Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : భీమసేన్‌ జోషి కొడుకు ఆవేదన

కళాకారులు ప్రజాభిమానాన్ని చూరగొంటారు. వారిలోని సరస్వతీ అంశను చూసి, ప్రజలు వారిని దైవాంశ సంభూతులుగా భావించి, ఎక్కడో ఎత్తున కూర్చోబెడతారు. మామూలు మనుష్యుల కుండే రాగద్వేషాలు, బలహీనతలు వారి కుంటాయని మర్చిపోతారు. తాము అంటగట్టిన సుగుణాలు వారికి లేవని తెలిస్తే తట్టుకోలేరు. ఈ విషయాలు తెలిసిన కళాకారులు తమ వ్యక్తిగత విషయాలు బహిరంగంగా చర్చించడానికి యిష్టపడరు. తమపై పుస్తకాలు రాస్తానన్నా, సినిమాలు తీస్తానన్నా వద్దని వారిస్తారు. వారి కుటుంబసభ్యులు కూడా ఓ పట్టాన అంగీకారం తెలుపరు. కానీ కళాభిమానులకు వారి ఆరాధ్యదైవాల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం వుంటుంది. ఏ మాత్రం సమాచారం తెలిసినా దానికి అతిశయోక్తులు జోడించి, అంతకింత చేసి తమలో తాము చెప్పేసుకుంటూ వుంటారు. పనికట్టుకుని ప్రచారం చేస్తూ వుంటారు. ఇది చాలా సందర్భాల్లో ఆ కళాకారుల కుటుంబసభ్యులకు అసహనం కలిగిస్తుంది.

ప్రజలంతా వారి కడుపున పుట్టడం మీ అదృష్టం అంటూ వుంటే చికాకు పుడుతుంది. కళాకారుల విషయమే కాదు, మహాదాతగా  పేరుబడిన లేదా ఉద్యమం కోసం జైలుకెళ్లిన, త్యాగాలు చేసిన వారిని సమాజమంతా ఆరాధిస్తుంది. కానీ ఆ దానాల వలన, త్యాగాల వలన కుటుంబం ఎంత నష్టపోయి వుంటుందో ఆలోచించండి. ఇంట్లో డబ్బు లేక, దారి చూపే తండ్రి లేక, చదువుకోలేక, వాళ్లు ఎంత కుములుతారో వూహించండి. వాళ్లకి సహజంగా తండ్రిపై కోపం వుంటుంది. కానీ దాన్ని వ్యక్తం చేయలేరు. సమాజం కోసం అందరితో బాటు వాళ్లని పొగడాలి. అలా పొగడలేక 'మీరనుకున్నంత కాదు, ప్రతి దీపం కింద నీడ వుంటుంది. ఆ నీడలో ఎదిగాం మేం. మా తండ్రి లేదా తల్లి మచ్చలు, వాటి వలన పడిన అవస్థలు మాకే తెలుసు. జరిగిందేదో జరిగింది. వదిలిపెట్టండి.' అని చెప్పబుద్ధవుతుంది. కానీ చెప్పలేరు. ఎవరైనా తెగించి చెప్పబోయినా, ప్రజలు దాన్ని వినడానికి యిష్టపడరు సరికదా తిట్టిపోస్తారు. 

ఓసారి ఘంటసాల పెద్ద కుమారుడు, స్వర్గీయ విజయకుమార్‌ రవీంద్ర భారతిలో సభలో 'మీరంతా ఆకాశానికి ఎత్తేస్తున్న మా నాన్నగారి వలన మేమెంత అవస్థ పడ్డామో తెలుసా?' అని చెప్పబోతే ప్రేక్షకులంతా గట్టిగా కేకలు వేసి అతన్ని మాట్లాడ నీయలేదట. ఘంటసాల గురించి వారి అమ్మాయి డా|| శ్యామల ''నేనెరిగిన నాన్నగారు'' పేరుతో 2013లో పుస్తకం వెలువరించి, దానిలో ఘంటసాలకు రెండు కుటుంబాలు వుండడం వలన ఎటువంటి క్లేశాలు అనుభవించారో వివరించారు. ఘంటసాలకు యిద్దరు భార్యలున్న సంగతిని దాశరథి, ఆరుద్ర తమ వ్యాసాల్లో ప్రస్తావించడం జరిగింది. కానీ ఘంటసాలపై వచ్చిన అనేక పుస్తకాల్లో రెండో సంసారం గురించిన ప్రస్తావన వదిలేశారు. ఘంటసాల గారి మొదటి భార్య సావిత్రిగారు ఆ కుటుంబం ఉనికిని గుర్తించడానికి నిరాకరించడంతో ఆ కుటుంబసభ్యుల గురించి వివరాలు బయటకు రాలేదు. కానీ శ్యామల 'మా రెండు కుటుంబాలు కలిసికట్టుగా వుండాలనేదే మా నాన్నగారి కోరిక' అంటూ అన్ని విషయాలూ బయటపెట్టడానికి నిశ్చయించుకున్నారు. ''భువనవిజయం'' అనే ఆన్‌లైన్‌ పత్రికలో 2004లో ''నాణానికి మరోవైపు'' పేరుతో సీరియల్‌ ప్రారంభించారు. సావిత్రిగారు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్‌ తెచ్చుకుని కూతురు రాసే సీరియల్‌ ప్రచురణ ఆపించివేశారు. శ్యామల ఐదేళ్లు పోరాడి స్టే తీయించేసుకుని, పుస్తకాన్ని అచ్చురూపంలో తీసుకుని వచ్చారు. ఘంటసాల రెండో భార్య కోడలు పార్వతీ రవి ఆ పుస్తక ప్రచురణలో సహకరించారు. డా. శ్యామల ఒక పరిశోధకురాలి లాగానే ఎలాటి పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా, ఒక సాక్షిలా ఘంటసాల-సావిత్రి-సరళ ముక్కోణంలో ఎవరి పొరపాటు ఎంత వుందో చక్కగా బేరీజు వేశారు. 

''దేవదాసు'' నిర్మాణంలో వున్న రోజుల్లో ఘంటసాల, సావిత్రి గార్లు అద్దె కుంటున్న యింట్లో పక్క వాటాలో రంగూన్‌ నుంచి వచ్చిన నాయుడుగారి కుటుంబం వుండేది. వారి చిన్నమ్మాయి సరళ పియుసి చదువుకునేది, సావిత్రి కంటె పెద్దది. మంచి మాటకారి. వచ్చి సరదాగా కబుర్లు చెప్పేది. అందరి చేత మంచిదాన్నని, విశాలహృదయురాలినని అనిపించుకునే తాపత్రయంతో సావిత్రి సరళను, ఘంటసాలను ఏకాంతంగా వదిలేసి వంటింట్లో పని చేసుకుంటూ వుండేవారు. ఘంటసాలతో చనువు పెరిగాక సరళ 'మిమ్మల్నే పెళ్లాడతాను, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను' అనడంతో ఆయన బిత్తరపోయారు. అప్పటికి ఆయనకు పెద్దగా ఆదాయమూ లేదు. అటువైపు, యిటువైపు పెద్దలెందరు చెప్పినా సరళ మొండిపట్టు పట్టారు. గతంలో ఒకమ్మాయి యిలాగే ఘంటసాలను ప్రేమించి, పెద్దలు వేరే వాళ్లతో పెళ్లి నిశ్చయం చేస్తే పారిపోదామంది. ఈయన వద్దని వారించి, పెళ్లి జరిగేట్లు చూశాడు. పెళ్లయ్యాక ఆవిడ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు యీమె కూడా అలాగే చేస్తుందేమోనని యీయన భయం. గతంలో చివరకు సరళ పెద్దలు సావిత్రి వద్ద సమ్మతి పత్రం తీసుకుని 1950 జూన్‌లో పెళ్లి జరిపించారు. సావిత్రి ద్వారా ఐదుగురు పిల్లలు కలిగితే, సరళ ద్వారా ముగ్గురు పిల్లలు కలిగారు. 

ఈ వివాహాన్ని సావిత్రి జీర్ణించుకోలేక పోయారు. ఆ యింటి మీద వాలిన కాకి యీ యింటిమీద వాలడానికి వీల్లేదన్నారు. అటు సరళ తన అహాన్ని సంతృప్తి పరుచుకోగలిగారు కానీ సమాజంలో గౌరవాన్ని కోల్పోయారు. సావిత్రిది సనాతన బ్రాహ్మణ కుటుంబం. ఆచారవ్యవహారాలు పాటించే పల్లెటూరి మనస్తత్వం. సరళది రంగూన్‌లో పెరిగిన అబ్రాహ్మణ కుటుంబం. ఆధునికత, చదువు కలిగిన పట్టణవాస మనస్తత్వం. మనస్తత్వాలకీ, జీవన విధానాలకి పొత్తు కుదరలేదు. ఇద్దరు భార్యలకూ కోపం, తన మాటే నెగ్గాలన్న పంతం, మొండితనం, పట్టే తప్ప విడుపు లేని లక్షణం సమానంగా వున్నాయి. ఈ ఘర్షణలో నలిగిన ఘంటసాల మనశ్శాంతికి దూరమయ్యారు. ఇక లోకులు యీ ఎనిమిది మంది పిల్లల వద్ద ''మీ అమ్మ పెద్ద పెళ్లామా? రెండో పెళ్లామా? మీ నాన్న మీతోనే వుంటాడా? వచ్చి వెళుతూంటాడా?'' వంటి వికృతమైన ప్రశ్నలు వేసేవారు. వీటన్నిటి మధ్య పెరిగిన డా. శ్యామల చాలా సంయమనంతో రాసిన పుస్తకం ''నేనెరిగిన మా నాన్నగారు''. 

ఇప్పుడీ పుస్తకం ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఘంటసాల లాగానే మరో సరస్వతీ పుత్రుడైన భీమసేన్‌ జోషి (1922-2011) గురించి ఆయన కుమారుడు రాఘవేంద్ర జోషి రాసిన మరాఠీ పుస్తకానికి ఇంగ్లీషు అనువాదమైన ''భీమసేన్‌ జోషి, మై ఫాదర్‌'' అనే పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. హిందూస్తానీ సంగీతంలో నిష్ణాతుడై భజనలు, అభంగాలు పాడడంలో అందె వేసిన చేయి అయి, 'భారతరత్న' బిరుదు పొందిన భీమసేన్‌కి కూడా యిద్దరు భార్యలు. ఘంటసాల యిద్దర్నీ సమాంతరంగా చూసుకున్నారు. అయితే భీమసేన్‌ తనతో బాటు కన్నడ నాటకంలో నటించిన నటి వత్సలా ముధోల్కర్‌ పరిచయమయ్యాక ఆమెతో ప్రేమలో పడి, పెళ్లయిన ఏడేళ్లకు మొదటి భార్యను, ముగ్గురు పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడు. అందరి కంటె పెద్దవాడైన రాఘవేంద్ర (యీ రచయిత)కు ఆరేళ్లు. పెద్ద భార్యకు విడాకులు యివ్వలేదు. బొంబాయి ప్రెసిడెన్సీలో బహుభార్యలు నిషిద్ధం కనుక సెంట్రల్‌ ప్రావిన్స్‌లోని నాగపూర్‌లో కాపురం పెట్టాడు. మొదటి భార్యకు తల్లికి తిండి గడవక, వేరే గతిలేక రెండో భార్య యింట్లో పనిమనిషిగా పనిచేయవలసి వచ్చింది. ఈ రచయిత సవతి తల్లి చేతిలో అవమానాలు పడ్డాడు. 

క్రమేపీ భీమసేన్‌ తన మొదటి కుటుంబాన్ని లోకానికి తెలియకుండా చేయాలని చూశాడు. గుల్జార్‌ తనపై తీసిన డాక్యుమెంటరీలో వారి ప్రస్తావన రాకుండా చేశాడు. సంగీత ప్రపంచమంతా కొలిచే తన తండ్రిలో దుర్మార్గుడైన భర్త, కర్కశుడైన తండ్రి వున్నారని లోకులకు చాటి చెప్పడానికి నిశ్చయించుకుని రాసిన పుస్తకమిది. ఆ రెండో భార్య పేరు కూడా రాయలేదు. వట్టి 'ఆమె' అనే రాశాడు. అందువలన యిది శ్యామల గారి రచనకు భిన్నంగా సాగింది. ఎందుకంటే వారికి ఎదురైన అనుభవాలు కూడా భిన్నమైనవి. ఈ రచయితకు శాస్త్రీయ సంగీతం తెలుసు కానీ నిష్ణాతుడు కాడు. వేరే ఉద్యోగం చేసుకుని పైకి వచ్చాడు. ఈ పుస్తకంలో తండ్రి సంగీతప్రావణ్యం గురించి పెద్దగా ఏమీ రాయలేదు. ఒక వ్యక్తిగా భీమసేన్‌ ఎటువంటి వాడు అన్నదే దీని ద్వారా బయటకు వస్తుంది. 

భీమసేన్‌ మొదటి భార్య సునంద కట్టి. అతని మేనమామ కూతురే. వాళ్లది కర్ణాటకలోని బాదామి. భీమసేన్‌ ఆమె యింటికి చాటుగా వచ్చి ఫేస్‌ క్రీమ్‌, టాల్కమ్‌ పౌడరు బహుమతులుగా యిచ్చి 'నన్ను పెళ్లి చేసుకోవా?' అని అడిగాడు. 1944లో పెళ్లయ్యాక ఆమె బావిలోంచి నీళ్లు చేదుతూంటే 'నా భార్య యిలాటి చాకిరీ చేయడమా?' అని విలవిలలాడేడు. ఆమె కూడా అతనంటే చాలా ప్రేమగా వుండేది. అతనికి టైఫాయిడ్‌ వస్తే దగ్గరుండి సేవ చేసి, అతని గొంతు మళ్లీ అతనికి వచ్చేట్లు చేసింది. ఓ సారి సునంద వాళ్ల సోదరి యింటికి వెళ్లి విపరీతంగా వర్షం పడడంతో ఆ రాత్రి అక్కడే వుండిపోయింది. ఆమెను చూడకుండా వుండలేని భీమసేన్‌ సైకిలేసుకుని బురదలోనే తొక్కుకుంటూ తెల్లవారుఝామున 3 గం.లకు అక్కడకు చేరాడు. భార్యపై యింత ప్రేమ చూపించిన అతను ఒక నటీమణిని చూసి మోహంలో పడ్డాడు. ఉచితానుచితాలు మరచాడు.  1951లో భార్యను, ముగ్గురు పిల్లల్ని వాళ్ల కర్మానికి వాళ్లను వదిలేసి, తన భార్య నగలు తీసుకుని వుడాయించి ఆవిడ గొలుసుతోనే రెండో భార్యకు మంగళసూత్రం చేయించాడు! 

సునంద సొంతంగా బతకాలని చూసి, కుదరక చివరకు భర్త పుణెలో వున్నట్లు తెలుసుకుని, అక్కడకు వెళ్లి 'మీ యింట్లో పనిమనిషి స్థానమైనా యిమ్మనమ'ని వేడుకుంది. అతను సరేనన్నాడు. ఇక ఆమె ఆ యింట్లోనే వుంటూ తన సవతి ప్రసవానికి సాయపడి, ఆమె ముగ్గురు పిల్లలకు ఆయాగా పనిచేసింది. కొంతకాలానికి అతనికి కచ్చేరీల ద్వారా బాగా డబ్బు రావడంతో సునంద కంటూ వేరే యిల్లు ఏర్పాటు చేశాడు. అప్పుడప్పుడు రెండో భార్యకు తెలియకుండా వచ్చి వెళ్లేవాడు. కాస్తో కూస్తో డబ్బు చేతిలో పెట్టేవాడు. పిల్లల కోసం సైకిలు, రసగుల్లాలు, బట్టలు తెచ్చేవాడు. వాళ్లని  తీసుకుని తన మోటారు సైకిలు మీద, కారులోనూ ఓ రౌండు కొట్టేవాడు. కెమెరా తెచ్చి ఫోటోలు తీసేవాడు. రచయిత రాఘవేంద్రకు యివి మధురమైన బాల్యస్మృతులు. ''కానీ యివి ఎప్పుడో కానీ జరిగేవి కావు. సాధారణంగా ఆయన యింటికి వచ్చినప్పుడల్లా మా అమ్మతో పోట్లాట, అరుపులు, కేకలు - యివే వుండేవి.'' అంటాడతను. 

రెండో ఫ్యామిలీ విచ్చలవిడిగా ఖఱ్చు పెట్టేది. రాఘవేంద్ర, అతని తమ్ముడు స్కూలు ఫీజుల కోసం ఆ యింటికి వెళ్లి తండ్రి నడిగి, చివాట్లు తినేవారు. 'మా కంటె పనివాళ్లను బాగా చూశాడు మా నాన్న, కారణం సవతి తల్లి అసూయ, మత్సరం' అంటాడు. ఆవిడంటే భయం చేతనే మా నాన్న మాకు దూరమయ్యాడంటాడు. ''మా స్థితిగతులు చూసి బాధపడినా, తను చేసిన తప్పును ఎలా సరిదిద్దుకోవాలో మా నాన్నకు తెలియలేదు. తనకు అనారోగ్యం కలిగినప్పుడు ఆ కుటుంబం ఆయనను నిర్లక్ష్యం చేసింది. అంపశయ్యపై పరుండినట్లు వుండేవాడు. మా యింటికి రమ్మనమన్నా రాలేదు. 'నా డబ్బును దోచుకున్నవారికి నా బాగోగులు పట్టించుకునే మాత్రం బాధ్యత లేదా? మంచం మీద పడ్డాక సేవలు చేయడం వారి పని కాదా?' అనేవాడు. మమ్మల్ని గుర్తించకపోవడం వలన నాకు అవమానాలు ఎదురయ్యాయి, సహించాను. కానీ యిప్పుడు మా పిల్లలకు తామెవరో చెప్పుకోవాలో లేదో తెలియటం లేదు'' అన్నాడు. మరాఠీలో రాసిన యీ పుస్తకాన్ని శిరీష్‌ చింద్‌హాడే ఇంగ్లీషులోకి అనువదించగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రెస్‌ వారు ముద్రించారు. ఘంటసాల విషయంలో రెండో కుటుంబం వెలుగులోకి రాకపోతే మొదటి కుటుంబంలోని వ్యక్తి సదవగాహనతో వారికి గుర్తింపు యిచ్చారు. భీమసేన్‌ విషయంలో మొదటి కుటుంబం వెలుగులోకి రాకపోతే ఆ కుటుంబ వ్యక్తి తన గురించి  తనే చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో వెలిబుచ్చిన ఆవేదన, ఆక్రోశం సహజం.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
- mbsprasad@gmail.com