Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: ఒఎన్‌జిసి నెత్తిన గుజరాత్‌ బండ

నష్టాల్లో పడి కొట్టుకుంటున్న గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పోరేషన్‌(జిఎస్‌పిసి)ను ఒడ్డున పడేయడానికి నరేంద్ర మోదీ సర్కారు ఒఎన్‌జిసిని ధారాళంగా వాడేసుకోవడం విమర్శలకు దారి తీసింది. ఆ రెండిటి మధ్య కుదిరిన ఒప్పందం ఉభయతారకమని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అంటూ వుండగా, ''ప్రధాన్‌గారు తన ప్రధానమంత్రిని కాపాడుకోవడానికి అలా చెప్తున్నారు' అంటూ చమత్కరించారు జయరాం రమేశ్‌. బాంకుల నుంచి తీసుకున్న అప్పులు కట్టలేక అవస్థ పడుతున్న జిఎస్‌పిసి, కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఒఎన్‌జిసికి తమ చమురుబావులు అమ్మడానికి తెగ ప్రయత్నించింది. కానీ ఒఎన్‌జిసి అధికారులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. చివరకు వారి మెడలు ఎవరు వంచారో తెలియదు కానీ 2016 డిసెంబరు 24 న ఒప్పందంపై సంతకాలు పెట్టారు.

2007 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ జిఎస్‌పిసి గురించి ఓటర్లను బ్రహ్మాండంగా ఊదర గొట్టారు. 1979లో చిన్న గ్యాస్‌ ట్రేడింగ్‌ కంపెనీగా ప్రారంభమైన ఆ కార్పోరేషన్‌ 2005లో కృష్ణా గోదావరి (కెజి) బేసిన్‌లో  కైవసం చేసుకున్న బ్లాకుల్లో 20 ట్రిలియన్ల ఘనపుౖటడుగుల (సిఎఫ్‌టి) గ్యాస్‌ లభిస్తుందని, అది అప్పట్లో దేశం మొత్తం మీద వినియోగమయ్యే దాని కంటె ఎన్నో రెట్లు ఎక్కువని, ఆ బావుల వలన గుజరాతీలకు 20 వేల కోట్లు సంపాదన లభించి, గ్యాస్‌ బేస్‌డ్‌ ఎకానమీ ద్వారా ఒక రాష్ట్రం ఏ మేరకు లాభపడుతుందో యితర రాష్ట్రాలకు ఉదాహరణగా గుజరాత్‌ నిలుస్తుందని మోదీ చెప్పారు. పదేళ్లు పోయాక చూస్తే జిఎస్‌పిసికి 20 వేల కోట్ల ఆదాయం రాకపోగా 15-17 వేల కోట్ల అప్పుల్లో మునిగింది. వాటిపై వడ్డీలకే ఏటా 2 వేల కోట్లు పోతోంది. 

ఎందుకిలా జరిగింది? నూతిలోకి దిగాక వాళ్లకు తత్త్వం బోధపడింది. వాళ్లు అనుకున్న 20 ట్రిలియన్ల సిఎఫ్‌టిలో పదో వంతు మాత్రమే గ్యాస్‌ లభ్యమవుతుందని, అది కూడా బయటకు తీయడానికి చాలా ఖర్చవుతుందని తెలిసింది. ఇది యిలా అఘోరిస్తూ వుండగానే 2006-11 మధ్య స్వదేశంలో అనేక చోట్ల బావులు కొనడమే కాక, ఈజిప్టు, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, యెమెన్‌ వంటి అనేక దేశాలలో ఎడాపెడా బావులు కొనేసింది. 2011 నాటికి ప్రపంచవ్యాప్తంగా యింటా, బయటా కలిపి దానికి 50 బావులు - గ్యాస్‌ బ్లాక్స్‌ - వుండేవి. అవేమీ కిట్టుబాటుగా వుండకపోవడంతో 36టిని నష్టాలకు అమ్ముకుని హక్కులు వదులుకుంది. 2011-12 నుంచి 2014-15 వరకు యీ 50 బ్లాక్స్‌ మీద 15,600 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీనిలో 12 వేల కోట్లు కెజి బేసిన్‌ మీదే పెట్టింది. 2015 మార్చి నాటికి కెజి బేసిన్‌ బావులపై పెట్టినది దాదాపు 19,600 కోట్లు అని, 2016 ఏప్రిల్‌లో గుజరాత్‌ అసెంబ్లీకి సమర్పించిన కాగ్‌ రిపోర్టు చెప్తోంది. 

దీన్నే జయరాం రమేశ్‌ ప్రశ్నిస్తున్నాడు. 'కెజి బేసిన్‌లో కానీ, మరో చోట కానీ అనుకున్నంత గ్యాస్‌ పడనప్పుడు పెట్టుబడి  తగ్గించడం సహజం. కానీ జిఎస్‌పిసి అనేక బ్యాంకుల నుంచి ఋణాలు తీసుకుంటూ, పెట్టుబడులు పెడుతూ పోయింది. మొెదటి అంచనా ప్రకారం కెజి బేసిన్‌పై 9 వేల కోట్లు పెట్టి 20 ట్రిలియన్‌ సిఎఫ్‌టి గ్యాస్‌ తీయాల్సింది. చివరకి చూస్తే పెట్టినది 19,600 కోట్లు, వెలికి తీసినది శూన్యం', అని విమర్శించాడు. 'రష్యా, ఈజిప్టు దేశాలకు ముఖ్యమంత్రి మోదీ వెళ్లిన సమయంలోనే జిఎస్‌పిసి ఆ యా దేశాల్లో పెట్టుబడి పెట్టడం యాదృచ్ఛికమా? మోదీ విదేశీ పర్యటనలకు జిఎస్‌పిసి ఎందుకు చార్టర్డ్‌ ఫ్లయిట్స్‌ ఏర్పాటు చేసింది?' అని కూడా అడుగుతున్నాడు.

ఇతని ప్రశ్నల మాట ఎలా వున్నా జిఎస్‌పిసి అప్పుల వూబిలో కూరుకుపోయిందన్న మాట కఠోరవాస్తవం. 2014-15లో దాని ఆదాయం రూ.152 కోట్లు మాత్రమేనని కాగ్‌ రిపోర్టు చెప్పింది. జిఎస్‌పిసికి ప్రస్తుతం ఎండీగా వున్న జెఎన్‌ సింగ్‌ ''గతంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. విదేశాల్లో బావులు తీసుకోవడం చాలా పొరపాటు. ఇప్పుడా తప్పులను సవరించే పనిలోనే వున్నాను.'' అన్నాడు. ఇకపై యీ గ్యాస్‌ వెలికితీత పనులు కట్టిపెట్టి గుజరాత్‌లోనే గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌, గ్యాస్‌ ట్రాన్సిమిషన్‌ వ్యాపారం చూసుకుంటే చాలనే భావానికి వచ్చేసింది. కానీ యీ అప్పులు తలకెత్తుకునేది ఎవరు? ఇంకెవరు, ఒఎన్‌జిసి అనుకున్నారు. 

వాళ్ల నడిగారు. కానీ ఒఎన్‌జిసి ఒప్పుకోలేదు. 'దీన్‌దయాళ్‌ బ్లాకులో మీరు చెప్పేటంత సీను లేదు' అంది. డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌, ద ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రెగ్యులేటర్లు 'మీరు అక్కడ 2.2 ట్రిలియన్‌ సిఎఫ్‌టి గ్యాస్‌ వుందంటున్నారు కానీ అక్కడ దానిలో పదో వంతు కంటె వుండదు' అన్నారు. ఆ ముక్క జిఎస్‌పిసి ఒప్పుకోలేదు. 'అయితే మీరూ మేమూ కాదు ప్రపంచఖ్యాతి నొందిన హ్యూస్టన్‌కు చెందిన గ్యాస్‌ కన్సల్టెంట్‌ రైడర్‌ స్కాట్‌ను పిలిపించి, అతని చేత చెక్‌ చేయిద్దాం' అంది ఒఎన్‌జిసి. అతను పరీక్షించి 2016 అక్టోబరులో నివేదిక సమర్పించాడు. ఆ నివేదికలో ఏముందో ఒఎన్‌జిసి యిప్పటిదాకా బయటపెట్టలేదు. పెట్టనివ్వలేదేమో తెలియదు. కేంద్రంలో వున్నది గుజరాత్‌ పక్షపాత ప్రభుత్వమే కాబట్టి ఒఎన్‌జిసిపై జిఎస్‌పిసి ఒత్తిడి తెచ్చింది. చివరకు డిసెంబరు 24 నాటి ఒప్పందం ద్వారా జిఎస్‌పిసికి బంగాళాఖాతంలో 1850 చ.కి.మీల విస్తీర్ణంలో వున్న దీన్‌దయాళ్‌ (పశ్చిమ) బ్లాకులో 80% పార్టిసిపేటింగ్‌ ఇంట్రస్టు, ఆపరేటర్‌షిప్‌ హక్కులను 9.95 కోట్ల డాలర్లకు కొంది. అంతేకాకుండా భవిష్యత్తులో కనుగొనబోయే 6 డిస్కవరీలకై 20 కోట్ల డాలర్లకు కొంది. 

ఇది గుజరాత్‌ కార్పోరేషన్‌ను రక్షించడానికి కేంద్రం చేసిన ప్రయత్నంగానే చూడకూడదంటున్నాడు రాహుల్‌ గాంధీ. జిఎస్‌పిసి కార్యకలాపాల్లోనే స్కాము జరిగిందని, అది 2005-2014 మధ్య 15 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.19,700 ఋణంలో మోదీకి లాభం చేకూరిందని, యిప్పుడీ జిఎస్‌పిసి వ్యవహారాలపై కాగ్‌ విమర్శలు చేయడంతో మొత్తమంతా కామాపు చేయడానికై ఒఎన్‌జిసిని రంగంలోకి దించాడని ఆరోపిస్తున్నాడు. దీన్ని పెట్రోలియం మంత్రి ప్రధాన్‌ కొట్టిపారేశాడు. ''జిఎస్‌పిసి, ఒఎన్‌జిసి ఇండియా-పాకిస్తాన్‌లాటివి కావు. ఒకదానితో మరొకటి సహకరించుకుంటున్నాయి.'' అన్నాడు. ''2జి స్కాము విషయంలో కాగ్‌ 'ఊహాజనితమైన నష్టం' గురించి మాట్లాడితేనే బిజెపి అంత యాగీ చేసింది, మరి దీని విషయంలో నష్టం జరిగిపోయిందని చెప్పింది. మరి ఏ చర్యలు తీసుకున్నారు? వాటి మాట ఎత్తకుండా, ఆ గొడవలు బయటకు రాకుండా, ఆ నష్టాలను ఒఎన్‌జిసి నిధులతో భర్తీ చేసేస్తున్నారు'' అంటాడు జయరాం రమేశ్‌. ఒఎన్‌జిసి అధికారులు కూడా లోపాయికారీగా పెదవి విరుస్తున్నారు. ''గ్యాస్‌ నిలవలు తరిగిపోయిన బావులను అధికధర పెట్టి కొనేట్లుగా మాపై ఒత్తిడి తెచ్చారు. వాళ్ల తప్పిదాలకు మేం బలై పోతున్నాం.'' అంటున్నారు. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2017)