Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఎమర్జన్సీ ఎట్‌ 40 - 55

తన చేతలు సమర్థించుకోవడానికి ఇందిర ప్రజలకు ఏమైనా చెప్పవచ్చు. కానీ ఆ దశలో ఆమె కొడుకు పట్ల ఎలా వ్యవహరించింది, కొడుకు ఆమెతో ఎలా వ్యవహరించాడు,  ఆమెను అప్పటివరకు విజయపథంలో నడిపించిన సలహాదారులు సంజయ్‌ విషయంలో ఆమె పంథా గురించి ఏమన్నారు అనేది తెలుసుకోవడం ఆసక్తికరంగా వుంటుంది. 

సంజయ్‌ తన షెడ్‌లో చదువురానివాళ్లతో కలిసి పనిచేసి, వేరే ఏ యింజనీర్లు, పరిశోధకుల అవసరం లేకుండా సొంత కారు తయారుచేసేయగలనని అనుకోవడం చాలా వింతగా తోస్తుంది కదా. నెహ్రూతో తన అనుభవాల గురించి పుస్తకం రాసిన ఎంఓ మత్తయ్‌ సంజయ్‌ గురించి రాస్తూ ''హెన్రీ ఫోర్డ్‌ ఆత్మకథ పుస్తకాన్ని నేను సెకండ్‌ హ్యాండ్‌ బుక్‌స్టాల్‌లో కొని నెహ్రూకు బహూకరించాను. సగం చదివేసరికే ఆయనకా పుస్తకం బాగా నచ్చింది. పూర్తయ్యాక తిరిగి యిచ్చేస్తానని అన్నారు. కానీ ఆ పుస్తకం నాకు వెనక్కి రాలేదు. సంజయ్‌ ఆ పుస్తకం చదివి, తన దగ్గర వుంచేసుకున్నాడు. ఫోర్డు లాగే సొంతంగా కారు తయారుచేయాలని కలలు కన్నాడు. ఫోర్డు ఒకప్పుడు మెకానిక్‌గా చేశాడని చదివి, తనూ ఒక పాత షెడ్‌లో మెకానిక్‌గా పనిచేసి, తనూ ఫోర్డంతటివాణ్ని అయిపోయాననుకున్నాడు. స్పేరు పార్టులు ఏరుకుని వచ్చి ఓ బండికి ఫిట్‌ చేస్తే అది నడవవచ్చు. అంత మాత్రాన వాటిని తయారుచేయడం వచ్చేసినట్లు కాదు. ఇది సంజయ్‌ గ్రహించలేదు.'' అన్నాడు. సంజయ్‌ తన కంటె బాగా చదువుకున్న ఇంజనీర్లను నియమించుకోలేదు. తన కంటె తక్కువ స్థాయివాళ్లను పోగేసి వాళ్లంతా చప్పట్లు కొట్టడంతో తను గొప్పవాడైపోయానని అనుకున్నాడు. ఇందిర వంటి మేధావికి ఈ మాట తెలియకుండా వుంటుందా? ప్రధాని కొడుకై వుండి అలగా జనంతో తిరుగుతూ వుంటే ఆమె సహిస్తుందా? తమది కులీనుల వంశమని, ఫిరోజ్‌ గాంధీ కూడా తమకు తూగడని భావించిన ఇందిర సంజయ్‌ మెకానిక్కులతో కలిసి తప్పతాగి తిరుగుతూ ఎప్పుడో అర్ధరాత్రి యింటికి వస్తూ వుంటే వూరుకుందా? ''ఆల్‌ ద ప్రైమ్‌ మినిస్టర్స్‌ మెన్‌'' అనే పుస్తకంలో జనార్దన్‌ ఠాకూర్‌ దీని గురించి విపులంగానే రాశాడు. 

- 'రోల్స్‌ రాయిస్‌ నుంచి సంజయ్‌ అర్ధాంతరంగా వచ్చేయడం ఇందిర అంగీకరించలేదు. మళ్లీ వెళ్లి, కోర్సు పూర్తి చేసిరా అని ఎంత చెప్పినా సంజయ్‌ ససేమిరా అన్నాడు. అప్పటికే అతనికి 20 ఏళ్లు. తండ్రి లేకుండా పెరిగాడు. అహంభావం అలవర్చుకున్నాడు. దాన్ని ఎగదోసి, అతన్ని చెడగొట్టడానికి యశ్‌పాల్‌ కపూర్‌, ఎల్‌ఎన్‌ మిశ్రా తయారయ్యారు. అతను ఇందిర చెయ్యిదాటి పోయాడు. ప్రధాని యింట్లో పనిచేసే సిబ్బంది చెప్పిన విషయాలు - 'సంజయ్‌ చాలా ఆలస్యంగా తప్పతాగి వచ్చేవాడు, కూడా రకరకాల మనుష్యుల్ని వెంటేసుకుని వచ్చేవాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఇందిర ఓ రోజు తలుపులు మూయించేసింది. అవేళ అతను ఒకడితో కలిసి వచ్చాడు. తలుపు దబదబా బాదసాగాడు. ఇందిర ఆదేశాల మేరకు ఎవరూ తలుపు తీయలేదు. ఇక సంజయ్‌ బూతులు లంకించుకున్నాడు. కాస్సేపటికి ఇందిర తనే స్వయంగా తలుపు తెరిచి ''సన్నాసి వెధవలను వెంటేసుకుని యింటికి రావలసిన తీరు యిది కాదు'' అంది కఠినస్వరంతో. ''నోర్ముయ్‌.. (బూతుమాట) నువ్వు ముందు నీతో వున్న సన్నాసి వెధవలను బయటకు పంపి అప్పుడు మాట్లాడు.'' అన్నాడు సంజయ్‌. తర్వాత యిద్దరి మధ్య పెద్ద వాగ్యుద్ధం జరిగింది. చివరకు సంజయ్‌ ''సరే, నేను యిప్పుడు వెళ్లిపోతాను. కానీ రేపే మీడియాను పిలిచి నీ సంగతి లోకం ముందు పెడతాను.'' అని బెదిరించాడు. అంతే ఆమె హతాశురాలై కూలబడింది. ఆ తర్వాత అతను ఎప్పుడు వచ్చినా నిరోధించే ప్రయత్నం చేయలేదు.' అదే పుస్తకంలో ''ద వాషింగ్టన్‌ పోస్ట్‌'' దక్షిణాసియా కరస్పాండెంట్‌ లూయీ ఎమ్‌. సైమన్స్‌ రాసినది కూడా ఠాకూర్‌ ప్రస్తావించాడు. 'ఇందిర, సంజయ్‌ హాజరైన ఒక డిన్నర్‌ పార్టీలో వాళ్ల కుటుంబస్నేహితుడు కూడా వున్నాడు. అతను చెప్పినదాని ప్రకారం సంజయ్‌ ఆ పార్టీలో ఆరుసార్లు తల్లి చెంపలు వాయించాడు. ఆమె ఒక్కమాట కూడా అనలేదు. దెబ్బలు తింటూ వుండిపోయింది. అతనంటే ఆమెకు చచ్చేటంత భయం.' అని అతను రిపోర్టు చేశాడు. దానికి గాను ఎమర్జన్సీ విధించినపుడు అతన్ని దేశం నుంచి బహిష్కరించారట. 

ఇందిరకు సంజయ్‌ పట్ల ధృతరాష్ట్రప్రేమ వుంది, భయమూ వుంది. గృహకలహాల కారణంగానే పెంపకం దెబ్బతిని యిలా తయారయ్యాడన్న అపరాధభావనా వుంది. ఏదో చిన్నకారు చేస్తానని ముచ్చట పడుతున్నాడు కదా, అదేదో తీరిస్తే జీవితంలో కుదురుగా వుంటాడు కదా అని ఆశపడింది. కానీ ఆమెకు రెండు రకాల యిబ్బందులు వచ్చిపడ్డాయి. ఒకటి సంజయ్‌ను ప్రోత్సహించవద్దు అనే హక్సర్‌ తదితర సలహాదారులు. రెండు సంజయ్‌ను నువ్వు యింతటివాడివి, అంతటివాడివి అని వూదరగొట్టి అతన్ని చెడగొట్టిన ఎల్‌ఎన్‌ మిశ్రా, బన్సీలాల్‌ వంటివాళ్లు. ఈ రెండు రకాల నాయకులతో ఆమె సతమతమైంది. రాజకీయాలు చేతకాని ఇందిరను పాత కాంగ్రెసు నాయకులపై పైచేయి సాధించడానికి దోహదం చేసి దేశనేతగా తీర్చిదిద్దిన సలహాదారు పిఎన్‌ హక్సర్‌ గురించి గతంలోనే కొంత రాశాను. 1968 నుంచి ఇందిరకు దిశానిర్దేశం చేసిన హక్సర్‌ 1972లో రిటైరయ్యాడు. కానీ వెంటనే ప్రిన్సిపల్‌ ప్రైవేటు సెక్రటరీగా నియమించింది ఇందిర. అతను ''సంజయ్‌ మారుతి ప్రాజెక్టును ప్రోత్సహించవద్దు. అతను అడ్డుదారులు తొక్కుతున్నాడు'' అని పదేపదే హెచ్చరించాడు. సంజయ్‌ చేసిన తుంటరిపనులు కవర్‌ చేసిచేసి అతను విసిగిపోయాడు. ఇతను పనికిమాలినవాడు అనే అభిప్రాయానికి వచ్చాడు. ఇందిర అతని మాటలకు బాధపడి, ఏమీ చేయలేని పరిస్థితిలో పడింది. ఆ టైములో లలిత్‌ నారాయణ్‌ మిశ్రా రంగంలోకి దిగాడు. అతనూ, బన్సీలాల్‌ సచ్ఛీలుడిగా పేరు పొందిన కేంద్ర హోం మంత్రి గుల్జారీలాల్‌ నందాకు శిష్యులుగా కెరియర్‌ ప్రారంభించి అవినీతికి ప్రతిరూపాలుగా పేరుబడ్డారు. బిహారు వాడైన మిశ్రా ఫిరోజ్‌ గాంధీ స్నేహితురాలు తారకేశ్వరి సిన్హాకు ఆత్మీయుడిగా మెలిగాడు. ఆమె ద్వారా ఫిరోజ్‌ గాంధీని పరిచయం చేసుకున్నాడు. ఇక నందాను ఎంత మెప్పించాడంటే ఆయన హోం శాఖలో డిప్యూటీ మంత్రిగా పదవి యిప్పించాడు. 1967 వరకు లలిత్‌ ఇందిరకు వ్యతిరేకంగా కామరాజ్‌ వెంట నడిచాడు. 1967 ఎన్నికలలో ఆమె గ్రూపును ఓడించడానికి ప్రయత్నించాడు. నిధుల సేకరణలో గట్టివాడు కాబట్టి బిహారుకి, ఒడిశాకు కామరాజును ప్రయివేటు డకోటాలో రప్పించి ప్రచారం చేయించాడు. ఆయన ఇందిరంటె అతనే పెద్ద లీడరవుతాడనుకున్నాడు కానీ ఆ లెక్కలు తప్పాయి. 1969లో కాంగ్రెసు చీలిక తర్వాత నాలిక కరచుకుని దినేశ్‌ సింగ్‌ను పట్టుకుని అతని ద్వారా ఇందిర ప్రాపకాన్ని సంపాదించాడు. 

పార్లమెంటులో అతన్ని నగద్‌ నారాయణ్‌గా అభివర్ణించేవారు. అందరినీ డబ్బుతో కొనడమే అతని పని. వివిధ నగరాల్లోని పత్రికా సంపాదకులకు, విలేకరులకు నెలనెలా కవర్లలో డబ్బు పెట్టి పంపేవాడు. అలా తీసుకోవడం యిష్టం లేనివాళ్లకు ఫారిన్‌ నుంచి మీ కోసం తెచ్చా అంటూ సూటుపీసులు పంపేవాడు. అదీ ఒప్పుకోనివాళ్లతో పేకాట ఆడుతూ కావాలని తను డబ్బు పోగొట్టుకునేవాడు. వీటికి వేటికీ లొంగనివాళ్లను గౌరవిస్తూనే, ఎప్పటికైనా వంచడానికి తన ప్రయత్నాలు తను చేస్తూ వుండేవాడు. యశ్‌పాల్‌ కపూర్‌, ఉమా శంకర్‌ దీక్షిత్‌లతో కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఇందిరకు చేరువ కావాలని ప్రయత్నించాడు. ఇందిర అమితంగా గౌరవించే మోహన కుమారమంగళం లలిత్‌ పద్ధతులను నిరసించేవాడు. ఇందిర ఇంగ్లండులో చదివే రోజుల నుంచి మోహన్‌ తెలుసు. అతనివి కమ్యూనిస్టు భావాలు. మేధావి. ఇందిరను సోషలిజంవైపు తిప్పడానికి సిపిఐ ద్వారా వచ్చినవాళ్లలో అతను ఒకడు. 1971లో స్టీలు, హెవీ యింజనీరింగు మంత్రిగా ఇందిర కాబినెట్‌లో చేరాడు. తెలివైనవాళ్లను సలహాదారులుగా పెట్టుకోమని ఇందిరకు సలహా యిచ్చేవాడు. ఆమె అతని మాటను మన్నించేది కూడా. అతను లలిత్‌ వంటి వాళ్లను దూరంగా పెట్టమనేవాడు. 1974లో మోహన్‌ విమానప్రమాదంలో మరణించడంతో లలిత్‌కు అడ్డు లేకుండా పోయింది. లలిత్‌ పద్ధతులు నచ్చని మరో వ్యక్తి హక్సర్‌. అతను ఇందిర ఆలోచనను ప్రభావితం చేస్తున్నాడని గ్రహించిన లలిత్‌ ఆమె సెంటిమెంటును రెచ్చగొట్టి దగ్గర కాదలచుకున్నాడు. అతని కంటికి సంజయ్‌ కనబడ్డాడు. అతన్ని దువ్వితే తల్లి సంతోషిస్తుందని లెక్కవేసి సంజయ్‌ గొప్ప దార్శనికుడు, అతన్ని ప్రోత్సహించాలి అని ఆమె దగ్గర అని అంటూండేవాడు. 'మీ మారుతి ప్రాజెక్టుకి పాలం విమానాశ్రయానికి అవతల భూములు తీసుకోండి. అవి హరియాణాలోకి వస్తాయి. దాని ముఖ్యమంత్రి బన్సీలాల్‌ మనవాడే' అని చెప్పిపెట్టాడు. 1500 మంది రైతులను వెళ్లగొట్టి ఆ స్థలాన్ని బలవంతంగా లాక్కుని మారుతి ప్రాజెక్టుకి యిచ్చాడు బన్సీలాల్‌. తన బంధువుల పేర ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాడు లలిత్‌.

ఇవన్నీ హక్సర్‌కు నచ్చలేదు. అడ్డు చెప్పేవాడు. అతను అడ్డు చెప్పడం ఇందిరకు నచ్చలేదు. ఒక ఏడాది పోయేసరికి అతన్ని ప్లానింగ్‌ కమిషన్‌కు బదిలీ చేసింది. అతని సలహాలు తీసుకోవడం మానేసింది. సంజయ్‌ తల్లిని రక్షించడానికి ఒక ఉత్తరంలో పాత తేదీ వేయమంటే హక్సర్‌ వేయనన్నాడట. సంజయ్‌కు ఆత్మీయుడిగా మారిన యశ్‌పాల్‌ కపూర్‌ వేరుశెనగ వ్యాపారస్తుల లాబీతో బేరం కుదుర్చుకుని దానికి అనుగుణంగా పాలసీ మార్చమంటే హక్సర్‌ ఒప్పుకోలేదు. ఇంటెలిజెన్సు రిపోర్టులు సంపాదించి అవతలివాళ్లను బెదిరిద్దామంటే హక్సర్‌కు చెప్పందే ఏ రిపోర్టు బయటకు రాదు. ఇందిరపై వత్తిడి తెచ్చారు. 1973 జనవరికి హక్సర్‌ను ఇందిర పంపించివేసింది. అది చాలా పొరపాటని తర్వాత జరిగిన సంఘటనలు రుజువు చేశాయి. అప్పణ్నుంచి ఆమె ఎన్నో తప్పులు చేసింది. హక్సర్‌ను పంపిన పై నెలలోనే లలిత్‌ మిశ్రాకు కాబినెట్‌ ర్యాంకు యిచ్చింది. ఇంటి గుమాస్తా వంటి ఉమాశంకర్‌ దీక్షిత్‌కు హోం శాఖ యిచ్చింది. పరిపాలనానుభవశూన్యుడు, నిధుల సేకరణలో దిట్ట అయిన డిపి చట్టోపాధ్యాయకు ఫారిన్‌ ట్రేడ్‌ యిచ్చింది. హక్సర్‌ను ప్రధాని కార్యాలయం నుంచి తప్పించివేశాక లలిత్‌ రెచ్చిపోయాడు.  క్రైమ్‌ రచనల్లో అతని హత్య గురించి రాసినపుడు అతని ద్వారా ఇందిర ఎలా నిధులు సేకరించేదో విపులంగా రాశాను. 1974లో లోకసభ సెషన్‌లో అతని గురించి అనేక యిబ్బందికరమైన ప్రశ్నలు లేవనెత్తారు. దాంతో ఇందిర భయపడసాగింది. అతన్ని కలవడం మానేసింది. పార్టీకి యిద్దామనుకున్న విరాళాలు అతని చేతికి యివ్వనక్కరలేదని వ్యాపారస్తులకు సంకేతాలు వెళ్లాయి. సంజయ్‌ గాంధీ కూడా అతన్ని కలవడం మానేశాడు. అతని చేతే రాజీనామా చేయించడం ఎలా అని పార్టీ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. కానీ అతను తనంతట తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా లేడు. మరీ ఒత్తిడి చేస్తే అన్నీ బయటపెట్టేస్తాననడం మొదలెట్టాడు. దాంతో హత్యకు గురయ్యాడు. అది యిప్పటికీ మిస్టరీగానే వుంది. లలిత్‌ హత్య గురించి రాసిన క్రైమ్‌ రచనలోనే దాని గురించిన వివరాలున్నాయి. 

తమను యిబ్బంది పెట్టిన హక్సర్‌పై సంజయ్‌ మిత్రులందరికి కసి పెరిగింది. అందరూ కలిసి హక్సర్‌పై ఎమర్జన్సీలో కసి తీర్చుకున్నాడు. హక్సర్‌ మేనమామకు ఢిల్లీ కన్నాట్‌ ప్లేస్‌లో ''పండిత్‌ బ్రదర్స్‌'' అని పెద్ద షాపు వుండేది. ఎమర్జన్సీ నడుస్తూండగా ఆ షాపుపై అతి చిన్న నెపం పెట్టి అధికారులు దాడి చేశారు. మేనమామను అరెస్టు చేసి, అతని కుటుంబాన్ని వేధించారు. రాజులతో స్నేహం ఎప్పటికైనా ప్రమాదకరమే అని సుభాషితం. హక్సర్‌కు అది అనుభవమైంది. రమేశ్‌ థాపర్‌ అనే వామపక్ష మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి. నాటకాలు, సినిమాలు రాశాడు, నటించాడు. ''క్రాస్‌రోడ్స్‌'' అనే పత్రికకు ఎడిటరు-పబ్లిషరు. లండన్‌లో చదువుకున్నాడు. 1962లో న్యూయార్క్‌లో ఇండియా పెవిలియన్‌ నిర్వహించినప్పుడు ఇందిర అతని ప్రతిభను గుర్తించి చేరదీసింది. తను ప్రధాని అయ్యాక గ్రామీణ ప్రాంతాలకై వాల్‌-న్యూస్‌పేపరు (ఏ రోజు వార్తలు ఆ రోజు గోడల మీద రాయడం), టూరిజం పాలసీ వంటి పథకాలపై వర్క్‌ చేయమని కోరింది. తర్వాతి రోజుల్లో ఇండియన్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌కు, నేషనల్‌ బుక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు చైర్మన్‌ని చేసింది. అతను కూడా మారుతికి అభ్యంతరాలు తెలిపాడు. ముఖ్యంగా దానికి ఋణం యివ్వడానికి తిరస్కరించిన సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ను పదవి నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కంపెనీ డైరక్టరుషిప్‌ నుంచి వైదొలగాడు. దాంతో ఇందిరకు కోపం వచ్చింది. ఆ పోస్టులు వుంచింది కానీ అతనికి ఎపాయింట్‌మెంట్స్‌ యివ్వడం మానేసింది. ఎమర్జన్సీ టైములో అతని ''సెమినార్‌'' పత్రికపై సెన్సార్‌షిప్‌ విధించి దాన్ని మూయించేసింది. ఎమర్జన్సీ విధించేనాటికే ఇందిర సంజయ్‌ చేతిలో కీలుబొమ్మ అయిపోయింది. ఆ విషయం ఆమె స్నేహితులు అప్పటికి గుర్తించలేదు. క్రమేపీ అవగాహనలోకి వచ్చింది.  (సశేషం)  (ఫోటో - రమేష్‌ థాపర్‌)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)   

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?