పేరుతో బ్రాహ్మణులను వెలి వేయడమేమిటి? మతపరమైన ఆచారాల గురించి చెప్పాలంటే - శివాజీ గణేశన్‌ ఒక స్నేహితుడితో కలిసి తిరుపతికి వెళ్లినందుకే నానా యాగీ చేసిన డిఎంకె, ఆ తర్వాతి రోజుల్లో ఎంత మారింది? పోనుపోను ద్రవిడ నాయకులందరూ గుళ్లకు వెళ్లసాగారు. కరుణానిధి సైతం తన సొంత వూళ్లో గుడి రథానికి విరాళమిచ్చాడు. ఆయన కుటుంబసభ్యులు గుళ్లకు వెళతారనేది వేరే విషయం. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వారికి ఉంటుంది. స్వయంగా తాను దేవుళ్లను ఎద్దేవా చేస్తూ, యీ ద్వంద్వ వైఖరి ఏమిటి? మళ్లీ ఎవరైనా వెక్కిరిస్తారేమోనని, రెండు మూడేళ్ల కోసారి 'రాముడు ఏ ఇంజనీరింగు కాలేజీలో చదివాడు?' అంటూ వెకిలి వ్యాఖ్యలొకటి.

కాంగ్రెసు తరహా వారసత్వ రాజకీయాలపై డిఎంకె ఎంతో యాగీ చేసింది. తన దగ్గరకు వచ్చేసరికి కరుణానిధి కొడుకుల్నీ, కూతురినే కాదు, యావత్తు బంధువర్గాన్నీ దింపేశాడు. తన కొడుక్కి పట్టం కట్టడానికి తనతో పాటు ఎన్నో దశాబ్దాల పాటు పార్టీలో ఉన్నవాళ్లని కూడా దూరంగా పంపేశాడు. నిజానికి అణ్నా కాబినెట్‌లో కరుణానిధి ఒక మంత్రి మాత్రమే. అణ్నా మరణం తర్వాత వారసులెవరు అనే ప్రశ్న వచ్చినపుడు అతని కంటె అర్హతలున్న తక్కినవారున్నా ఎమ్జీయార్‌ మద్దతుతో కరుణానిధి సింహాసనం దక్కించుకున్నాడు. ఆ తర్వాత పార్టీ మొత్తం తన గుప్పిట్లోనే ఉండాలన్న వ్యూహంతో ఎమ్జీయార్‌కి యిబ్బందులు సృష్టించాడు. అతనికి పోటీగా తన కొడుకుని హీరోగా నిలబెడదామని శతథా ప్రయత్నించి విఫలమయ్యాడు.

ఎమ్జీయార్‌ కున్న బలం ఫ్యాన్స్‌ అసోసియేషన్లని గుర్తించి అభిమాన సంఘాలన్నీ చట్టవిరుద్ధమని ప్రకటించాడు. ఎమ్జీయార్‌ తమిళేతరుడని, మలయాళీ అని యాగీ చేశాడు. తమిళ ప్రొటక్షన్‌ ఫోర్స్‌ అనే పేర ఒక సంస్థ పెట్టించి, అతని సినిమాలు ఆడే హాళ్ల వద్ద ప్రదర్శనలు జరిపేట్లు చేశాడు. చివరకు అతన్ని పార్టీలోంచి నెట్టేశాడు. అలా చేసి, యిలా చేసి డిఎంకె అంటే కరుణానిధి తప్ప వేరే లీడరు లేడు అనేట్లు చేసుకున్నాడు. తనకు పోటీ వస్తారనుకునే వాళ్లనే కాదు, కొడుక్కి పోటీ వస్తారనుకునే వాళ్లనూ తొక్కి పారేశాడు. తనను వ్యతిరేకించిన వాళ్లను హింసించడంలో ఇందిరా గాంధీ కంటె నాలుగాకులు ఎక్కువ చదివాడు. ఇందిరకు సంజయ్‌ గాంధీలాగానే, కరుణానిధికి స్టాలిన్‌ అనేవారు. ఇప్పుడు పెద్దమనిషి అయ్యాడు కానీ స్టాలిన్‌ అంటే ఒక కాలంలో మద్రాసు వాసులు గడగడ లాడేవారు.

తను ముఖ్యమంత్రిగా ఉండగా ప్రధాని ఐన ఇందిరా గాంధీపై నియంత అని అనేక విమర్శలు గుప్పించిన కరుణానిధి పార్టీనే కాదు, ప్రభుత్వాన్నీ నియంత లాగే పాలించాడు. ఎదురాడినవారిని కేసులు పెట్టి హింసించాడు. లొంగని అధికారులనూ వేధించాడు. మీడియా పవర్‌ తొలుతగా గుర్తించినది ద్రవిడోద్యమ నాయకులే. తమ భావాలు వ్యాప్తి చేయడానికి, ప్రతిక్షకుల్ని అల్లరిపాలు చేయడానికి నాటకాల్ని, సినిమాలను విచ్చలవిడిగా వాడుకున్నారు. పార్టీ పత్రికలు పెట్టారు. ప్రయివేటు రంగంలో టీవీ రాగానే మొట్టమొదటగా దాన్ని అంది పుచ్చుకుని బాగా ఉపయోగించుకున్నది వారే. వీరందరిలో అగ్రశ్రేణిలో ఉన్నది కరుణానిధే. స్వతహాగా గొప్ప రచయిత కావడంతో ఆఖరిశ్వాస విడిచేవరకు కలానికి పదును తగ్గకపోవడంతో మీడియా మేనేజ్‌మెంట్‌లో ఆయనను మించినవారు లేకపోయారు. తను ఏం చేసినా సమర్థించుకోగల నేర్పు ఆయనకు పుష్కలంగా ఉంది. ఆ వాదనతో ఏకీభవించని వారిని కులం పేరుతోనో, మరోలాగానో రచ్చకీడ్చే మొరటుతనమూ ఉంది. నిజానికి తమిళభాషలో కానీ, తమిళ సంస్కృతిలో కానీ మొరటుతనాన్ని ప్రవేశపెట్టిన ఘనత ద్రవిడ నాయకులదే.

అవినీతిని ఒక వ్యవస్థగా మార్చిన ఘనత రుణానిధిదే. కాంగ్రెసు ముఖ్యమంత్రిగా భక్తవత్సలం (తమిళంలో పక్తవచ్చలం అనవచ్చు) ఉండగా, ఆయన పేరును 'పత్తు లచ్చం' (పది లక్షలు)గా వక్రీకరించి ఆయన లంచగొండి అని యాగీ చేసి అధికారంలోకి వచ్చిన డిఎంకె, అణ్నాదురై హయాంలో మాత్రమే అవినీతికి దూరంగా ఉందని చెప్పుకోవచ్చు. కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాక యిక చెలరేగి పోయాడు. తనే కాదు, పార్టీలో అందరికీ ఆ రోగం అంటించాడు. ఎమ్జీయార్‌ డిఎంకెలో ఉండే రోజుల్లో కరుణానిధి ఫలానాఫలానా వారి నుంచి లంచం తీసుకున్నాడని, అదంతా ఏం చేశాడో చెప్పాలని డిమాండ్‌ చేశాడు. కరుణానిధి పార్టీ పెద్దలతో మీటింగు పెట్టి, తను ఎంత తీసుకున్నదీ, వారిలో ఎవరెవరికి ఎంత యిచ్చినదీ లెక్కలు చెప్పాడట. దాంతో అందరూ తృప్తి పడ్డారు. అందరూ కరుణానిధి వెంటే నిలబడ్డారు. ఎమ్జీయార్‌ను పార్టీలోంచి బహిష్కరించినపుడు వారెవరూ అతని వెంట వెళ్లలేదు. తన అవినీతి గురించి కరుణానిధి చమత్కారంగా చెప్పుకున్న ఒక విషయాన్ని పిచ్చాపాటీ సమావేశాల్లో ప్రస్తావిస్తారు.

''ప్రభుత్వం తేనెను నా దోసిట్లో పోసి ప్రజలకు అందివ్వమని అడిగింది. ప్రజలకు యిచ్చాను కానీ కొంత నా అరచేతికి అంటింది. కడుక్కోవడం దేనికని దాన్ని నాకాను.'' అని చెప్పుకున్నాట్ట. తను ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం కరుణానిధి యితరుల అవినీతి గురించి నానా గలభా చేసేవాడు. అందువలన ఎమ్జీయార్‌ పదవిలో ఉన్నపుడు ఎవరైనా తన దగ్గరకు వస్తే తనకు రావలసినది మాట్లాడుకుని ''ఓసారి గోపాలపురం కూడా వెళ్లి కలవండి.'' అనేవాట్ట. గోపాలపురం అంటే కరుణానిధి నివాసం ఉన్న స్థలం. అలా ముడుతూ వచ్చింది కాబట్టే ఎన్నో ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా కరుణానిధి పార్టీ క్యాడర్‌ను కాపాడుకోగలిగాడు. జయలలితకు అలాటి మొహమాటాలు లేవు. అందుకే ఆమె అంటే కరుణానిధికి మహా కసి.

ద్రవిడ ఉద్యమం తను విగ్రహారాధనకు వ్యతిరేకం అని చెప్పుకుంది. కానీ చేసినదేమిటంటే దేవుడి విగ్రహాలు తీసేసి, తమ నాయకుల విగ్రహాలు పెట్టుకుని కార్యకర్తల చేత పూజలు చేయించుకుంది. పాత పేర్లు మార్చేసి,  పేటలకు, వీధులకు, ప్రభుత్వ సంస్థలకు తమ నాయకుల పేర్లు పెట్టింది. పెద్ద పెద్ద బ్యానర్లు, ఊరంత వాల్‌పోస్టర్లు, కటౌట్లు, సన్మానాలు, గజమాలలు, బిరుదులు, వర్ణనలు, ఉపమానాలు, అతిశయోక్తులతో ఉపన్యాసాలు.. ఓహ్‌, తమిళనాడు రాజకీయాల్లో ఉన్నంత హంగామా ఎక్కడా చూడం. ఇక గౌరవ డాక్టరేట్ల విషయం చెప్పనలవి కాదు. కరుణానిధి, ఎమ్జీయార్‌, జయలలిత అందరూ డాక్టర్లే. ఒక్కరూ డిగ్రీ కూడా చదవలేదు. కరుణానిధిని అసలు పేరుతో ప్రస్తావిస్తే తమిళనాడులో ఎగాదిగా చూస్తారు. అతడు కలైజ్ఞర్‌ (కలంజర్‌ అంటారు), అంటే కళాభిజ్ఞుడు. ఒట్టి కలైంజర్‌ అన్నా పనికి రాదు, డాక్టర్‌ కలైంజర్‌ అనాల్సిందే.

సిద్ధాంతాల గురించి కరుణానిధి మాట్లాడినంత ధాటీగా ఎవరూ మాట్లాడలేరు. కానీ రాజకీయం తప్ప మరొక సిద్ధాంతం లేని వ్యక్తి ఆయన. అక్కర ఉందంటే లెఫ్ట్‌, రైట్‌, సెంటర్‌ ఎవరితోనైనా చేతులు కలుపుతాడు, అక్కరలేదనుకుంటే కత్తులూ దూస్తాడు. ఎప్పుడేం చేసినా, దానికి ఓ సిద్ధాంతాన్ని ముడిపెడతాడు. కాంగ్రెసు, బిజెపి, కమ్యూనిస్టు అందరూ ఒకప్పటి మిత్రులే, ఒకప్పటి శత్రువులే. శాశ్వత శత్రుత్వమంటూ ఉంటే అది ఎడిఎంకె తో మాత్రమే! జయలలితకు మెరీనాలో సమాధి కట్టించవలసి వస్తుందేమోనని కరుణానిధి తను అధికారంలో ఉండగా 'అధికారంలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రులకు మెరీనా బీచ్‌లో సమాధి, మాజీ ముఖ్యమంత్రులకు గాంధీ మండపం వద్ద సమాధి' అని రూలు పాస్‌ చేశాడు.

జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చి చనిపోతే ఆ రూలు ప్రకారం ఆమెకు మెరీనా బీచ్‌లో సమాధి కడితే అది కుదరదంటూ తన పార్టీ అభిమానుల చేత కేసులు వేయించాడు. చివరకు తను ఏర్పరచిన రూలు తనకే అడ్డంకైంది. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి గాంధీమండపం వద్ద రెండు ఎకరాల స్థలం యిస్తానంది ప్రభుత్వం. అబ్బే కుదరదు, ఆయన ద్రవిడ ఉద్యమకారుడు, మరణానంతరమైనా సరే రాజాజీ, కామరాజ్‌ వంటి కాంగ్రెసు నాయకుల పక్కన ఎలా ఉండగలడు? అంటూ డిఎంకె అభ్యంతర పెట్టింది. చివరకు కోర్టు మెరీనాలో సమాధి చేయమంటే చేశారు. ఈ లెక్కన రేపుమర్నాడు పళనిస్వామి, పన్నీరు సెల్వం, శశికళ వంటి సదరు ద్రవిడ నాయకులు కూడా మెరీనాను అలంకరించ గలరన్నమాట!

ద్రవిడోద్యమానికి పూచిన మరో కొమ్మ హిందీ వ్యతిరేకత. తక్కిన కొమ్మలన్నీ విరిగిపోయినా దీన్ని మాత్రం పట్టుకుని యింకా వేళ్లాడుతున్నారు. తమిళ విద్యావంతుల్ని ఎవర్ని కదిపినా 'తమకు రాష్ట్రంలో ఉద్యోగాలు రావడం లేదని, ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రయత్నాలు చేసుకుందామంటే బడిలో హిందీ నేర్పకపోవడం వలన నష్టపోతున్నాం' అని వాపోతారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించే పరీక్షలకు కడుతూంటారు. ద్రవిడోద్యమానికి ముఖ్యమైన నినాదం - దక్షిణ భారతం విడిపోయి, ద్రవిడనాడు పేరుతో వేరే దేశంగా ఏర్పడాలని. ద్రవిడనాడు అనడమే తప్ప సాటి ద్రవిడులను, వారి భాషలను వారు గౌరవించినది ఎన్నడూ లేదు. కరుణానిధి తెలుగువాడని యివాళ మన టీవీ ఛానెల్స్‌ అన్నీ ఏకఘోష. అసలు రుణానిధికి మనవాళ్లు అంత ఘననివాళి అర్పించడమెందుకో నాకు అర్థం కావటం లేదు. కరుణానిధి తన తెలుగుదనాన్ని ఎక్కడా చాటుకోలేదు. తను 'పచ్చతమిళుడ'ననే చెప్పుకున్నాడు. ఎమ్జీయార్‌ను మలయాళీ అన్నపుడు అతను బయటపెట్టాడు - కరుణానిధి స్కూలు సర్టిఫికెట్టులో మాతృభాష తెలుగు అని ఉందని!

కరుణానిధికి తెలుగు ధారాళంగా వచ్చు. ప్రయివేటు సంభాషణల్లో తెలుగులో మాట్లాడతాడుట. కానీ బహిరంగంగా సభల్లో ఒక్క తెలుగు మాట మాట్లాడలేదు. తమిళనాడులో తెలుగు స్థానం నానాటికీ తీసికట్టు కావడానికి, తెలుగు ఉపాధ్యాయులను భర్తీ చేయకపోవడానికి, తెలుగు స్కూళ్లు మూత పడడానికి, మద్రాసు రైల్వే స్టేషన్‌లో రాకపోకల గురించి తెలుగు ప్రకటనలు ఆగిపోవడానికి కారకులైనవారిలో కరుణానిధిది ప్రథమస్థానం. సాటి తమిళులంటూ శ్రీలంక ఉగ్రవాదులని వాటేసుకున్నాడు కానీ, సాటి ద్రవిడులంటూ తెలుగువారికి చేసినదేమీ లేదు. తమిళాన్ని విపరీతంగా ప్రజలపై రుద్ది, తమిళనాడులో తక్కిన భాషలన్నిటినీ చిన్నచూపు చూడడానికి కారణం కరుణానిధి వంటి ద్రవిడ నాయకులే. ఎవరైనా ఉదారంగా వ్యవహరిద్దామన్నా, స్కూలు సిలబస్‌లో హిందీ పెడదామని తలపెట్టినా రంకెలు వేయడానికి కరుణానిధి రెడీగా వుండేవాడు. ఇప్పుడాయన లేడు కాబట్టి యికనైనా మార్పు వస్తుందని ఆశిద్దాం.

ద్రవిడ ఉద్యమాన్ని భ్రష్టు పట్టించిన నేతల్లో అగ్రతాంబూలం కరుణానిధిదే. అణ్నాదురై గురించి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడానికి విమర్శకులు తటపటాయిస్తారు. కానీ కరుణానిధి గురించి తిట్టడానికి బోల్డంత ఉంది. అయినా యిన్నేళ్లు పెద్ద నాయకుడిగా వెలిగాడంటే సొంత ప్రతిభే కారణం. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. మేధస్సుకు ప్రతిరూపం. పేరుకు తగ్గట్టుగానే ఆయన విషయగ్రహణశక్తి కానీ, జ్ఞాపకశక్తి కానీ, భావవ్యక్తీకరణ శక్తి కానీ అమోఘం, అద్వితీయం, అపూర్వం. నాటకాల్లో, డైలాగుల్లో ఆయన కనబరచిన ప్రతిభ జనాల్ని ఉర్రూత లూగించింది. శివాజీ కానీ ఎమ్జీయార్‌ కానీ ఎస్సెస్సార్‌ కానీ అంత మాస్‌ హీరోలయ్యారంటే కరుణానిధి కలమే దానికి ప్రధాన కారణం. ఆయన గొప్ప వక్త కూడా. ఆయన ఉపన్యాసాలకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఎంతోమంది దాన్ని అనుకరిస్తారు. అన్నిటినీ మించి గొప్ప నాయకుడు. కార్యకర్తలను ఎలా దువ్వాలో, ఎలా పిండాలో, ఎలా కిర్రెక్కించాలో, ఎలా నియంత్రించాలో తెలిసినవాడు.

రాజకీయ దురంధరుడు అనే పదానికి అసలైన నిర్వచనం కరుణానిధి. ఆయన స్నేహహస్తం చాచినప్పుడల్లా అవతలివాళ్లు అందుకున్నారంటే దానికి కారణం ఆయన వెనక ఉన్న ప్రజాబలం. ఎట్టి విపత్కర పరిస్థితుల్లో కూడా డిఎంకె ఓటు బ్యాంకు 25-30% మధ్య ఉండేట్లు చూసుకోగలిగాడు. తమిళనాడు రాష్ట్రంలో ప్రతి వీధీ ఆయనకు సుపరిచితమే. అన్ని చోట్లా తనకు ఓటు బ్యాంకు ఉండేట్లు చూసుకున్నాడు. తన కోసం ప్రాణాలు అర్పించే క్యాడర్‌ను నిర్మించుకున్నాడు. తమిళం మాత్రమే మాట్లాడుతూ గత ఏభై ఏళ్లగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగాడు. ఒక్క రాష్ట్రంలోనే బలమైన శక్తిగానే ఉన్నా జాతీయ నాయకులను తన దగ్గరకు రప్పించుకోగలిగాడు.

సంకీర్ణ ప్రభుత్వాలలో పాలు పంచుకుంటూ తమిళనాడుకి ఎన్నో ప్రాజెక్టులు తెప్పించుకోగలిగాడు. తన కుటుంబానికి, పార్టీకి ఎన్నో నిధులు సంపాదించుకోగలిగాడు. ఎంతటి వాళ్లూ ఆయనకు లొంగారు. అవినీతి మాట ఎలా ఉన్నా గొప్ప ఎడ్మినిస్ట్రేటర్‌గా కరుణానిధికి పేరుంది. అధికారులను గడగడ లాడించగలిగాడు. గొప్ప ఈస్తటిక్‌ సెన్స్‌ ఉంది. వళ్లువర్‌ కొట్టమ్‌ వంటి స్వయంగా డిజైన్‌ చేయగలిగాడు. ఎన్నో ప్రాంతాలను టూరిస్టు స్పాట్‌లుగా తీర్చిదిద్దాడు. తమిళానికి ఎంతో ప్రాధాన్యత తెచ్చిపెట్టాడు. సంపూర్ణ జీవితం గడిపాడు. తమిళ రాజకీయాలపై తనదైన ముద్ర వేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఉన్న తమిళనాయకుల్లో స్టాలినే బలవంతుడిగా కనబడుతున్నాడు. అతను ముఖ్యమంత్రి అయిన పక్షంలో తమిళనాడులో ప్రస్తుతం అణ్నా, ఎమ్జీయార్‌ల పేర్లతో ఎన్ని ఉన్నాయో అంతకు రెట్టింపు పేర్లతో సంస్థలు, విగ్రహాలు కరుణానిధి పేర వెలియడం ఖాయం.
-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2018)
mbsprasad@gmail.com

 


×