Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: మాయాబజార్‌కు 60 ఏళ్లు- 2

అసలు ఈ సినిమాయే తీద్దామని ఎందుకనుకున్నారు? దీని నేపథ్యం ఏమిటి? మూకీగా 1925లో బాబూరావ్‌ పెయింటర్‌ 'మాయాబజార్‌ ఉరఫ్‌ సురేఖా హరణ్‌' అనే పేరుతో ఓ సినిమా తీశారు. టాకీలు వచ్చాక 1932లో హిందీలో ఇదే పేరుతో విడదలయింది. ఆ తర్వాత చాలా వెర్షన్లు వచ్చాయి. 1935లో ఆర్‌.పద్మనాభం అనే ఆయన తమిళంలో 'మాయాబజార్‌ ఉరఫ్‌ వత్సలా కల్యాణం' అనే పేరుతో సినిమా తీశాడు. మరుసటి ఏడాది అంటే 1936లో తెలుగులో మాయాబజార్‌ సినిమా తయారయింది. పి.వి.దాసుగారు తీశారు. శాంతకుమారి హీరోయిన్‌. అంటే శశిరేఖ అన్నమాట.   ఆ తర్వాత మాయాబజార్‌ హిందీ, మరాఠీ భాషల్లో వచ్చినా తెలుగులో మళ్లీ రాలేదు. మనమే తీస్తే బాగుంటుంది అనుకున్నారు. 

'దొంగరాముడు' సినిమా అయిపోయిన తర్వాత కెవి రెడ్డిగారు మాయాబజారుపై పని మొదలెట్టారు. ప్రతిష్ఠాత్మకమైన సినిమాగా రూపొందించాలన్న తపన. పింగళిగారిచేత స్క్రిప్టు రాయించారు. బోలెడన్ని పాత్రలు. హేమాహేమీలైన నటీనటులు. అందరికీ ప్రాముఖ్యత ఉండాలి. స్క్రిప్టు రాసుకోవడమే ఏడాది పట్టింది. ఒక్కో పాత్రకు ఒక్కో రకంగా ఆహార్యం, ఆర్ట్‌ డైరక్టర్‌ మాధవపెద్ది గోఖలే గారిచేత స్కెచెస్‌ వేయించుకుని తయారుచేసుకున్నారు. కృష్ణుడి వేషానికి అప్పటిదాకా వచ్చిన సినిమాల్లో సగం కిరీటమే ఉంటుంది. హాఫ్‌ క్రౌన్‌, పక్కన నెమలి ఈకలు. అది వీధి భాగవతుల కాలంనుంచీ వస్తున్న పద్ధతి. కెవి అది మార్చేశారు. ఫుల్‌ క్రౌన్‌ పెట్టించి, పైన నెమలిఈకల గుత్తి పెట్టారు. ఎందుకంటే ఎన్టీ రామారావు చేత కృష్ణుడి వేషం వేయిద్దామని అనుకున్న తర్వాత ఈ లోపున ఓ సినిమా రిలీజయింది. ఘంటసాల గారి సొంత సినిమా ''సొంతవూరు''. అందులో అంతర్నాటకంలో రామారావు కృష్ణుడి వేషం వేస్తే, జనాలు ఈలలు వేసి గోల చేశారట. అందుకని మోడల్‌ మార్చేసినట్టున్నారు. అలాగే ఘటోత్కచుడు. ఇదివరకు సినిమాల్లో భయంకరంగా కనబడేవాడు. రాక్షసుడు కదాని వాళ్ల ఉద్దేశం. ఈ మాయాబజారులో ఘటోత్కచుడు ఎంత గ్లామరస్‌గా కనబడతాడో చూడండి.  మాయాబజార్‌ థీమ్‌ అభిమన్యుడి పెళ్లి. అయినా అతని తండ్రికూడా పెళ్లికి హాజరయినట్టు చూపలేదు. తండ్రి, పెదతండ్రి, బాబాయి - ఎవరూ లేకుండా పెళ్లి అయిపోతుంది. కానీ ఆ లోపం స్ఫురించనీయకుండా తీశారు సినిమాని. పాండవులని చూపించనక్కరలేకుండానే కథ లాగించేశారు. మరి 1936 నాటి మాయాబజార్‌లోనే యిలా వుందా? వీళ్లేమైనా మార్పులు చేశారా? అనే సందేహం నాకెప్పుడూ వుంది. ఆ సినిమా కాపీ దొరకటం లేదు. చూసిన వారికి గుర్తూ లేదు.  

షూటింగు ప్రారంభించబోతారనగా నిర్మాతలకు సందేహాలు వచ్చాయి. పెద్ద సెట్టింగులు, భారీ తారాగణం, కెవి హంగామా చూస్తూంటే సినిమా ఎక్కడికి తేలుతుందో అన్న భయం పట్టుకుంది నాగిరెడ్డికి, చక్రపాణికి. మామూలు సినిమా 10, 12 లక్షల్లో అయిపోతుంది. ఇది చూస్తూంటే 25,30 దాటేట్టు ఉంది. ఇంతా చేసి సినిమా ఫట్‌ మంటే!? అలా అని సినిమా తీయమని అంటే కెవి రెడ్డితో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే! ఎలా? కాస్త ఆలోచించి 'ప్రస్తుతానికి ఆపండి. తరువాత సంగతి తరువాత చెబుతాం' అని ప్రొడక్షన్‌ మేనేజర్‌ చేత కబురు పెట్టించారు నిర్మాతలు. ఈ వార్త విని కెవి హతాశులయిపోయారు. ఎంతో మనసు పెట్టి తయారుచేసుకున్న ప్రాజెక్టు ఈ దశలో ఎబార్ట్‌ చేయడం బాధ కలిగించింది. జబ్బు పడినట్టు అయిపోయారు. మాయాబజారు ఆగిపోయినట్టు ఇండస్ట్రీలో వార్తలు వ్యాపించాయి. మాయాబజారు సినిమాకై కెవి సర్వం సిద్ధం చేసుకున్నారనీ, కానీ నాగిరెడ్డి, చక్రపాణి వెనుకంజ వేస్తున్నారని తెలియగానే ఇండస్ట్రీ పెద్దలు ముందుకు వచ్చారు. ఎవిఎమ్‌ చెట్టియార్‌ గారినుండి ఆఫర్‌ - 'కెవితో చెప్పండి. మాయాబజార్‌ మనకు తీయమనండి. అడిగినంత రెమ్యూనరేషన్‌. నా స్టుడియోలో తీయాలన్న షరతు లేదు. ఖర్చు విషయంలో నా ప్రమేయం ఏమీ ఉండదు. ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.' అని. సుందర్‌లాల్‌ నహతా అని డిస్ట్రిబ్యూటర్‌ ఆయన దగ్గర్నుంచి మరో ఆఫర్‌. ఇంకో ఇద్దరు అరవ నిర్మాతలనుండి కూడా అలాటి ప్రపోజల్సే. అందరికీ ఒకటే సమాధానం - 'ఒప్పందం ప్రకారం విజయావాళ్లకే చేస్తాను. కోట్లు ఇచ్చినా ఇతరులకు చేయను.' అని. అదీ కెవి నిబద్ధత! సినిమా తీసే ప్రతిభ ఉండడం ఒక యెత్తు. ఇలాటి వ్యక్తిత్వం గలిగివుండడం మరో యెత్తు. ఇవన్నీ వింటున్నా నాగిరెడ్డి, చక్రపాణిలో చలనం లేదు. ఇంత భారీగా సినిమా తీయడం అవసరమా అన్న మీమాంసలోనే ఉన్నారు వాళ్లు. మరి చిక్కుముడి విడేదెలా?

అక్కినేని నాగేశ్వరరావు గారి ద్వారా ఆ చిక్కుముడి వీడింది. కెవి నాగేశ్వరరావుగారి సొంత సినిమా 'దొంగరాముడు' హిట్‌ చేసి పెట్టారు. ఇంత ఫీజు అని నిబంధన పెట్టలేదు. ఎంత ఇచ్చినా పుచ్చుకుంటానన్నారు. అలాటి కెవి పడుతున్న మనోవ్యథ గమనించారు అక్కినేని. విజయావాళ్లను కదిలేసి చూద్దామని ఓ ఠస్సా వేశారు. మాయాబజారు అభిమన్యుడి వేషానికి నాగేశ్వరరావుని అనుకున్నారు కదా. ఆ సందర్భం పెట్టుకుని నాగేశ్వరరావు విజయావాళ్ల దగ్గరకు వెళ్లి ''మీరు నన్ను అభిమన్యుడిగా వేయమని చెప్పారు. బాగుంది. చాలా నెలలు గడిచినా సినిమా తీయటం లేదు. ఈలోగా ఓ అరవ నిర్మాత వచ్చి మాయాబజార్‌ తీస్తాననీ, నన్ను అభిమన్యుడిగా వేయమనీ అడిగాడు. మిమ్మల్ని ఓ మాట అడిగి చెప్తానని అతనికి చెప్పాను. ఏం చెప్పమంటారు?'' అని అడిగారు. నాగిరెడ్డి, చక్రపాణికి ఏం చేయాలో తోచలేదు. ''ఓ నాలుగురోజులు వెయిట్‌ చేయి'' అని నాగేశ్వరరావుకి చెప్పి ఆలోచనలో పడ్డారు. థీమ్‌ బాగుంటుందనే కదా వాళ్లంతా మాయాబజార్‌కోసం ఎగబడుతున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే  మన స్టార్స్‌ జారిపోవచ్చుకదా. ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి. కానీ ఖర్చు మాటో!? తట్టుకోగలమా? పంతానికి పోయి సినిమా తీస్తే మునుగుతామా? ఓ మధ్యవర్తిని పిలిచారు. ''కెవి దగ్గరకి వెళ్లి సినిమా మొత్తం ఎంత అవుతుందో మాకు ఖచ్చితంగా చెప్పాలి. అని చెప్పు.'' అని చెప్పించారు. కెవి టెక్నీషియన్లందర్ని కూచోబెట్టుకుని కరక్టుగా లెక్కవేశారు. ప్రొడక్షన్‌ మేనేజరుగా వర్క్‌ చేసిన ఘటమాయె! మొత్తం అన్నీ వేశాక, 'ఇదిగో ఇదీ ఖర్చు. దీనికి పైన ఒక్క నయాపైస ఖర్చు అయినా నేను చేతిలోంచి పెట్టుకుంటాను.'' అని హామీ ఇచ్చారు. ఆ లెక్కలు చూసి నిర్మాతలు ఖర్చుకు సిద్ధపడ్డాకనే మాయాబజారు నిర్మాణం ప్రారంభమయింది. అలా తయారయిన సినిమా పూర్తయి 1957 నాటికి రిలీజయింది. ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. సినిమా తీస్తున్నప్పుడు కూడా కెవి మధ్య, నిర్మాతల మధ్య కాస్త పొరపొచ్చాలు వచ్చాయి. కానీ కెవి ఓర్చుకున్నారు. ఓర్చుకున్నారు కాబట్టే మనకో మహత్తర చిత్రం అందింది. 

భారతం ప్రకారం అభిమన్యుడి భార్య ఉత్తర. వాళ్ల కొడుకు పరీక్షిత్తు. ఈ శశిరేఖ గురించి, ఆవిడ పిల్లల గురించి ఏమీ ఉండదు. భారతంలో పాత్రలతో యీ సినిమా కథ నడిపించారు. బలరాముడు, కృష్ణుడు అన్నదమ్ములు. వాళ్ల చెల్లెలు సుభద్ర. బలరాముడి భార్య రేవతి. కూతురు శశిరేఖ. కృష్ణుడి భార్య రుక్మిణి. కథకు అవసరం లేదు కాబట్టి సత్యభామను చూపించలేదు. శశిరేఖ పుట్టినరోజు పండక్కి సుభద్ర తన కొడుకు అభిమన్యుడిని వెంటబెట్టుకుని వచ్చింది. ఇన్ని పాత్రలు ప్రేక్షకుడికి ఇంట్రడ్యూస్‌ చేయడం ఎలా? సింపుల్‌గా పుట్టినరోజు ఫంక్షన్‌లో ఓ పాట పెట్టేశారు. శశిరేఖను ఉద్దేశించి ఆ పాట. నీ తల్లి రేవతీదేవి. ఇదిగో నీ బావ అభిమన్యుడు అంటూ.. అలా పాడుతూనే పాత్ర స్వభావాలు కూడా మనకు చెప్పారు. 'అడుగకే వరము లిడు బలరామదేవులే జనకులై..' అని. కథకు మూలం అదిగో, ఆ బలరామదేవుల వరాలే! ఆయన ఇద్దరికి వరాలు ఇస్తాడు. వరం ఒక్కటే - కూతురు శశిరేఖను ఇచ్చి పెళ్లి చేస్తానని! వేర్వేరు సమయాల్లో ఇస్తాడనుకోండి. మొదటివరం వల్ల కథ సుఖాంతం కాబోయి, రెండవ వరం వల్ల మలుపు తిరుగుతుంది. మొదటివరం చెల్లెలు సుభద్రకు. రెండవది దుర్యోధనుడికి. రెండింటిలోనూ పేరంట్స్‌కి మాట ఇవ్వడమే తప్ప పెళ్లి కొడుకుల చేతిలో కూతురు చెయ్యి పెట్టి ప్రామిస్‌ చేయడం ఉండదు. అందువల్ల ఆ మాటలు చివరకు గట్టున పెట్టినా ఔచిత్యభంగం కలగదు. మొదటివరం ఇచ్చిన సందర్భం ఏమిటంటే అభిమన్యుడి ప్రతాపం చూసి ముచ్చటపడి అల్లుణ్ని చేసుకుంటానని చెల్లెలుకు చెప్పడం. అది పిల్లల చిన్నప్పటి ముచ్చట. వాళ్లు పెద్దవాళ్లయేటప్పటికి పాండవులు తమ విభవాన్ని కోల్పోతారు. కౌరవులను దండిద్దామని వచ్చిన బలరాముడు వాళ్ల ఉచ్చులో పడి దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణకుమారుడికి తన కూతుర్ని ఇస్తానని చెప్పి రెండో వరమిచ్చేస్తాడు. దాంతో గొడవలవుతాయి. సుభద్ర పుట్టింటినుండి బయటకు వచ్చేస్తుంది. కృష్ణుడి ప్లాను వల్ల ఘటోత్కచుడి వద్దకు  చేరుతుంది. ఘటోత్కచుడు కృష్ణుడి గైడెన్సులో శశిరేఖను ఎత్తుకువచ్చి అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు.

కథ ఇంతే అయితే మాయాబజారు సృష్టి అవసరమే లేదు. జరగవలసిన కార్యం శశిరేఖను కిడ్నాప్‌ చేసి తీసుకురావడంతో తీరిపోతుంది. శశిరేఖ కూడా సుముఖమే కాబట్టి పెళ్లి విషయంలో మలుపులకు ఆస్కారమే లేదు. మరి కథలో డ్రామా పుట్టాలంటే ఎలా? నీతి చెప్పాలంటే ఎలా? పిల్లల పెళ్లి జరగడమే కాదు, పెద్దలకు కనువిప్పు కూడా కావాలి. అప్పుడే కథకుడి లక్ష్యం నెరవేరుతుంది. అంతేకాదు, దుష్టులకు శిక్ష కూడా పడాలి. శకుని ఈ పెళ్లి ప్రపోజల్‌ చేయడం వెనుక ఓ రాజకీయ కుట్ర ఉంది. కృష్ణుడు పాండవపక్షపాతి అని సుభద్రా పరిణయం విషయంలోనే తెలిసింది. రేేపు జరగబోయే కౌరవపాండవ యుద్ధంలో కృష్ణుడు మళ్లీ వాళ్ల పక్షాన నిలవకుండా చేయాలంటే ఈ పెళ్లి జరగాలి. ఈ బంధుత్వం వల్ల బలరాముడు కౌరవుల పక్షాన నిలుస్తాడు. అతన్ని బట్టి కృష్ణుడూ ఇటే వుంటాడు. దానికోసం లక్ష్మణకుమారుణ్ని కష్టపడి ఒప్పించాడు శకుని. ఆ విషయం బలరాముడికి తెలియాలి. తెలిస్తేనే వీళ్ల మీద కోపం తెచ్చుకుని, తన కూతుర్ని కిడ్నాప్‌ చేసినవాళ్లని క్షమిస్తాడు. అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ కౌరవుల కుతంత్రం గురించి బలరాముడికి అర్థం కావడం ఎలా? ఎవరైనా చెబితే వినే రకం కాదు. అతనంతట అతనికే బోధపడాలి. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో  ఏ శివుడో ప్రత్యక్షమయి 'ఇదీ సంగతి' అని చెప్పాల్సివస్తుంది. అది బీటెన్‌ ట్రాక్‌. అలాక్కాకుండా సత్యపీఠం ఐడియా దీనికోసమే సృష్టించారు. విలన్‌ అయిన శకుని చేతనే కన్ఫెస్‌ చేయిస్తే బలరాముడు నమ్మక తప్పదు. ఆ రివీలిషన్‌ క్లయిమాక్స్‌లో రావాలి. 

అలా అని క్లయిమాక్స్‌లో హఠాత్తుగా సత్యపీఠం ఎక్కణ్నుంచో పుట్టుకువస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. అందువల్ల సినిమా మొదట్లోనే సత్యపీఠం పరిచయం చేశారు. రాజసూయయాగం సందర్భంగా ధర్మరాజు బలరాముడికి పంపిన కానుక అని చెప్పించి దాన్ని పూజాగృహంలో పెట్టమన్నారు. దాన్ని సాత్యకి క్లయిమాక్స్‌లో పట్టుకొచ్చి శకునిని ఎక్కమంటాడు. బలరాముడికి, రేవతికి కూడా ఆ పీఠం సంగతి మరుపున పడింది కానీ లేకపోతే మధ్యలోనే మాయా శశిరేఖనో, కృష్ణుడినో దాని మీద ఎక్కమని వుంటే కథ మరీ కాంప్లికేట్‌ అయిపోయి వుండేది. చెకోవ్‌ అంటాడు - 'కథ మొదట్లో గోడమీద తుపాకీ వుందని వర్ణించేమనుకోండి, కథ పూర్తయ్యేసరికి అది పేలాలి' అని. అలాగ ఈ సత్యపీఠం కూడా క్లయిమాక్స్‌ను నడపడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రియదర్శిని కూడా. పాత్రల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. శశిరేఖకు అభిమన్యుడు ఇష్టం అని ఎస్టాబ్లిష్‌ అవుతుంది. రేవతికి ఐశ్వర్యం ఇష్టం. బలరాముడికి దుర్యోధనుడు. ఇక్కడ జరిగే సంభాషణ గమనించండి. కృష్ణుడి ప్రియదర్శినిలో చూడడానికి సందేహిస్తూంటే వదినగారు మేలమాడుతుంది - 'ఈ మాత్రానికి రుక్మిణి ఏమీ అనుకోదు గానీ, చూడవయ్యా కృష్ణా' అని. భర్తకు తనే అత్యంత ప్రియమైనదని అనిపించుకోవాలని ప్రతి భార్యకూ ఉండడం సహజం. తను కాక అర్జునుడు కనబడినా ఆమెకు బాధే! కొంపదీసి ఏ సత్యభామో కనబడితే మరీ ముప్పు! అందుకే వదినగారు మరిదితో జోక్‌ చేసింది.

అలాగే తోటికోడళ్ల మధ్య సరసం. రేవతికి నగలు కనబడతాయి. 'నాకలాంటి ఆశలు లేవు. ఎందుకలా కనిపించిందో ఏమో!' అనేస్తుంది రేవతి గడుసుగా. కానీ తోటికోడలు రుక్మిణి రొక్కిస్తుంది 'ఊరికే అలా కనిపించదులే అక్కయ్యా' అంటూ అప్పటికప్పుడు అర్జంటుగా కన్ఫెషన్‌ తీసుకోవాలన్నట్టు. దానికి రేవతి 'నువ్వు నా చెంతనే వున్నావు. నువ్వు కోరుకున్నది నాకు కనిపించిందేమో' అని అంటిస్తుంది. అలాగే ఇంకో సన్నివేశంలో - రుక్మిణి శశిరేఖ తరఫున ప్లీడ్‌ చేస్తుంది, 'మనం పెట్టిన ఆశలేగా! అభిమన్యుణ్ని కాకుండా వేరేవాళ్లకు కట్టబెడితే అమ్మాయి ఏం సుఖపడుతుంది?' అని. అప్పుడు రేవతి ఫట్‌ మని సమాధానం చెబుతుంది - 'కూతురి సుఖం కన్నతల్లి కంటె నీకు ఎక్కువ తెలుసా? ఒక్క కూతుర్ని కనివుంటే తెలిసేది - ఈ నీతులేమయ్యేవో!' అని. అచ్చు మన ఇంట్లో సంభాషణల్లా లేవూ! అందుకే మాయాబజార్‌ మనకంత ఆత్మీయంగా అనిపిస్తుంది. ఇక్కడ ఓ విషయం గమనించండి. రుక్మిణికి కూతురు లేదన్న పౌరాణిక సత్యాన్ని చక్కగా, సమయోచితంగా వాడుకున్నారు. ఇలాగే శకుని బలరాముడికి పాండవుల మీద చాడీలు చెప్పేటప్పుడు అంటాడు - 'ఆ భీముడు రౌద్రాకారం తాల్చి ప్రతిజ్ఞలు చేశాడు - బలరాముడి ఎదుటే ఈ దుర్యోధనుడి తొడలు విరగ్గొడతాను అని.' అన్నాడు.

నిజానికి భీముడు కురుసభలో అలా అనలేదు. కురుక్షేత్రయుద్ధంలో పాల్గొనని బలరాముడు చివర్లో వస్తే అతడిని రిఫరీగా పెట్టుకుని గదాయుద్ధం జరుగుతుంది. సరే ఇదంతా కథాకాలం నాటికి భవిష్యత్తు. అయినా ఆ వాస్తవాన్ని సమయానుకూలంగా వాడుకున్నారు. అలాగే ఇంకో చోట బలరాముడు అంటాడు - 'ప్రజ్ఞావంతులని చూస్తే మా కృష్ణుడు ఎప్పుడూ ఉలికి పడుతూనే ఉంటాడు.' అని. అది కూడా నిజమే కదా. ఎవరైనా మరీ బలవంతులైతే వాళ్లు దుర్మార్గులుగా మారిపోతారని ఎక్కడికక్కడ వాళ్లని అరికట్టడమే కృష్ణావతార రహస్యం అంటారు. అందుకనే మేనల్లుడైనా చూడకుండా అభిమన్యుడిని చంపించి వేస్తాడు. ఘటోత్కచుణ్నీ, ఘటోత్కచుడి కొడుకునీ కూడా! ఆ అవతార స్వభావాన్ని సందర్భోచితంగా చెప్పించారు.

సినిమా ఎంజాయ్‌ చేయాలంటే కాస్త పౌరాణిక జ్ఞానం ఉంటే బాగుంటుంది. బలరాముడు తన భార్య విల్లంబులు పట్టుకువస్తూంటే 'కృష్ణా, ఆ ధనుర్బాణాలు ధరించి నిల్చుంటే, మీ వదిన అపర త్రిపురసుందరివలె లేదూ?' అని జోక్‌ చేస్తాడు.  అలాగే రాజసూయయాగం బ్రహ్మాండంగా జరిగిన సంగతి వింటూంటే 'ఇంద్రవైభవం అంతా అక్కడే వుంది' అంటుంది రేవతి. 'అవును, ఇంద్రుడి కొడుకే వున్నాడక్కడ!' అంటుంది రుక్మిణి. ఇంద్రుడి కొడుకు అర్జునుడు. అతనక్కడ ఉన్నాడు కాబట్టి ఇంద్రవైభవం ఉండడం సహజమని అర్థం. కృష్ణుడు శకునితో అంటాడు - 'తమరు ధర్మాత్ములు కారని తేలినా అన్నగారితో చిక్కేనే!' అని. భారతం ప్రకారం కూడా బలరాముడు మహా కోపిష్టి. కృష్ణుడిలా లౌక్యం తెలియనివాడు. విరుచుకుపడి చితక్కొట్టేరకం. ఇక్కడ యింకో మాట కూడా చెప్పాలి. బలరాముడు భారతంలో చివరిదాకా కౌరవపక్షపాతే. ఈ మాయాబజారు కథ నిజమే అయి వుంటే తన కూతురి విషయంలో మోసం చేయబోయిన కౌరవులను క్షమించేవాడా?

ఇలా పురాణాలను ఉపయోగించుకుంటూనే కొన్ని చోట్ల స్పెసిఫిక్‌గా చెప్పకుండా జాగ్రత్తపడ్డారు. దుర్యోధనుడు బహుమతిగా పంపిన నగలు చూస్తూ రేవతి 'ఈ పతకం ఒక్కటే పదిలక్షలు చేస్తుంది' అంటుంది. పదిలక్షలు కరెన్సీ ఏమిటి? రూపాయలా? వరహాలా? మరోటా? చెప్పకుండా దాటేశారు. మాయాబజారు రచయిత మిమ్మల్ని పురాణాలు చదివి తీరాలని బలవంత పెట్టడు. ఆ మాట కొస్తే శాస్త్రాలూ చదవమనడు. శాస్త్రాలను పట్టుకుని వేలాడేవాణ్ని వెక్కిరిస్తాడు కూడా. లంబు జంబు చిన్నమయతో అంటారు - 'నీ శాసతరం సొంత తెలివి లేనివాళ్లకి. మాకు కాదు.' అని. మాయాబజారు మెయిన్‌డోర్‌ ఎటు పెట్టాలన్న సమస్య వచ్చినపుడు దేవుడిచ్చిన తెలివి తేటలు ఉపయోగించకుండా 'అది ఉత్తరదిశ వాస్తు శాస్త్రం ఒప్పుకోదు' అంటాడు చిన్నమయ. వచ్చేవాళ్లు ఎంటరయేది అటునుంచి కాబట్టి ద్వారం అటే వుండాలని శిష్యులు అంటారు. అదే కరక్టు కదా! వాస్తు కంటె కన్వీనియన్స్‌ చూసుకోవాలి. ఈ పండితులు కూడా తమాషావాళ్లు. మరీ గట్టిగా రొక్కిస్తే ఏదో వంద ఇళ్లుంటే వాస్తు చూడక్కరలేదని ఏదో మినహాయింపు చెప్పేస్తారు. అంతా ఎదరున్న పార్టీ బట్టి ఉంటుంది. వీళ్లకీ ఓ చురక వేశాడు పింగళి. 

శశిరేఖ పెళ్లి ముహూర్తం బాగాలేదని నిజాయితీపరుడైన ఓ పండితుడు అంటూ ఉంటే రాజాశ్రితులైన పండితులు దానికి వేరేలా వ్యాఖ్యానం చెప్పేస్తారు. వధూవరుల మధ్య కలహం వస్తుందని ఆ పండితుడు అంటే ప్రణయకలహం అనేస్తారు వీళ్లు. కష్టం వస్తుందంటే బహుసంతాన ప్రాప్తి అని అర్థం తీస్తారు. గాంధారి వందమందిని సాకింది కదా బహుసంతానం వలన రాజులకు కష్టం ఏమిటి నా మొహం! పండితుల్ని అని ప్రయోజనం లేదు. ఆ హిపాక్రసీ మనలోనే ఉంది. అలాగే అక్కడ శకుని కూడా బలరాముడితో సంబంధం కలుపుకుందామని చూస్తూంటే ఈ చాదస్తం పండితుడు సంబంధం చెడగొట్టేట్లా ఉన్నాడ్రా అనుకుంటాడు. అనుకుని 'మీ శాస్త్రాలు సామాన్యులకోసం. మా కౌరవుల వంటి అసాధారణ అపూర్వ జాతకులకు కాదు.' అని అతన్ని వెళ్లగొట్టేస్తాడు. 

మీరు జాగ్రత్తగా గమనించండి. శకుని పెట్టించుకుని వచ్చిన ముహూర్తాన్ని శంకుతీర్థులవారు 'వధూమణి గారి జాతకరీత్యా గ్రహచారం చూస్తున్నా. ఈ లగ్నాన్ని రాక్షసగణాచారియైన శుక్రుడు వక్రదృష్టితో పరికిస్తున్నాడు. ఇందువల్ల వధూవరులకు కలహాలు, కష్టాలు కలగవచ్చు' అంటాడు. పైగా 'ఇది దగ్ధయోగం. ఈ లగ్నంలో అసలు వివాహమే జరగదని శాస్త్రం.' అని కూడా అంటాడు. నిజానికి అదే ముహూర్తానికి శశిరేఖ పెళ్లి అవుతుంది. అదీ ఓ రాక్షసుడి ఇంట్లో. అతని ఆధ్వర్యంలో! రచయిత అన్యాపదేశంగా ఇచ్చే సందేశం ఇదే! మరీ చాదస్తాలకు పోకండి అని. 'పాండిత్యం కంటె జ్ఞానం ముఖ్యం' అని ఘటోత్కచుడి చేత చెప్పిస్తాడు. అతని భటులు మాటలు సరిగ్గా పలకలేకపోతే వాళ్ల గురువు దండిస్తూంటాడు. అప్పుడు ఘటోత్కచుడు కలగజేసుకుని చిలకపలుకులు వల్లించడం కంటె అర్థం గ్రహించడం ముఖ్యం అని తీర్మానిస్తాడు. అలాగే 'రసపట్టులో తర్కం కూడదు' అనే మాట కూడా అక్షర లక్షల విలువ చేసేది. తెలివి ఉంది కదాని ప్రతీదానికీ బుర్ర అప్లయి చేయకూడదు. ఒక్కోప్పుడు హృదయంతో ఫీలయి ఊరుకోవాలి. హెడ్‌ అండ్‌ హార్ట్‌కి సంబంధించిన ఈ కోటబుల్‌ కోట్‌ను ఆ రెండిటినీ చక్కగా ఉపయోగించిన కృష్ణుడి నోట చెప్పించడం చాలా సముచితంగా ఉంది. (సశేషం)
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
mbsprasad@gmail.com