Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: బైబిల్‌ కథలు - 49

డేరియస్‌ తన రాజ్యాన్ని పాలించడానికి 120 మంది రాష్ట్రపాలకులను, వారిని పర్యవేక్షించడానికి ముగ్గుర్ని వేశాడు. వారిలో డేనియల్‌ ఒకడు. మొత్తం అధికారం అతనికి అప్పగించబోతున్నాడని అనుమానించి అసూయపడిన రాష్ట్రపాలకులు, తక్కిన పర్యవేక్షకులు రాజు వద్దకు వెళ్లి ''రాబోయే 30 రోజుల్లో మిమ్మల్ని తప్ప వేరెవ్వరినీ కొలవకూడదని, కొలిస్తే వాళ్లను సింహాల గుంటలో పడవేస్తానని శాసనం చేయండి'' అని అడిగారు. రాజుకి అది నచ్చింది. అలాగే శాసనం చేశాడు. అలాటి శాసనం వున్నా డేనియలు తన దేవుడికి తప్ప రాజుకి మొక్కలేదు. అది గమనించి వీరందరూ రాజుతో ఫిర్యాదు చేస్తే ఆయన డేనియలును సింహాల గుంటలో పడేసి పైన బండతో మూసేయమన్నాడు. కానీ ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మర్నాడు వెళ్లి చూస్తే డేనియలు క్షేమంగా వున్నాడు. 'దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు. అందువలన నాకే హానీ జరగలేదు.' అన్నాడు డేనియలు. రాజు తన తప్పు గ్రహించి, తనకు తప్పుడు సలహాలిచ్చినవారిని ఆ సింహాల గుంటలో పడేయించాడు. డేనియలు రాజుకి ఆప్తుడిగా మెలగుతూ రాబోయే సంఘటనల గురించి జోస్యం చెపుతూ అతన్ని హెచ్చరిస్తూ వుండేవాడు. 

ఈ అధ్యాయం తర్వాత అనేక చిన్న అధ్యాయాలు వస్తాయి. ఇవన్నీ పారశీకుల చేతిలో యూదులు కష్టాలు పడిన నాటి చరిత్రనే మళ్లీ మళ్లీ చెప్తాయి. కష్టకాలంలో దేవుడి మీద నమ్మకం సడలకుండా, ఆయన్నే నమ్ముకోండని యీ ప్రవక్తలందరూ రకరకాలుగా బోధిస్తారు. హోషియా (Hosea) అనే ప్రవక్త తన భార్య గోమెర్‌ తనను విడిచి వ్యభిచారిణిగా మారిన వృత్తాంతం చెప్తాడు. దేవుణ్ని వదిలిపెట్టి అన్యమతాలను అనుసరించేవాళ్లు కూడా తన భార్యలాటి వ్యభిచారిణులే అని చెప్తాడు. దారి తప్పినా తన భార్యపై తను ఆదరం చూపుతున్నట్లే, దేవుడు కూడా దారి తప్పిన తన భక్తులపై ఆదరం చూపుతాడని బోధిస్తాడు. దేవుడికి, భక్తుడికి మధ్య అనుబంధాన్ని భార్యాభర్తల బంధంతో పోల్చిన మొదటి బైబిల్‌ రచయిత హోషియానే. ఈ సింబాలిజాన్ని న్యూ టెస్టమెంటులో కొనసాగించి చర్చిని, చర్చిలో వుండే సన్యాసులను, సన్యాసినులను జీసస్‌ క్రైస్తు భార్యలుగా పోల్చారు. 

తర్వాతి అధ్యాయం యోవేలు (Joel). పాలస్తీనాపై మిడతల దండు దాడి చేసి నాశనం చేసింది. దాని ఆధారంగా దేవుడు పాపులకు విధిస్తున్న శిక్ష యిది అని యితను తీర్మానించాడు.  తీర్పు చెప్పే దినం (జడ్జిమెంటు డే) వస్తుందని, యీలోగా చేసిన పాపాలకు పశ్చాత్తాపం వ్యక్తపరచకపోతే, ఆనాడు శిక్ష తప్పదని అతను హెచ్చరించాడు. తదుపరి అధ్యాయం ఆమోసు (Amos) ఆమోసు ఇతను ఇజ్రాయేలు సంపదలతో తులతూగే కాలంలో (క్రీ.పూ.782-753) మతబోధకుడిగా వున్నాడు. ఎంత భోగభాగ్యాలున్నా సామాజిక న్యాయం జరగనంతకాలం, ధనవంతులు పేదలను పీడిస్తున్నంతకాలం దేవుడు సంతోషించడని వాదించాడు. దాంతో అధికారులకు, పాలకులకు కంటిలో నలుసుగా మారాడు. రాజాస్థానం నుంచి పంపివేసి, ప్రజల్లో మతప్రచారం మానుకోమని హెచ్చరించారు. సాంఘికన్యాయానికి, పుణ్యానికి ముడిపెట్టిన ఆమోసును ఆధునిక పరిభాషలో సామాజికస్పృహ కలిగిన  తొలి ప్రవక్తగా చెప్పుకోవచ్చు. తర్వాతి అధ్యాయమైన  ఓబద్యా (Obadiah) లో తమ స్వదేశాన్ని ఆక్రమించి తమను తరిమివేసిన విదేశీయులను ఎదిరించని జెరూసలెం వాసులు తీర్పు దినాన దేవుడికి సమాధానం చెప్పుకోవలసి వుంటుందని హెచ్చరించాడు. పోరాడితే మీ భూమి మీకు దక్కుతుందని జోస్యం చెప్పాడు కూడా. బహుశా క్రీ.పూ. 587లో బాబిలోనియన్లు జెరూసలెంను ఓడించిన సందర్భంలోనే యీ పుస్తకం రాసి వుండవచ్చు. 

తర్వాతి అధ్యాయమైన యోనా (Jonah) లో ఇజ్రాయేలు దేవుడిలో గల కరుణరసం కనబడుతుంది. ఇప్పటివరకు వున్న గాథల్లో అన్యదేవుళ్లను పూజించినవాళ్లను యీ దేవుడు నాశనం చేయడమే కనబడుతుంది. దీనిలో భిన్నమైన స్వభావం గోచరిస్తుంది. ఇజ్రాయేలుకు శత్రువైన అస్సీరియా రాజ్యానికి రాజధాని నీనెవే ''నువ్వు ఆ నగరానికి వెళ్లి వాళ్ల దౌష్ట్యం గురించి నాకు తెలిసిపోయిందనీ, వాళ్లను శిక్షిస్తాననీ తెలియపరచు.'' అని దేవుడు యోనాకు చెప్పాడు. 'అన్యజాతులతో మనకెందుకు వచ్చిన చిక్కు? వాళ్లెటూ నా మాట వినరు' అనుకున్నాడు యోనా. దేవుడి మాట కాదనలేక సొంత వూరునుంచి బయలుదేరి ఆ వూరికి వెళ్లకుండా వేరే వూరికి వెళ్లే ఓడ ఎక్కాడు. కానీ దారిలో తుపాను వచ్చింది. ఓడ బద్దలయ్యే ప్రమాదం వచ్చింది. ఓడలో సరుకులు సముద్రంలో పారేసి బరువు తగ్గించుకున్నా లాభం లేకపోయింది. 'దేవుడికి యిష్టం లేనివారెవరో మనలో వున్నారు. చీట్లు వేసి అతనెవరో తెలుసుకుని సముద్రంలో పడవేద్దాం' అనుకుని చీట్లు వేస్తే యోనా పేరు వచ్చింది. అతన్ని పిలిచి అడిగితే నిజం చెప్పేశాడు. వాళ్లందరూ అతన్ని ఎత్తి సముద్రంలో పడవేశారు. వెంటనే తుపాను శాంతించింది. ఒక పెద్ద చేప యోనాను మింగివేసింది. చేప కడుపులో వుండి యోనా దేవుణ్ని వేడుకున్నాడు. అప్పుడు చేప ఒడ్డుదాకా యీదుకుని వచ్చి అతన్ని బయటకు కక్కివేసింది. 'ఇప్పటికైనా నీనెవేకు వెళ్లి నా సందేశం వినిపించు' అన్నాడు దేవుడు. అతను ఆ నగరానికి వెళ్లి '40 రోజుల్లో యీ నగరం నాశనమవుతుంది' అని ప్రకటించాడు. వాళ్లు అన్యదేవుళ్లను ప్రార్థించేవారే అయినా యితని మాట విని యీ దేవుడి పద్ధతిలో ఉపవాసాలు చేశారు. దుష్కార్యాలు మానారు. అవన్నీ చూసిన దేవుడు ప్రసన్నుడయ్యాడు. నగరాన్ని నాశనం చేయకుండా వదిలిపెట్టాడు.

ఇది యోనాకు కోపం తెప్పించింది. ''నువ్వు చెప్పిన మీదటనే నేను ఆ ప్రకటన చేశాను. ఈ రోజు నా మాటకు విలువ లేకుండా పోయింది. వాళ్లు వేరే దేవుళ్లను కొలిచేవారు కదా. శిక్షించకుండా వదిలిపెడితే ఎలా?'' అని నిందించి, ఊళ్లోంచి వెళ్లి పోయి ఓ గుడెసె వేసుకుని దాని నీడలో కూర్చుని నగరం కేసి చూస్తూ కూర్చున్నాడు. దేవుడు అతని పక్కనే ఒక సొరతీగ పెరిగేట్లు చేశాడు. యోనా అది చూసి సంతోషించాడు. మర్నాడు దేవుని ఆజ్ఞపై ఒక పురుగు ఆ తీగను కొట్టివేసింది. తీగ వాడిపోయింది. యోనా బాధపడ్డాడు. కోపం తెచ్చుకున్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ''ఈ సొరతీగ ఓ రాత్రి పెరిగి మరుసటి రాత్రి కల్లా చచ్చిపోయింది. దాని కోసం నువ్వు నారు వేయలేదు, నీరు పోయలేదు. అయినా చచ్చిపోయినందుకు ఖేదపడుతున్నావు. మరి నేను అంత పెద్ద నగరాన్ని పెంచి పోషించానే, దాన్ని నా చేతులతో ఎలా నాశనం చేయను? దానిలో లక్షా యిరవై వేల మంది అమాయకులున్నారు. అభంశుభం తెలియని జంతువులున్నాయి. వారి మీద జాలి చూపవద్దా?'' అని అడిగాడు. యోనాకు దేవుడి కరుణాంతరంగం బోధపడింది. పాపులకు కూడా పశ్చాత్తాపపడి మంచి మార్గానికి మరలే అవకాశం యిస్తాడని బోధపడింది.

తర్వాతి అధ్యాయం మీకా (Micah). ఇతను కూడా సమారియా, జెరూసలెం వాసుల్లో వున్న మతపరమైన దాంబికాన్ని, పేదల అణచివేతను నిరసించాడు. కొద్దికాలంలో యిదంతా పోతుందని, ఇజ్రాయేలుకు మంచి రోజులు వస్తాయని, డేవిడ్‌ కాలం నాటి రాజ్యం మళ్లీ వెలస్తుందని జోస్యం చెప్పాడు. డేవిడ్‌ పుట్టిన బెతల్‌హామ్‌లోనే మరొకడు పుడతాడని (జీసస్‌ క్రైస్తు అక్కడే పుట్టాడు), అతను పాపుల ఉద్ధారకుడు (మెస్సయ్య)గా అవతరిస్తాడని చెప్పాడు. తర్వాతి అధ్యాయమైన నహూము (Nahum)లో అస్సీరియా అడవిలో సింహంలా యిరుగుపొరుగు దేశాలను కబళిస్తోందని, త్వరలోనే అస్సీరియన్‌ రాజధాని ఐన నీనెవే పతనమవుతుందని జోస్యం చెప్పాడు. క్రీ.పూ. 612లో ఆ జోస్యం ఫలించింది కూడా. తదుపరి అధ్యాయమైన  హబక్కూకు (Habakkuk)లో అప్పటికీ, యిప్పటికీ జవాబు దొరకని ప్రశ్న చర్చకు వస్తుంది. దుర్మార్గులు సజ్జనులను బాధిస్తూంటే దేవుడు చూస్తూ ఎందుకు కూర్చుంటాడు?  హబక్కూకు దేవుణ్ని అడుగుతాడు - ''దుష్టులైన బాబిలోనీయులు ఉత్తమప్రవర్తన కలిగిన యూదులను ఎందుకు పీడిస్తున్నారు? నువ్వు ఎందుకు అనుమతిస్తున్నావు?'' అని. 'సరైన సమయంలో, తను చర్య తీసుకుంటానని, దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షిస్తానని' దేవుడు చెప్తాడు. 'అప్పటిదాకా ఓపిక పట్టి, నా పట్ల భక్తివిశ్వాసాలు కలిగి జీవించాలి' అని యీ ప్రవక్త ద్వారా జనావళికి చెప్పాడు. తర్వాతి అధ్యాయం జెఫన్యా (Zephaniah), ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజుగా వున్న కాలంలో అతను సాటి యూదులపైన దుర్మార్గంగా వ్యవహరించాడు. ప్రజలను పీడించాడు. ''ఈ దుష్టపాలకులను శిక్షిస్తాను, ప్రజల్లో వినయం కలవారిని, దీనులను కాపాడి రక్షిస్తాను.'' అని దేవుడు జెఫన్యా ద్వారా అందరికీ తెలియపరిచాడు. 

తర్వాతి అధ్యాయం హగ్గయి(Haggai),లో హగ్గయి అనే ప్రవక్త 70 ఏళ్ల క్రితం నెబుచెడ్నజారు కూల్చివేసిన దేవాలయాన్ని మళ్లీ కట్టమని ప్రజలకు, పూజారులకు, గవర్నర్లకు బోధనలు చేయడం కనబడుతుంది. బాబిలోనియాలో ప్రవాసంలో వున్న యూదులు క్రీ.పూ.538 కల్లా జెరూసలెంకు తిరిగి వచ్చి గుడి కట్టడం మొదలుపెట్టారు కానీ రెండు దశాబ్దాలైనా పునాదిరాళ్ల దగ్గరే ఆగిపోవడంతో బాధపడిన హగ్గయి, గుడి కడితే మనకు మంచి రోజులు వస్తాయని, బాధలు తీర్చబోయే మెస్సయ్య వస్తాడని చెప్పాడు. తర్వాతి అధ్యాయమైన జెకర్యా(Zechariah),లో జెకర్యా కూడా యిదే ధోరణిలో గుడి కట్టడం గురించే ఉద్బోధించాడు. అయితే హగ్గయి కంటె భిన్నంగా, దేవుడు ఆజ్ఞలు పాలించాలని, దాని వలన పుణ్యం వస్తుందని నొక్కి వక్కాణించాడు. మన కష్టాలు తొలగించేందుకు ఒక రాజు వస్తాడని అతను చాలా వినయవంతుడై వుంటాడని, గాడిద నెక్కి జెరూసలెంకు వస్తాడని చెప్పాడు. న్యూ టెస్ట్‌మెంట్‌ రచయితలు ఏసుక్రీస్తు కూడా గాడిద నెక్కి జెరూసలెంకు పామ్‌ సండేనాడు వచ్చాడని, యీ అధ్యాయంలో చెప్పిన వినయవంతుడైనా రాజు అతనేనని అంటారు. ఆఖరి అధ్యాయమైన మలాకీ(Malachi) లో కూడా రాబోయే మెస్సయ్య గురించి ప్రస్తావన వుంటుంది. నియమాలు తప్పుతున్నందుకు ప్రజలనే కాక పూజారులను సైతం మందలించడం కనబడుతుంది. మెస్సయ్య వచ్చేముందు ఒక వార్తాహరుడు వచ్చి అతని రాక గురించి తెలుపుతాడని యీ అధ్యాయం చెప్తుంది. మలాకీ అంటే హీబ్రూ భాషలో ''నా దూత'' అని అర్థం. న్యూ టెస్ట్‌మెంట్‌ రచయితల వాదన ప్రకారం జీసస్‌ క్రైస్తు రాక గురించి జాన్‌ ద బాప్టిస్టు ముందుగా తెలియపరచాడు కాబట్టి యీ జోస్యం కూడా నిజమైందని, అందువలన పాత నిబంధన గ్రంథంలో ప్రస్తావించబడిన మెస్సయ్య జీసస్‌ క్రైస్తు తప్ప వేరెవరూ కాదని అభిప్రాయపడతారు.యూదులు యీ వాదనను తిరస్కరిస్తారు. (చిత్రం - సింహాల గుంటలో డేనియల్‌)

దీనితో ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ అనే పాత నిబంధన గ్రంథం పూర్తయింది. ప్రపంచంలోని ముఖ్య మతాలైన క్రైస్తవం, ఇస్లాం, యూదులకు పవిత్ర గ్రంథమైన యీ పుస్తకంలో ఏముందో యితర మతస్తులైన పాఠకులకు చెప్పాలనే తాపత్రయంతో ''బైబిల్‌ కథలు'' సీరీస్‌ ప్రారంభించడం జరిగింది. వెయ్యి పేజీలకు పైగా వున్న యీ గ్రంథసారాన్ని సుమారు 50 పేజీల్లో చెప్పడం సులభమైన పనేమీ కాదు. పేర్లుకాని, ప్రదేశాలు కాని పరిచితమైనవి కావు. పుస్తకాలలోని భాష కూడా ఒక పట్టాన కొరుకుడు పడేది కాదు. చాలా చోట్ల భావాల పునరుక్తి కనబడుతుంది. తొలి భాగాలలో ప్రముఖ వ్యక్తులు, ప్రఖ్యాత ఘట్టాలు వున్నా, పోనుపోను ఇజ్రాయేలు పొరుగుదేశాల చేతిలో ఓటమిపాలు చెందడం, దాస్యవిముక్తి కోసం పోరాడడం మళ్లీమళ్లీ వస్తూ ఆసక్తి సన్నగిల్లుతుంది. అందుకే పాఠకుల సంఖ్య కూడా క్రమేపీ తగ్గింది. నేను మధ్యలో మూడేళ్ల విరామం యివ్వడం కూడా పట్టు కోల్పోవడానికి కారణమైంది. దీని తర్వాత కొత్త నిబంధన గ్రంథం, కొరాన్‌ కథలు చెప్దామనుకున్నాను కానీ ఆదరణ యింత తక్కువగా వున్నపుడు వాటి జోలికి పోకపోవడమే మేలు. న్యూ టెస్ట్‌మెంటులో కథలు, బోధనలు క్రైస్తవ టీవీల్లో తరచుగా వింటూనే వుంటాము. కొరాన్‌ను మాలతీ చందూర్‌గారు సులభమైన భాషలో అనువదించారు. దినపత్రికలలో వారంవారం వస్తూనే వున్నాయి. 

ఈ రచనలో ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే క్షంతవ్యుణ్ని. ఎత్తి చూపిస్తే ఈ-బుక్‌గా వేసినప్పుడు సవరించుకుంటాను. 

(''బైబిల్‌ కథలు'' సీరీస్‌ సమాప్తం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2016)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?