Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: అమెరికా యిక భూతాల స్వర్గమేనా?

అమెరికాలోని కాన్సస్‌ రాష్ట్రంలో ఒక జాత్యహంకారి చేతిలో కాల్పులకు గురై కూచిభొట్ల శ్రీనివాస్‌ అనే ప్రతిభావంతుడైన తెలుగు యువకుడు నేల కొరగడం అత్యంత విషాదకరం. జాత్యహంకారంతో దాడులు జరగడం అమెరికాకు కొత్త కాదు. నల్లజాతివారిపై దాడులు జరిగినపుడు విని వూరుకుంటాం. బ్రౌన్స్‌, అనగా మనపై జరిగినపుడు ఉలిక్కిపడి, చర్చలు జరుపుతుంటాం. కానీ ఈ సారి చాలా పెద్ద ఎత్తున రోజుల తరబడి జరుగుతున్నాయి. ఎందుకంటే ట్రంప్‌ అధ్యక్షుడుగా వచ్చాడు కాబట్టి యిలాటివి మరిన్ని జరుగుతాయనే భయం!

ట్రంప్‌ కారణంగానే అక్కడి వాతావరణం కలుషితం అయిపోయిందని, యిప్పటిదాకా అవకాశాలు వెతికేవారికి భూతలస్వర్గంగా వున్న అమెరికా యిప్పుడు భూతాలకే స్వర్గంగా. తక్కినవారికి నరకంగా మారిందని, ప్రాణం మీద ఆశ వుంటే అక్కడకి వెళ్లడం మంచిది కాదని మీడియా హోరెత్తించేస్తోంది. ఇది చూసి అమెరికాలో పిల్లలున్న తలిదండ్రులు బెంబేలెత్తున్నారు. బతికుంటే బలుసాకు తినవచ్చు, వెనక్కి వచ్చేయమని పిల్లల్ని బతిమాలుతున్నారు. ఇదంతా అక్కడున్న మనవాళ్లకు చికాకు వ్యవహారంగా తయారైంది. గోరంత దాన్ని మీడియా కొండంతలు చేస్తోందని టీవీలలో కనబడి చెప్తున్నారు, మీడియాలో వ్యాసాలు రాస్తున్నారు. 

అక్రమ నివాస కోణం
ఇంతకుముందు అనేకమంది తెలుగువాళ్లు, తక్కిన భారతీయులు దాడులకు గురయ్యారు. పార్కింగ్‌ దగ్గర గొడవ పడ్డారనో, ఊరి శివార్లలో పార్టీ ఏర్పాటు చేసుకుంటే అక్కడకు వచ్చి కాల్పులు జరిపారని, అర్ధరాత్రి రోడ్డు మీద కనబడితే డబ్బు దోచుకుని, తర్వాత కాల్చారని.. యిలా ఏవో కారణాలు. ఇటీవలే వంశీ అనే ఒక కుర్రవాడు ఒక అమ్మాయిని రక్షించబోయి కాల్పులకు గురయ్యాడన్నారు. ఇవన్నీ డబ్బు కోసమో, అసూయ చేతనో, అక్కడ నేరసంఘటనల్లో భాగంగానో జరిగాయని సరిపెట్టుకున్నారు. కానీ యీసారి హంతకుడు ''మీకు వీసాలున్నాయా? అక్రమంగా నివాసముంటున్నారా?'' అనే టెక్నికల్‌ ప్రశ్న అడిగాడు. వీళ్లు జవాబు చెప్పకపోవడంతో తమ దేశంలో అక్రమంగా నివాసముంటున్న అరబ్బు ముస్లిములనే అభిప్రాయానికి వచ్చి అమెరికాకు వారి భారాన్ని తగ్గించాలనుకుని తుపాకీ పట్టుకువచ్చి కాల్చేశాడు.

అక్రమవాసులనుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయవలసింది. చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు అనే మాట కూడా కరక్టు కాదు, అక్రమవాసులను కాల్చి చంపమని ఏ చట్టమూ చెప్పలేదు. అతను తాగుబోతు, ఫ్రస్ట్రేషన్‌లో వుండి వుంటాడు. తుపాకీలు ఆటవస్తువుల్లా లభ్యమవుతాయి కాబట్టి కోపోద్రేకంలో ప్రాణాలు తీశాడు. అలాటి ఉన్మాదులు ఏ దేశంలోనైనా తక్కువ సంఖ్యలోనే వుంటారు. కాల్చడానికి వాళ్లకి ఏ కారణమూ అక్కరలేదు. 'నీ మొహం నాకు నచ్చలేదు' అని కూడా అనవచ్చు. అమెరికాలో నిత్యం జరిగే హింసాత్మక సంఘటనల్లో దాడి చేసినవాడు, బాధితుడు యిద్దరూ శ్వేతజాతి అమెరికన్లు అయిన సందర్భాలే ఎక్కువ శాతం అయి వుంటాయి. మన ఈ హత్యపై జరిగిన చర్చల్లో చాలామంది ప్రభుత్వం మన వాళ్ల తరఫున అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి రక్షణ కల్పించాలని సూచించారు. మాట్లాడితే ఏమంటారు? 'మీవాళ్లు అప్పుడప్పుడు పోతున్నారు. మా వాళ్లు నిత్యం ఛస్తున్నారు. మా తుపాకీ కల్చర్‌ అలాటిది.' అని జవాబిస్తారేమో! నిజానికి శ్రీనివాస్‌ హత్యను ట్రంప్‌ కాంగ్రెస్‌ సాక్షిగా ఖండించిన మూడు రోజుల్లోనే సౌత్‌ కరోలినాలో ఓ గుజరాతీ కాల్పులకు గురయ్యాడు.

ఇప్పుడీ పూరింగ్‌టన్‌ అక్రమ వలసదారుల ప్రస్తావన తెచ్చాడు కాబట్టి చర్చ ట్రంప్‌ విధానాలపై మళ్లింది. నిజానికి అక్రమ వలసదారులను ప్రతి అమెరికా అధ్యక్షుడు బయటకు పంపిస్తూనే వున్నారని గణాంకాలు చెపుతున్నాయి. (బిల్‌ క్లింటన్‌ (1993-2000) 9 లక్షలు, బుష్‌ (2001-08) 20 లక్షలు, ఒబామా (2009-16) 31 లక్షలు ) ఇంతమందిని పంపినా, ప్రస్తుతం కోటీ పదిలక్షల మంది ఉన్నారంటే దాని అర్థం ఏమిటని? పంపినవాళ్లు మళ్లీ వచ్చేస్తున్నారనా? కొత్తగా వస్తున్నారనా? ట్రంప్‌ తన ఎన్నికల ప్రచారంలో చేసిన దేమిటంటే యీ అక్రమ వలసలకు, స్థానికుల నిరుద్యోగానికి, అమెరికాలో పెరుగుతున్న క్రైమ్‌ రేటుకు ముడిపెట్టడం. దాంతో ఇన్నాళ్లు అక్రమ వలసదారులను చూసీ చూడనట్లు వదిలేసిన అమెరికన్‌ సమాజం, వారిని తిట్టుకుంటూనే వారి చేత అతి తక్కువ జీతాలకు పని చేయించుకుంటూ వున్న జనం యిప్పుడు వారిని తరిమివేస్తే తప్ప దేశం బాగుపడదనే ఉద్దేశానికి వచ్చి వుండవచ్చు. సమాజంలో అందరూ యిదే భావంతో వున్నారని చెప్పలేము కానీ ట్రంప్‌కు ఓటేసిన వారైనా - వారి సంఖ్యా గణనీయమైనదే - అలా అనుకుంటూ వుండవచ్చు. అక్రమ వలసదారుల్లో 52% మంది మెక్సికన్లని, వ్యవసాయ కార్మికుల్లో వారి శాతం 25 అని, వాళ్లని పంపించివేస్తే పళ్లు, కూరగాయలు మార్కెట్‌ రావని చెప్తున్నారు. అక్రమ వలదారులు ఆర్థిక రంగానికి ఏటా 50 వేల కోట్ల డాలర్లు సమకూరుస్తున్నారని, వారిని పంపేస్తే జిడిపి 2.6% తగ్గవచ్చని అంటున్నారు. కొన్ని సంస్థలు వారిని దాచడానికి నడుం బిగించాయి కూడా.

ఎంతమంది వెనక్కి వస్తున్నారు?
ఈ అంశంతో బాటు ట్రంప్‌ చేపట్టిన అనేక చర్యలు కూడా యీ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. అమెరికన్‌ సమాజం కూడా శ్రీనివాస్‌ హత్యను సీరియస్‌గానే తీసుకుందని హిల్లరీ ట్వీట్లు, వైట్‌హౌస్‌ ప్రకటన, ట్రంప్‌ ప్రసంగం తెలుపుతున్నాయి. ఇక మన తెలుగు మీడియా అయితే ట్రంప్‌ని బోనెక్కించేసి, అమెరికాలో హింసంతా అతని పుణ్యమే అన్నట్లు చిత్రీకరిస్తోంది. ఈ క్రమంలో మన సమాజంలో భయాందోళనలు విపరీతంగా రేకెత్తిస్తున్నారు. నా ఉద్దేశంలో అటువంటి భయం అనవసరం. ఇలా అనడానికి నేను అమెరికావాసిని కాను. అమెరికావాసికైనా వాళ్ల నగర పరిస్థితో, మహా అయితే వాళ్ల రాష్ట్ర పరిస్థితో తెలుస్తుంది తప్ప అమెరికా మొత్తంలో యిలాగే జరుగుతోందనో, జరగటం లేదనో చెప్పడం కష్టం. కేవలం తర్కంతోనే ఆలోచించి చెప్తున్నాను. అమెరికా పరిస్థితి మరీ అంత ఘోరంగా వుండి వుంటే యీ పాటికి దాన్ని వదిలి వచ్చేందుకు అక్కడ స్థిరపడిన వారందరూ మూటాముల్లె సర్దుకుంటూ వుండాలి. కానీ వారి ధైర్యం చెదరలేదు. ఇలాటి సంఘటనలు ఎక్కడో, ఎప్పుడో చెదురుమదురుగా జరుగుతాయని, ద్వేషం చూపిన అమెరికన్‌ ఆడమ్‌ పూరింగ్‌టన్‌ ఒక్కడుంటే అక్కున చేర్చుకునే ఇయాన్‌ గ్రిలాట్‌ వంటి అమెరికన్లు వేలల్లో వుంటారని చెప్తున్నారు.

అక్కడ 30, 40 ఏళ్లగా స్థిరనివాసం ఏర్పరచుకున్నవాళ్లు వెనక్కి రారు. ఆస్తులు, కుటుంబాలు అన్నీ అక్కడే వున్నాయి వాళ్లకి. ఎదిగిన పిల్లలుంటే వాళ్లు 'కావాలంటే మీరు వెళ్లండి, మేం యిక్కడే వుంటాం. మాకేమీ జంకు లేదు. ఇండియాలో మాత్రం మతకలహాలు, కులకలహాలు లేవా? టెర్రరిస్టు దాడులు అక్కడే ఎక్కువ కదా!' అని వాదిస్తారు. వాళ్లని వదిలి వీళ్లు రాలేరు. ఇక పదేళ్ల క్రితం వెళ్లి స్థిరపడుతున్నవారు కూడా వచ్చేస్తారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్లకు అక్కడా యిక్కడా ఆస్తులతో బాటు వాటి మీద అప్పులూ వుంటాయి. అక్కడి ఉద్యోగంలో వచ్చే ఆదాయం వెనక్కి ఇండియాకు వచ్చేస్తే యిక్కడ రాదు. అప్పు మాత్రం వెంటాడుతుంది. వచ్చేద్దామనుకుంటే అక్కడి ఇల్లూ వాకిలీ అయినకాడికి తెగనమ్ముకోవాలి. అమ్ముకుందామనుకున్నా కొనేవాళ్లు దొరకాలి. ఇన్ని తలనొప్పులు పడే బదులు కాస్త రిస్కు తీసుకునైనా వుండిపోదామనుకుంటారు.

గతంలో గల్ఫ్‌లో యుద్ధాలు వచ్చినపుడు మనవాళ్లందరూ బతుకుజీవుడా అంటూ మాతృదేశం వచ్చేశారు చూడండి. ఇప్పుడు అలాటి పరిస్థితి అక్కడేమీ లేదు. అమెరికాపై యుద్ధం ప్రకటించి వాళ్ల గడ్డపై బాంబులు కురిపించేటంత సాహసం యిప్పట్లో ఏ దేశానికీ లేదు. ఇక టెర్రరిస్టులు అప్పుడప్పుడు చేసే దొంగదాడులంటారా, ఆ భయం ప్రపంచంలో చాలా దేశాల్లో - ఇండియాతో సహా - ఉంది. లెక్కకు చూస్తే అమెరికాలోనే తక్కువ!

ఆవిడా అక్కడ ఉండిపోతున్నారు
వెళ్లి యింకా సెటిలవనివారిలో కూడా ఎంతమంది తమంతట తామే వెనక్కి వస్తారో తెలియదు. అమెరికాలో ఇక్కడ చెప్పుకునేటంత భయానక వాతావరణమే వుండి వుంటే శ్రీనివాస్‌ భార్య సునయన మళ్లీ అమెరికాకు వెళ్లేందుకు సిద్ధపడేదే కాదు. 'ఇక్కడ పరిస్థితి బాగా లేదు. వేరే ఏ దేశానికైనా వెళ్లిపోదాం' అని భర్తతో అన్నానని ఆమె చెప్పారు. కానీ భర్త మరణంతో ఆమెలో ఏదో మొండి ధైర్యం వచ్చినట్లుంది. అక్కడే వుండి భర్త పనిని కొనసాగిస్తానంటున్నారు. భర్త కంపెనీ వాళ్లు వీసా ఏర్పాటు చేస్తానంటున్నారు. ఏరోనాటిక్స్‌లో అతనికి వున్న సాంకేతిక నైపుణ్యం ఆవిడకు వుందా? తెలియదు. బహుశా భర్త చేసిన ఉద్యోగంలో కాకుండా ఆ కంపెనీలోనే వేరే ఉద్యోగంలో చేరి అమెరికాకు తన సేవలు అందించే పనిని భర్త నుండి అందిపుచ్చుకుంటానని ఆవిడ భావం కాబోలు.

ఏది ఏమైతేనేం అక్కడి ద్వేషపూరితమైన వాతావరణం గురించి ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించిన ఆమె అక్కడ వుండడానికే నిశ్చయించుకున్నారు. అక్కడ ప్రాణాలకు ముప్పు వుండి వుంటే వుండి పోయేవారు కారు కదా అని తోస్తోంది. శ్రీనివాస్‌ అన్న డాలస్‌లో వుంటారట. ఆయన కూడా వెనక్కి వచ్చేస్తానని ఏమీ చెప్పలేదు. తల్లిదండ్రులు వెనక్కి వచ్చేయమని చెప్పి వుండవచ్చు కానీ యీయన యింకా ఏమీ నిర్ణయించుకోలేదేమో! ఇవన్నీ చూస్తే మనం మరీ గందరగోళ పడవలసిన పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇక అప్పుడప్పుడు జరిగే కొట్లాటలంటారా? మన దేశంలోనూ ఏదో ఒక రూపంలో జరుగుతూ వుంటాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారిపై ఢిల్లీలో ఆ మధ్య అనేక దాడులు జరిగాయి. పట్టుకుని చావగొట్టి వదిలిపెట్టారు. కొన్నాళ్లకు చల్లారాయి. ఇక్కడికి, అమెరికాకు తేడా ఏమిటంటే మనం చేతులకు పని చెపుతాం. వాళ్లు తుపాకీలకు పని చెప్తారు. ఎందుకంటే వాళ్లకు తుపాకులు అందుబాటులో వుంటాయి. అది వాళ్ల కల్చర్‌! దానికి తగ్గట్టుగానే అక్కడ వుండేవాళ్లు - స్వతహాగా అమెరికన్లయినా, విదేశాల నుండి వెళ్లి స్థిరపడినవారైనా - హెచ్చరికగా వుండాలి. ఓ స్థాయి దాటి పోట్లాట పెట్టుకోకూడదు.

కోలాహలంతో హాలాహలం 
ఈ దాడి సందర్భంగా అక్కడ వుంటున్న మన వాళ్ల పోకడలు కూడా ఫోకస్‌లోకి వచ్చాయి. 40, 50 ఏళ్లగా అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నవాళ్లు ఎదుర్కోని వివక్షత కొత్తగా వెళ్లినవాళ్లు ఎందుకు ఎదుర్కుంటున్నారు అనే దానిపై విస్తృతంగా చర్చలు జరిగాయి. పాతవాళ్లు సంఖ్యపరంగా తక్కువగా వుండడమే కాక, అక్కడి స్థానిక పరిస్థితుల్లో యిమిడిపోయారుట. తమను ఎవరూ వేలెత్తి చూపే అవకాశం కలగనీయలేదుట. అమెరికాలో కొంతకాలం వుండి తిరిగి వచ్చేసిన కొందరు టీవీ చర్చల్లో 'ద్వితీయశ్రేణి పౌరులం అనే భావన సదా మా మనసులో మెదులుతూ వుండేది.' అన్నారు. అది కాస్త అతిశయోక్తి ఏమో కానీ కాస్త తగ్గి వుండేవారనుకోవచ్చు. ఐశ్వర్యం సంపాదించినా అట్టహాసం చేసేవారు కాదనుకుంటాను. గత రెండు దశాబ్దాలుగా వెళ్లినవారు యిలాటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు లేదు. 

తానా పూర్వ అధ్యక్షులు, భారతీయ అమెరికన్‌ మైత్రీ మండలి అధ్యక్షులు, మిత్రులు తోటకూర ప్రసాద్‌ గారు మనవాళ్లు తీసుకోవలసిన జాగ్రత్తలు అంటూ పేపర్లలో వ్యాసాల ద్వారా, టీవీ ద్వారా చాలా విషయాలు చెప్పారు. అవి వింటే 'ఇవి కూడా చెప్పవలసి వస్తోందేమిటి?' అనిపిస్తోంది. రాజకీయ నాయకులు, సినిమా తారలు వస్తే ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారట. ఏదైనా కల్చరల్‌, రెలిజియస్‌ ఫంక్షన్లు అత్యంత కోలాహలంగా జరుపుతూ పోలీసుల చేత చివాట్లు తింటున్నారట.

బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ సద్దుగా మాట్లాడడం, స్థానికులను చూస్తూ, పక్కవాళ్లకు చూపిస్తూ వాళ్ల కర్థం కాకుండా తెలుగులో మాట్లాడడం, బిగ్గరగా నవ్వడం, తమ యిళ్ల దగ్గర గట్టిగా మ్యూజిక్‌ పెట్టడం, లుంగీలు, నైట్‌గౌన్‌లలో యింటి బయట తిరగడం, స్థానికులను తేరిపార చూడడం, ఫంక్షన్లకు వచ్చి యితరులకు ఆటంకం కలిగించేట్లా కార్లు యిష్టం వచ్చినట్లు పార్క్‌ చేయడం.. యిలాటివి చెయ్యవద్దు అని చెప్తున్నారు. అంటే కొంతమందైనా యిప్పుడు చేస్తున్నారనే అర్థమవుతోంది. సినిమా రిలీజు టైములో కటౌట్లు, క్షీరాభిషేకాలు, జంతుబలులు యింకా మొదలుపెట్టి వుండరు. మొదలెడితే పక్కవాడికి కసి యింకా పెరుగుతుంది.

నిజానికి యిలాటివి చెప్పాలా అనిపిస్తుంది కానీ తెలియకపోతే అడిగి తెలుసుకోవడం మంచిది. ఇంకో సందర్భంలో వేరేవారు చెప్పారు - మన కుర్రవాళ్లకు ఫైనాన్షియల్‌గా ఫ్యామిలీ సపోర్టు వుంటుంది. వాళ్లకుండదు. మనవాళ్లు ఇంటి బయట పార్టీలు చేసుకుంటూ తమ కున్న బంగారాన్ని, సంపదను షో ఆఫ్‌ చేస్తున్నారట. అసలే ఉద్యోగాలు లేక ప్రభుత్వ భృతిపై బతుకుతున్న పొరుగింటి స్థానికుడికి అక్కసు, అసూయ రగులుతోందట. 2015 దీపావళికి యుకెలో ఉన్నాను. మేం ఉన్న కవెంట్రీలోనే బాణసంచా కాల్చారు. మాకు దగ్గర్లో వున్న లెస్టర్‌లో కొన్ని గంటలపాటు ఒక వీధి వీధంతా దీపావళి పటాసులతో, ప్రభుత్వ అనుమతితోనే, హోరెత్తిస్తారు. లండన్‌లో అయితే కొన్ని ప్రాంతాల్లో మరీట. శ్రీలంక తమిళులు శరణార్థులమనే పేరుతో పౌరసత్వం సంపాదించుకుని చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని, రాత్రి 10 దాకా వాటిని నడుపుతూ విపరీతంగా ఆర్జించి ఆస్తులు కొన్నారు. వాళ్లు దీపావళి చాలా ధూంధాంగా చేస్తారు. వినడానికి మనకు సరదాగానే వుంటుంది కానీ పొరుగున వున్న ఇంగ్లీషువాడికి అనిపిస్తుంది - 'పొట్ట చేత్తో పట్టుకుని వచ్చినవాడు నా కళ్ల ముందే ఎదిగి యిప్పుడింత ఆర్భాటం చేస్తున్నాడు. నేను ఇంగ్లీషు పద్ధతుల్లో ఐదు గంటలకే కొట్టు కట్టేసి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుందన్నట్లు వుండిపోయాను' అని. 

బ్రిటన్‌లో ట్రంప్‌ లేడుగా! 
ఇలాటి భావాలే బ్రెగ్జిట్‌కు దారి తీశాయి. పరదేశం వాళ్లు వచ్చి తక్కువ కూలీలకు పనిచేసి మా ఉద్యోగాలు కాజేస్తున్నారని ఫీలైన ఇంగ్లీషు కార్మికులు బ్రెగ్జిట్‌ అన్నారని మర్చిపోవద్దు. అక్కడ ఏ ట్రంపూ లేడు. నిజానికి బ్రిటన్‌ ప్రధాని ఈయులో వుందామనే అన్నాడు. కానీ జనం వినలేదు. ఉద్యోగాలు పోయినవారు, దొరకనివారే కాదు, పాతతరం ఇంగ్లీషు వాళ్లు కూడా యితర దేశాల నుంచి వచ్చిపడిన వాళ్ల కారణంగా బ్రిటిషు సంస్కృతి తగలబడిపోతోందని ఫీలై వాళ్లూ ఎగ్జిట్‌కే ఓటేశారు. ఇది కూడా ఒక అంశమే. ముంబయిలో మహారాష్ట్రు లెవరినైనా కదలించండి. 'ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చిపడి మా నగర సంస్కృతి నాశనం చేశారు' అని వాపోతారు. నిజానికి పుణే లాటి నగరాల్లో మరాఠీ కల్చర్‌ కనబడుతుంది. ముంబయి వచ్చేసరికి గుజరాతీలు వచ్చి కొన్ని లొకాలిటీల్లో పూర్తిగా డామినేట్‌ చేసి వాళ్ల వూళ్లల్లా తయారుచేశారు. తమిళులు ధరావీ అని ఆసియాలోనే పెద్ద స్లమ్‌ తయారు చేశారు. ఇటీవలి కాలంలో యుపి, బిహారీలు వచ్చి కంపు చేసేస్తున్నారని రాజ్‌ ఠాక్రే ఉద్యమాలే చేస్తున్నాడు. 

అంతెందుకు మన యింటి పక్క వున్న ఖాళీ స్థలంలో ఓ లంబాడీ తండా వచ్చి ఆక్రమించి, గుడిసెలు వేసేసుకుని వాళ్లకు ప్రత్యేకమైన పండగ వచ్చిందంటూ ఓ రాత్రంతా ఆడా, మగా తాగి డప్పూ, ఢోలూ, పాటలతో హోరెత్తించేశారనుకోండి. మనకు సహనం నశిస్తుంది. 'వీళ్లను తరిమివేయాలండీ, వాళ్ల ఓట్ల కోసమని నాయకులు వాళ్లని ఎంకరేజ్‌ చేస్తున్నారు' అంటూ విరుచుకు పడతాం. ఎవరి సంస్కృతి వారు కాపాడుకోవాలి. కానీ అది నాలుగు గోడల మధ్య వుండాలి. స్థానికులకు చిర్రెత్తించే రీతిలో బహిరంగంగా ప్రదర్శించ కూడదు. యూరోపియన్‌ యూనియన్‌లో యితర సభ్యదేశాలు కూడా ఇంగ్లండు బాట పట్టబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రతి చోట భూమిపుత్రుల వాదం బలపడుతోంది. భుక్తి కోసం ఇతర దేశాల నుంచి వలస వచ్చేవారిపై అసహనం పెరుగుతోంది. దానితో పాటు విదేశాల నుంచి వచ్చి ఉద్యోగాలు ఎగరేసుకుని పోయేవారిపై కూడా ఆగ్రహం కలుగుతోంది. ప్రొటెక్షనిజం పేరుతో స్థానిక పరిశ్రమలను కాపాడాలని, జాతీయవాదం పేరుతో స్థానికులకే అవకాశం యివ్వాలనే డిమాండు యూరోపంతా వ్యాపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మనం డబ్బు విరజిమ్మి వాళ్లను కవ్వించడం ప్రమాదకరమే.

పద్ధతులు అడిగి తెలుసుకోవాలి
మన డబ్బు మన యిష్టం, ఖర్చు పెట్టుకోవద్దని అనడానికి వాడెవడు అని వాదించవచ్చు. అమెరికన్లు ఇండియాకు టూరిస్టులుగా వచ్చినపుడు చిన్నచిన్న బట్టలు కాకుండా మన పద్ధతి ప్రకారం బట్టలు వేసుకుంటున్నారా? మన భాషలు మాట్లాడుతున్నారా? అనే లాజిక్కులు లాగవచ్చు కానీ లాభం లేదు. అక్కడ నివాసముండడానికి వెళ్లినపుడు వాళ్ల పద్ధతులన్నీ తెలుసుకుని వుండాలి. వాళ్లను రెచ్చగొట్టకూడదు. మాకు తెలిసున్నవాళ్లబ్బాయి అమెరికాలో చదువుకుంటూ ఓ డిపార్టుమెంటు స్టోర్సులో పనిచేసేవాడు. ఎవడో దొంగ స్టోర్సులో చొరబడి తుపాకీ చూపితే మన సినిమాల్లో చూపినట్లు చేతులు పైకెత్తాడట. అక్కడ తుపాకీ చూపితే చేతులు నెత్తిమీద పెట్టుకుంటారు కానీ ఎత్తరు. ఇతను ఎత్తడంతో తనను ప్రతిఘటిస్తున్నాడనుకుని ఆ దొంగ కాల్చాడు. చిన్న పాయింటు తెలియకపోవడం వలన యితని ప్రాణాలే పోయాయి.

తోటకూర ప్రసాదు గారే చెప్పారు - ఈ మధ్య టూరిస్టుగా వచ్చిన ఓ భారతీయుడు నార్త్‌ డకోటా ఎయిర్‌పోర్టులో విమాన సిబ్బందితో వాగ్వివాదానికి దిగి 'నా సూట్‌కేసులో బాంబుంటే ఏం చేసి వుండేవారు?' అంటూ తర్కించబోయాట్ట. బహుశా అతని సూట్‌కేసు అప్పటికే చెకిన్‌ అయిందేమో! వాళ్లు వెంటనే విమానాన్ని ఆపేసి, పూర్తిగా తనిఖీ చేసి, ఏమీ లేదని తేల్చుకుని యితన్ని పట్టుకుని జైల్లో పడేశారు. అబ్బే నేను సరదాకి అన్నా అని మొత్తుకున్నా వినలేదు. అక్కడివాళ్లు అసలే పారనాయిడ్‌. పరాయివాళ్లంటే చచ్చే భయం. ఇండియా నుంచి వచ్చిన కేంద్రమంత్రుల్ని కూడా గుడ్డలూడదీసి సోదా చేస్తారు. అలాటి వాళ్లతో పరాచకాలేమిటి? మన ఇండియాలో అయితే నిజంగా బాంబున్నా మనవాళ్లు చలించరు. అందుకే ఏకంగా పార్లమెంటుపై దాడి జరిగినా, మన రైల్వే స్టేషన్లలో, ఎయిర్‌పోర్టుల్లో భద్రతా ఏర్పాట్లలో వైఫల్యాలు సవరించుకోవటం లేదు. ఈ వాతావరణంలో పెరిగి, ఆ వాతావరణానికి అలవాటు పడాలంటే మనవాళ్లకు తర్ఫీదు యివ్వాల్సిందే.

ప్రసాద్‌గారు చెప్పిన అంశాల్లో కల్చరల్‌గా స్థానికులతో కలవడం, మన ఫంక్షన్లకు వాళ్లను పిలవడం, మన ఔన్నత్యాన్ని వాళ్లు గుర్తించేలా చేయడం కూడా వుంది. ఇది చాలా అవసరం. సాధారణంగా ఒక భాషవాళ్లందరూ ఒకే లొకాలిటీలో చేరడం, దానిలోకి యితరులు చొరబడకుండా కనబడని కంచె కట్టేసుకోవడం జరుగుతుంది. మన దేశంలోని నగరాల్లో కూడా యీ ధోరణి కనబడుతుంది. లండన్‌లో కూడా భారతీయులు ఎక్కువ వుండే ప్రదేశాలు, తెలుగువాళ్లందరూ గుమిగూడి వున్న ప్రదేశాలూ కనబడతాయి. అలా జరిగినపుడు అక్కడ కోలాహలం పెరిగి, స్థానికుల దృష్టిలో పడి, ఏవైనా గొడవలు జరిగినప్పుడు అవి యీజీ టార్గెట్లవుతాయి. నేను అనేక వ్యాసాల్లో రాశాను - తమిళులు తమిళనాడులో తప్ప వేరే ఎక్కడున్నా వారిపై దాడులు ఎందుకు జరుగుతాయి? అని. బెంగుళూరు, ముంబయి, శ్రీలంక.. యిలా ఎక్కడైనా సరే వాళ్లపై దాడులు జరుగుతాయి, తెలుగువాళ్లపై జరగవు. ఎందుకు? ఎక్కడికి వెళ్లినా తమిళులు తమ అస్తిత్వం చాటుకుంటారు. తమ వాళ్లంతా ఒక పేటలో పోగడి, వాళ్ల వూళ్ల నుంచి వచ్చినవాళ్లందరినీ అక్కడ చేరుస్తారు. అక్కడ తమ తరహాలో ఓ గుడి కడతారు. తమ ప్రాంతపు పూజారిని రప్పిస్తారు. మేళతాళాలతో ఉత్సవాలు చేస్తారు. ఆ లొకాలిటీలో లుంగీలు కట్టుకుని వీధుల్లో తిరిగేస్తూంటారు. తమ ప్రాంతపు వంటకాలు దొరికే దుకాణాలు పెట్టిస్తారు. చుట్టూ యితర భాషీయులు ఎంతమంది వున్నా తమిళంలో పెద్దగా అరుచుకుంటూ తమ ఉనికిని చాటుకుంటారు. ఏవైనా పండగలు వస్తే ఏ తమిళ విద్వాంసుణ్నో పిలిపించి కచ్చేరీ పెట్టిస్తారు. వాళ్ల సంఘీభావం సాధారణంగా చూడముచ్చటగానే వుంటుంది. కానీ వాళ్లు స్థానికులను డామినేట్‌ చేస్తున్నారన్న ఫీలింగు వచ్చిందంటే చాలు వాళ్లపై దాడులు జరుగుతాయి. తెలుగువాళ్లల్లో అలాటి సంఘీభావం అస్సలు వుండదు. పైగా తెలుగుతనం నిలబెట్టేయాలన్న తపనా వుండదు. ఎక్కడ వుంటే అక్కడ లోకల్‌ వాళ్లతో కలిసిపోతారు. వేషభాషలు కూడా మారిపోతాయి. అందువలన యితర రాష్ట్రాల్లో వున్న తెలుగువారిపై దాడులు ఎప్పుడూ వినం. 

దేశాన్ని ప్రేమిస్తే దేశవాసులనూ గౌరవించాలి
అమెరికా వెళ్లిన యిప్పటి తరం వాళ్లు యీ విషయాన్ని తలకెక్కించుకోవాలి. స్థానికులు బద్ధకస్తులనో, పెద్దగా చదువుకోని వారనో, పొదుపు నేర్వని తెలివితక్కువ వారనో, కుటుంబవ్యవస్థ సరిగ్గా లేని దురదృష్టవంతులనో చిన్నచూపు చూడడం తగదు. వాళ్లెలాటి వాళ్లయినా, విదేశీయులను అనుమతించే, వాళ్లను గౌరవించే సౌజన్యం వాళ్ల దగ్గర వుంది. మనం  సుఖంగా జీవించడానికి వర్ధిల్లడానికి అనువైన వాతావరణం కల్పించింది వారి సంస్కృతే! కొన్ని లోపాలున్నా ఆ సంస్కృతి మనకు నచ్చింది కాబట్టే మనం అక్కడి పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నాం. మన పిల్లలు, మనుమలు కూడా అక్కడే స్థిరపడి పైకి రావాలని ఆశ పడుతున్నాం. ఆ దేశాన్ని మెచ్చుకుంటూ, దేశస్తులను తూష్ణీంభావంతో చూడడం సరికాదు. వారితో కలసిమెలసి వుండడంలోనే, వారి సంస్కృతిలో భాగం కావడంలోనే విజ్ఞత వుంది. మీకు మీరే, మాకు మేమే అని అనుకుని మన కల్చర్‌ని వాళ్లకు నేర్పకపోయినా, వాళ్ల హిస్టరీ, హెరిటేజ్‌, కల్చర్‌ను మనం నేర్చుకోకపోయినా పొరపాటే. ఈ విషయాలపై మన వెన్ను చరిచి హెచ్చరిక చేయడానికి ఈ ఘటన జరిగిందనుకుందాం. 

ఈ విషయాలు తలకెక్కించుకునే బదులు మన మీడియా ట్రంప్‌ను తిట్టడానికి చాలా సమయం వెచ్చిస్తోంది. అమెరికా వలసదారుల దేశమని గుర్తుంచుకోవాలట. పాత చరిత్రంతా తవ్వి వలసదారుల వలన ఆ దేశం ఎంత బాగుపడిందో చెప్తున్నారు. ఆ మాట కొస్తే మన దేశానికి ఎన్నో జాతుల వాళ్లు శతాబ్దాలుగా వలస వస్తూనే వున్నారు. అంతమాత్రం చేత యిప్పుడు ఎవణ్ని పడితే వాణ్ని రానిస్తామా? బంగ్లాదేశ్‌ శరణార్థులు ఆసాంను ముంచెత్తుతున్నారని ఆందోళన జరగటం లేదా? ఎవర్ని రానీవాలో, ఎవర్ని రానీయనక్కరలేదో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.  'మీది వలస దేశం కాబట్టి, మీ దేశంలో వున్న 1.10 కోట్ల అక్రమ వలసదారులను ఉంచుకో! కొత్తగా ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకోకు.' అని మనం చెప్పగలమా? అక్రమవాసుల్లో నాలుగున్నర లక్షల మంది భారతీయులున్నారట. అలా వుండడం తప్పు కదా! అసలు వుండవలసిన అవసరం ఏమొచ్చింది? వాళ్లను తీసుకెళ్లి జైల్లో పెడితే మన పాలకులు అభ్యంతర పెట్టగలరా? హైదరాబాద్‌లో సరైన పత్రాలు లేకుండా బంగ్లాదేశీయులు తిరుగుతున్నారని మనం ఫిర్యాదు చేయటం లేదా? 

ప్రతిభ ఆధారంగా వీసాలు
ట్రంప్‌ లేవనెత్తిన మరొక అంశం - ఎచ్‌1 బి వీసాల జారీ విధానం. నాణ్యత, సామర్థ్యం వున్న స్థానికులు దొరకటం లేదు కాబట్టి నిపుణులను విదేశాల నుంచి తెచ్చుకుంటున్నామని అమెరికన్‌ కంపెనీలు వాదిస్తున్నాయి. 'వాళ్లు నిపుణులా? అయితే నిపుణుల కిచ్చే జీతమే - ఏటా లక్ష డాలర్లు - ఇయ్యి' అన్నాడు ట్రంప్‌. లక్షా ముప్ఫయి యివ్వాలంటూ ఒకావిడ బిల్లు ప్రవేశపెట్టింది. నాలుగు దశాబ్దాల క్రితం పెట్టిన 60 వేల డాలర్ల పరిమితి యిప్పుడూ కొనసాగిస్తే ఎలా? అంది. ట్రంప్‌ తన ప్రసంగంలో స్పష్టంగా చెప్పాడు - కెనడా, ఆస్ట్రేలియా తరహాలో ప్రతిభ వున్నవారికి వీసాలు యిస్తాము అని. నిజమే కదా. విదేశీయులను అనుమతించినపుడు టాలెంట్‌ వున్నవాళ్లనే తీసుకోవాలి, వారికి తగినంత జీతం యివ్వాలి. ఆ జీతం యివ్వడానికి సిద్ధపడటం లేదంటే అతను నిపుణుడు కాడన్నమాట. నిపుణుడని అబద్ధం చెప్పి స్థానికుడికి ఉద్యోగం ఎగ్గొడుతున్నావన్నమాట! 75 లక్షల నిరుద్యోగులున్నపుడు వాళ్లని కాదని విదేశీయుడికి యిచ్చేటప్పుడు అతనికి నైపుణ్యం వుందని ప్రభుత్వాన్ని నమ్మించగలగాలి కదా! 

తాజాగా ఔట్‌సోర్సింగ్‌ చేసే కంపెనీలకు యిచ్చే గ్రాంట్లు, గ్యారంటీలు, రాయితీలు యివ్వకూడదంటూ బిల్లు ప్రవేశపెడుతున్నారు. విదేశాల్లో అమెరికా కంపెనీల ఔట్‌సోర్సింగు ఉద్యోగులు 1.40 కోట్ల మంది వున్నారు. అంటే అమెరికాలో ఉద్యోగార్థుల కంటె దాదాపు రెట్టింపు. నిజానికి బ్యాంకు బాలన్సు చెప్పడం, సినిమా హాల్లో బుకింగ్‌ చేయడం వంటి పనులు స్థానికులకే యివ్వవచ్చు.  ఎంతటి గణిత విద్యా ప్రవీణులైనా బయటి దేశాల వాళ్లకు యిచ్చే అవసరం లేదు. కానీ కంపెనీలు ఎందుకిస్తున్నాయి? వాళ్లయితే చవగ్గా చేస్తారని, డబ్బు మిగులుతుందని. ఆ విధంగా ఆల్‌రెడీ లాభపడుతున్న కంపెనీలకు విడిగా రాయితీలు దేనికి? మన పాలకులు ట్రంప్‌ నుంచి స్ఫూర్తి తీసుకుని మన కంపెనీలకు కూడా యిలాటి కోతలు పెట్టాలి. ఎందుకంటే ఏ చైనావాళ్లో మన కంటె తక్కువ జీతాలకు సిద్ధపడవచ్చు. అప్పుడు మన కంపెనీలు వాళ్లకు ఔట్‌సోర్సు చేసేయవచ్చు. ఇప్పటికే మన ఐటీ కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తున్నామనే పేర ప్రభుత్వాల నుంచి అవసరం లేకపోయినా వందలాది ఎకరాలు చౌకగా కొట్టేశాయి. స్థానికంగా తయారుచేసిన వస్తువులమ్మే షాపు వాడి ఎదురుగా మరొకడు చైనా చీప్‌ వస్తువుల షాపు పెట్టి లాభాలు గడిస్తూ, పైగా ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా పొందుతూంటే మొదటి షాపువాడు ఎలా ఫీలవుతాడో ఊహించండి. 

విద్యార్థులు వెనక్కి వచ్చేయచ్చు
ట్రంప్‌ తెస్తున్న సంస్కరణల్లో ఒపిటి - చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసే అవకాశాన్ని - తగ్గించే ప్రతిపాదన కూడా వుంది.  మనం నిజాలు మాట్లాడుకోవాలంటే ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళుతున్నామని చెప్పేవారిలో నిజంగా ఉన్నత విద్యార్జన కోసం  వెళ్లేవారు అతి తక్కువ మంది. ఎక్కువ మంది ఆ పేరుతో చిల్లర ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదిద్దామని వెళుతున్నారు. ఏవో సాధారణ కాలేజీల్లో చేరి నామమాత్రంగా చదువుతూ, చదువుకునే సమయంలోనే చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేస్తూ అప్పుడప్పుడు పట్టుబడుతున్నారు. చదువు పూర్తయ్యాక కూడా అక్కడే చిన్నా, చితకా ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. విద్య కోసం అమెరికాకు వెళ్లినవారిలో వెనక్కి వస్తున్నది 5% మాత్రమే అని గణాంకాలు చెప్తున్నాయి. భారతీయ విద్యార్థుల సంఖ్య 1.90 లక్షలు కాగా చైనా విద్యార్థుల సంఖ్య 3.30 లక్షలు. అయితే చైనీయుల్లో 50% మంది చదువు పూర్తయ్యాక వెనక్కి వెళ్లిపోతున్నారు. మనవాళ్లలో 95% మంది మాత్రం అక్కడే వుండిపోయి ఏవో తంటాలు పడుతూన్నారు. వాళ్లకు ఉద్యోగం యిచ్చి తీరాలి అని మనం అమెరికా వాళ్లను పట్టుబట్టలేం కదా. ఇండియాలో కూడా అనేక మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. వారందరికీ మనం ఉద్యోగాలు చూపిస్తున్నామా?

ఇప్పుడీ కాన్సస్‌ సంఘటన వలన, ట్రంప్‌ విధానాల వలన అత్యధికంగా ప్రభావితమయ్యే వారు యీ వర్గమే. నిజానికి అన్నీ సక్రమంగా వున్నవారికి కూడా పూరింగ్‌టన్‌ వంటి వాడి వలన భయముంది. వాళ్లకే అలా వుంటే చదువుతూండగానే అక్రమంగా పని చేసేవారు, చదువు పూర్తయి, వీసా గడువు తీరిపోయినా అక్రమంగా వుండిపోయినవారు ఇంకా దడుస్తారు. పూరింగ్‌టన్‌ లాటి వాడు తమను ప్రశ్నలు వేస్తాడని అనుక్షణం భయపడుతూ వుంటారు. అక్కడుంటే గొడవలు వస్తాయనుకుని వెనక్కి వచ్చేస్తారు. ఇప్పటికే అక్రిడేషన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇండిపెండెంట్‌ కాలేజెస్‌ అండ్‌ స్కూల్స్‌ బోర్డు గుర్తింపు రద్దు చేయడంతో దాని అనుబంధంగా వున్న 800 విద్యాసంస్థల్లో చేరిన 2 లక్షల మంది పరిస్థితి గందరగోళంగా వుంది. గత ఏడాది చదువు పూర్తి చేసుకుని ఏడాదిగా ఓపిటిపై ఉద్యోగం చేస్తున్న వారిలో 10 వేల మంది తెలుగువాళ్లు వున్నారట. బోర్డు రద్దుతో వీరిలో కనీసం సగం మందైనా వెనక్కి రావలసి వుంటుంది. లేకపోతే మళ్లీ యింకో యూనివర్శిటీలో చదువు కంటూ చేరాలి. వారి తలిదండ్రులు మరింత అప్పులపాలవుతారు. వారికి వ్యక్తిగతంగా నష్టమే కానీ, దీనివలన జరిగే మేలు ఏమిటంటే - ఇకపై ఉద్యోగాల యావలో పిల్లల్ని అమెరికా పంపరు. ఇక్కడ ఏదోలా బిటెక్‌ అయిందనిపించి, ప్రఖ్యాత యూనివర్శిటీల్లో సీటు తెచ్చుకోలేక, తలితండ్రుల్ని పీడించి, 40, 50 లక్షలు విద్యాఋణాలు తీసుకుని, బ్యాంకు బాలన్స్‌ లేకపోయినా వున్నట్లు చూపించి, ఏజంట్ల ద్వారా స్థాయిలేని యూనివర్శిటీలో చదువు వెలగబెడుతూ, చాటుగా ఉద్యోగాలు చేసేవారు తగ్గుతారు. ఉన్నతవిద్య కోసం నిజంగా తపించేవారు మాత్రమే అమెరికా వెళతారు. వారికి ఎలాగూ మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఎచ్‌1బి వీసా బిల్లు పాసయితే జీతం కూడా 1.30 లక్షలు వస్తుంది.

అంతంత మాత్రం ప్రతిభతో వెళ్లడం దేనికి?
సాధారణ ప్రతిభ మాత్రమే వున్నవారు అమెరికా వెళ్లకపోవడం వలన దేశానికి నష్టమేమైనా వుందా? వాళ్లు అక్కణ్నుంచి పంపే రెమిటెన్సెస్‌ తగ్గుతాయి. ఫారెక్స్‌ నిలువలు తగ్గుతాయి. కానీ లాభాలు చాలానే వున్నాయి. మన టాలెంటు మన దగ్గరే వుంటుంది. (ఇక్కడో జోకు గుర్తు వస్తోంది. షూటింగులో పొట్టి ప్రసాద్‌ కాస్త ఓవరాక్ట్‌ చేస్తూ వుంటే బాపుగారు 'ప్రసాద్‌గారూ, అంత వద్దు, సగం చాలు' అన్నారట. పొట్టిప్రసాద్‌ ఏమీ అనుకోకుండా 'అలాగే కానీయండి సార్‌, నా టాలెంటు నా దగ్గరే వుంటుంది.' అని చమత్కరించారట) నిజానికి వాళ్లకు ఆ టాలెంట్‌ సమకూర్చడంలో ముఖ్యపాత్ర మనం పన్ను కట్టిన డబ్బుది. అతని టాలెంటుపై యీ దేశప్రజలకు ఎంతో కొంత హక్కు వుంది. వీళ్లంతా మన దగ్గరే వుంటే ఈ సారి రాకెట్లో 200 శాటిలైట్లు కుక్కి పంపగలం. డబ్బు యావలో పడి అమెరికాలో ప్రాధాన్యత లేని ఉద్యోగాలు చేసే బదులు, యిక్కడి ఉద్యోగాలే చేస్తే మన సేవారంగంలో నాణ్యత పెరుగుతుంది. విదేశాలకు మరోలా సేవ లందించి బోల్డు ఫారిన్‌ ఎక్ఛ్‌ఛేంజ్‌ సంపాదించి ఫారెక్స్‌ నిలవలు పూరించగలం. మన దేశం పట్టనంత నాణ్యత గల వ్యక్తులే అయితే వాళ్లను లక్షల డాలర్ల జీతం ఎర చూపి అమెరికా ఎలాగూ ఎగరేసుకుని పోతుంది. ప్రస్తుతం ట్రంప్‌ అమెరికాను స్కిల్‌డ్‌ అమెరికా చేస్తానంటున్నాడు. స్కిల్‌ వున్నవాళ్లకే అక్కడ పీట వేస్తారు. లేనివాళ్లను వదుల్చుకుందామని చూస్తారు. మన స్థాయి ఏమిటో మనకు అర్థమైతే అక్కడుండాలో, వెనక్కి రావాలో మనకే తెలుస్తుంది. వెనక్కి వచ్చేమాటైతే దానికి తగ్గ సన్నాహాలు చేసుకుని ఒడిదుడుకులు లేకుండా స్మూత్‌గా మకాం మార్చవచ్చు. ఆ లోపున అక్కడ ఎలా మసలుకోవాలో పైన చర్చించాం. 

పిల్లల్ని అమెరికా పంపుదామనుకుంటున్న తలిదండ్రులకు యీ సుదీర్ఘవ్యాసం చెప్పే సలహా ఒక్కటే - ప్రస్తుత సంఘటనతో బెంబేలెత్తకండి. మీ పిల్లలలో అసమాన ప్రతిభ వుంటేనే అమెరికా పంపండి. అదీ పేరుప్రఖ్యాతులున్న కాలేజీల్లో సీటు వస్తేనే, అతను చాటుమాటు ఉద్యోగం చేయనవసరం లేకుండా చదివించగల ఆర్థిక స్తోమత మీకుంటేనే పంపండి. 'చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరకదు, యింటికి తిరిగి వచ్చేస్తాడు, ఇక్కడే ఉద్యోగం వెతుక్కుంటాడు' అనే సందర్భానికి సిద్ధపడితేనే పంపండి. పంపబోయే ముందు అక్కడి సమాజంలో ఎలా యిమిడిపోవాలో తర్ఫీదు యిప్పించి పంపండి. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2017)