Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: మంత్రిగా లోకేశ్‌

లోకేశ్‌ మంత్రి అయ్యారు. మంత్రి కావడానికే ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికై కేబినెట్‌లోకి వచ్చి వుంటే ప్రజల కోరిక మేరకు మంత్రి అయ్యారని చెప్పుకునే వీలుండేది. కానీ ఎమ్మెల్యే కావాలంటే ఉపయెన్నిక జరపాలి. ఈయన కోసం ఎవరి చేతనైనా రాజీనామా చేయించి, ఆ స్థానంలో ఉపయెన్నిక పెడితే వైసిపి నుంచి వచ్చిన ఫిరాయింపుదారుల నియోజకవర్గాల్లో కూడా ఉపయెన్నిక పెట్టాలన్న డిమాండు రావచ్చు. ప్రతిపక్షాలు ఏమన్నా చలించని స్థితికి బాబు వచ్చారు కాబట్టి రేపు భూమా నాగిరెడ్డి ఖాళీ చేసిన స్థానంలో మాత్రమే ఎన్నిక జరిపి తక్కినవాటిని వదిలేసినా వదిలేయవచ్చు. ఏం చేసినా చెల్లుబాటు అయిపోతోంది. అందువలన లోకేశ్‌ కోసమే ఏదైనా ఉపయెన్నిక పెట్టినా పెట్టి వుండవచ్చు. కానీ ప్రతిపక్షాలన్నీ కక్ష కట్టి ప్రచారానికి దిగితే అనుకున్నంత మెజారిటీ రాకపోయినా చిక్కే. ఎందుకొచ్చిన రొష్టు అనుకుని ఎమ్మెల్సీ రూటు ఎంచుకున్నారు బాబు. ముఖ్యమంత్రి కొడుకు మంత్రి కావడం యీ మధ్య వింతగా తోచటం లేదు. పంజాబ్‌లో చూశాం, తెలంగాణలో చూశాం, యిప్పుడు ఆంధ్రప్రదేశ్‌. కాంగ్రెసు నడిపిన వారసత్వపు రాజకీయాలను తీవ్రంగా విమర్శిస్తూ అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలన్నీ వారసత్వపు రాజకీయాలే నడుపుతున్నాయి. వాటిలో తెలుగుదేశం కూడా వుంది అనుకుని నోరు చప్పరించి వూరుకోవడమే. బాలకృష్ట హీరోగా టాప్‌ రేంజ్‌లో వుండగా అతని రాజకీయ సభలకు విపరీతంగా జనం రావడం చూసిన ఎన్టీయార్‌ మురిసిపోయి 'నా వారసుడు బాలకృష్ణే' అని ఆవేశంలో ప్రకటించేస్తే చంద్రబాబు 'ఇది విమర్శలకు దారి తీస్తుంది' అని నచ్చచెప్పి, పట్టుబట్టి ఆ స్టేటుమెంటు విత్‌డ్రా చేయించారు. అలాటి బాబు యిప్పుడు తన దగ్గరకు వచ్చేసరికి కొడుకుని ఎమ్మెల్సీ దారిలో మంత్రిగా చేయడమేమిటి అని ఆశ్చర్యపడడమూ అనవసరమే! బాలకృష్ణ ఎన్టీయార్‌ కొడుకు, లోకేశ్‌ 'నిప్పు' మార్కు బాబు కొడుకు!

వారసత్వ రాజకీయాల గురించి ఆదర్శాలు వల్లించి, లోకేశ్‌ మంత్రి కావడాన్ని నిరసించేవారిలో నేను చేరను. దాన్ని నేటి వాస్తవంగా గుర్తిస్తున్నాను. కాంగ్రెసులో వారసత్వం అనగానే నెహ్రూ కుటుంబం స్ఫురిస్తుంది కానీ చాలామంది కాంగ్రెసు నాయకులు వారి సంతానాన్ని రాజకీయాల్లోకి తెచ్చారు. సత్తా వుండి నిలదొక్కుకున్నవారు నిలదొక్కుకున్నారు, తక్కినవారు తప్పుకున్నారు. ఇక ప్రాంతీయ పార్టీలైతే కుటుంబ పార్టీలుగానే నడుస్తున్నాయి. ఇతర జాతీయ పార్టీల్లో కమ్యూనిస్టులు వారసుల్ని తీసుకురారు. బిజెపిలో కూడా మొన్నటిదాకా లేదు. ఇటీవల వారసులకు టిక్కెట్లు యిప్పించుకుంటున్నారు. ఎవరైనా నాయకుడు చనిపోతే సానుభూతి ఓట్ల కోసం అతని భార్యకు లేదా యితర కుటుంబసభ్యులకు టిక్కెట్లు యివ్వడం దాదాపు అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఎవర్నీ ఎత్తి చూపలేం. ఒక విషయం మాత్రం మనం ఒప్పుకుని తీరాలి. సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ వారసత్వం ప్రవేశానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తొలి దశలో పరాజయాలు కలిగినా నిలదొక్కుకోవడానికి ఉపకరిస్తుంది. కానీ చాలాకాలం నిలవాలంటే ప్రజామోదం వుండి తీరాలి. కాస్త ఆలస్యంగానైనా తన ప్రతిభాపాటవాలు చూపించగలిగితేనే వారసులు నిలుస్తారు. ఇప్పుడు లోకేశ్‌ పార్టీ యూత్‌ వింగ్‌లో తర్ఫీదై వచ్చారనుకోవాలి. ఇక పాలనలో తర్ఫీదు పొందాలి.

బాబు చాలా నీతులు వల్లిస్తారు కాబట్టి తన కుటుంబసభ్యుణ్ని రాజకీయాల్లోకి తీసుకురారని నమ్మి, తర్వాత కంగు తిన్నవారూ వున్నవారు. ఆయన స్థానంలో మనం వున్నపుడే ఆయన యిక్కట్లు తెలుస్తాయి. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు, అదీ అర్ధరాష్ట్రంలో. పైగా ఏ వసతులూ లేని, కేంద్ర నుంచి కానీ, పొరుగు రాష్ట్రం నుంచి కానీ సహాయసహకారాలు అందని కొత్త రాష్ట్రం. ఎన్నికలకు యింకో రెండేళ్లు మాత్రమే వున్నాయి. బ్రోషర్ల ద్వారా ప్రజల్ని ఊరించడమే తప్ప ప్రభుత్వం యిప్పటిదాకా సాధించినది ఏమీ లేదు. ఏదో ఒకటి చేసి చూపించాలి. ఆ ఫలితాలు ప్రజలకు అందుబాటులోకి రావాలి. ఓ పక్కన పార్టీ కూడా చూసుకోవాలి. పార్టీలో ద్వితీయశ్రేణి నాయకత్వం లేదు. అన్నీ తనే చూసుకోవాలి. ఇటు ప్రభుత్వంలోనూ అంతే. ఏదైనా కాన్ఫరెన్సు పెడితే దాని లోగో దగ్గర్నుంచి తనే ఫైనలైజ్‌ చేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులను తిట్టినా, కొట్టినా తనే మధ్యస్తం చేయాలి. ఎవరికీ అప్పగించడానికి లేదు. జాతీయ స్థాయి వ్యవహారాలు పట్టించుకోవడం మానేశారు కానీ లేకపోతే ఆ భారమూ వుండేది. ఇవన్నీ ఒంటి చేతిమీద నడపడం చాలా కష్టం. ఆరోగ్యాన్ని ఎంత బాగా చూసుకున్నా, వయసు దాని ప్రభావాన్ని అది చూపిస్తూనే వుంటుంది. చటుక్కున ఎప్పుడో దెబ్బ కొట్టవచ్చు. 

పాలకులకు వున్న పెద్ద యిబ్బంది అనారోగ్యాన్ని దాచుకోవాలి. ఒంట్లో నలతగా వున్నట్లు బయటకు పొక్కినా, వెంటనే పార్టీలో గ్రూపులు తయారై పోతాయి. కొంతమంది అటూ, కొంతమంది యిటూ, కొంతమంది అటూయిటూ...! ఆశావహులు జాతకాలు చూపించేసుకుంటూ వుంటారు. శూన్యం ఏర్పడితే అన్నివిధాలా సమర్థుడైన నాయకుడు అంటూ అనుకూల మీడియాలో వ్యాసాలు రాయించేసుకుంటారు. పెద్ద గందరగోళం ఏర్పడిపోతుంది. ముఖ్యమంత్రి తిరిగి వచ్చాకనే, నాయకుడెవరో తేలాకనే పని చేద్దాంలే యీ లోపున నిర్ణయాలు తీసుకుంటే చివాట్లు తినాల్సి వస్తుంది అనుకుని అధికారగణం నిదానిస్తారు. పాలన పడకేస్తుంది. అందువలననే ముఖ్యమంత్రులు ఓ పట్టాన ఆసుపత్రిలో చేరరు. ఇంటి వద్దే వైద్యం చేయించుకుంటారు. రొటీన్‌ చెకప్‌ అని చెప్పుకుంటారు. ఒక్కోప్పుడు తాత్సారం జరిగి, జయలలిత కేసులో లాగ అడ్డం తిరుగుతుంది. జయలలిత మరణం ఆమెకే కాదు, ఆమె పార్టీకే విషాదాన్ని తెచ్చిపెట్టింది. ఆమె ఎవర్నీ వారసులుగా ప్రకటించకపోవడంతో ఎవరికి వారే తాము వారసులమంటూ తయారయ్యారు. పార్టీ చీలింది. ప్రభుత్వం అయోమయంలో పడింది. అదే కనక డిఎంకెలో జరిగి వుంటే, యింత గందరగోళం వుండేది కాదు. ఎందుకంటే అక్కడ వారసుడెవరో అందరికీ తెలుసు. 

మృత్యువు రకరకాలుగా వస్తుంది. జబ్బు పడి, మంచం మీద పడి, పార్టీ నాయకులందరినీ పిలిచి 'ఇదిగో ఫలానావాడే నా వారసుడు, మీరంతా జీహుజూర్‌ అనాలి మరి' అని చెప్పే సావకాశం వుండకపోవచ్చు. హఠాత్తుగా గుండెపోటు రావచ్చు, యాక్సిడెంటు జరగవచ్చు. హత్యకు గురి కావచ్చు. మామూలు వ్యక్తి అయితే వీలునామా రాసే ముందే పోతే, వారసులంతా కూర్చుని చర్చించుకుని ఎవరి వాటాలు వారు తేల్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో కోర్టుకి వెళతారు. కానీ పార్టీ వ్యవహారాల్లో అలా వుండదు. ఆలస్యమైన కొద్దీ ఆశావహులు పెరుగుతారు. అందువలన చావు సంభవించగానే ఓ పట్టాన ప్రకటించరు. మొఘల్‌ చక్రవర్తుల విషయాల్లో యిలా జరిగేవని విన్నాం. ఫరూక్‌ అబ్దుల్లా విషయంలో చూశాం. ఇందిర హత్య జరగ్గానే ప్రణబ్‌ తనే ఆపద్ధర్మ ప్రధాని అవుతానని ఆశించారని, అందుకే రాజీవ్‌ ఆయనపై పగబట్టారని చెప్పుకుంటారు. ఆయన లాటి సీనియర్‌ కాంగ్రెసు నాయకులు ముందుకు వస్తారేమోనన్న భయంతో ఇందిర శవం అక్కడ వుండగానే రాజీవ్‌ను ప్రధానిని చేసేశారు. 

ఎన్టీయార్‌ మరణానికి ముందే ఆయన నుంచి బాబు అధికారం లాగేసుకున్నారు కాబట్టి అధికారం ఎవరిది అనే సమస్య రాలేదు. అలా జరగకుండా పదవిలో వుండగానే ఎన్టీయార్‌ పోయారనుకోండి, ఏం జరిగేదో వూహించండి. లక్ష్మీపార్వతి వర్గం, చంద్రబాబు వర్గం, మధ్యలో మధ్యేమార్గంగా హరికృష్ణ... యిలా అందరూ పోటీ పడేవారు. ఎవరు నెగ్గినా, పార్టీ మాత్రం చీలికవాలికలయ్యేది. ఇలాటి డ్రామాలు అనేకం జరుగుతాయి కాబట్టి అధికారంలో వున్న పార్టీ నాయకుడు తన వారసుణ్ని ముందే ప్రకటించి పెట్టుకుంటే అధికార బదిలీ సజావుగా సాగుతుంది. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు, నాయకుడు లేనప్పుడు తక్కినవారందరూ సమావేశమై, తమలో ఎవరికి ఎక్కువ ఆమోదయోగ్యుడున్నాడో వాణ్ని నాయకుడిగా ఎన్నుకోవాలి - అని సుద్దులు చెప్పవచ్చు. మన దగ్గర ప్రజాస్వామ్యం నడవటం లేదు. అంతా రాజరికమే. అన్నీ హైకమాండ్‌ నిర్ణయాలే. పార్టీలో సంస్థాపరమైన ఎన్నికలు జరగటం లేదు. అధికభాగం కాంట్రాక్టులు నామినేషన్లే, పార్టీ పదవులూ నామినేషన్లే. జిల్లా స్థాయిలో ఏకవాక్య తీర్మానం - 'నాయకుడి ఎన్నికను అధిష్టానం నిర్ణయానికి వదిలేస్తున్నాం' అని. ప్రస్తుతం దేశం మొత్తం ఏకవ్యక్తి పాలనపై నడుస్తోంది. మంచి జరిగినా, చెడు జరిగినా అతడినే బాధ్యుణ్ని చేయవలసి వస్తోంది. అలాటప్పుడు ఒక రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలో ప్రజాస్వామ్యం వుండాలని ఎలా ఆశిస్తాం?

చంద్రబాబుగారు ఆరోగ్యవంతుడు. ఓపికమంతుడు. అనేక విషయాలు క్షుణ్ణంగా తెలిసినవాడు. ఆయనకు యిప్పట్లో ఏ అనారోగ్యమూ రాదనే ఆశిద్దాం. కానీ తన పనిభారం తగ్గించుకోవడానికైనా, కనీసం పంచుకోవడానికైనా ఒక ద్వితీయ శ్రేణి నాయకుడిని తయారు చేయవలసిన అవసరం వుంది. డుపున పుట్టినవాడైనంత మాత్రాన లోకేశ్‌ ఆటోమెటిక్‌గా అన్ని గుణాలూ పుణికి పుచ్చుకోడు. అతనికి తర్ఫీదు అవసరం. ఇప్పటికే పార్టీ ఆఫీసులో వుండి వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. కొన్ని విషయాలలో మంచి సలహాలు యిస్తున్నాడు అని చెప్పుకుంటే సరిపోదు. బాక్‌సీట్‌ డ్రైవింగ్‌ వేరు ఫ్రంట్‌ సీట్‌ డ్రైవింగ్‌ వేరు. మంత్రిగా, అధికారులతో ఎలా వ్యవహరించాలి, ఎప్పుడు కసరాలి, ఎప్పుడు మెచ్చాలి, ప్రజాదర్బారులో ప్రజల ప్రశ్నలు ఎలా ఎదుర్కోవాలి వంటివి అనుభవం మీదనే అలవడుతాయి. లోకేశ్‌ యిప్పటిదాకా ఎమ్మెల్యే కూడా కాదు. సాధారణ ప్రజలను ఎప్పుడూ ఎదుర్కోలేదు. పార్టీ సమావేశాల్లో మాట్లాడారుగా అంటే అక్కడ అందరూ జై కొట్టేవారే! ప్రజల్లో తన పార్టీ వారే కాదు, అన్ని పార్టీల అభిమానులూ వుంటారు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. తన శాఖలో తనకు తెలిసో, తెలియకుండానే అక్రమాలు జరుగుతాయి. అవి మీడియాకు పొక్కకుండా చూసుకోవడం, పొక్కితే ఏమీ జరగలేదని బుకాయించడం, వీలు కాకపోతే దోషులెవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని హుంకరించడం.. అన్నీ నేర్చుకోవాలి. స్టార్‌సన్స్‌ లాగనే లోకేశ్‌కు కూడా ఒక యిబ్బంది వుంది. ప్రతీదీ తండ్రితో పోల్చి పెదవి విరుస్తూంటారు. ఆయన వేరే, యీయన వేరే అని గ్రహించరు. లోకేశ్‌ తండ్రి భుజాల వరకైనా ఎదగాలి. లేకపోతే వ్యతిరేక వ్యాఖ్యలు వస్తూంటాయి. 

అది చాలనట్లు కెటిఆర్‌తో పోలిక ఒకటి వచ్చిపడింది. కెసియార్‌, కొడుకు కెటియార్‌కు ఐటీ, పంచాయితీ రాజ్‌ యిచ్చారు కదాని కాబోలు బాబు కూడా అవే శాఖలు కొడుక్కి యిచ్చారు. కెటియార్‌తో ఓ స్థాయి వరకైనా పోటీ పడకపోతే లోకేశ్‌ విమర్శలకు గురవుతాడు. ఏ మాట కా మాట చెప్పాలంటే కెటియార్‌కి మంచి వాగ్ధాటి వుంది. ఇంగ్లీషు, తెలుగు, హిందీలలో అనర్గళంగా, మేధావులను సైతం మెప్పించేట్లు మాట్లాడగలడు. బహిరంగ సభలో ఆవేశంగా మాట్లాడతాడు, కాన్ఫరెన్సుల్లో సంయమనంతో మాట్లాడతాడు. బిజినెస్‌ మాగ్నెట్స్‌తో సమావేశమైనప్పుడు సూటులో హుందాగా కనబడతాడు. లోకేశ్‌లో యింత వాక్చాతుర్యం వుందో లేదో నాకు తెలియదు. నేనెప్పుడూ గమనించలేదు. అతను చేసిన ట్వీట్లే చదివాను. కానీ ట్వీట్లు అతని తరఫున మీడియా ఎడ్వయిజర్‌ కూడా చేసి వుండవచ్చు. సభల్లో, చర్చల్లో చమత్కారం ప్రదర్శించినపుడే మనకు నమ్మకం చిక్కుతుంది. లోకేశ్‌ ఉపన్యాస కళలో తప్పకుండా మెరుగు పరుచుకోవాలి. ఆకారం విషయంలో కూడా తను జాగ్రత్తపడాలని లోకేశే చెప్పుకున్నారు. 

'నేను మా తాతగారి (ఎన్టీయార్‌)లా భోజనప్రియుణ్ని.' అని సంజాయిషీ యిచ్చుకున్నారు. లోకేశ్‌ వయసులో ఎన్టీయార్‌ నాజూగ్గానే వున్నారు. ''మాయాబజార్‌''లో వేసేనాటికి ఎన్టీయార్‌కు 35. ఇప్పుడు లోకేశ్‌కు 34. తండ్రి చంద్రబాబు ఐతే చెప్పనే అక్కరలేదు. ఇప్పటికీ చువ్వలా వుంటారు. 67 యేళ్ల వృద్ధుడు అనబుద్ధి కాదు. ఇటు పోటీదారు కెటియార్‌ చూస్తే లోకేశ్‌ కంటె ఏడేేళ్లు పెద్దవాడైనా చాలా గ్లేమరస్‌గా వుంటాడు. 'నన్ను కెటియార్‌తో, జగన్‌తో పోల్చకండి. నేను వారి కంటె చిన్నవాణ్ని, వారి కున్నంత అనుభవం నాకు లేదు' అని లోకేశ్‌ చెప్పుకున్నారు. అనుభవం మాట తర్వాత, చిన్నవాడైనప్పుడు వాళ్ల కంటె స్మార్ట్‌గా కనబడాలి కదా. లోకేశ్‌ కుటుంబంలో తల్లి, తండ్రి, భార్య ఎవరూ స్థూలకాయులు కారు. వారిని చూసి యిన్‌స్పయిర్‌ కావాలి. ఇంట్లో వున్నపుడు ఎలా వున్నా ఫర్వాలేదు. పబ్లిక్‌లోకి వచ్చినపుడు ఎప్పియరెన్స్‌ చాలా ముఖ్యం. లోకేశ్‌ తన శాఖను ఎంత బాగా చేస్తారో ముందుముందు తెలుస్తుంది. ఐటీ విషయంలో అన్ని సౌకర్యాలూ యిప్పటికే వున్న హైదరాబాదుతో పోటీ పడడమంటే మాటలు కాదు. అది చాలా పెద్ద ఛాలెంజ్‌. పంచాయితీ రాజ్‌ శాఖలో తన అధికార వికేంద్రీకరణ లాటివి చేపట్టి తన పాటవం చూపించవచ్చు. 

లోకేశ్‌ అన్నీ చక్కగా నేర్చుకుని, దక్షత గల మంత్రిగా తయారవ్వాలని కోరుకోవడంలో నా స్వార్థం ఏమీ లేదు. ప్రస్తుతం ఆంధ్రలో టిడిపి ప్రభుత్వం వుంది. పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నా 2019లో కూడా మళ్లీ టిడిపియే గెలిచేట్లు వుంది. ప్రతిపక్ష నాయకుడు జగన్‌ ప్రజాగ్రహాన్ని సరిగ్గా వ్యక్తీకరించలేక పోతున్నాడు. మంచి నాయకులను తన వద్ద నిలుపుకోలేక పోతున్నాడు. తెలంగాణలో టిపిడి దెబ్బ తిన్నంతగా, ఆంధ్రలో వైసిపి దెబ్బ తినలేదు కానీ, అధికారంలోకి వచ్చేటంత సత్తా కనబడటం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కడప జిల్లాలో సైతం గెలవకపోవడం కార్యకర్తలకు జగన్‌ పై నమ్మకాన్ని చెదరగొడుతోంది. జగన్‌కు తండ్రి నుంచి వాక్చాతుర్యం, చమత్కారం అబ్బలేదు. మాటల్లో ఆవేశం, ప్రవర్తనలో దూకుడు ప్రదర్శితమౌతున్నాయి. అనవసర వ్యాఖ్యలతో వివాదాలతో చిక్కుకుంటున్నాడు. అసలే మీడియా ప్రతికూలం. అవకాశం దొరికితే అతన్ని విలన్‌గా చూపుతున్నారు. లోకంలో ఏ అనర్థం జరిగినా దాన్ని జగన్‌కు ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఇలాటి పరిస్థితుల్లో 2019లో అతన్ని బాబుకి ప్రత్యామ్నాయంగా ఓటర్లు పరిగణిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. ఇక కాంగ్రెసు 2019 నాటికి ఏ మేరకు కోలుకుంటుందో ఎవరికీ తెలియదు. 

కాంగ్రెసు అధిష్టానమే మన్ను తిన్న పాములా పడి వుంది. ఇక బిజెపి, టిడిపితో అధికారం పంచుకోవడం వలన, రాష్ట్రానికి తగినంత సాయం చేయకపోవడం వలన ప్రజల అభిమానాన్ని చూరగొనటం లేదు. ఒకవేళ విడిగా పోటీ చేసినా పెద్దగా సీట్లు గెలిచే పరిస్థితి లేదు. అనేక జిల్లాలలో దానికి శాఖలే కనబడటం లేదు. వాళ్లు ప్రజల్లో తిరిగే కార్యక్రమాలు చేపట్టటం లేదు. ఈ పరిస్థితుల్లో టిడిపి 2019 తర్వాత కూడా పాలిస్తుందని అనుకోవచ్చు. అప్పటికి బాబుకి 69 ఏళ్లు వుంటాయి. 1995లో ఆయన చొరవ, ముందు చూపు పాతికేళ్ల తర్వాత కూడా అలాగే వుంటాయని అనుకోలేము. ఓటమి ఆయన ఆలోచనావిధానంలో చాలా మార్పు తెచ్చింది. అప్పుడు లేని చాదస్తాలు యిప్పుడాయనను చుట్టుముట్టాయి. ఓపిక తగ్గో, వారసుణ్ని తీర్చిదిద్దుదామనో, ఆయన 36 ఏళ్ల లోకేశ్‌ను ఉపముఖ్యమంత్రిగానో, ముఖ్యమంత్రిగానో కూర్చోబెట్టవచ్చు. అందువలన లోకేశ్‌ ఎంత సమర్థుడైతే ఆంధ్ర ప్రజలకు అంత మంచిది. ఆంధ్ర ప్రజల మేలు కోరే లోకేశ్‌ ప్రతిభాపాటవాలు పెరగాలని ఆశిస్తున్నాను. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
mbsprasad@gmail.com