Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ కథలు - చావంటే ఇదేరా !

దెయ్యాలను నమ్మకుండా ఉండడం కష్టం. ముఖ్యంగా మనమే దెయ్యాలమైనప్పుడు. మూడ్‌ ఖరాబయిన ఆ ఘడియలో నేను ఉరివేసుకున్నాను - చావు వచ్చేలోపునే నేను చేసిన పని నాకు నచ్చలేదు. కుర్చీ తన్నేసిన వెంటనే మళ్లీ అది నా కాళ్ల కిందకు వచ్చేస్తే బాగుండుననిపించింది. కానీ భూమ్యాకర్షణ శక్తి కారణంగా పడిపోయిన కుర్చీ మళ్లీ లేవలేకపోయింది. అదే శక్తి నా 90 కిలోల శరీరాన్ని కూడా కిందకు వేలాడేసింది. దాంతో మెడకు వేసుకున్న తాడు మరింత బిగిసింది.

గొంతు బాగా నెప్పి పుడుతుందని ముందే అనుకున్నాను కానీ బుగ్గలు ఇంతలా ఉబ్బుతాయని ఊహించలేకపోయాను. కళ్లు వెళ్లుకు వచ్చాయి, గుమ్మం వైపుకి చూపు సారిస్తూ. ఎవరైనా వచ్చి రక్షిస్తారేమోనని ఆశ! ఇంట్లో ఎవరూ లేరని తెలుసు, ఉన్నా తాళం పెట్టి ఉన్న తలుపును తోయలేరని తెలుసు. అయినా ఆశ చావలేదు! కాళ్లు విదుల్చుకుంటూ, గిరగిరా గాలిలో వేళ్లాడడంతో కాస్సేపు తలుపు వైపుకు, కాస్సేపు కిటికీ వైపుకు ఊగాను. చేతుల్తో తాడు అందుకోబోయేను కానీ పట్టు చిక్కలేదు, ఇక వదులుచేయడం మాట దేవుడెరుగు!

నాకు భయం ముంచుకొచ్చింది. వెర్రెక్కినవాడిలా అయిపోయేను. అయినా ఎక్కడో నా మెదడులో ఓ చిన్నమూల కాస్త ఒంటరితనం మిగిలిపోయింది. నన్ను నేనే అబ్జర్వ్‌ చేసుకుంటూ ఉండిపోయాను. గాలిలో వేలాడుతూ, గిలగిలలాడుతూ ఉన్న నా శరీరం, వికారమైన నా కదలికలు, మందంగా ఉన్న ఉరితాడు, గట్టిగా ఉన్న దూలం, గదిలో ఒకదానికొకటి పొంతన లేని రెండు బెడ్‌లాంప్‌లు, వాటి వల్ల రెండు వేర్వేరు షేడ్స్‌లో గోడ మీద పడుతున్న నా నీడలు, కిటికీకి వేసిన తెల్ల కర్టెన్‌, మూసేసిన కిటికీ - 'చావంటే ఇదేరా!' అనిపించింది. కానీ నాకు చావంటే ఇష్టం పోయింది. దురదృష్టవశాత్తూ చావు బతుకుల్లో ఏది ఎంచుకోవచ్చో ఛాయిస్‌ పూర్తిగా పోయాకనే ఆ విషయం తెలిసివచ్చింది.

xxxxxxxxxxxxxxxxxx

నా పేరు ముకుందం. ఆర్‌.ఎల్‌.ముకుందం. జననం 1959, మరణం 1999. 

నలభై ఏళ్లు పూర్తవడానికి నెల ముందే చావు వరించాను. నలభై పూర్తయివున్నా ఏదో ఒరిగి ఉండేదన్న భ్రమలు నాకు లేవు. ఎందుకంటే ఇంకా నలభై ఏళ్లు బతికి ఉన్నా నాకు పిల్లలు పుట్టి ఉండేవారు కారు. అసలదే నా కష్టాలకు ముఖ్యమైన కారణం. నా స్పెర్మ్‌ కౌంట్‌ సరిగ్గా ఉండి మాకే పిల్లలు పుట్టివుంటే, వకుళ ఇంకోడితో తిరిగేదే కాదు, నేనిలా కసితో ఆత్మహత్యకు ఒడిగట్టేవాణ్ని కాను.

ఆత్మహత్యాస్థలం - మా ఇంట్లో గెస్ట్‌రూమ్‌. సమయం సాయంత్రం ఏడుగంటల తర్వాత. 

చీకటి పడుతోంది. అంతకు గంట ముందు ఆఫీసు నుండి నేను ఇల్లు చేరడం జరిగింది. నేను రియల్‌ ఎస్టేటు ఏజంటుని. ఈ మధ్య నా అశ్రద్ధ వల్ల బిజినెస్‌ దెబ్బతింటోంది కానీ లేకపోతే బాగానే సంపాదించాను. ఇంటికి రాగానే వకుళ కనబడలేదు. కిచెన్‌ టేబుల్‌ మీద వకుళ రాసి పెట్టిన చీటీ కంటబడింది. ''రంగాతో కలిసి ఏంటిక్‌ షాపులకు వెళ్లాల్సివచ్చింది. వంట చేయలేదు. మీరే ఏదో చెయ్యి కాల్చుకోవాలి. లేకపోతే హోటల్లో తినేయండి. సారీ - వకుళ.''

ఈ రంగా ఒకడు. వకుళ ప్రియుడు. ఏమీ తోచడం లేదు కాబట్టి పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తానంటూ వకుళ రంగా ఏంటిక్‌ షాపులో చేరింది. 'జీతం తక్కువే కానీ, కాలక్షేపం బాగానే అవుతోంది' అంటూంటుంది వకుళ. అసలే పాత వస్తువుల షాపు. చీకటిగా ఉంటుంది. రోజూ పెద్ద బేరాలేముంటాయి? టూరిస్టులు కూడా ఉండీ, ఉడిగీ వస్తూ ఉంటారు. ఈ లోపున వీళ్లకు కావల్సినంత ఏకాంతం. వాళ్లిద్దరూ కలిసి షాపు వెనక్కాల గదిలో మధ్యాహ్నాలు ఏం చేస్తుంటారో నాకు బాగా తెలుసు. ఇవాళ కాదు, మూడు సంవత్సరాలుగా ఎలాటి భాగోతం నడుస్తోందో  తెలుసు. కానీ ఎలా డీల్‌ చేయాలో మాత్రం నాకు తెలీదు. ఒకవేళ రచ్చకెక్కితే నా లోపమే బయటపడుతుంది. అందువల్ల నోర్మూసుకుని కూచున్నాను.  నోర్మూసుకున్నాను కానీ మనస్సు మూసుకోలేనుగా. కోపం, ఉక్రోషం, అసహనం, చివరికి కసి. - అన్నీ నా మీదే!

ఇంతకు ముందు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేసాను. కానీ ఆత్మహత్య అని తెలిస్తే ఎందుకా అని ఆరాలు తీయడం వల్ల నా లోపం బయటపడుతుందేమోనన్న సంకోచంతో కాస్త జాగ్రత్తగా ప్లాను చేసాను. కారు డ్రైవ్‌ చేస్తూ ట్రక్‌ నొకదాన్ని గుద్దేయబోయాను. కానీ చివరి నిమిషంలో లారీ డ్రైవర్‌ వేసిన కేకల వల్ల బెదిరి కాబోలు, ఒక సైడుకు తిప్పేసేను. ఇంకోసారి కొండ చివరి దాకా వెళ్లి నదిలోకి కారుతో సహా దూకేసే ప్రయత్నం చేసేను. చివరి నిమిషంలో అప్రయత్నంగానే బ్రేకు వేసేసేను. వేసేనన్నమాటే కానీ రివర్స్‌ చేయబుద్ధి కాలేదు. అలాగే అరగంట కూచుని చివరికి వెనక్కి వచ్చాను. ఇంకోసారి వాచ్‌మన్‌ ఉండని ఓ రైల్వే క్రాసింగ్‌ దగ్గర పట్టాల మీద కారు ఆపి కూచున్నాను. ఆ రోజు ట్రెయిన్‌ ఇరవై నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. ఈలోపున నా ఉక్రోషం చల్లారిపోయి బుద్ధిగా ఇంటికి తిరిగివచ్చేసాను. ఆ తర్వాత మణికట్టు మీద బ్లేడు పెట్టి కోసుకోబోయేను. అంత పదునైన బ్లేడు పెట్టి నా చర్మమంత సున్నితమైనదాన్ని కోయడం నావల్ల కాలేదు.

xxxxxxxxxxxxxxxxxxx

చివరికి, ఇన్నాళ్లకి నేను సఫలమయ్యేను. కళ్లు వెళ్లుకువచ్చి, బుగ్గలు బూరెల్లా పొంగి, నాలుక బయటకు వచ్చేసి, శరీరం విపరీతంగా ఊగిపోయి - ఇంత నొప్పి భరించగలుగుతానని నేను అనుకోలేదు. కానీ భరించేను. చివరికి నా తల పక్కకు వేలాడిపోయాక నా బాధ కాస్త తగ్గినట్టనిపించింది. అప్పుడు చూడబోతే కళ్లల్లో తడి ఆరిపోయింది, శరీరం ఊగడం ఆగిపోయింది. ఒక్కసారిగా నాకు తెలిసివచ్చింది - నేను చచ్చిపోయానని!

చచ్చి 'పోయాను' అనడం తప్పేమో.. నేక్కడికీ పోలేదు, ఇక్కడే చచ్చి ఉన్నాను అని అనాలి కాబోసు. ఉన్నాను కానీ ఆ రక్తమాంసాలతో కూడిన శరీరంలో కాదు. గాలిలా, కాంతిలా, పొగమంచులా అన్ని చోట్లా వ్యాపించి ఉన్నాను కానీ ఒక ఆకారంలో లేనన్నమాట. వాట్‌ నెక్‌స్ట్‌? ఏమో, తెలియదు.

ఏమీ జరగలేదు. ఆ శరీరం అలానే వేళ్లాడుతూ ఉండిపోయింది. 'ఇలా ఎంత సేపర్రా బాబూ?' అని అరుద్దామనుకున్నాను కానీ గొంతు నెప్పి పుట్టింది - గొంతే లేకపోయినా. నాలుక మండింది - నాలుకే లేకపోయినా. నాకు శరీరమే లేదు. బ్రెయిన్‌ అంతకంటే లేదు. అసలు జీవపదార్థమే లేదు నాలో. మాట్లాడలేను, కదలలేను, మెదలలేను. ఇక్కడే ఈ శవం ఉన్న ఈ గదిలోనే ఉండాలి. గడియారం కేసి అప్రయత్నంగా చూసాను. 7.21. అంటే నేను బాల్చీ తన్నేసి... కాదు... కుర్చీ తన్నేసి 20 నిమిషాలయింది, చచ్చిపోయి ఇంచుమించు 15 నిమిషాలయింది. ఇంకేం మరి? ఏదో ఒక హడావుడి జరగద్దూ?

గడియారంలో 9.11 అవుతూ ఉండగా వకుళ ఇంటికి వచ్చింది. నేనేమీ ఆత్మహత్య ఉత్తరం రాసి పెట్టలేదు. నా మృతకళేబరాన్ని చూస్తేనే వకుళకు అంతా అర్థమవుతుందని నాకు తెలుసు. 'ఎందుకిలా చేసారు?' అని అడగదలిచినా నేను ఉండను కదా అన్న ధీమా నాది. నాకేం తెలుసు? వకుళ వచ్చేవేళకి నేను ఇక్కడే చూరుపట్టుకుని వేళ్లాడుతూ ఉంటానని. నేను ఆత్మహత్య చేసుకోవడం పూర్తిగా జస్టిఫైడ్‌ అన్న విషయంలో  ఎలాటి తభావతూ లేదు. చేసుకున్నాక 'ఎందుకు చేసుకున్నానా' అని బాధపడుతున్న మాట వాస్తవమే ననుకోండి కానీ, చేసుకోవడానికి తగినంత కారణం ఉందని మాత్రం గట్టిగా చెప్పగలను. అయినా అంతా అయిపోయేక వకుళ మొహం చూడడం నాకిష్టం లేదు. నాకు తన మూలంగా నా కన్యాయం జరిగింది. ఆ విషయం నాకు తెలుసు, తనకూ తెలియాలి. కానీ నా ఎదురుగా కాదు.

నొప్పులు ఎక్కువయ్యాయి - నా ఒకప్పటి గొంతుకలో. ఒకప్పటి నా తలలో. కింద తలుపు వేసిన చప్పుడయ్యింది. నేను గదిలో గాలిలా కదలేను. గది విడిచిపెట్టి వెళదామని నా ప్రయత్నం. కానీ విడవలేకపోయాను.

''ఏమండీ...'' అది వకుళ గొంతే. ఖర్మ, గదిలోంచి వెళదామంటే వెళ్లలేకపోతున్నాను. నరకబాధ అంటే ఇదే గాబోసు. వకుళ నన్ను పిలుస్తూ, గాభరాపడుతూ, అన్ని గదులూ తిరుగుతున్న విషయం నాకు తెలుస్తూనే ఉంది. ఎందుకు తిరుగుతోందో? మెసేజ్‌ ఏదైనా రాసిపెట్టానేమోనని చూస్తోంది కాబోలు. నా కారు బయట ఉండడం చేత నేను ఇంటికి వచ్చినట్టు తెలిసిఉంటుంది. వచ్చి ఎక్కడకైనా వెళ్లానేమో, ఏదైనా చీటీ రాసి పెట్టానేమో ననుకుంటూండవచ్చు.

xxxxxxxxxxxxxxxxx

ఇల్లు చాలా పెద్దది కదా, వెతకడానికి చాలాసేపే పట్టవచ్చు. పెద్ద ఇల్లు, పాతదే కాబట్టి కొనగలిగేను, వకుళ కోసమే. వకుళకి ఏం కావాలన్నా ఇచ్చేను. అంటే నేనివ్వగలిగినవన్నీ. తను తపించిన బిడ్డల నెలాగూ ఇవ్వలేను కదా. ఈ ఇంటి నలంకరించడానికి ఏంటిక్స్‌ కొనడానికి వెళ్లినప్పుడే ఆ రంగాగాడు పరిచయమయ్యేడు, వకుళకు. రంగా.. కాదు, పూలరంగడు అంటే సరిపోతుంది. వెధవ. వాడే వకుళలో నాపైన చులకనభావం పెంచి ఉంటాడు. పాపం వకుళ - పిల్లలు పుట్టలేదని నన్ను ఎన్నడూ నిందించలేదు. పెళ్లయిన కొత్తల్లో పిల్లలుంటే బాగుండేది అంటూ ఉండేది కానీ అప్పుడు నా మొహం మాడిపోవడం చూసి క్రమేణా అలా అనడం మానేసింది. మానేసింది కానీ మనస్సులో ఉండే ఉంటుంది. నాకు తెలియదా?

ఇల్లంతా చుట్టబెట్టి నా గది తలుపు తట్టేటప్పటికి 9.23 అయింది. లోపటినుంచి తాళం వేసి ఉందిగా, తనంతట తాను తలుపు బద్దలు కొట్టి లోపలికి రాలేదు. హమ్మయ్య, తనను నేను చూడనక్కరలేదు. బతికిపోయా!

''ఏమండీ, లోపలున్నారా?'' అంటూ పదినిమిషాల సేపు తలుపుబాదిన తర్వాత వకుళ ఎవరికో ఫోన్‌ చేయడానికి వెళ్లింది. ఎవరేమిటి? నా మొఖం, ఆ రంగా గాడే! 9.44 కల్లా తలుపు బయట ప్రత్యక్షమయ్యాడు. ''ముకుందం గారూ..'' అంటూ! ... గారూ ఒకటి, ఓ పక్క నా పెళ్లాన్ని వలలో వేసుకుని...

ఇద్దరూ తలుపు బాదుతూండగానే వకుళ భయపడుతూ అంది, ''ఆయన ఏ అఘాయిత్యమూ చేసి ఉండరు కదా''

రంగాకు అర్థమయినట్టు లేదు. ''అఘాయిత్యం ఏమిటి?'' అన్నాడు వెర్రివెధవ. తన భార్య ఇంకోడితో కులుకుతూంటే మనుషులు ఎంతకు తెగిస్తారో వాడికి తెలీదు. పెళ్లి చేసుకుంటేగా!

''ఆయనీ మధ్య చాలా బాధపడుతున్నారు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు.''

''అనవసరంగా ఖంగారు పడక. స్లీపింగ్‌ పిల్స్‌ ఏవైనా వేసుకుని పడుక్కుని ఉంటాడు.''

''అది కాదు. అసలు నేను నిన్ను పిలిచి ఉండాల్సింది కాదు.'' అతనితో అంటూనే ''ఏమండీ, బయటకు రండి. నాకు చాలా భయంగా ఉంది.'' అంది వకుళ నన్నుద్దేశించి.

''నన్ను పిలిస్తే ఏం పోయింది?'' అంటున్నాడు రంగా.

''ఆయన లేచి చూస్తే ఏం బాగుంటుంది? అంత మట్టిబుర్ర కాదాయనది.''

తర్వాత గుసగుసలు వినబడ్డాయి. నేను లోపల బతికే ఉన్నాననుకుంటున్నారు. బహుశా వకుళ అని ఉంటుంది - 'మనిద్దరి సంగతీ పసిగట్టేశాడు. మనకు తెలియకుండా ఎప్పుడో ఆయన కంటబడి ఉంటాం.' అని. కాస్సేపటికి రంగా ''ముకుందం గారూ, బయటకు రండి. అన్ని విషయాలు మాట్లాడదాం. మీరు మనస్సులో అలాటిదేమీ పెట్టుకోకండి'' అంటూ అరిచేడు. ఇంకా మనస్సులో పెట్టుకోడానికి నేనుంటే కదరా చవటా!

తలుపు బాది బాది, డోర్‌ నాబ్‌ తిప్పి, తిప్పి వాళ్లకి విసుగు వచ్చినట్టుంది. ''మనం లోపలికి వెళ్లి చూద్దాం. దీనికి డూప్లికేట్‌ కీ ఏమైనా ఉందా?'' అన్నాడు రంగా.

వకుళ వెళ్లి తెచ్చాక తెలిసింది లోపలినుండి తాళం వేసి ఉన్న సంగతి. ''ద్వారబంధాల్లోంచి తలుపు ఊడపీకాల్సిందే. మా ఇంటికి ఫోన్‌ చేసి జగన్‌ని రమ్మనమను. వచ్చేటప్పుడు టూల్‌బాక్స్‌ తీసుకురమ్మని చెప్పు.'' అన్నాడు రంగా. జగన్‌ రంగా షాపులో అసిస్టెంటు. ఇంత జుట్టూ వాడూ, ఆడంగిలా ఉంటాడు. రంగాగాడు వాణ్ని ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడూ వస్తాడన్నమాట!

వకుళ ఫోన్‌ చేయడానికి వెళ్లగానే రంగా తాళం చెవితో తలుపు తెరవడానికి ప్రయత్నించసాగాడు. జరిగినది ఊహించినట్టుగా ఉన్నాడు. నా శవం భీకరస్థితిలో వకుళ కంటబడకూడదన్న ప్రయత్నం కాబోలు. చాలా కన్సిడరేట్‌ పాపం. అంతవరకు మంచివాడే. నిజానికి కూడా మంచివాడే. వకుళను బుట్టలో వేసుకున్నాడన్న కోపం తప్పించి నాకు అతని మీద ద్వేషం లేదు. బహుశా అతనే నా భార్యకు కాబోయే భర్త! 

వకుళ వయస్సు ముప్ఫైయ్యారే. తల్లయ్యే అవకాశం ఇంకా ఉంది. ఇద్దరూ అతని ఇంట్లోనే కాపురం పెడతారేమో. ఈ ఇల్లు అమ్మేస్తారేమో. రియల్‌ ఎస్టేటు ఏజంటుగా ఇల్లు అమ్మడంలో కష్టాలు నాకు తెలుసు. పైగా ఆత్మహత్య జరిగిన ఇల్లంటే... దెయ్యం పట్టిందని ఎవరూ కొనరేమో. అవును. ఇంటికి దెయ్యం పట్టినట్టేగా. అంటే నేనే... మా ఇంటికి నేను పట్టేనన్నమాట. మై గాడ్‌! గాడ్‌ అనవచ్చో, అనకూడదో ఇప్పుడు?!

9.58 కి రంగా తలుపు తెరవగలగడం, నిర్ఘాంతపోతూ నన్ను... అంటే నా శవాన్ని చూడడం జరిగింది. ఒక్క నిమిషంలోనే తలుపు మూసేసి వెళ్లిపోయాడు. ఇకపై ఏం జరుగుతుందో నాకు తెలసు. వకుళను దగ్గరకు తీసుకుని రంగా ఓదార్చడం, పోలీసుల్ని పిలవడం...

10.07 కి వకుళ, రంగా తలుపు బయట ఘర్షణ పడనారంభించారు. ''ఆ తాళం చెవి నాకియ్యమంటే ఇవ్వవేం?'' అని వకుళ ఏడుస్తోంది, బతిమాలుతోంది, అరుస్తోంది. ఇవ్వకురా బాటూ, ఇవ్వకు. నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని క్షమిస్తాను. వకుళను నేను చూడక్కరలేకుండా చేయి చాలు. చచ్చిపోయినా  నేనిక్కడే వేళ్లాడతానని, వకుళను చూడవలసి వస్తుందని తెలిస్తే నేను ఈ ప్రయత్నం చేసేవాణ్నే కాను.

కానీ వాడు తాళం చెవి ఇచ్చేశాడు. వకుళ గదిలోకి వచ్చింది. నన్ను చూసింది. ఏడ్చింది. మొరపెట్టుకుంది. నిరాశా, నిస్పృహ చుట్టుముట్టగా బిగ్గరగా రోదించింది. దుఃఖమంటే ఏమిటో నాకు తెలిసివచ్చింది. రంగా ఆమెను పట్టుకుని గది బయటకు తీసుకెళ్లబోయినా విదుల్చుకుని నా శవం వైపుకి పరుగెట్టింది. నా ... కాదు... నా శవం బుగ్గలు రాసింది. కాళ్లు చుట్టేసి వెక్కి వెక్కి ఏడ్చింది. ఏం మాట్లాడుతోందో తెలియకుండా ఏవేవో అంది. చివరికి రంగా ఆమెను బయటకు ఈడ్చుకుపోయి తలుపు మూసేసాడు. నా శవం ఊగి, ఊగి కాస్సేపటికి నిశ్చలంగా వేళ్లాడింది.

xxxxxxxxxxxxxxxxx

 రాత్రి ఎప్పుడో పోలీసులు వచ్చారు. శవాన్ని చూశారు. కిందకు దింపారు. బయటకు తీసుకుపోయారు. నేను ఆ శరీరంతో బాటే వెళ్లిపోతాననుకున్నాను. కానీ వెళ్లలేదు. ఇక్కడే, ఈ గదిలోనే ఉండిపోయాను. తలుపులు తీసేవున్నాయి కాబట్టి బయట జరుగుతున్న సంభాషణ స్పష్టంగా వినబడుతూనే ఉంది. డాక్టరు రావడం, శవాన్ని పరీక్షించడం, వకుళకు ఏదో మత్తు ఇంజక్షన్‌ ఇవ్వడం అన్నీ తెలుస్తున్నాయి. వకుళ ఒకటే ఏడుపు, ''నేనే ఆయన్ని చంపేశాను. తప్పంతా నాదే!'' అంటూ ఏడుస్తోంది.

నాక్కావలసినది అదే. వకుళ తన పొరపాటు తాను తెలుసుకోవాలి. నేను చావబోతూ కోరుకున్నది నెరవేరింది. కానీ అంతలోనే అనిపించింది. వకుళకు ఇంత కష్టం కలిగించడం న్యాయమేనా? పైగా లోపం నాలో ఉన్నప్పుడు? ఏ ఆడదైనా చేసేదే వకుళ చేసింది. నేను చావకుండా ఉండాల్సింది. వకుళ ఇంత బాధపడేది కాదు. ఇంత గిల్టీగా ఫీలయ్యేది కాదు. నా కళ్లెదురుగా ఇదంతా జరిగేది కాదు.

ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రంగాను గదిలోకి తీసుకువచ్చాడు. జరిగినదంతా రంగా వివరించాడు. అంతా విన్నాక, ''మీరు ముకుందం గారి ఫ్రెండా?'' అని అడిగేడు ఇన్‌స్పెక్టర్‌.

''ముకుందం గారి కంటే వకుళ గారి ఫ్రెండననాలి. ఆవిడ మా షాపులో పనిచేస్తారు.'' 

అతన్ని ఎగాదిగా చూసాడు ఇన్‌స్పెక్టర్‌. కళ్లెగరేసాడు. ''ఈయన ఇలా ఎందుకు చేసాడంటారు?'' అన్నాడు 'నువ్వేం చెబుతావో విందాం' అన్నట్టు.

ఈ ప్రశ్న వస్తుందని రంగా ముందే ఊహించినట్టున్నాడు. ''అతని భార్యకు, నాకూ ఏదో సంబంధం ఉందని అనుమానమేమో...'' అన్నాడు మెల్లగా.

''ఉందా?''

రంగా ఇబ్బందిగా కదిలేడు. ''అలాటిదేమీ లేదు. కాస్త చనువున్నమాట నిజమే కానీ...''

''భర్తకు విడాకులిచ్చి వదిలించుకోవచ్చుగా. ఇలా అడ్డమైన తిరుగుళ్లు తిరిగి అతన్ని కష్టపెట్టే బదులు...'' ఇన్‌స్పెక్టర్‌ అతి కటువుగా అన్నాడు.

''సార్‌, నా మాట వినండి. ఆవిడకు భర్తంటే పంచప్రాణాలు. విడాకులిచ్చే సమస్య లేదు.'' 

''మరి మీతో చనువు...''

''...చనువంటే మీరు మరోలా అనుకోకూడదు. మనశ్శాంతి కోసం నా కంపెనీ కోరుకునేది. ముకుందం గారు చాలా మూడీ మనిషి. ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉండేవారు.''

''ఆత్మహత్య చూసిన వాడికెవడికైనా తెలుస్తుందా విషయం...''

''...అందుకే'' రంగా ఆగిపోయేడు.

 ''...అయితే ఇక మీ ఇద్దరూ ఝామ్మని పెళ్లిచేసేసుకుంటారన్నమాట..'' పోలీసు ఇన్‌స్పెక్టర్‌ వెటకారంగా నవ్వాడు.

రంగాకి కోపం వచ్చేసింది. ''మీ ఉద్దేశం ఏమిటి? మేం ఇద్దరం కలిసి అతన్ని చంపేసేమనా?'' అంటూ అరిచేడు.

ఇన్‌స్పెక్టర్‌ కాస్త వెనక్కి తగ్గి, ''నేనా మాట అనలేదే! ఇప్పుడు అడ్డు తొలగిపోయింది కాబట్టి ఇక పెళ్లి బాజాలే తరువాయి అంటున్నాను.''

''బాజాలు లేవు, భజంత్రీలు లేవు.'' అన్నాడు రంగా విసుగ్గా.

''అదేం పాపం...''

రంగా కాస్త ఆగేడు. గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నాడు. ''చెప్పక తప్పదు కాబట్టి చెపుతున్నాను. మీరనుకునేదేదీ మా మధ్య లేదు. నేను... నేను... జగన్‌ అని ఇందాకా పరిచయం చేసాను కదా, మా ఇంట్లోనే ఉంటాడు.. అతనూ, నేను ఫ్రెండ్స్‌. అదే.. అంతకంటే విపులంగా చెప్పక్కర్లేదనుకుంటా. అందువల్ల నాకు ఆడవాళ్ల అవసరం లేదు''

''మై గుడ్‌నెస్‌...'' ఇన్‌స్పెక్టర్‌ తెల్లబోయేడు. ఒకడుగు వెనక్కి కూడా వేసాడు.'' ..మరి వకుళ గారు...''

''ఆవిడంటే నాకు చాలా అభిమానం. జాలి కూడా. అందుకే ఆమె నక్కడికీ, ఇక్కడికీ తిప్పేవాణ్ని. కాస్త సాన్నిహిత్యం తప్ప.. అంతకంటే ఆమె కూడా ఏమీ కోరుకోలేదు. భర్త అంటే చచ్చేటంత ఇష్టం వకుళకు.''

రంగా భుజం మీద ఇన్‌స్పెక్టర్‌ చేయివేసాడు అభిమానంగా. గది బయటకు నడిపించుకుని తీసుకెళ్లాడు.

xxxxxxxxxxxxxx

నాకు మతిపోయింది. బుర్ర తిరగనారంభించింది. కళ్లు మసకబారేయి. రూమంతా గిర్రున తిరుగుతోంది. నా కళ్లముందు పొరలు, చీకటి తెరలు. వాటి మధ్యలోంచి ఒక దృశ్యం - ఒక వ్యక్తి  తలుపుతీసుకుని విసురుగా గదిలోకి ప్రవేశించాడు. గబగబా ఒక తాడు తీసుకుని దూలానికి వేస్తున్నాడు. ఎవరా అని పరకాయించి, కళ్లు చించుకుని చూసాను. నేనే!

'నువ్వు చేస్తున్నది పొరబాటు, నీ భార్య అలాటిది కాదు. నీవు చేసేపని వల్ల ఆమెకూ, నీకు కష్టమే కానీ, సుఖం కలగదు.' అని ఎలుగెత్తి చెప్పబోయేను. కానీ అతను వినిపించుకోలేదు. అతి త్వరగా ముడివేసాడు. మెడ దానిలో దూర్చాడు. కుర్చీ తన్నేయబోయాడు.

''ఆగు, తొందరపడక..'' అని చెబుతూండగానే కుర్చీ తన్నేసాడు.

భగవాన్‌! చావంటే ఇదే!

(డోనాల్డ్‌ వెస్ట్‌లేక్‌ వ్రాసిన 'దిసీజ్‌ డెత్‌' కు స్వేచ్ఛానువాదం)

-  ఎమ్బీయస్‌ ప్రసాద్‌,

mbsprasad@gmail.com

ఆంధ్రప్రభ వీక్లీ లో, 1999లో ప్రచురితం)