Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: కాలిఖో పుల్‌ ఆత్మహత్య

ఎమ్బీయస్‌: కాలిఖో పుల్‌ ఆత్మహత్య

ఇటీవలి దాకా అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వుండి మారిన సమీకరణాలతో పదవి పోగొట్టుకున్న కాలిఖో పుల్‌ ఆగస్టు 9 న తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించి 12 రోజులైంది. అతని ఆత్మహత్యకు కారణం యితమిత్థమని యిప్పటిదాకా ఎవరూ గట్టిగా చెప్పటం లేదు. అతని అనుయాయులు మృతిపై సిబిఐ విచారణ జరగాలని డిమాండ్‌ చేయగా, రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ పోలీసు అధికారుల చేత ఇంక్వయిరీ కమిషన్‌ వేసింది. దాని నివేదిక కూడా ఎటూ తేలుస్తుందని అనుకోవడానికి లేదు. వాళ్లేం చెప్పినా పుల్‌ అనుయాయులు నమ్మరు. అరుచికరమైన కారణాలున్నా వాటిని బయటపెట్టడానికి ముఖ్యమంత్రికి ధైర్యం చాలదు. ఆత్మహత్య వార్త బయటకు రాగానే పుల్‌ అనుచరులు మంత్రుల యిళ్లపై దాడి చేసి ఫర్నిచర్‌ విరక్కొట్టారు. వాళ్ల మూడ్‌ గమనించిన ముఖ్యమంత్రి అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఇది భావోద్వేగాలకు సంబంధించిన సమస్య అయిపోయింది.

గెలుపోటములను నిబ్బరంతో స్వీకరించే లక్షణం రాజకీయ నాయకులకు సహజంగా వుంటుంది. దశాబ్దాలుగా అనుభవిస్తూ వచ్చిన మంత్రి పదవి పోగొట్టుకుని, 20 ఏళ్లకు పైగా వున్న పార్టీలోంచి బహిష్కరించబడిన కష్టసమయంలో పుల్‌ మానసికంగా తట్టుకున్నాడు. టుకీకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ వచ్చాడు. చివరకు బిజెపితో బేరాలాడుకుని, గవర్నరు సహాయంతో అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిపోయాడు. అయితే అది ఐదునెలల ముచ్చటైంది. అలా వచ్చిన పదవి శాశ్వతమని ఎలా భ్రమించాడో తెలియదు.  సుప్రీం కోర్టు తీర్పు రాగానే ''ఇది అన్యాయం. టుకీకి మెజారిటీ నిరూపించుకునే అవకాశం యివ్వకపోవడం తప్పయితే, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకున్న నన్ను తొలగించడం కూడా అన్యాయమే'' అని వాపోయాడు యితను, మొదటి తప్పు కారణంగానే తనకు గద్దె దక్కిందన్న విషయం మర్చిపోయి. తీర్పు రాగానే తన పక్షాన మెజారిటీ సభ్యులున్నారని మీడియాకు ప్రదర్శించి తనకు ఢోకా లేదనుకున్నాడు. కానీ కాంగ్రెసు చురుగ్గా వ్యవహరించి, కాళ్ల కింద తివాచీ లాగేసింది. చివరిదాకా వేచి చూసి గత్యంతరం లేక అందరి కంటె ఆఖరున మళ్లీ పార్టీలో చేరాడు. వేరేవారిని ముఖ్యమంత్రిగా ఒప్పుకోవలసి వచ్చింది. అది అతన్ని కృంగదీసింది.

నిజానికి పుల్‌ జీవితమంతా ఎగుడుదిగుళ్లే. అతనికి ఏడాదిన్నర వయసులో తల్లి పోయింది. 11 ఏళ్ల వయసులో తండ్రి పోయాడు. బంధువుల యిళ్లలో పెరుగుతూ వడ్రంగం పని నేర్చుకున్నాడు, పిల్లలకు పాఠాలు చెప్పాడు, వాచ్‌మన్‌గా పనిచేశాడు, కిళ్లీ కొట్టు పెట్టుకున్నాడు, వెదురు కంచెలు కట్టే వ్యాపారం చేశాడు, మేస్త్రీగా పనిచేశాడు. ఇవన్నీ చేస్తూనే డిగ్రీ చేశాడు. కాలేజీలో చదువుతూండగానే రాజకీయాల్లో చురుగ్గా పనిచేశాడు. అతని తెలివితేటలు చూసి, కాంగ్రెసు పార్టీ అతన్ని సభ్యుడిగా చేర్చుకుని 1995లో ఎమ్మెల్యే టిక్కెట్టు యిచ్చింది. నెగ్గాడు. అక్కణ్నుంచే నాలుగు సార్లు నెగ్గాడు. ఎప్పుడూ ఏదో ఒక మంత్రి పదవి అనుభవిస్తూనే వచ్చాడు. పన్నులు, ఎక్సయిజ్‌ మంత్రిత్వ శాఖల్లో పనిచేశాడు. 2003లో గెగాంగ్‌ అపాంగ్‌ ముఖ్యమంత్రి ఐనప్పుడు 34 ఏళ్ల వయసులోనే యితను ఆర్థికమంత్రి అయి నాలుగేళ్ల పాటు ఆ పదవి నిర్వహించాడు. అతని తర్వాత ముఖ్యమంత్రి ఐన దోర్జీ ఖండూ ముఖ్యమంత్రిగా వుండగా మళ్లీ 2011 వరకు అదే పదవిలో వున్నాడు. ఖండూ ప్రమాదంలో చనిపోగా గామ్లిన్‌ ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే నబామ్‌ టుకీ అతనిపై తిరుగుబాటు చేసి ఆర్నెల్లలోనే దింపేసి 2011 అక్టోబరులో ముఖ్యమంత్రి అయిపోయాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నబామ్‌ టుకీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక పుల్‌కి ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ దక్కింది. ఎప్పటికైనా యితను తనకు పోటీదారు అవుతాడని గ్రహించిన టుకీ అతని స్థాయిని తగ్గించాడు. కానీ పుల్‌కి ముఖ్యమంత్రి అయితీరాలనే పట్టుదల. తన శాఖ ద్వారా చాలా పనులు చేపట్టి, దానికి నిధులివ్వటం లేదని ముఖ్యమంత్రిని విమర్శించసాగాడు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని విమర్శలు గుప్పించసాగాడు.

పుల్‌కు మంచి పదవి యిచ్చి ప్రోత్సహించిన అపాంగ్‌ 2010లో వెయ్యి కోట్ల అవినీతి కుంభకోణంలో చిక్కుకున్నాడు. బిజెపి అతన్ని 2014 ఫిబ్రవరిలో తమ పార్టీలో చేర్చుకుంది. అతను తనకు సన్నిహితుడైన పుల్‌ ద్వారా కాంగ్రెసులో ముసలం పుట్టించడానికి శతథా ప్రయత్నించాడు. కాంగ్రెసును చీలిస్తే బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రిని చేస్తానని ఆశ కల్పించాడు. ఇదంతా తెలిసిన టుకీ, పుల్‌ను కట్టడి చేయడానికి ప్రయత్నించాడు. 2014 డిసెంబరులో కాబినెట్‌ నుంచి తీసేశాడు. పుల్‌ ఢిల్లీ వచ్చి పార్టీ హై కమాండ్‌తో మొర పెట్టుకోబోతే వినే నాథుడు లేకుండా పోయాడు. అప్పణ్నుంచి పుల్‌ 'టుకీ హయాంలో అవినీతి పెరిగిపోయింది' అంటూ ప్రచారం మొదలుపెట్టి ఢిల్లీ వచ్చి జాతీయ మీడియా దగ్గరకు కొన్ని దస్తావేజులు యిచ్చి, అరుణాచల్‌పై కథనాలు రాయమని కోరాడు. అలా అందుకున్న ''ద వైర్‌'' ప్రతినిథి అతని మృతి తర్వాత కథనం రాస్తూ ''అతను చేసిన ఆరోపణలకు, చూపిస్తున్న ఆధారాలకు ఎక్కడా పొంతన కుదరలేదు. అందుకనే రాయలేదు.'' అని రాసింది. అవినీతి మాట ఎలా వున్నా, 20 ఏళ్ల పాటు తమ పార్టీ తరఫున మంత్రి పదవులు అనుభవించిన వ్యక్తి దాని గురించి బహిరంగంగా మాట్లాడడం పార్టీకి రుచించలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డావంటూ 2015 ఏప్రిల్‌లో షో కాజ్‌ నోటీసు కూడా యివ్వకుండా ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో యితను పార్టీపై, టుకీపై పగబట్టాడు. అది గ్రహించిన బిజెపి అతన్ని దువ్వింది. టుకీ మూర్ఖంగా, నియంతలా వ్యవహరించడం వారి పనిని సులభతరం చేసింది. 

ఆ తర్వాత కాంగ్రెసులో టుకీ వ్యతిరేకులందరినీ పోగు చేసి గవర్నరు సాయంతో అతని ప్రభుత్వాన్ని పడదోసి, బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి అయిపోయాడు. అమ్మయ్య చిరకాల వాంఛ నెరవేరింది అని ఆనందిస్తూండగా సుప్రీం కోర్టు తీర్పు అశనిపాతంలా వచ్చిపడింది. బిజెపి ఏదో చిట్కా వేసి తనను బయటపడేస్తుందని ఆశ పెట్టుకుంటే ఆశ నిరాశ అయింది. సుప్రీం కోర్టు తీర్పుపై అప్పీలుకి వెళదామని సూచించినా బిజెపి స్పందించలేదు. ఎందుకంటే, ఉత్తరాఖండ్‌లో, అరుణాచల్‌లో కేంద్రం వ్యవహరించిన తీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా పుల్‌ని యింకా సమర్థిస్తూ పోతే పరువు పోతుందని వారు భయపడ్డారు. ''మా పార్టీలో చేరిపో. ఎప్పటికైనా విజయం సాధిస్తాం.'' అని చెప్పారట. అయితే పుల్‌ ఎటూ తేల్చుకోలేకపోయాడు. చిన్నప్పణ్నుంచి ఎదిగిన కాంగ్రెసులో న్యాయం జరగలేదన్న ఫీలింగు, బిజెపి మాటలు నమ్మి మోసపోయానన్న ఫీలింగు. పదవి పోయినా అధికార నివాసం ఖాళీ చేయలేదు. దానిలోనే ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ఆ గదిలో ''మేరే విచార్‌'' (నా ఆలోచనలు) అనే 60 పేజీల పుస్తకం దొరికిందట. దానిలో రాష్ట్రంలో అవినీతి గురించి రాశాడట. సూసైడ్‌ నోట్‌ రాశాడని ఓ పోలీసు అధికారి అన్నాడట కానీ అలాటిది ఏదీ దొరకలేదని ప్రభుత్వం, అధికారులు అంటున్నారు. 47 ఏళ్ల వయసుకే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి యీ మాత్రం దానికే నిరాశ, నిస్పృహలకు గురై ఆత్మహత్య చేసుకోవడం ఒక విషాదం.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?