Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: ఒడిశాలో ఊపు మీదున్న బిజెపి - బిజెడిలో రగడ

ఏప్రిల్‌ 14, 15 శని, ఆదివారాల్లో బిజెపి ఒడిశాలోని భువనేశ్వర్‌లో జాతీయ ఎగ్జిక్యూటివ్‌ సమావేశం జరుపుకుంటోంది. ఫిబ్రవరిలో జరిగిన పంచాయితీ ఎన్నికలలో బిజెపి ఘనఫలితాలను సాధించడంతో మంచి వూపులో వుంది. గత నాలుగుదఫాలుగా నవీన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రిగా ఏలుతూ 2019లో కూడా మళ్లీ ఎన్నికవుతాడేమో అనుకుంటూన్న తరుణంలో మొత్తం 849 జిల్లా పరిషత్‌ జోన్లలో బిజెపి 294 వాటిల్లో గెలుపొందింది. ఒక అసెంబ్లీ స్థానంలో రమారమి ఆరు జిల్లా పరిషత్‌ స్థానాలుంటాయి కాబట్టి దీన్ని అసెంబ్లీ స్థానాలుగా అనువదిస్తే 49 అసెంబ్లీ స్థానాలైంది. బిజెడి నెగ్గిన 467 స్థానాలను బట్టి 78 వస్తాయనుకోవాలి. అదే లెక్కలో 60 గెలిచిన కాంగ్రెసుకు 10 వస్తాయనుకోవాలి. మొత్తం 147 స్థానాలు కాబట్టి 78 వస్తే బిజెడియే ఐదోసారీ అధికారం చేపడుతుంది. మరి బిజెపికి ఎందుకంత ఆనందం అంటే గతంలో 2014లో దేశం మొత్తం మోదీ ప్రభంజనం వూపేస్తూ వుండగా ఒడిశాలోని 21 పార్లమెంటు స్థానాల్లో బిజెపి ఒక్కటి మాత్రమే గెలిచింది. తక్కిన యిరవై బిజెడికే! దానితో బాటే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెడికి 117 రాగా, కాంగ్రెసుకు 16, బిజెపికి 10 వచ్చాయి. మూడేళ్లు తిరిగేసరికి జిల్లా పరిషత్‌ ఎన్నికలలో బిజెపి బలం దాదాపు 5 రెట్లు పెరిగినట్లే కదా! ఈ ఊపును మరింత బలంగా ముందుకు తీసుకుని వెళ్లి 2019లో అధికారాన్ని కైవసం చేసుకుందామని బిజెపి ప్రయత్నిస్తోంది. జిల్లా పరిషత్‌ ఎన్నికలలో ఓటమిని బిజెడి జీర్ణం చేసుకోలేకపోతోంది. దాని నాయకులు ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఇప్పటివరకు నవీన్‌ ఎవరి పక్షాన నోరు విప్పలేదు. అతని స్వభావమే అంత. 

70 ఏళ్ల నవీన్‌ ఒడిశాకు దశాబ్దాలపాటు నాయకుడిగా వెలిగిన బిజూ పట్నాయక్‌ కొడుకు. బిజూ కరిజ్మాటిక్‌ లీడర్‌, చొరవ ఎక్కువ. మొదట్లో కాంగ్రెసు నాయకుడిగా, తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా జాతీయ రాజకీయాల్లో కూడా ఒక వెలుగు వెలిగాడు. నవీన్‌, అతని తమ్ముడు హిమాంశు దెహరాదూన్‌లో, ఢిల్లీలో చదువుకున్నారు. ఒడిశా బయటే వుండడంతో ఒడియా రాదు. సభల్లో  ఒడియా ఉపన్యాసాన్ని రోమన్‌ లిపిలో రాసుకుని చదువుతాడు. హిందీ, ఇంగ్లీషు, ఫ్రెంచ్‌ భాషలు బాగా వచ్చు. పుస్తకరచయిత కూడా. 1997లో బిజూ పట్నాయక్‌ చనిపోయాడు. అప్పుడతను జనతా దళ్‌ పార్టీ నాయకుడిగా వున్నాడు. అతని అనుచరుల బలవంతం మేరకు నవీన్‌ అయిష్టంగా రాజకీయాల్లోకి రావలసి వచ్చింది. తండ్రి స్థానంలో ఆస్కా నియోజకవర్గం ఉపయెన్నికలో నెగ్గి పార్లమెంటుకి వెళ్లాడు. ఇతని విద్వత్తు చూసి నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ పాలకులు అనేక కమిటీల్లో స్థానం యిచ్చారు. పై ఏడాది నేషనల్‌ ఫ్రంట్‌, దానితో బాటు జనతా దళ్‌ విచ్ఛిత్తి కావడంతో నవీన్‌ తన తండ్రి పేర బిజూ జనతా దళ్‌ (బిజెడి) అని పార్టీ పెట్టి వాజపేయి నేతృత్వంలోని ఎన్‌డిఏలో భాగస్వామిగా మారాడు. కాబినెట్‌లో మంత్రిగా చేరాడు. 1999 అసెంబ్లీ ఎన్నికలలో బిజెడి-బిజెపి కూటమి జానకీ వల్లభ్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని కాంగ్రెసుపై ఘనవిజయం సాధించడంతో కేంద్రపదవికి రాజీనామా చేసి 2000లో ఒడిశా ముఖ్యమంత్రి అయ్యాడు. తన రాష్ట్రపు భాష రాని ముఖ్యమంత్రి అని అతన్ని ఎద్దేవా చేస్తారు. 

కానీ అతని మృదుస్వభావం, మితభాషిత్వం, నిరాడంబరత, అవినీతికి దూరంగా వుంటూ అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులను, అధికారులను దండిస్తాడనే యిమేజి ప్రజలకు దగ్గర చేసింది. తన తండ్రి పేర పార్టీ పెట్టినా మాటిమాటికీ తండ్రి పేరు స్మరించడు. అవివాహితుడు. తన బంధువులను, తన కులస్తులను చేరదీసి పదవులు యివ్వడు. మీడియాతో పెద్దగా మాట్లాడడు. సహజ వనరులు అనేకం వున్నా ఒడిశా అనేక విధాలుగా వెనుకబడిన ప్రాంతం.  రైతు ఆదాయం విషయంలో జాతీయ సగటు కంటె ఒడిశా రైతు ఆదాయం 20-25% తక్కువే వుంటుంది. తండ్రిలాగా పరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకుని, అధికారులను అదుపుచేస్తూ,  ప్రోత్సహిస్తూ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఏర్పరచాడు. పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు అనేకం చేపట్టాడు.  దారిద్య్ర రేఖ (బిపిఎల్‌) కంటె దిగువ వున్న 82 లక్షల కుటుంబాలను రేఖ పైకి తెచ్చామని అతని ప్రభుత్వం చెప్పుకుంటుంది.  దేశంలోని రైతు ఆత్మహత్యలలో 3-7% ఒడిశాలో జరుగుతున్నాయన్న అంశం ప్రతిపక్షం అసెంబ్లీలో ప్రస్తావించినపుడు సంబంధిత మంత్రి ఆ విషయం ఒప్పుకుంటూనే కానీ ఆ సంఖ్య ఎపి, యుపి, కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ల కంటె తక్కువని ఎత్తి చూపాడు. నిజానికి ఒడిశా మెల్లమెల్లగా ఎదుగుతూన్న విషయాన్ని ఎవరూ విస్మరించలేరు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు ప్రభుత్వస్పందన చాలా ప్రశంసనీయంగా వుంటోందన్న పేరు కూడా వచ్చింది. 2013 అక్టోబరులో ఫైలాన్‌ తుపాను వచ్చినపుడు 10 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రదేశాలకు సమర్థవంతంగా తరలించినందుకు యునైటెడ్‌ నేషన్స్‌ నవీన్‌ను సత్కరించింది. అప్పుడప్పుడు అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు వస్తూన్నా, పెద్దగా వివాదాల్లో చిక్కుకోకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ పోతున్నాడు నవీన్‌. 

అతని రాజకీయాలకు వస్తే 2004లో బిజెపితో కలిసి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి కాంగ్రెసును ఓడించి ఘనవిజయం సాధించాడు. అయితే సంకీర్ణ ప్రభుత్వం సరిగ్గా సాగలేదు. బిజెడి-బిజెపి మధ్య కీచులాటలు ప్రారంభమయ్యాయి. 2007-08 సం||లలో కంధమల్‌ జిల్లాలో బజరంగ్‌ దళ్‌ కార్యకలాపాలు, స్వామి లక్ష్మణానంద సరస్వతి హత్య కారణంగా సంఘటనలు కారణంగా చూపి, బిజెపిని మతతత్వ పార్టీ అని నిందిస్తూ నవీన్‌ ఎన్‌డిఏతో తెగతెంపులు చేసుకున్నాడు. అయితే యుపిఏతో చేతులు కలపలేదు. 2009 ఎన్నికలలో మూడో ఫ్రంట్‌కు మద్దతిచ్చాడు. ఒడిశాలో ఒంటరిగా పోటీ చేశాడు. 147 అసెంబ్లీ స్థానాల్లో 103, 21 పార్లమెంటు స్థానాల్లో 14 గెలిచాడు. బిజెపి తీవ్రంగా నష్టపోయింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యుపిఏ ఒడిశా కాంగ్రెసు నాయకుడు జానకీ వల్లభ్‌ను అసాం గవర్నరుగా నియమించింది. ఆయన 2015లో చనిపోయాడు. జానకీ వల్లభ్‌ అలా వెళ్లిపోయి కాంగ్రెసులో ప్రఖ్యాత నాయకుడు ఎవరూ లేకపోవడం, బిజెపికి రాష్ట్రస్థాయిలో పెద్ద నాయకుడు లేకపోవడం నవీన్‌కు కలిసి వచ్చింది. 2014 ఎన్నికలలో కళ్లు చెదిరే విజయాన్ని అందుకున్నాడు.

అది గ్రహించిన బిజెపి ఒడిశాలో తమ పార్టీ తరఫున కాబోయే ముఖ్యమంత్రిని ప్రొజెక్టు చేయడం మంచిదనుకుంది. ప్రస్తుతం కేంద్రమంత్రిగా వున్న ధర్మేంద్ర ప్రధాన్‌కు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానపాత్ర యిస్తోంది. దేశంలో బిజెపి ప్రాభవం పెరుగుతోంది కాబట్టి, కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగి జిల్లా పరిషత్‌ ఎన్నికలలో మంచి ఫలితాలు రాబట్టింది. కారణాలు విశ్లేషించిన పరిశీలకులు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెసు నాయకులు లేక, ఉన్నవారు అంతఃకలహాలలో మునగడమే అని తేల్చారు. 2016లో సిఎల్‌పి-పిసిసి నాయకులు రాష్ట్ర అధ్యక్ష పదవితో తన్నుకులాడుతూ వుంటే అధిష్టానం ఉదాసీనం వహించి సమస్యను పరిష్కరించలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెసుకు 20% ఓటు పడుతూ వుండేది. ఇప్పుడది యిగిరిపోయింది. దాంతో రంగంలో బిజెడి, బిజెపి మాత్రమే మిగిలాయి. బిజెడి అంటే పడని వారు, అధికార పక్షంలో అసమ్మతి నాయకుల అనుచరులు బిజెపిని ఎంచుకున్నారు. నరేంద్ర మోదీ ఆకర్షణ ఎటూ వుంది. 17 ఏళ్లగా ఏలుతున్న ప్రభుత్వంపై సహజమైన వ్యతిరేకతా వుంది. రేషన్‌ కార్డుల పంపిణీ సరిగ్గా జరగకపోవడం, అంటువ్యాధులు ప్రబలడం, టీచర్లు ఎన్నికలు బహిష్కరించడం వంటి స్థానిక కారణాలూ వున్నాయి.  అసంతృప్తితో వున్న కార్యకర్తలను స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని, తమ ముఠాలకే తప్ప తక్కినవారికి డబ్బులు పంపిణీ చేయలేదని కూడా చెప్పారు. ఏం చేసినా, చేయకపోయినా తామే గెలుస్తామన్న ధీమాతో వున్న బిజెడి ఫలితాలతో కంగు తింది. దామోదర్‌ రౌత్‌ అనే సీనియర్‌ మంత్రి 'పార్టీ ఓటమికి కారణం పార్టీలోని విభీషణులే' అని స్టేటుమెంటు యిచ్చి కలవరం రేపాడు.

ఆ విభీషణుడి పేరు బయటపెట్టడానికి నిశ్చయించుకున్నాడు బిజెడి ఎంపీ తథాగత శతపథి. ఇతను పూర్వ ముఖ్యమంత్రి నందినీ శతపథి కుమారుడు. అప్పట్లో బిజూ పట్నాయక్‌ పాత కాంగ్రెసుతో కలిసి వుంటే, నందిని ఇందిరా గాంధీ పక్షాన వుండేది. ఎమర్జన్సీ సమయంలో ఒడిశాలో నియంతృత్వం చలాయించింది. ఆమె చిన్న కొడుకు తథాగత సంజయ్‌ గాంధీ అడుగుజాడల్లో నడిచి ఒడిశా సంజయ్‌ అనే పేరు తెచ్చుకున్నాడు. తర్వాత సంజయ్‌ నందినిని, తథాగతను తన పార్టీలోంచి తరిమివేశాడు. కాలక్రమంలో తథాగత ఒడియా పత్రిక ''ధరిత్రి'', దాని ఇంగ్లీషు వెర్షన్‌ ''ఒడిశా పోస్ట్‌''కు ఎడిటర్‌-పబ్లిషర్‌ అయ్యాడు. నవీన్‌ పట్నాయక్‌ పెట్టిన బిజెడిలో చేరాడు. 2000లో అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తే బయటకు వెళ్లి ఒడిశా గణ పరిషద్‌లో చేరి దానికి జనరల్‌ సెక్రటరీ అయ్యాడు. నవీన్‌ ముఖ్యమంత్రి అయ్యాక తన పేపరు ద్వారా అతని విధానాలను తీవ్రంగా విమర్శించేవాడు. 2004లో ఎన్నికలకు ముందు నవీన్‌తో రాజీ పడి మళ్లీ పార్టీలో చేరాడు. 'మా పార్టీ కాంగ్రెసుతో చేతులు కలుపుతోంది కాబట్టి అది నచ్చక బయటకు వచ్చేశాను' అని చెప్పుకున్నాడు. 2014లో ధెంకనాల్‌ పార్లమెంటు నియోజకవర్గం ద్వారా నెగ్గిన తథాగతను నవీన్‌ తన పార్టీకి లోకసభలో విప్‌గా చేశాడు. పంచాయితీ ఎన్నికల ఫలితాల తర్వాత నెల్లాళ్లకు మార్చి 27న తథాగత 'బిజెపి ఎడిఎంకె పార్టీని చీల్చినట్లే తమ పార్టీనీ పార్లమెంటులోను, అసెంబ్లీలోను చీల్చుదామని ప్రయత్నిస్తోంద'ని ఆరోపిస్తూ ట్వీట్ల యుద్ధం మొదలుపెట్టాడు. బిజెపి పక్షాన ఆ పని చేయడానికి తమ పార్టీ ఎంపీ ఒకడు ప్రయత్నిస్తున్నాడని పుకార్లు వస్తున్నాయని కూడా ట్వీట్‌ చేశాడు.

ఆ ఎంపీ వేరేవెరో కాదు వైజయంత్‌ పండా అని అనుకోసాగారు. జయ్‌ పాండా అని అందరూ వ్యవహరించే 53 ఏళ్ల వైజయంత్‌ మిషిగన్‌ టెక్నలాజికల్‌ యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ చదివాడు. కార్పోరేట్‌ సెక్టార్‌లో పనిచేసి రాజకీయాల్లోకి వచ్చాడు. మొదట్లో బిజూ పట్నాయక్‌కు, తర్వాత నవీన్‌ పట్నాయక్‌కు సాయపడ్డాడు. అతని భార్య జగీ మంగత్‌ పండా విదేశాల్లో చదువుకుని ఇండస్ట్రియలిస్టుగా మారింది. జయ్‌ పాండా ఎంపీగా అనేక అంశాల్లో చాలా చురుగ్గా వుంటాడు. 'తథాగత ప్రస్తావిస్తున్న ఎంపీవి నువ్వేనా?' అని ఎవరో ట్విట్టర్‌లో అడిగితే 'పార్టీలోంచి సస్పెండ్‌ కావడం, ఇంకో పార్టీలో చేరడం వంటి విషయాల్లో మా విప్‌కు చాలా అనుభవం వుంది' అని జవాబిచ్చాడు. అంతేకాదు మార్చి 28న ఒక ఒడియా దినపత్రికలో పంచాయితీ ఫలితాల తర్వాత బిజెడి పార్టీ తనను తాను ఆత్మావలోకనం చేసుకోవలసిన తరుణం వచ్చిందంటూ వ్యాసం రాశాడు. 'అధికారులు ప్రభుత్వాన్నే కాదు, పార్టీని కూడా నడిపేస్తున్నారు' అంటూ ఆరోపించాడు. పార్టీ అధినాయకత్వంపై యీ ఘాటు విమర్శ చేసేముందు నవీన్‌తో మాట్లాడి వుండవలసిందని పార్టీ సీనియర్‌ నాయకులు భావిస్తున్నారు. నిజానికి యీ వ్యాసం ప్రచురణకు ఐదు రోజుల ముందే పత్రికాఫీసుకి చేరింది. కానీ తథాగత ట్వీట్‌, దానికి జయ్‌ పాండా ప్రతి ట్వీట్‌ వెలువడ్డాకనే యీ వ్యాసాన్ని పత్రిక ప్రచురించింది.

ఇలా యిద్దరు నాయకులు కలహించడం నవీన్‌ను కలవరపరచి వుంటుంది. 2012లో అతనికి అత్యంత సన్నిహితుడైన ఒక నాయకుడు అతనిపై కుట్ర పన్నితే నవీన్‌ టివి కెమెరాల ఎదురుగానే అతన్ని 'బేఇమాన్‌' (నీతిలేని వాడు) అని వర్ణించి అవమానకరంగా అతనికి ఉద్వాసన చెప్పాడు. అవసరమైతే కాఠిన్యం వహించగలడని అప్పుడే తెలియవచ్చింది. ఈసారి అతను యింకా ఏమీ మాట్లాడలేదు కానీ పత్రికలో యీ వ్యాసం రాగానే అతని అక్క, ప్రఖ్యాత రచయిత్రి గీతా మెహతా భువనేశ్వర్‌కు వచ్చి నవీన్‌ నివాస్‌లో సమావేశాలు నిర్వహించింది. గీత ఇండియాలో విద్యాభ్యాసం పూర్తయాక కేంబ్రిజ్‌ యూనివర్శిటీలో చదువుకుంది. ఆమె రచనలు 21 భాషల్లో అనువదితమయ్యాయి. అంతేకాదు, డాక్యుమెంటరీలు తీస్తుంది కూడా. యుకె, యుఎస్‌, యూరోపియన్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌లు వాటిని ప్రసారం చేస్తాయి. తండ్రిలాగే సాహసి. 1970-71లో అమెరికన్‌ టీవీ నెట్‌వర్క్‌ ఎన్‌బిసి తరఫున బంగ్లాదేశ్‌ యుద్ధంలో వార్‌ కరస్పాండెంట్‌గా పనిచేసి ఆ సమాచారంతో 'డేట్‌లైన్‌ బంగ్లాదేశ్‌' అనే సినిమా కూడా తీసింది. సోనీ మెహతాని పెళ్లాడింది. న్యూయార్క్‌, లండన్‌, ఢిల్లీల మధ్య తిరుగుతూ వుంటుంది. ఆవిడ యిప్పటిదాకా రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి చర్చలు జరపడంతో ఆవిడ రాజకీయాల్లోకి వస్తోందన్న పుకారు వచ్చింది. తన ఎంపీల మధ్య వివాదం గురించి మౌనాన్ని ఆశ్రయించిన నవీన్‌ అక్క గీత గురించి అడిగినప్పుడు మాత్రం ఆమె రాజకీయాల్లోకి రాదని ధృవీకరించారు. బిజెపి సమావేశాల తర్వాత ఒడిశా రాజకీయాలు రాజుకుంటాయని ఊహించవచ్చు. 

ఫోటోలు - జయ్‌ పండా, నవీన్‌ పట్నాయక్‌, తథాగత శతపథి

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
mbsprasad@gmail.com