Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ కథ: దెయ్యాల బోను

ఎమ్బీయస్ కథ: దెయ్యాల బోను

ముకుందం అనే ఓ జర్నలిస్టు గొంతు సవరించుకున్నాడు. "దెయ్యాల గురించి చెప్తాననగానే హారర్ కథ చెప్తాననుకుంటారేమో, కానీ నేను చెప్పేది అద్భుతరసం కేటగిరీలోనే వస్తుంది.’’ అంటూ మొదలుపెట్టాడు.

ముఖ్యమంత్రిణి చిరునవ్వుతో ‘‘అయితే దెయ్యాలున్నాయనే అంటారా?’’ అని అడిగారు.

‘‘కథంతా విని మీరే చెప్పాలి మేడమ్. ఇది అభిషేక్ అనే మా ఫ్రెండు చెప్పిన సంగతి. ఇలాగే ఓ రోజు అందరం కూర్చుని, దెయ్యాల గురించి డిస్కస్ చేస్తూండగా వాడు చెప్పుకొచ్చాడు. అవేళ జరిగినది నేను మీకు కళ్లక్కట్టినట్లు వర్ణిస్తాను, మా తక్కిన ఫ్రెండ్స్ పేర్లతో సహా! ఎక్కడైనా కన్‌ఫ్యూజన్ వస్తే చెప్పండి.’’ అంటూ మొదలుపెట్టాడు.

"నిన్ననే 'రెడ్ రూమ్' అని ఓ ఇంగ్లీషు కథ చదివేను. తమాషాగా ఉందిలే. దెయ్యాలను పట్టి వాటిని నాశనం చేయడం అదీ.., అసలిలాటి ఐడియాలు ఎలా వస్తాయో వాళ్లకి.." అంటూ ఆశ్చర్యపడ్డాడు విఠల్ మందుపార్టీ వేడెక్కుతూండగా.

"దెయ్యాలే ఒక ఐడియా అయినప్పుడు, వాటిని పట్టి, నిర్వీర్యం చేయడం అన్నది ఆ ఐడియాకు ఎక్స్‌టెన్షన్. అది నిజమని నిరూపిస్తే అబ్బురపడాలి గానీ... "అంటూ అడ్డుపడబోయేను నేను. "నిరూపించినా నువ్వు ఒప్పుకొని చావవుగా, ప్రతీదానికీ ఆధారాలు కావాలంటావు. జర్నలిస్టు బుద్ధి అన్నిట్లోనూ వాడతావు." అన్నాడు అభి గ్లాసు నింపుకుంటూ. అందరూ గొల్లుమన్నారు.

నేను కోపంగా ఏదో అనబోతూ ఉండగానే అభి ఆపాడు, "నీ వాదనలు మాకందరికీ కంఠతా వచ్చులేరా! ఒరే విఠల్, ఎక్కడో ఫారిన్ వాడు రాసాడని మురిసిపోవడం కాదు. మన పరిసరాల్ని పరీక్షగా చూసినా ఇలాటివి అనేకం దొరుకుతాయి తెలుసా, అది ఇంగ్లీషులోనే చదివితేనే గొప్పనుకోవడం గొప్ప తప్పు. తెలుసుకో." అన్నాడు. "అయితే నువ్వు అలాటివి చూసావా?" అడిగారెవరో.

"ఆహాఁ, మా జయచంద్రా రెడ్డి ఇంట్లోనే చూసా."

"అయితే మాకు చూపిస్తావా?" అరడజను మంది ఒక్కసారిగా అడిగేరు.

"ఇప్పుడది లేదు.'' అని అభి అనడంతో అంతా 'హాఁ' అని అరిచారు. దాంతో నేను పుంజుకున్నాను. "ఇదీవరస! ఇలాటి కప్పదాట్లే వేస్తాడు ఈ అభి గాడు. అసలు నాకు తెలీక అడుగుతాను. కోరిక తీరకపోతే దెయ్యాలవుతారంటారు కదా, చావు ముంచుకొచ్చినా ప్రతీ వాడికీ ఏదో కోరిక ఉండి తీరుతుంది కనీసం యింకో మంచి డాక్టరు వచ్చి చూడాలనైనా అనుకుంటాడు. మరి వాళ్లందరూ దెయ్యాలయివుంటే మనుష్యుల జనాభా కంటే దెయ్యాల జనాభా రెట్టింపు ఉండాలి."

‘‘భలే లాజిక్ లాగావ్, ముకుందం’’ అంటూ ముఖ్యమంత్రిణి పిఆర్వో మెచ్చుకున్నాడు. ‘‘మీ మెప్పులు తర్వాత వింటాం. ముందు కథ కానీయవయ్యా, ముకుందం’’ అని ప్రోత్సహించాడు ఓ సీనియర్ జర్నలిస్టు. ముకుందం హుషారుగా కథ సాగించాడు. అభినయం జోడించి డైలాగులు చెప్పసాగాడు. ‘‘నేనన్నదానికి మా అభి గాడేమన్నాడో తెలుసాండీ - నేను చెప్పేది వినకుండానే రెచ్చిపోకురా నాయనా, నీ కొస్తున్న డౌట్లే నాకూ వచ్చి జయచంద్రా రెడ్డిని అడిగేను.. వాడేమన్నాడో తెలుసా?"

"వాడేమన్నాడో తర్వాత చెబుదువు గాని, ముందు వాడెవడో చెప్పు..." అన్నాడు విఠల్.

"వాడు నాకు కాలేజిలో క్లాసుమేటు. నల్గొండ జిల్లా రెడ్డీస్. తరతరాలుగా జమీందార్లన్నమాట. ఒడ్డూ, పొడుగూ, మంచి పొగరుగా ఉండేవాడు. కానీ నేనంటే మాత్రం మహా ఇష్టం. కలిసి తిరిగేవాళ్లం. వాళ్ల జమీందారీ ఆచార వ్యవహారాలూ అవీ చెబుతూ ఉంటే భలే వింతగా ఉండేది. అప్పుడే వాడు చెప్పాడు దెయ్యాలబోను గురించి. వాళ్ల గడీలో, అదేలే వాళ్ల బంగళాలో ఓ గది ఉందనీ, దెయ్యాల్ని కట్టిపడేయడానికి దాన్ని ఉపయోగిస్తారనీ చెప్పాడు."

"ఎలకలబోనులా ఈ దెయ్యాలబోను ఏమిట్రా బాబూ? లోపల పకోడీ ఏమైనా ఉంటుందా?" హాస్యంగా మాట్లాడుతాననుకునే వెంకట్రావు జోకేయబోయేడు కానీ అందరూ అభి కేసే ఆసక్తిగా చూస్తున్నారు.

"అది ఒక గదిట. నాలుగువైపులా గోడలే. గుమ్మాలూ, కిటికీలూ ఏమీ ఉండవు. కంప్లీట్లీ క్లోజ్డ్. ఆ గదికి పైన ఒక పొడుగాటి ఇనుప చువ్వ ఉంటుందిట. ఆ గదిలో గోడలకు ఎరుపురంగు పులిమి ఉంటుంది. లోపల ఏవో సామాన్లు ఉంటాయి. పిడుగుని ఆకర్షించి భూమిలోకి పంపేసే ఇనపరాడ్‌లా ఈ చువ్వ దెయ్యాల్ని ఆకర్షించి గదిలోకి పంపేస్తుంది. ఆ లోపల ఉన్న సామాన్ల వల్ల దెయ్యం శక్తి హరించుకుపోయి ఉపశమిస్తుంది. ఇక దాని వల్ల భయం లేకుండా పోతుంది. క్రమేపీ అది విచ్ఛిన్నం అయిపోతుందిట. "

పార్టీలో ఉన్న ఒక ప్రొఫెసర్ "దీనిలో ఒక పాయింటు గమనించాలి. మన పాంచభౌతిక శరీరానికి గుండె ఆగిపోవడంతో మరణం సంభవిస్తుంది. కానీ బాడీలో తక్కిన శక్తులు ఉంటాయి కదా, కుండలినీ శక్తి అలాటివి, అవి ఏమవుతాయి అని తరచు ఆలోచిస్తూ ఉంటాను. శక్తి నాశనం లేనిది, రూపం మారుతుంది అని సైన్స్ చెబుతోంది కదా. దహనం చేసినా మనిషి లోపల దాగి ఉన్న శక్తులు మరో రూపంలో వెలువడవచ్చు. ఇప్పుడీ దెయ్యాలబోను లాటి వాటిల్లో ఆ శక్తి రూపాన్ని మార్చే ఎక్విప్మెంటు ఉండవచ్చు." అన్నాడు.

"లోపల ఎరుపు రంగు పులమడంలో కూడా ఏదో అర్థం ఉండవచ్చు. కలర్ థెరపీ వల్ల మనుష్యులు ప్రభావితులవుతున్నారు కదా, దెయ్యాలు అదే ఆ శక్తిరూపాలు కూడా రంగు ప్రభావానికి లోనై కెమికల్ యాక్షన్‌లో ప్రోడక్ట్స్‌లా వేర్వేరు కాంపౌండ్లుగా తయారవ్వచ్చు. అలా తయారయినవి ప్రమాదరహిత మైనవేమో!'' అన్నాడు విఠల్.

"అవును గురూ, ఈ జమీందార్లకు ఆ దెయ్యాలబోను ఎందుకంట? పట్టి సర్కసు చేయిస్తారా? "అడిగేడు ఓ కొక్కిరాయి.

"అదే అడిగేను జయచంద్రాన్ని. వింటే బాధాకరంగా ఉంటుంది. ఈ జమీందార్లు ఎంతో మందిని గుట్టు చప్పుడు కాకుండా చంపిపారేసేవారట. దాయాదులను, తమకు ఎదురు తిరిగిన రైతుల్ని, పన్నులు అడగవచ్చిన ప్రభుత్వోద్యోగులను, తన కోర్కె తీర్చని ఆడవాళ్లను బోల్డు మందిని చంపేసేవారు. ఆ తర్వాత వాళ్లు దయ్యాలయి పీడిస్తారేమోనని భయపడి చచ్చేవారు. అందువల్ల ఆ దెయ్యాలను పట్టి, శక్తిహీనంగా చేయడానికే ఆ గదులు కట్టించేవారట." సమాధానం చెప్పేడు అభి.

"వార్నీయవ్వ...!' అంటూ ఆశ్చర్యపడబోతున్న మురళి భుజం తడుతూ అభి, "ఇంకా ఘోరమైన విషయం విను. ఆ గదులు కట్టే విద్య, అంటే తాపీ పని ఒకటే కాదు, లోపల ఎలాటి సరుకులు ఏయే ఏంగిల్స్ లో పెట్టాలి, ఎంతంత పెట్టాలి, లోపల ఏ కలర్ ఎంత డీప్‌గా వెయ్యాలి ఇవన్నీ తెలిసినవాళ్లు చాలా తక్కువట. వాళ్ల చేత ఈ పనంతా చేయించుకుని తమ గుట్టు బయటపడుతుందేమోనని వాళ్లని కూడా చంపిపారేసేవారట!" !

"అందుకే అన్నమాట వీటి గురించి ఆ ఫ్యామిలీ వాళ్లకు తప్ప తక్కిన ఎవరికీ తెలియనిది, మై గాడ్!"  అంటూ ఆశ్చర్యపోయారందరూ.

"మై డెవిల్ అనండి. ఇదంతా దెయ్యాల గోలేగా! ఇంతకీ నా బేసిక్ క్వశ్చన్ ఇప్పటిదాకా ఎవరూ ఆన్సర్ చేయలేదు. ఆ దెయ్యాలబోను ఓ టీవీ ఏంటీనాలాటిది పెట్టుకుని లోకంలోని దెయ్యాలన్నిటినీ ఎట్రాక్టు చేసేస్తూంటే, మనకు రెట్టింపు జనాభా ఉన్న దెయ్యాల.."అంటూ నేను మొదలెట్టబోతే ప్రొఫెసర్ గారు గొంతు సవరించుకుని ''ముకుందం గారూ, మీరు వెక్కిరిస్తే నేనేమీ చెప్పలేను గానీ, వీటి గురించి కొన్ని థియరీలు ఉన్నాయండి. కాంతి సరళరేఖలా వేలాది మైళ్లు ప్రయాణిస్తుంది. శబ్దం తరంగాల్లో ప్రయాణిస్తుంది. మన ఆలోచనలు, జ్ఞాపకాలూ అవన్నీ కూడా సరళ రేఖల్లాగానో, తరంగాల లాగానో అనంత విశ్వంలోకి ప్రయాణిస్తూనే ఉంటాయిట. ఒక్కోప్పుడు అవి వంపు తిరిగి, పరావర్తనం లేదా వక్రీభవనం లాటిది అనుకోండి.. భూమికి తిరిగి వచ్చి ఎవరో ఓ మనిషికి చేరతాయి. అందుకే ఒక్కోప్పుడు అవతలి వాళ్ల ఆలోచనలు మనకు తట్టడం, రేడియోలో వచ్చే పాట ముందుగానే తెలిసిపోవడం జరుగుతూందంటారు. గతజన్మ గుర్తుకొచ్చిన కేసుల్లో ఆ ఆలోచనలు, జ్ఞాపకాలు ఈ విధంగా రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఆ జ్ఞాపకాలు తన పూర్వజన్మ స్మృతులనుకుంటాడు. నిజానికి అవి అతని స్మృతులే కానవసరం లేదు.. "

నేను ఊరుకోలేదు, అడ్డు తగిలేను. "మరి అందరూ అలాగే రిసీవ్ చేసుకోవాలిగా! కొంతమందికి మాత్రమే ఆ స్మృతులు కలగడమేం? దెయ్యాలు ఆడవాళ్లకే ఎక్కువగా పట్టడమేం?"

విఠల్ చెప్పాడు సమాధానం. "ఒరేయ్ ముకుందం, రేడియో తరంగాలు, టీవీ తరంగాలు, యిప్పుడీ సెల్‌ఫోన్ తరంగాలు టవర్ల ద్వారా ప్రపంచమంతా వెదజల్లేస్తున్నారు కదా! అందరూ రిసీవ్ చేసుకోమెందుకు? ఏంటీనా లాటిదో, రౌటర్ లాటిదో ఉంటేనే వాటిని అందుకోగలం, అనుభవించగలం. అలాగే మనలో కొంతమందికి మాత్రమే ఆ ఏంటీనాలున్నాయి. ఆడవాళ్లకు అవి బాగా ఉన్నాయేమో. అందుకే వాళ్లకు దయ్యాలు పడుతున్నాయి. ప్రాక్టీసు ద్వారా కూడా వస్తుందేమో, రేకీ లాటి వాటి ద్వారా కాస్మిక్ ఎనర్జీను పట్టి ఉపయోగిస్తున్నారుగా!"

"రసపట్టులో చర్చ కూడదన్నారందుకే! ఒరేయ్ అభీ, నువ్వు కథ కానివ్వరా. మీ జయచంద్రుడి బాధేమిటో చెప్పావు కాదింతకీ." అన్నాడు మురళి.

అభి ఇంకో పెగ్గు లాగించి, పెదాలు తుడుచుకుని మరీ మొదలెట్టాడు. ''మా వాడి ఇంట్లో కూడా ఈ దెయ్యాలగది ఉందని చెప్పాను కదా! దాని వల్ల చెరుపు జరుగుతోందని వాడికి అనుమానం. వాళ్లింట్లో తాతముత్తాతల దగ్గర్నుంచీ అందరూ కూడా ఏదో తెలియని రుగ్మతలతో బాధపడి చచ్చిపోయినవాళ్లే. ఆ రుగ్మతలకీ, ఈ గదికీ సంబంధం ఉందనీ అందుచేత దాన్ని పడకొట్టించేయాలనీ వీడి వాదన. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని చెడగొట్టడం ఎందుకు, ఆ గది అలా ఉంటే నష్టం లేదు అని వాళ్ల అన్నయ్య వాదన."

"నువ్వేమన్నావు?"

"దీన్లో మనం అనేదేముంది? అన్నా వినేదెవడు? ఇద్దరి కిద్దరూ మొండి రాక్షసులు. తల్లీ, తండ్రి లేరు. పెళ్లిళ్లు చేసుకోలేదు. ఆస్తులు పోయినా, అహంకారాలు పోలేదు. నా కా గది చూపించరా నాయనా అని బతిమాలడం తప్ప మనం చేసేదేమీ లేదు. చూపిస్తా, చూపిస్తా అంటూనే వాడు చచ్చిపోయాడు."

"హారినీ అసాధ్యం కూలా! ఇంత కథా చెప్పి చివరికి ఇలా తేల్చావా? ఆ గది చూడకుండా, మీ జయచంద్రగాడు చెప్పినది పట్టుకుని ఇప్పటి వరకూ గొప్ప సస్పెన్స్ లో మేన్టేన్ చేసావు కదరా!'' అంటూ వాపోయేడు బ్రహ్మం.

"ఆ తొందరే పనికి రాదన్నాను. వాడు చూపించలేదన్నాను కానీ నేను చూడలేదన్నానా? ప్రమాదంలో వాడు చచ్చిపోయిన రెండేళ్లకి, అంటే క్రితం ఏడాది అన్నమాట జయచంద్ర ఊరి నుంచి ఓ మనిషి వచ్చాడు. 'అభిషేక్ గారు మీరేనా? మా అయ్యగారు జయసూర్యా రెడ్డి గారు మిమ్మల్ని వెంటబెట్టుకు రమ్మన్నారు' అంటూ. ఎవడ్రా అని కనుక్కుంటే జయచంద్ర అన్నగారీయన. నాతో పనేముందో తెలియదు. బావుండదని వెళ్లాను.

అరవై యేళ్లకు పైన ఉంటాయి. రోగగ్రస్తుడిలా ఉన్నాడు. పేరు తెలియదు కానీ, జయచంద్ర అన్న అతని కంటే ఐదేళ్లే పెద్దవాడని నాకు గుర్తు. మరి ఈయనెవరో? ఇంకా పెద్ద అన్నగారెవరైనా ఉన్నారేమో! ఆయన్ని చూడగానే మా జయచంద్రే గుర్తుకువచ్చాడు. అచ్చు అదే నడక, అదే మాట తీరు. అన్నదమ్ములు కదా, పోలికలుంటా యనుకున్నాను. వచ్చిన గంటవరకు పిలిపించిన పని చెప్పనేలేదు. "మధ్యాహ్నం దెయ్యాలబోను పడగొట్టించేస్తున్నాం. కూల్చేసేముందు మా తమ్ముడు జయచంద్ర మీకు చూపించమని చెప్పాడు. భోజనం చేసి రెడీగా ఉండండి. చూపిస్తాను." అన్నాడాయన.

బయటనుండి చూస్తే మామూలు గదులకు భిన్నంగా లేదా గది! పాతకాలం ధాన్యపుగాదిలా ఉంది, ద్వారం, కిటికీ ఏమీ లేకుండా. బయటనుండి గదిలోకి వస్తున్న ఇనుపరాడ్ మాత్రం కాస్త తుప్పు పట్టి ఉంది. అది ఒక గోడలో నుండి దూసుకుపోయింది. పగలకొట్టడానికి ముందు, పగలకొడుతూంటేనూ చెరో రెండు ఫోటోలు లాగించేను. ముందే చెబుతున్నాను, ముకుందం, ఫోటోల్లో దెయ్యాల యిమేజీలేవీ రాలేదు. ఇక గది చూడబోతే, మామూలు సున్నం, ఇటుకలే. కానీ గది మధ్యలో ఓ ఇనుపకాగు లాటిది ఉంది. దాని మీద ముళ్లబంతి ఒకటి. ఓ మూలగా ఒక డాలు వేళ్లాడగట్టి ఉంది. దానికి ఆ గోడలో ఉన్న ఇనుప చువ్వకు మరో ఇనుపడ్డీతో కనక్షన్ పెట్టారు. 'విచిత్రసోదరులు'లో పొట్టి కమలహాసన్ ఎక్విప్‌మెంటులోలా ఆ దెయ్యం స్పిరిటు వీటన్నిటి మధ్యా నలిగి ఏమవుతుందో దేముడికి, లేదా దెయ్యానికి మాత్రమే తెలియాలి. ఇంతకీ అన్నిటికన్నా షాకింగ్ థింగ్ ఏమిటంటే ఆ గోడలకున్నది పూర్తి ఎరుపు రంగు కాదు. ఎరుపు రంగు వేసారు కానీ పైన నీలం చారలు పూసారు. వాటిని చూస్తూనే జయసూర్యారెడ్డి పాలిపోయాడు. 'మోసం, మోసం' అనడం మొదలు పెట్టి గోడలన్నీ పరీక్షించసాగాడు. ఆ రూము మేమనుకున్నంత ఎయిర్ టైట్ కాదు. పైన చిన్న గవాక్షం ఒకటి ఉంది. దెయ్యం, లేదా దెయ్యంలో మిగిలిన భాగం ఆ గవాక్షం ద్వారా తప్పించుకునే వీలుంది."

అభి కథ ఇక్కడి వరకూ రాగానే అందరూ మంత్రముగ్ధుల్లా అయిపోయేరు. తాగడం కూడా మర్చిపోయారు. బ్రహ్మం మాత్రం "అంటే ఆ దెయ్యం దాంట్లోంచి తప్పించుకుని బయటకు వచ్చి, మళ్లీ ఇనుపరాడ్ చేత ఆకర్షింపబడి, లోపలకి జారి, మళ్లీ బయటపడి, ఇలా జారుడుబండ ఆడుకునేదంటావా ఏమిటి? " అంటూ జోక్ చేయబోయాడు. ఎవరూ నవ్వలేదు. బ్రహ్మం కేసి విసుగ్గా చూశారు.

నేను మాత్రం ఏమీ చలించలేదు. కాళ్లు బార్లా జాపి కుర్చీ మీద పెట్టి, ''ఇంత సొద చెప్పేవు కానీ, అందులో ఇరుక్కుపోయిన దెయ్యాన్ని మాత్రం చూసినట్టు చెప్పలేదు కదా!'' అన్నాడు.

ఆడియన్స్ పూర్తిగా తన పక్షాన ఉన్నారని తెలిసిన అభి నాకేసి కాస్త నిరసనగా చూసి "అందుకే పూర్తిగా వినమన్నది. అక్కడి వరకూ అయితే ఏదో చాదస్తం, మూఢనమ్మకం అని నేనూ కొట్టిపారేసి ఉండేవాణ్ని. కానీ జరిగినదేమిటో జయచంద్ర చెప్పడంతో నాకు పూర్తి నమ్మకం కలిగింది." అన్నాడు.

"జయచంద్ర చచ్చిపోయాడన్నావు!!"

"అవును, చచ్చిపోయాడు. దెయ్యమయ్యాడు. అసలెలా పోయాడనుకున్నావ్? ఓ రోజు రాత్రి వాళ్ల మేడ మీద తాగుతూ, తాగుతూ ఆ గది విషయమై వాళ్ల అన్నతో పోట్లాట వేసుకున్నాడు. 'నేను ఛస్తే కానీ నీకు బుద్ధి రాదు' అంటూ లేచి మెట్ల మీద నుండి దిగుతూ తూలేడు. అంతే సరాసరి వెళ్లి ఆ గది ఇనుపరాడ్ మీద పడ్డాడు. ఇది వాళ్ల అన్నయ్య నాకు చెప్పినది. వాడు దయ్యం అయ్యాక అనుభవాలు మాత్రం వాడే చెప్పాడు."

"ఎప్పుడు?"

" గది పడగొట్టిన రాత్రే. అవేళ గదిలో రంగులు చూసి జయసూర్య అప్‌సెట్ అయ్యేడని చెప్పానుగా. డిన్నర్ టైములో తిన్నది తక్కువ, తాగినది ఎక్కువ అయిపోయింది. అతను ఔట్ అయిపోయాక, 'ఏరా అభీ, గది చూపిస్తానని నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను కదూ!' అని జయచంద్ర గొంతు వినబడింది. ఆశ్చర్యపడుతూ జయసూర్య కేసి చూసా. అచ్చు జయచంద్రలాగే కనబడ్డాడు. లేచి కూచుని సిగరెట్ తీసుకు కాల్చడం - జయసూర్య కాల్చడులే -అదీ, అంతా వాడే!

తెల్లబోయి చూస్తున్న నాకేసి చూసి నవ్వేడు. ఎనిగ్మాటిక్ స్మైల్! వేరే ఎవ్వరికీ రాదు. 'నేను మొత్తుకుంటూనే ఉన్నానురా. ఆ గదిలోనే ఉంది, ఏదో కుట్ర అని. మావాడు వినలేదు. చూడు మేస్త్రీలు చేసిన మోసం. ఎరుపు రంగు వేసినట్టే వేసి పైన నీలం రంగు పులిమేసారు. దాంతో దెయ్యం పూర్తిగా నాశనమవదు. దాని శక్తి రోగంగా మారి, ఆ గవాక్షం ద్వారా మా ఇంట్లోకి, మా శరీరాలలోకి ప్రవేశించేది. అందుకే మా పెద్దలంతా అంతుపట్టని రోగాలతో చచ్చారు.' అన్నాడు నాకు విశదీకరిస్తున్నట్టు.

"తాపీ మేస్త్రీ కావాలనే చేసాడంటావా?"

"అందులో సందేహమే లేదు. ఆ గది కట్టిన తర్వాత తనను చంపి పారేసేవాడి మీద కసి ఉండదూ? అందుకే ఆ ట్రిక్ చేసాడు. రకరకాలమంది ఛస్తూ ఉంటారు. వాళ్లలో కొంతమందైనా దారి తప్పి ఆ రాడ్ చేత ఎట్రాక్ట్ అయి గదిలో పడతారు. వాళ్లే మావాళ్ల శరీరాలలో ప్రవేశించేవారు. అందుకే మా వాళ్లందరూ వింత, వింతగా ఒక్కోప్పుడు లంబాడీ వాళ్లలా, మరోప్పుడు ముస్లిమ్స్‌లా ప్రవర్తించేవారు. మా చిన్నతాతగారు కొంతకాలం నీచు మానేసాడు. బాపనదెయ్యం ఏమైనా దూరిందేమో!" -

"నువ్వు ఇప్పుడు మీ అన్న దేహంలో దూరినట్టా?"

"అంతే కదా! కానీ నేను ఏజిటీజ్ రాలేదు. ఆ గదిలో ఉన్నప్పుడు నాలో ఏవేవో మార్పులు జరిగాయి. ఓ రోజు గాలికి ఎగిరినట్టయి ఆ గవాక్షం ద్వారా బయటపడ్డాను. మా అన్నయ్య శరీరం నన్ను ఆకర్షించింది. నాతో బాటు ఏదో రోగం కూడా కొనితెచ్చాను లాగుంది. మా వాడికి అకాల వార్ధక్యం వచ్చిపడింది. నా లక్షణాలు కూడా వాడికి వంటబట్టాయి. ఆ గది పడగొట్టమని వాడి చేత నేనే అనిపించాను. నిన్ను రప్పించాను. లేకపోతే నీ అడ్రసు వాడికేం తెలుసు?"

"ఆయన వరస చూస్తూంటే ఎక్కువకాలం బతికేట్టు లేడు, పాపం!"

"వాడు పోతాడన్న బాధ కంటే చచ్చిన తర్వాత వాడేమవుతాడన్న చింత నాకు ఎక్కువై పోయింది. నేనయితే ఆ దెయ్యాలబోను రాడ్ మీదే పడ్డాను కాబట్టి ఆ గదిలో పడడం, తద్వారా ఈ శరీరంలోకి రావడం, కొంతకాలమైనా తెలిసున్న వాతావరణంలో మసలడం జరిగింది. మరి మా అన్న పోయినప్పుడు? గది ఇక లేదుగా.. మిస్టరీ విడగొట్టాలని గది పడగొట్టించేశానుగా... మరి ఏమవుతాడో? ఏ పుట్టలూ, గుట్టలూ పట్టుకు తిరగాల్సివస్తుందో" అని ఏడవనారంభించేడు వాడు.

జయచంద్ర అన్న గతి తలచుకుంటే నాకు బాధ వేస్తుంది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడాను." అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ అభి గ్లాసు కింద పెట్టేసాడు.

ఆ పార్టీలో ఉన్న మా అందరి కళ్లల్లోనూ నీళ్లే! అవి జయసూర్య మరణానంతరస్థితి తలుచుకునో, లేదా మా మరణానంతర స్థితిని ఊహించుకునో మాత్రం ఎవరికీ తెలియలేదు’ - అని ముకుందం కథ ముగించాడు.

(టెర్రీ డౌలింగ్ రాసిన ‘‘ద డెమన్ స్ట్రీట్ ఘోస్ట్ ట్రాప్’’ కథ స్ఫూర్తితో) (మరో అద్భుత రసయామిని కథ వచ్చే నెల రెండో బుధవారం) – ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)

తాజా కలం:  నా తొలి కథ ఆంధ్రపత్రిక వీక్లీ 08061973 సంచికలో ప్రచురితమైంది. అంటే ఇవాళ నేను నా రచనా స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నానన్నమాట. వచ్చే ఏడాది యీ తారీకుకి నేను ఉంటే, రాస్తూ ఉంటే 50 ఏళ్ల రచనావ్యాసంగం పూర్తవుతుంది. 50 ఏళ్ల పాటు రంగంలో ఉండడం మామూలు విషయం కాదు. నా శక్తియుక్తులను ఫిక్షన్, నాన్ ఫిక్షన్ రెండిటికీ కేటాయించడం వలననే యిది సాధ్యపడిందని నేను అనుకుంటాను. నాన్ ఫిక్షన్ చదవడం, రాయడం వలన ఫిక్షన్ రాసేందుకు ఐడియాలు వస్తాయి. ఫిక్షన్ రాసే అలవాటు వలన నాన్ ఫిక్షన్‌ను ప్రజారంజకంగా రాసే ఒడుపు అబ్బుతుంది. ఈ విషయం నాకు నేను చెప్పుకోవటం లేదు. రచనా వ్యాసంగంలో ఉన్నవారికి ఉపయోగ పడుతుందని చెపుతున్నాను. చాలామంది కథారచయితలకు నాన్ ఫిక్షన్ అంటే చిన్నచూపు. కొత్తగా ఏదీ కల్పించటం లేదు కదా, ఏరుకొచ్చినవి ఒక చోట పేర్చడమే కదా అనుకుంటారు. అదీ కష్టమైనదే, పైగా దాని వలన మీ ఫిక్షన్ మెరుగుపడుతుంది అని వారికి చెప్తున్నాను.

mbsprasad@gmail.com

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా