Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : బాపుకు బాష్పాంజలి - 5

ఎమ్బీయస్‌ : బాపుకు బాష్పాంజలి - 5

బాపు తను వేసిన బొమ్మలన్నీ రమణకు చూపించేవారు. రమణ తను రాసినదల్లా బాపుకి చూపించేవారు. సినిమాలైతే కలిసే తీశారు. ఈ సినిమా లేదా యీ సీను యింత బాగా ఎలా తీయగలిగారని బాపుని అడగండి, 'నాదేం లేదండి, ఆ ఘనతంతా రమణగారి స్క్రిప్టుదే' అనేస్తారు. ప్రతీ ప్రశ్నకూ అదే సమాధానం. వాళ్ల సినిమాల సంగీతం విషయంలో బాపుగారి భూమిక ఎక్కువని తెలుసు కాబట్టి ఆ విషయంపై సమాచారం తరచితరచి అడగగా తన సంగీతాభిరుచులపై ''హాసం''కు రాసి పంపారు. అంతా రమణే చేశాడని బాపు చెప్పినా, స్క్రిప్టు రాసి యివ్వడం, ఆ తర్వాత నిర్మాణవ్యవహారాలు చూడడం రమణ బాధ్యత. ఆ తర్వాత బాపుగారు సొంతం చేసుకునేవారు. డైరక్షనంతా బాపుగారిదే. దానిలో రమణ వేలు పెట్టేవారు కాదుట. తర్వాత సమీక్షించుకోవడాలు ఎలాగూ వుంటాయి. ''సాక్షి'' సినిమా మనందరికీ నచ్చినా బాపుగారికి నచ్చలేదు. ''రమణ స్క్రిప్టుకి న్యాయం చేయలేదు'' అని ఫీలయ్యేవారు. సినిమాలు బాగా ఆడినపుడు అది నా వలన ఆడింది అని, పోయినపుడు అవతల వాళ్ల వలన పోయింది అని వాళ్లిద్దరు ఎప్పుడూ అనుకోలేదు. ''కోతికొమ్మచ్చి'' నిండా 'మేం..' అనే కనబడుతుంది. అందుకే అది 'బాపురమణీయం' అయింది, ఒట్టి రమణగాథగా లేదు. ఎవరు ప్రతిపాదించినా ఫైనల్‌గా వాళ్లవి ఉమ్మడి నిర్ణయాలే, వాటి ఫలితాలు కూడా ఉమ్మడిగా అనుభవించారు. 

వాళ్లిద్దరి అభిరుచులు దాదాపు సమానమైనా, తేడాలు కూడా వున్నాయి. రమణగారికి ఏదైనా చదవమని సూచించినా, యిచ్చినా తన అభిప్రాయం చెప్పేవారు, బాపు అభిప్రాయం కూడా చెప్పేవారు. స్వాతిలో బహుమతి గెల్చుకున్న 'నాగాభరణం' అనే నా కథ బాపుగారికి చాలా చాలా నచ్చేసింది. చదువు అని రమణగారికి చెప్తే ఆయన తాత్సారం చేశారు. ఒకటికి రెండుసార్లు చెప్పి చదివించారు. అప్పుడు రమణగారికీ బాగా నచ్చింది. నాకు ఫోన్‌ చేసి యీ వివరాలు చెప్పారు. ఇలా నిరంతరం వాళ్లు ఒకరికొకరు అన్ని రకాల సమాచారాలూ ఫీడ్‌ చేసుకుంటూ వున్నారు. ఆ ఎడ్వాంటేజి తక్కిన చిత్రదర్శకులకు వుంటుందనుకోను. రమణగారు తను రాసినవన్నీ బాపుగారికి చూపించి అభిప్రాయం తీసుకునేవారు. వ్యక్తిగత విషయాల్లో బాపుగారిది కన్సర్వేటివ్‌ వ్యూ. సంకోచాలు ఎక్కువ. రమణగారికి ధైర్యం ఎక్కువ. ''రచన''కు 'శృంగార శాఖాచంక్రమణం' అని శృంగారం గురించి జోకులతో వ్యాసం రాశారు. బాపుగారు బొమ్మలేసి పెట్టారు కానీ 'ఎందుకయ్యా యివన్నీ పబ్లిగ్గా రాయడం' అని సణిగారు. అచ్చయ్యాక రమణ నన్నడిగారు - 'ఎలా ఫీలయ్యార'ని. 'మీ ప్రతిష్టకు లోటేమీ రాదు, జీవితవాస్తవాలు రాశారు, అందరి మనసుల్లో మెదిలేదే చెప్పారు' అన్నాను. ఆయన వూరడిల్లి బాపు అభిప్రాయం చెప్పారు. ఆ వ్యాసం చాలా ప్రసిద్ధి కెక్కింది. 

''కోతికొమ్మచ్చి'' రాసేటప్పుడు కూడా రమణరాసిన చాలా విషయాలకు బాపు అడ్డుపడుతూనే వున్నారు. 'ఎందుకయ్యా యివి..' అంటూ. ఈయన అయోమయంలో పడేవారు. అప్పటికీ కొన్ని రాశారు. 'ఫలానాది రాయవచ్చు కదండీ' అంటే 'బాపు వద్దంటున్నాడు..' అనేవారు రమణ. ''కొసరు కొమ్మచ్చి''లో సీతారాముడు గారు వాళ్ల వ్యక్తిగత విషయాలు రాస్తే వాటిని నేను బాక్స్‌ ఐటమ్స్‌గా వాడతానన్నాను. బాపు వద్దన్నారు. ముఖ్యంగా మద్యపానం గురించి ముచ్చట్లూ అవీ. రమణ ''కోతికొమ్మచ్చి''లోనే వాటి గురించి సరదాగా రాశారు. అవి చదివి సీతారాముడుగారితో ఆయన ఫ్రెండ్స్‌ 'వాళ్లు పక్కా తాగుబోతుల్లా వున్నారే' అని కామెంట్‌ చేశారట. 'కాదు సుమా, హెల్త్‌ డోస్‌లా తాగుతారు' అని సీతారాముడు రాస్తే బాపు దాని ప్రస్తావనే వద్దన్నారు. నేను చెప్పాను - 'మీరు వర్క్‌ స్పాట్‌లో ఎప్పుడూ తాగలేదు, తాగి షూటింగులు కాన్సిల్‌ చేయలేదు. పార్టీలలో ఎవరితో ఘర్షణ పడలేదు. ఆఫీసులో తాగుతున్నాడన్న కారణంగా ఒక వ్యక్తితో మీరు భాగస్వామ్యం తెంపుకున్నారు. రమణగారు మద్యపానం గురించి జోకులేస్తూ ప్రస్తావించకపోతే గొడవే లేదు. ఆయన చెప్పారు కాబట్టి యీ సమాచారం కరక్టివ్‌గా వుంటుందండి' అన్నాను. అయినా బాపు ఒప్పుకోలేదు. అది ఒకటే కాదు, తన లైబ్రరీ గురించి గురించి రాయవద్దంటారు. ఈ పర్శనల్‌ ఐటమ్సన్నీ నేను డిటిపి చేసి పంపించాను. దాదాపు అన్నిటికీ పక్కన యింటూలు పెట్టేసి 'వ్యక్తిగత విషయాలు ప్రజలకు ఆసక్తికరంగా వుండవు కాబట్టి తీసేయండి' అంటూ పైన రాశారు. అలా అభ్యంతరం తెలుపుతూనే 'చివరి తీర్పు మీదే' అంటూ నాకు వదిలేశారు.  ఆ లెటరు కాపీ పెడుతున్నాను చూడండి. నా కిచ్చిన అధికారాన్ని వినియోగించుకుని రెండు, మూడు బిట్స్‌ తప్ప తక్కినవన్నీ పుస్తకంలో పెట్టేశాను. 

బాపుకి అనవసర భయాలు, మొహమాటాలు ఎక్కువ. ''కోతికొమ్మచ్చి'' స్వాతిలో సీరియల్‌గా వస్తూండగా మొదటి 35 వారాల మెటీరియల్‌తో ''హాసం ప్రచురణలు'' తరఫున ''కోతికొమ్మచ్చి'' పుస్తకం తయారుచేయడం మొదలుపెట్టాను. సీరియల్‌లో వాడిన ఫోటోల కంటె ఎక్కువ ఫోటోలతో అందంగా తయారుచేయాలని నా తాపత్రయం. సినిమా స్టిల్స్‌తో బాటు సందర్భానుసారంగా బాపురమణల పర్శనల్‌ ఫోటోలు, షూటింగ్‌ ఫోటోలు కూడా వాడాలని నా ఉద్దేశం. రమణగారికి నా జడ్జిమెంటుపై అచంచల విశ్వాసం కానీ బాపుగారికి అంత లేదు - అప్పట్లో! ''మా ఫోటోలు వద్దండి, పాఠకులు తిట్టుకుంటారు'' అనేవారు. ''మీ గురించి ఏ చిన్న సమాచారమైనా సరే, వాళ్లకు ఆసక్తి కలిగిస్తుందండి, వాళ్లకు ఎవర్షన్‌ రానంత మోతాదులో వుపయోగిస్తాను.'' అని చెప్తూ వచ్చాను. ''మీ పెద్దబ్బాయి వేణు ఫోటో పంపండి.'' అంటే ''అక్కరలేదు'' అన్నారు. ''రమణగారు తన కథలో మీ నాన్నగారే అతని రూపంలో మళ్లీ వచ్చి తనను ఆదుకున్నాడనీ, తన అప్పులన్నీ తీర్చేశాడనీ రాశారు. అంత పుణ్యాత్ముడు ఎలా వుంటాడో చూద్దామని పాఠకుడికి కుతూహలం వుంటుంది కదా'' అని వాదించాను. ఆయనలో తండ్రి కరిగాడు - ''అవునండీ, వాళ్ల మామ అంటే వాడికి అంత యిష్టం.'' అంటూ ఫోటో పంపారు. చివరిదాకా సణుగుతూనే వున్నారు - 'నా ఫోటోలు ఎక్కువై పోయాయి' అని. 'ఏదైనా యాడ్వర్స్‌ కామెంట్‌ వస్తే సెకండ్‌ ఎడిషన్‌లో తీసేస్తా' అని హామీ యిచ్చి అలాగే వేసేశా. పుస్తకం ప్రజాదరణ పొందింది. బాపుగారు కిమ్మనలేదు. ''ఇంకోతికొమ్మచ్చి'' వచ్చేసరికే ఏ అభ్యంతరమూ రాలేదు. ''మీరేం చేసినా పెర్‌ఫెక్ట్‌గానూ వుంటుంది, అందంగానూ వుంటుంది' అని కితాబు యిచ్చారు. బాపు వంటి పెర్‌ఫెక్షనిస్టు చేత అలా అనిపించుకోవడం కంటె జన్మకు ధన్యత వుంటుందా? (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?