Advertisement

Advertisement


Home > Politics - Telangana

పాపం... ఆయన కూతురి కోరిక తీరనేలేదు

పాపం... ఆయన కూతురి కోరిక తీరనేలేదు

పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా విరగబడి ప్రచారం చేస్తున్నారు. పెద్దాయనతో పాటు ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు చెమటోడుస్తున్నారు. తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు. కాని ఇంత మందిలో కేసీఆర్  కూతురు కవిత మిస్సయిపోయింది. ఇది ఆ పార్టీకి తీరని లోటేనని చెప్పొచ్చు. ఆమె కూడా ప్రచారంలో ఉంటే గులాబీ పార్టీ ప్రచారం మరింత రంజుగా సాగేది. పార్టీ అభ్యర్థులు, నాయకులు కూడా ఇదే ఫీలవుతున్నారు.

తాను పార్టీకి స్టార్ క్యాంపైయిన‌ర్ను, తాను ప్రచారం చేయాలని, కాబట్టి బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడంతో ఆమె ఇక ఎన్నికల ప్రచారం చేయాలనే ఆశ అడుగంటిపోయింది. ఆమె కల కలగానే మిగిలిపోయింది. ఆమెకు బెయిల్ దొరుకుతుందని, నాలుగు రోజులైనా ప్రచారం చేస్తుందని గులాబీ పార్టీ నాయకులు ఆశ పడ్డారు. కాని కోర్టు గండి కొట్టింది.

ఎన్నికల ప్రచారానికి బెయిల్ ఇచ్చినట్లయితే కేజ్రీవాల్‌కు, ఇతర ఆప్ నాయకులకు కూడా ఇవ్వాలి. గతంలోనూ ఎన్నికల ప్రచారానికి బెయిల్ అడిగితే కోర్టు తిరస్కరించింది. ఇప్పడు మళ్లీ అదే కారణంతో కవిత బెయిల్ అడిగింది. ఇప్పటి వరకు ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. పిల్లగాడికి పరీక్షలు ఉన్నాయని, తాను దగ్గరుండి  చదివించుకోవాలని అడిగితే కోర్టు నో చెప్పింది. ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే కోర్టు నో అంది. ఎన్నికల ప్రచారానికి పోవాలంటే నో అంది.

కోర్టుకు ఇవన్నీ బలమైన కారణాలుగా కనబడలేదు. నిజానికి బెయిల్ ఇవ్వడానికి ఇవి బలమైన కారణాలు కావు. మరి ఆమె లాయర్లు ఆ  కారణాలతో ఎందుకు బెయిల్ పిటిషన్లు వేశారో అర్థం కావడంలేదు. ఈడీ కేసు అంటే మనీలాండరింగ్ కేసు. ఈ కేసులో బెయిల్ దొరకడం సాధారణ కేసుల్లో మాదిరిగా  కాదు. పది హత్యలు చేసినవాడికైనా బెయిల్ దొరుకుతందేమోగాని ఈడీ  కేసులో బెయిల్ దొరకడం అనుకున్నంత వీజీ కాదు. ఈ చట్టం చాలా పకడ్బందీగా ఉంటుంది.

ఈ యాక్టులో అరెస్టయితే అంతే సంగతులు. చట్టానికి ఆడ, మగ అన్న తేడా ఉండదు కదా. దొరికితే అరెస్టు చేసి లోపలేసేయటమే. మిగిలిన విషయాలు కోర్టులో తేల్చుకోవాల్సిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీలో వేలు పెట్టేముందు కవిత భవిష్యత్తు గురించి ఆలోచించనట్లుంది. ఆమెకు కళ్ల ముందు సంపాదన కనబడింది.  అధికారంలో ఉండి కన్నూ మిన్ను కానకుండా ఉన్నరోజుల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత ఈడీ... బోడీ మమ్మల్ని ఏం చేయలేవని, తాము భయపడే ప్రసక్తే లేదని వీరులు శూరుల మాదిరిగా మాట్లాడారు. ఇప్పడు అసలు కథ తెలుస్తోంది.

చాలాసార్లు కవిత తాను మహిళనని సెంటిమెంట్ ప్లే చేసింది. తనను అరెస్టు చేయడానికి వీల్లేదని, ఇంటి దగ్గరే విచారించాలని కోర్టులో పిటిషన్లు వేసింది. దీంతో ఆమె అరెస్టులో జాప్యం జరిగింది. కాని చివరకు ఎన్నికల షెడ్యూలు రావడానికి ఒకరోజు ముందు అరెస్టు చేసి ఢిల్లీ తీసుకెళ్లిపోయారు. అప్పటినుంచి ఆమె తీహార్ జైల్లోనే ఉంది. అసలు మనీల్యాండరింగ్ చట్టంలో అరెస్టయితే బెయిల్ అంత తొందరగా దొరకదన్న విషయాన్ని ఆమె లాయర్లు కవితకు చెప్పలేదా.

బెయిల్ కోసం పిటిషన్ వేస్తే కారణం బలంగా ఉండాలని లాయర్లకు తెలియకుండా ఎందుకుంటుంది. మరి ఎందుకు బలహీనమైన కారణాలతో బెయిల్ పిటిషన్లు వేస్తున్నారో  అర్థం కావడంలేదు. నిజామాబాద్లోని ఆమె క్యాంప్ కార్యాలయం బోసిపోయింది. ఒకప్పుడు నాయకులతో, పార్టీ మీటింగులతో ఎంతో బిజీగా ఉన్న  క్యాంపు కార్యాలయం ప్రస్తుతం నిర్మానుష్యమైపోయింది. దానికి పూర్వ వైభవం ఇప్పట్లో వచ్చేలా లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?