Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : బాపుకు బాష్పాంజలి - 2

ఎమ్బీయస్‌ : బాపుకు బాష్పాంజలి - 2

రమణగారితో పరిచయమైన చాలా రోజులకు గాని, బాపుగారితో ప్రత్యక్ష పరిచయం ఏర్పడలేదు. ''బొమ్మా-బొరుసూ'' పుస్తకం సంకలనం చేస్తూ ఫుట్‌నోట్స్‌లో వాడుకోవడానికి బాపుగారి వివరాలు సేకరిస్తే బాగుంటుందనిపించి, డైరక్టుగా యింటర్వ్యూ చేయడానికి ధైర్యం చాలక, 1995 ఏప్రిల్‌లో లిఖితపూర్వకంగా ప్రశ్నావళి పంపాను. వారం తిరక్కుండా జవాబులు రాసి పంపారు. వ్యక్తిగతమైన  ప్రశ్నల విభాగంలో 6 వ ప్రశ్నగా - ''మీరు ''సీతాకళ్యాణం'' ఎవార్డుకై విదేశాలు వెళ్లినపుడు రమణగారి కాళ్లకు నమస్కారం పెట్టారని చదివాను. నిజమేనా?'' అనీ, ''మీ రెండో అబ్బాయి పేరు వెంకటరమణ, అది మీ మావగారి పేరా? రమణగారి పేరా?'' అనీ అడిగాను. బాపు-రమణలు స్నేహితులు కాబట్టి యిద్దరూ ఒకరితో ఒకరు సమానస్థాయిలో వ్యవహరించుకుంటారని అనుకుంటాం. కానీ ఒకరి కాళ్లకు మరొకరు దణ్ణం పెట్టడం లేదా పిల్లలకు పేరు పెట్టడం విడ్డూరంగా తోస్తుంది. అందుకే ఆ ప్రశ్న. దానికి సమాధానంగా బాపు - 'గౌరవం చూపడంలో ఆశ్చర్యం ఏవుంది? కాళ్లు పట్టుకుని లాగెయ్యలేదు కదా!' అని చెప్తూ 'మా అబ్బాయి పేరు రమణగారి పేరే పెట్టుకున్నాము' అని క్లారిఫై చేశారు. రమణ అంటే బాపుకి ఎప్పుడూ మహాగౌరవం. వాళ్లల్లో వాళ్లు ఎంతైనా వాదించుకోవచ్చు, పోట్లాడుకోవచ్చు కానీ రమణ మీద బాపు యీగ వాలనివ్వరు. ఆయన ఏం చేసినా కరెక్టే అనేవారు. బాపుని విమర్శిస్తూ రమణగారి దగ్గర మాట్లాడినా ఫర్వాలేదు, ఆయన వింటారు, కానీ రమణగారిని బాపుగారి దగ్గర విమర్శిస్తే అస్సలు ఒప్పుకోరు. 

బాపుగారు చాలా ఎమోషనల్‌. ఆగ్రహానుగ్రహాలు చాలా తీవ్రంగా వ్యక్తపరుస్తారు. ఆయనకి నేనంటే అమిత యిష్టం. నన్ను ఆప్తమిత్రుడిగా భావించేవారు. నిజానికి నేను బాపుగారికి చేసిన సహాయం ఏమీ లేదు, ఆయన బొమ్మలు సేకరించి పెట్టడం కానీ, మరోటి గానీ ఏమీ చేయలేదు. నేను రమణగారి కోసం చేసినదానికే బాపుకి నేనంటే గౌరవం, వాత్సల్యం కలిగాయి. రమణకు ఏదైనా మంచి చేస్తే తనకు చేసినట్లే ఆయన భావన. కొసరు కొమ్మచ్చిలో నా 'అభిమాని ప్రస్థానం' చదివి ''రమణగారి గురించి మీ విశ్లేషణ అత్యద్భుతంగా వుంది. రమణగారన్నట్లు తను చాలా అదృష్టవంతుడు. మీ, వరప్రసాద్‌ గార్ల స్నేహం దొరకడం మాకు దేవుడిచ్చిన వరం.'' అని రాశారు. ఇలాటి మాటలకు మించిన ఎవార్డు వేరే వుంటుందా? ఇదేదో సభావేదికపై మెచ్చుకోలుకి చెప్పిన మాటలు కావు. వ్యక్తిగతంగా రాసిన ఉత్తరాలు. రచనలు కానీ, వ్యక్తులు కానీ నచ్చితే  విపరీతంగా నచ్చేస్తారు. బాపుగారికి, రమణగారికి పి జి ఉడ్‌హవుస్‌ అంటే ప్రాణం. నాకూ చాలా యిష్టం. ''రచన''లో ప్రచురించబడిన నా ఉడ్‌హవుస్‌ తరహా హాస్యకథలు ''అచలపతి కథలు''కు లోగో బాపుగారే వేసిపెట్టారు. పుస్తకరూపంలో తెచ్చినపుడు దాన్నే ముఖచిత్రంగా వాడుకున్నాను. ''హాసం'' ప్రారంభించినపుడు ''బాపురమణీయం'' అనే శీర్షిక ద్వారా వారి గురించి కబుర్లు చెపుతూనే, ''ఉడ్‌హవుస్‌ కార్నర్‌'' అనే పేరుతో మరో శీర్షిక నడుపుతూ దానిలో ఉడ్‌హవుస్‌ కథల స్వేచ్ఛానువాదాలు రాసేవాణ్ని. అవి బాపుగారికి విపరీతంగా నచ్చాయి. ''మీ పిజిడబ్ల్యు అనువాదం అద్భుతంగా వుంది. రమణగారిది తరువాత అంత చక్కటి అనువాదం నేను చదవలేదు.' అని కితాబు యిచ్చారు. 

నేను మేనేజింగ్‌ ఎడిటర్‌గా ''హాసం'' పత్రిక తొలి సంచిక అక్టోబరు 2001లో వెలువడింది. బాపుగారికి తెగ నచ్చేసింది. కనబడిన అందరికీ చదవమని చెప్పేవారు. ఆ వూపు చూసి 'హిందూస్తానీ, కర్ణాటక సంగీతకారులతో మీ అనుభవాలు రాసి పంపండి.'' అని కోరాను. డిసెంబరులో ఆరుపేజీల వ్యాసం రాసి పంపుతూ ఫుట్‌నోట్‌లో 'మీరడిగినట్లు నా అనుభవాలు కొన్ని రాశాను. ఫ్యాక్ట్‌ చెడకుండా మీ 'ఇనిమిటబుల్‌ స్టయిల్‌'లో మీ వీలు కొద్దీ తిరగరాయచ్చు...' అని వెసులుబాటు యిచ్చారు. నేను దాన్ని వుపయోగించుకోలేదు. వ్యాసాన్ని యథాతథంగానే వాడుకున్నాం. బాపు రాసినది మనం తిరగరాయగలమా? కానీ రాయండి అని ఆయనే అనడం ఆయన అభిమానానికి నిదర్శనం. ఇలాటివి మాత్రమే చెప్పి ఆయన నాపై ప్రదర్శించిన కోపతాపాల గురించి చెప్పకపోతే అసంపూర్ణంగానే వుంటుంది. ఆ సందర్భం గురించి తర్వాత చెప్తాను. ప్రస్తుతం బాపుగారిలో వున్న పసిబాలుణ్ని గురించి చెపుతున్నా.  'రోదా' (ఇంగ్లీషు స్పెల్లింగ్‌లో రోడిన్‌ అని వుంటుంది) అనే ఫ్రెంచ్‌ శిల్పి చెక్కిన శిల్పాలు పారిస్‌లో అతని కోసం ప్రత్యేకంగా కట్టిన మ్యూజియంలో మాత్రమే ప్రదర్శనకు పెట్టారు. ''థింకర్‌'' అనే ప్రఖ్యాత శిల్పాన్ని ఆ మ్యూజియం ఆవరణలో పెట్టారు. 1984లో అనుకుంటా, ప్రపంచ కళాప్రియుల కోరికపై ఆయన శిల్పాలు కొన్నిటిని ప్రపంచమంతా అనేక నగరాలకు తీసుకెళ్లారు. ఇండియాలో కలకత్తాను మాత్రమే ఎంచుకున్నారు. నేను ఆ ప్రదర్శన చూసి ముగ్ధుణ్నయిపోయాను. ఓ సారి బాపుగారితో మాటల్లో చెపితే 'ఆ ప్రదర్శన చూసినందుకు మీ కాళ్లకు దణ్ణం పెట్టాలి' అన్నారాయన. మీరైనా నేనైనా అయితే 'అది చూడడం మీ అదృష్టం' అని వూరుకునేవాళ్లం. విఎకె రంగారావుగారి నోట అలాటి కాంప్లిమెంటు వస్తే 'అసలు నీకేం అర్థమౌతుందని వెళ్లావు నాయనా అంటూ యీయన మనల్ని వెక్కిరిస్తున్నాడ్రా' అనుకుంటాం. కానీ బాపు సిన్సియర్‌గానే అంటారు. 

'ఇవాళ మీ ఫలానా కార్టూన్‌ బాగా వచ్చిందండి, 'మీరు కొత్తగా వేసిన దుర్గాబాయమ్మ బొమ్మ అద్భుతంగా కుదిరిందండి, దానిలో ఆవిడ దృఢచిత్తం, దీనుల పట్ల వాత్సల్యం రెండూ గోచరిస్తున్నాయి' అని చెప్తే 'చాలా థాంక్సండీ, యూ మేడ్‌ మై డే' అనేవారు. ఇంత గొప్పగా బొమ్మలేసే ఆయనకు అది బాగా వచ్చిందని తెలియదా? మనం బాగుందంటే మాత్రం మనకు థాంక్స్‌ ఎందుకు చెప్పడం? అదే అడిగితే 'ఇలా ఎవరు చెప్తారండి? చెప్పినా సిన్సియర్‌గా చెప్పారో, మెచ్చికోలుకు చెప్పారో తెలియదు కదా' అనేవారు అమాయకంగా. ఓ సారి ఉషాకిరణ్‌ గెస్ట్‌హౌస్‌లో ఆయన దిగితే రిసెప్షన్‌ వద్దకు వెళ్లి 'ఫలానా ఎమ్బీయస్‌ ప్రసాద్‌ వచ్చాడని చెప్పండి, రమ్మంటే వెళతా' అన్నాను. అతను వెళ్లి చెప్పగానే బాపుగారు బయటకు స్వయంగా వచ్చి 'మీరు నేరుగా రూములోకి వచ్చేయకుండా రిసెప్షన్‌లో అడగడమేమిటి' అంటూ కోప్పడ్డారు. 'అదేమిటండి, మీ వీలూ, సాలూ చూడాలి కదా, వేరే ఎవరైనా వుంటే వెయిట్‌ చేయాలికదా' అంటే వినరే! మొహం కందగడ్డలా చేసుకుని 'ఇలా ఎప్పుడూ చేయకండి, నాకున్న ఫ్రెండ్సే తక్కువ. వాళ్లలో మీరొకరు. ఇలా ఫార్మాలిటీస్‌ పెట్టుకోకండి' అంటూ చివాట్లు వేశారు. ఎంత అభిమానం వుంటే మాత్రం మరీ అంత చనువు తీసుకోగలమా? అది లౌకిక వ్యవహారం కాదు కదా! కానీ బాపుకి అది పట్టదు. అసలాయన లౌక్యం కాదు కదా, లౌకిక వ్యవహారాలే తెలియవు. మరి అలాటాయన యిన్ని మహత్కార్యాలు ఎలా చేయగలిగాడు? సినిమాలు ఎలా తీయగలిగాడు? అంటే అవన్నీ రమణగారు చూసుకున్నారు. రమణగారున్నంతకాలం బాపు కేరాఫ్‌ రమణగానే వున్నారంటే అతిశయోక్తి కాదు. అలా ఎందుకు జరిగింది? బాపుది ఆర్థికంగా మెరుగైన కుటుంబం. రమణ కంటె ఎక్కువ చదువుకున్నారు. చదువు పూర్తయ్యేవరకు తండ్రి బతికే వున్నారు. రమణ బాల్యమంతా కష్టాలమయం. చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ, మానేస్తూ ఒక విధమైన అరాచకంగా జీవితం గడిపిన మనిషి. ఆయన యీయనకు చుక్కాని కావడమేమిటి? (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2014)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?