Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : బాపుకు బాష్పాంజలి - 4

ఎమ్బీయస్‌ : బాపుకు బాష్పాంజలి - 4

జరిగిందేమిటంటే బాపుగారికి మూడ్‌ స్వింగ్‌ ఎక్కువ. ఫోన్‌లో మాట్లాడడం తక్కువ. ఏదైనా పని వుంటే తప్ప ఫోన్‌ చేయరు. చేసినా అవసరమైనంత వరకే మాట్లాడతారు. రమణగారైతే పనేమీ లేకపోయినా వూరికే ఫోన్‌ చేసి 'ఎలా వున్నారండీ?' అంటూ కబుర్లు చెప్తారు. పైగా ఆయన లోకవ్యవహారం తెలిసిన మనిషి. అందువలన అందరూ రమణగారితోనే ఫ్రీగా మాట్లాడేవారు. బాపు వలన కావలసిన పనికి కూడా రమణగారికే పురమాయించేవారు. ఒక్కోప్పుడు రమణగారికి చికాకేసేది - 'నేనేమైనా అతనికి సెక్రటరీనా? ఏదైనా బొమ్మ కావలిస్తే అతనికే డైరక్టుగా ఉత్తరం రాయండి. నచ్చితే వేస్తాడు, లేకపోతే కుదరదని చెప్తాడు. మధ్యలో నాకెందుకు చెప్పడం?' అనేవారు. '..అంటే ఆయనకు ఎంతివ్వాలో కనుక్కుని చెప్తారని... కొన్నిటికి డబ్బు యిస్తానంటే బాపుకి కోపం వచ్చి తిడతారట కదా..' అంటూ నసిగేవారు యివతలివాళ్లు. బాపుకి డబ్బు అక్కరలేదన్న ప్రచారం ఒకటి బాగా వుండేది. అందువలన బతిమాలి బొమ్మ వేయించుకున్నవాళ్లు కూడా డబ్బు దగ్గరకు వచ్చేసరికి ఎగ్గొట్టేవారు. ఈయన రొక్కించి అడగలేకపోయేవారు. కొన్ని వాటికి ఆయన డబ్బు పుచ్చుకోని సందర్భాలూ వున్నాయి. అంతమాత్రం చేత మనం ఆఫర్‌ చేయకుండా వుండకూడదు కదా! స్వీకరించాలో లేదో ఆయనకు వదిలేయాలి. 'బొమ్మలేయడం బాపుకి వృత్తి కదా. దానికి డబ్బు పుచ్చుకోకపోతే అతనికి మాత్రం ఆదాయం ఎలా?' అని రమణ తనకు ఫోన్‌ చేసిన వారితో వాదించేవారు. 

చెప్పవచ్చేదేమిటంటే - అందరూ రమణగారితో మాట్లాడేవారు, అవన్నీ రమణ బాపుగారికి చేరవేసేవారు. మనం చెప్పినదానికి బాపు కస్సుమన్నా, బుస్సుమన్నా, సంతోషించినా రమణగారి ద్వారా ఫిల్టరయ్యి మనకు చేరేది. రమణ పోవడంతో బాపు ప్రపంచపు కిటికీ మూసుకు పోయినట్టయింది. ఆయనతో డైరక్టుగా మాట్లాడేవారు ముందునుండీ పెద్దగా లేరు, యిప్పుడు యింకా తగ్గిపోయారు. ఆయన ఏకాకి అయిపోయారు. నేను యీ ప్రమాదాన్ని అప్పుడే వూహించాను. రమణగారు పోగానే బాపుగారితో యీ విషయాలన్నీ నేరుగా చెప్పాను. ''దీనికి పరిష్కారం మీరు హైదరాబాదుకి షిఫ్ట్‌ అయిపోండి. నాబోటిగాళ్లం పది రోజులకో, పదిహేను రోజులకో ఓ సారి వచ్చి ఓ గంటసేపు కబుర్లు చెప్పి పోతూ వుంటాం. వంతుల వారీగా వస్తూంటాం కాబట్టి, రోజుకి రెండు మూడు గంటలపాటు లోకాభిరామాయణంతో సరిపోతుంది. ఆ డోస్‌ చాలు, తక్కిన టైములో మీరు ఎలాగూ ఏదో పని చేసుకుంటూ వుంటారు.'' అన్నాను. ఆయన ఆలోచిస్తామన్నారు కానీ, దాన్ని అమలు చేయలేదు. చేసి వుంటే యింకో రెండేళ్లు కచ్చితంగా బతికేవారని చెప్తాను. చిన్నప్పటినుండి వారు మద్రాసువాసులే. కూతురు, చిన్నకొడుకు, తమ్ముడు.. అందరూ అక్కడే వున్నారు. తరలిరావడం అంటే బృహత్ప్రయత్నం. రమణగారు బతికి వుండగా దానికి పూనుకుని వుంటే బాపుగారు ఆయన వెనక్కాలే వచ్చేసి వుండేవారు. రమణగారు జీవించి వుండగా యీ విషయమై ఆలోచించి వదిలిపెట్టేశారు. ప్రాక్టికల్‌ ప్రాబ్లెమ్స్‌ ఏవో వుండి వుండవచ్చు. 

బాపుగారు జీనియస్‌. బహుముఖ ప్రజ్ఞాశాలి. అయితే ఆయన అనేకవాటికి రమణగారిపై ఆధారపడ్డారన్నది నికార్సయిన నిజం. దానివలన ఆయన మరింత ప్రకాశించారన్నది కూడా వాస్తవమే. మనందరికీ తలిదండ్రులు, ఉంటే పెద్దన్నయ్యలు, గురువులు ఎవరో వుంటూనే వుంటారు. క్రమేపీ వాళ్లు లేకపోయినా మనం సొంతంగా నిలదొక్కుకునే థకు ఎమోషనల్‌గా చేరుకుంటాం. కానీ బాపు అంతటి మహానుభావుడు ఆ థకు చేరుకోలేదు. రమణగారు పోయాక 'ఇక్కడ యింకేం చేస్తాం? వెళ్లిపోతే సరి' అనే ఫీలింగు తెచ్చేసుకున్నారు. ఎవరైనా ఏదైనా చేద్దామని ప్రతిపాదించినా 'బ్రహ్మ లేడుగా' అనేవారు. రమణగారు ఏదైనా గాలిలోంచి బ్రహ్మలా సృష్టిస్తే తాను దానికి మెరుగులు దిద్దగలనని, ఆయన రాయకపోతే తను మాత్రం ఏం చేయగలనని బాపు అభిప్రాయం. అందుచేత రమణగారికి ఏదైనా ఐడియా వచ్చేదాకా ఓపిక పట్టేవారు. ఇద్దరికి నచ్చాక స్క్రిప్టు తయారయ్యాక యిక బాపు దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకుని వెళ్లిపోయి రమణగారినే అబ్బురపరిచేవారు. అందుకే వాళ్లిద్దరి మధ్య పరస్పరగౌరవం అలా నిలిచిపోయింది. ''మీకు పద్మ అవార్డులు రాకపోవడం అన్యాయమండి, కనీసం పద్మభూషణ్‌ నుండైనా మొదలుపెట్టాలి'' అని రమణగారితో అంటే 'నాకు రాకపోయినా ఫర్వాలేదండి, నేను రచయితను మాత్రమే. బాపుకి తప్పకుండా రావాలి. అతను చేసినన్ని ప్రయోగాలు మరెవరూ చేయలేరు.'' అనేవారాయన. తెలుగుభాష వున్నంతకాలం రమణ రచనలు వుంటాని చెపితే అది కొంచెం అతిశయోక్తిగా తోస్తుంది కానీ తెలుగు లిపి వున్నంతకాలం బాపు సజీవంగా వుంటాడని చెపితే మాత్రం ఎవరూ ఖండించలేరు. గుండ్రటి అక్షరాలలో తెలుగు రాయడం వెయ్యేళ్లుగా వస్తున్నా ఒక్క బాపు వచ్చి, వంకర టింకరగా రాసి, దాన్నే ఫ్యాషన్‌ చేసి పడేశారు. ఇప్పటికి హెడింగ్‌ పెట్టాలంటే బాపు స్క్రిప్టే వాడుతున్నాం. 

''ఇస్తే మీ యిద్దరికీ కలిపే యిస్తారండి. మేం అరటిక్కెట్టు గాళ్లమని మీరే అంటూంటారుగా, పద్మ ఒకరికి, భూషణ్‌ మరొకరికీ యిస్తారేమో' అని జోక్‌ చేసేవాణ్ని రమణగారితో. అర టిక్కెట్టు విషయమేమిటంటే - సాధారణంగా వాళ్లిద్దరికీ కలిపే సన్మానాలు చేసేవారు. ఇద్దరినీ కలిపే సభలకు పిలిచేవారు. తక్కిన సన్మానితులందరికీ పదేసి వేల చొప్పున పర్స్‌ యిస్తే బాపురమణలకు మాత్రం చెరో ఐదువేలు చేతిలో పెట్టేవారు. ఇద్దరూ విడివిడిగా ప్రతిభావంతులైనా ఇద్దరికి కలిపి ఒక టిక్కెట్టు కింద లెక్కేసి, సగం-సగం యిచ్చేవారు. చివరకు రమణగారికి ఏ పద్మ అవార్డూ రాలేదు. ఆయన పోయాక బాపుకి పద్మశ్రీ యిచ్చి సరిపెట్టారు. ఇప్పుడు చనిపోయాక ఏకంగా పద్మవిభూషణ్‌కు సిఫార్సు చేశారట. రమణగారు చేసిన ''ప్యాసా'' సినిమా (ఒక కవిని బతికుండగా యీసడించిన సమాజం అతను చనిపోయాడనుకుని ఆకాశానికి ఎత్తేస్తుంది. అతని సంతాపసభకు అతనే హాజరైతే యీడ్చి అవతల పారేస్తారు) సమీక్షకు బొమ్మ వేస్తూ ఒక కవి విగ్రహం వేశారు. దానికి చారెడు కళ్లుంటాయి. 'చచ్చినవాళ్ల కళ్లు చారెడు' అంటాం కదా! బాపు విషయంలో కూడా అదే నిజమైంది. ఈ రోజు పద్మవిభూషణ్‌ ప్రతిపాదిస్తున్న చంద్రబాబు పదేళ్లు ముఖ్యమంత్రిగా వున్నారు. ఆయన ముఖ్య భూమిక వహించిన ఎన్టీయార్‌ టిడిపి ప్రభుత్వం ఆరేళ్లు నడిచింది. అప్పుడు కనీసం పద్మశ్రీ కూడా యిప్పించలేదు. ఇప్పుడు ఏవేవో చెప్తున్నారు. ఏం చేసినా చూడడానికి వాళ్లు లేరు కదా. వాళ్లెప్పుడూ వీటి గురించి ఆశపడలేదు రాకపోతే నిరాశ పడలేదు, కానీ బాపుకి వస్తే బాగుండునని రమణ, రమణకు వస్తే బాగుండునని బాపు అనుకునేవారు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?