ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది.. రాజధాని నగరం కాబోతోన్న విజయవాడ పరిసరాలు కంగారు పడ్డాయి.. అసలేం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. రాయలసీమకే పరిమితమైన ఫ్యాక్షన్, కృష్ణా జిల్లాల్లో పడగ విప్పిందా.? అన్న అనుమానాలు కలిగాయి. కారణం విజయవాడ – ఏలూరు మధ్య జాతీయ రహదారిపై కాల్పులు జరగడం. ఈ కాల్పుల్లో ముగ్గురు దారుణ హత్యకు గురికావడం. జాతీయ రహదారిపై వేగంగా దూసుకుపోతున్న కారుని దుండగులు మరో కారుతో వెంబడించారు.. గుద్దేశారు.. ఆ వెంటనే కాల్పులు జరిపారు. ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ఈ ఘటన గురించి సమాచారం అందగానే పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాత కక్షలే హత్యకు కారణమనే నిర్ధారణకు వచ్చారు పోలీసు అధికారులు. మృతులు పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పాత కక్షలే ఈ దారుణానికి కారణమని తేల్చినా.. ఈ తరహా ఘటన ఇటీవలి కాలంలో ఎప్పుడూ ఈ ప్రాంతంలో జరగకపోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులూ ఈ ఘటనతో విస్మయానికి గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో.. అదీ జాతీయ రహదారిపై జరిగిన ఈ ‘రక్తచరిత్ర’పై ఒక్కసారిగా అందరిలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమలో ఆధిపత్య పోరులో భాగంగా ఈ తరహా హత్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. రాజధాని కానున్న విజయవాడ పరిసరాల్లో ఇలాంటి ఘటన జరగడంతో భద్రతా పరంగా పోలీసులు భవిష్యత్తులో అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం సుస్పష్టమవుతోంది.
ఘటనకు కారణం వ్యక్తిగత కక్షలే అయినా.. హత్యలు జరిగిన తీరు, ‘సుపారీ’ నేపథ్యాన్ని తలపిస్తుండడం గమనార్హం. సుపారీలంటే డబ్బుకి హత్యలు చేసే ముఠాలు తమకు అప్పగింపబడిన పనిని అత్యంత కిరాతకంగా పూర్తి చేయడం.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!