బాపు, రమణ హైస్కూలు రోజుల నుండే స్నేహితులు. ఇద్దరూ కలిసి తిరిగేవారు, సినిమాలు చూసేవారు. కానీ రమణ కష్టాలు రమణవే, నిరుద్యోగంతో బాధపడుతూ, జీవితం తినిపిస్తున్న ఢక్కామొక్కీలు తింటూ, కాలం నెట్టుకొస్తున్న యువకుడు. బాపు తండ్రి చాటు బిడ్డ, బుద్ధిగా చదువుకునే బుద్ధిమంతుడు. రమణతో కలిసి తిరిగి చెడిపోతాడేమోనని బాపు తండ్రి బెంబేలు పడేవారు. రమణను మందలిస్తూ వుండేవారు. ఈ పరిస్థితుల్లో ఆయన పోయారు, కొద్దిరోజులకే బాపు అన్నగారు కూడా పోయారు. ఒక్కసారిగా బాపు యింటికి పెద్ద అయిపోయాడు. ఆ సమయంలో రమణలో హఠాత్తుగా పెద్దరికం ముందుకు వచ్చింది. వ్యవహారదక్షత వెలికి వచ్చింది. బాపు కుటుంబానికి పెద్దకొడుకై పోయి, ఆ యింటి వ్యవహారాలు చక్కదిద్దసాగారు. బాపు తల్లి ఆయన మాటకు విలువ యిచ్చేది. జీవితం నేర్పిన లోకజ్ఞానం, నలుగురితో మాట్లాడే నైపుణ్యం, ఏ పనైనా ప్రణాళికాబద్ధంగా చేయడం – యీ గుణాలతో రమణ తక్కిన అందరికీ మార్గనిర్దేశనం చేయగలిగారు.
అంతే బాపు, రమణ చొక్కా అంచు పట్టుకుని వెనక నడిచారు. కోతికొమ్మచ్చి సీరీస్ ముఖచిత్రాలన్నిటిలోనూ బాపు దీన్నే ప్రదర్శించారు చూడండి. రమణ మార్గదర్శకత్వంలో నడుస్తున్నట్లే తనను తాను చూపుకున్నారు బాపు. సినీరమణీయం తయారుచేసే టైములో రమణగారి యింటికి వెళ్లి వాళ్ల ఆల్బమ్‌లు వెతికాను. ఒక ఫోటో దొరికింది. రమణ చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడి ముందుకు చూస్తున్నారు, వెనక్కాల బాపు కూడా నిలబడి అటే చూస్తున్నారు. కెమెరా యాంగిల్ కారణంగా రమణ పొడుగ్గా, లీడర్‌లా కనబడుతున్నారు. నాకు చాలా బాగా నచ్చి, ఆ పుస్తకంలో వాడాను. 'ముందు రమణ, వెనుక బాపు' అని కాప్షన్ పెట్టాను. రమణగారు వద్దన్నారు. 'మీరే కదా సినిమాల్లోకి ముందు వెళ్లినది, తర్వాతే బాపు' అని చెప్పబోయాను. 'అది నిజమే కదా, యీ కాప్షన్ వలన వేరే అర్థం వస్తుంది, వద్దు, సింపుల్‌గా రమణ, బాపు అని పెట్టేయండి.' అన్నారు రమణ. అలాగే చేశాను. ఆ ఫోటోలో రమణ హీరోయిక్‌గా, ఏమొచ్చినా తట్టుకుంటాం అన్నట్టు నిలబడి వుంటారు. బాపు బేలగా ఏమీ వుండరు. రమణ చూసేవైపే చూస్తూ వుంటారంతే. ఆయన శక్తి ఆయనకుంది. కానీ అంతా రమణ గైడెన్సులోనే అనే భావం స్ఫురిస్తుంది.
అసలు ''సాక్షి'' మొదలుపెట్టినపుడు దర్శకత్వం ఎవరు చేయాలన్నది నిశ్చయించుకోలేదట. ఇలస్ట్రేటర్‌గా బాపు ఫ్రేమింగ్ అద్భుతంగా వుంటుంది కాబట్టి బాపు డైరక్టు చేస్తే మంచిది అనే సూచన సీతారాముడుగారు చేస్తే అప్పుడు అందరూ ఆమోదించారట. ఆ వైనమంతా ''కొసరు కొమ్మచ్చి''లో సీతారాముడుగారు రాశారు. బాపు డైరక్షన్ మీద దృష్టి కేంద్రీకరిస్తే రమణే ఆర్థిక వ్యవహారాలు, నిర్వహణావ్యవహారాలు అన్నీ చూసుకునేవారు. వాళ్ల ఫిలిం కంపెనీ సంగతులే కాదు, యింటి వ్యవహారాలలో కూడా రమణదే అజమాయిషీ. ఆయనను బాపు పెద్దన్నగారిలా చూస్తే బాపుగారి భార్య తమ్ముళ్లా చూసేది. ఇంట్లో ఏం కావలసివచ్చినా ఆయనకే చెప్పేదని రమణగారమ్మాయి ''కొసరు కొమ్మచ్చి''లో రాశారు. రెండు కుటుంబాలలో పిల్లలకు, పెద్దలకు, అతిథులకు ఎవరికి ఏం కావలసి వచ్చినా, ఏ ఫంక్షన్ చేయాలన్నా అన్నిటికీ కేరాఫ్ రమణే. దాంతో బాపుకి లోకం తీరు గురించి తెలుసుకోవాల్సిన అవసరం పడలేదు. బొమ్మలేసుకోవడం, సినిమాలు డైరక్టు చేసుకోవడం. అంతే..!
వాళ్లు తీసిన సినిమాల్లో యిద్దరికీ భాగస్వామ్యం వున్నా, బాపుకి దేనికి ఎంత డబ్బు వచ్చిందన్న విషయంపై పూర్తి అవగాహన లేదు. 'నామీదే నర్రోయ్' అంటూ తన సినిమాలపై తనే వేసుకున్న సెటైర్లలో ''కృష్ణావతారం'' ఫ్లాప్ అని వేసుకున్నారు. ''కాదు, హిట్టయింది, అతనికి తెలియదు'' అంటారు రమణ. సరిగ్గా చెప్పాలంటే రిస్కంటే భయపడని ఎంటర్‌ప్రెనార్ రమణ. రిస్కులు తీసుకోకుండా సజావుగా నడిచిపోతే చాలనుకునే ఉద్యోగి స్వభావం బాపుది. నిర్మాతగా బాపు తీసుకున్న రిస్కులు రమణతో కలిసి తీసుకున్నవే. సినిమా జయాపజయాల మాట ఎలా వున్నా చిత్రకారుడిగా ఆయనకు ఆదాయం నిరంతరంగా వస్తూనే వుంది. అందుకే ఒడిదుడుకులు లేకుండా గడిచిపోయింది. ఆర్థికంగా స్థిరపడ్డాక కూడా రమణ రిస్కులు తీసుకుని యిబ్బందుల్లో పడ్డారు. నిర్వహణకనే కాదు, అనేక విషయాలలో బాపు రమణపై ఎమోషనల్‌గా ఆధారపడ్డారు. ఆయన ప్రపంచాన్నంతా రమణ ద్వారానే చూసేవారు. మనం బాపుగారితో డైరక్టుగా అన్నీ చెప్పనక్కరలేదు. రమణగారితో చెపితే చాలు, అది ఆయనకు చేరిపోతుంది. ఇద్దరికీ ఫ్రెండ్స్ కామన్. బాపురమణలు ఎవర్నీ దగ్గరకు రానీయరని, వాళ్లిద్దరే కలిసి తిరుగుతారు తప్ప ఎవరైనా దగ్గరకి వస్తే కరుస్తారని చెప్పుకునేది అబద్ధం. వాళ్లకి అన్ని రంగాలలో, అన్ని స్థాయిలలో స్నేహితులున్నారు. ప్రభుత్వోద్యోగులు, వ్యాపారస్తులు, కళాకారులు.. యిలా చాలామంది వున్నారు. వీళ్లంతా వందిమాగధులు కారు.
నేను రమణ గారింటికి వెళ్లిన కొత్తలో వరాను అడిగాను – ''మీ నాన్నగారి సినిమా రిలీజయ్యాక బాగుందో బాగోలేదో మీకెలా తెలుస్తుంది? మద్రాసులో వుంటారు కదా'' అని. ''నాన్నగారి స్నేహితులు అన్ని వూళ్లల్లో వున్నారు కదండీ, వాళ్లే ఫోన్ చేసి చెప్పేస్తారు.'' అన్నాడతను. సినిమాల గురించి, తన రచనల గురించి నిరంతరం రమణ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూనే వుంటారు. ''ఈ వారం కోతికొమ్మచ్చి గురించి ఫలానావాళ్లు యిలా విమర్శించారండీ'' అని రమణ ఫోన్ చేసి నాకు చెప్పేవారు. ఇలాటి స్నేహాలు మేన్‌టేన్ చేయడం వలనే వాళ్లెప్పుడూ పొగడ్తల అగడ్తలో పడలేదు. మనందరికీ ఎంతమంది స్నేహితులున్నా, అత్యంత సన్నిహితులు కొందరే వుంటారు కదా. అలాగే వాళ్లకు క్లోజ్ సర్కిల్ ఒకటి వుంది. అలాగే మితభాషిత్వం. అవతలివాళ్లతో స్నేహం కుదిరితే ఎంతైనా మాట్లాడతారు. ఊరికే ముఖస్తుతి కబుర్లు చెపుతూ వుంటే మాట తప్పించేస్తారు. రమణ పోయిన తర్వాత యీ స్నేహితులంతా ఏమయ్యారు, బాపుతో మాట్లాడుతూ ఆయన్ని యాక్టివ్‌గా వుంచవచ్చు కదాన్న సందేహం వస్తుంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2014)