Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : ఓటింగు యంత్రాలను నమ్మవచ్చా?

'ఆడలేనమ్మ వేదిక ఎగుడుదిగుడందట' అనే సామెతను ఓడిపోయినవాళ్లను వెక్కిరించడానికి వాడతాం. కానీ వేదికో, దానికి ఎక్కడానికి వేసిన మెట్లవరసో నిజంగానే మిట్టపల్లాలతో వుంటే....? ఇండియాలో ఎన్నికలలో ఓడిపోయినవాళ్లు ఇవిఎమ్‌లను తప్పుపడుతూ వుండడం, అధికారంలో వున్నవాళ్లు వాటిని కొట్టిపారేయడం జరుగుతూనే వుంది. ఇవిఎంలను ట్యాంపర్‌ చేయవచ్చని గతంలో ఒక నిపుణుడి చేత టిడిపి నిరూపించబోయినా అది అరణ్యరోదనే అయింది. ప్రపంచంలో సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం యీ యంత్రాలను విశ్వసించటం లేదని, బ్యాలట్‌ పేపర్‌నే ఉపయోగిస్తున్నారని, అలాటప్పుడు నిరక్షరాస్యత యీ స్థాయిలో వున్న యిండియాలో మాత్రం ఎందుకివి అని ఓడిపోయిన పార్టీల వాళ్లు గగ్గోలు పెడుతున్నా, ఎన్నికల కమిషన్‌ మాత్రం 'అవన్నీ సిస్టమ్స్‌ కంప్యూటర్‌ ఆధారిత, ఇంటర్నెట్‌ అనుసంధానిత యంత్రాలు, మన దేశంలో వేటికవే. అందువలన వీటిని ట్యాంపర్‌ చేయడం, మానిప్యులేట్‌ చేయడం అసాధ్యం' అని వాదిస్తోంది. 'ఎలక్ట్రానిక్‌ పరికరం ఏదైనా సరే, దాన్ని లొంగదీసుకునే ఘనులున్నారు. ఈ యంత్రాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకునే అవకాశం వుండే వుంటుంది అనే అనుమానం వుంది కాబట్టి దీన్ని చెక్‌ చేసే, ఆడిట్‌ చేసే ఒక ప్రింటవుట్‌ పెట్టుకోవాలి' అని రాజకీయ పార్టీలు వాదించాయి.  సరే అని ఎన్నికల కమిషన్‌ 'ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌' (వివిపిఎటి) యంత్రాన్ని తయారు చేయించాయి. 

ఈ వివిపిఎటి యంత్రాన్ని ఓటింగు యంత్రానికి ఎటాచ్‌ చేస్తారు. ఓటరు ఓటేశాక, ఏడు సెకండ్ల పాటు అతను ఎవరికి ఓటేశాడో  తెరపై కనబడుతుంది. తను ఓటేసిన అభ్యర్థికాక వేరేవారి పేరు కనబడితే అప్పుడే అతను ఫిర్యాదు చేసే అవకాశం వుంది. ఏడు సెకండ్ల తర్వాత ఆ డిస్‌ప్లే మాయమవుతుంది. ఏ అభ్యర్థికి ఓటేశాడో అతని పేరు, సీరియల్‌ నెంబరు, పార్టీ గుర్తు ఓ కాగితంపై ప్రింటయి, సరాసరి ఒక పెట్టెలోకి వెళ్లి పడుతుంది. ఆ కాగితాన్ని ఓటరు బయటకు తీసుకెళ్లలేడు. కౌంటింగులో ఏదైనా తకరారు వస్తే అప్పుడు ఆ పెట్టె తెరిచి యీ కాగితం స్లిప్పులను లెక్కపెట్టి ఇవిఎం ఫలితంతో సరిచూస్తారు. ఇదీ ప్రింటవుట్‌ యంత్రం పనితీరు. మొన్న జరిగిన యుపి ఎన్నికలలో 30 నియోజకవర్గాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా వాడి చూశారు. వాటిలో 25 స్థానాల్లో బిజెపి గెలిచింది. యుపి ఎన్నికల ఫలితాలలో బిజెపి హవా వుంటుందనుకున్నా, ఎవరూ వూహించనంత స్థాయిలో బిజెపి గెలవడంతో మాయావతి ఇవిఎం యంత్రాలపై అనుమానం వ్యక్తం చేసింది. పంజాబ్‌ ఎన్నికలలో ఓడిపోయిన అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా అలాటి ఆరోపణలే చేశాడు. మాయావతి అనుమానాలు నివృత్తి చేయవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై వుందని అఖిలేశ్‌ అని వూరుకున్నాడు. మాయావతి, అరవింద్‌ మాటలు ఎవరు పట్టించుకుంటారులే అనుకుని ఎన్నికల కమిషన్‌ కూడా వాటిని తేలిగ్గా తీసుకుంది. 

అయితే మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలలో మరిన్ని ఆరోపణలు వచ్చాయి. ఒక స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడలేదు. 'కనీసం నా ఓటైనా నాకు రావాలి కదా' అని అతను వాదించాడు. పంచవటిలో అభ్యర్థుల ఓట్లన్నీ కూడితే పోలయిన ఓట్ల కంటె ఎక్కువగా వచ్చాయి.  2 లక్షల ఓటర్లున్న నియోజకవర్గంలో 90 వేల మెజారిటీతో ఓ అభ్యర్థి గెలవడం వంటివి నమ్మశక్యంగా లేవని కొందరు వాపోయారు. ఎటిఎం కార్డులు కూడా సురక్షితం అనుకుంటూ వచ్చాం, కానీ యిటీవలే 32 లక్షల కార్డులు హేకింగ్‌కు గురయ్యాయి. ప్రతి సాఫ్ట్‌వేర్‌లోను ఏదో ఒక లోపం కనిపెడుతున్నారు హ్యేకర్లు. మరి ఇవిఎంలు మాత్రం అంత పక్కాగా వుంటాయా? అన్న సందేహాలు ఎల్లెడలా రావడంతో ఎన్నికల కమిషన్‌ 2019 పార్లమెంటు ఎన్నికల సమయానికి వివిపిఎటిని ఎటాచ్‌ చేయడానికి సన్నిద్ధమవుతోంది. అదెలా పనిచేస్తుందో చూపించడానికి మధ్యప్రదేశ్‌లో అప్పటికి 10 రోజుల్లో ఉపయెన్నిక జరపబోతున్న భీడ్‌లో మార్చి 31న మీడియా, రాజకీయ పార్టీల ప్రతినిథుల ఎదుట ఒక ప్రదర్శన నిర్వహించింది. మధ్యప్రదేశ్‌ చీఫ్‌ ఎలక్టొరల్‌ ఆఫీసర్‌ సలీనా సింగ్‌ విలేకరుల ఎదుట ఇవిఎంలో కొన్ని పార్టీలకు ఓటేసి, దానికి ఎటాచ్‌ చేసిన వివిపిఎటి నుంచి ప్రింటవుట్‌ తీసి చూపించారు.

తీరా చూస్తే ఆ ప్రింటవుట్‌లో బిజెపి గుర్తుకే చాలా ఓట్లు పడ్డాయి. ఇవిఎంలో ఏ పార్టీకి మీట నొక్కినా, ప్రింటవుట్‌లో మాత్రం బిజెపియే వస్తోంది. దాంతో అంతా బిత్తరపోయారు. సలీనా గారికి కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు. 'ఇవిఎంలకు బిజెపి పక్షపాతమున్నట్లుందే' అని ఒక విలేకరి చమత్కరించాడు. 'ఇదిగో యీ విషయం మీరు పేపర్లో రాశారో, మీ అందరినీ నేను పోలీసు స్టేషన్లో చూడాల్సి వస్తుంది జాగ్రత్త' అని యీవిడ చమత్కరించింది. మర్నాటి కల్లా పేపర్లలో వచ్చేసింది - ఇవిఎంలు సరిగ్గా పనిచేయటం లేదని, ఆ విషయం బయటకు పొక్కితే అరెస్టు చేయిస్తానని అధికారి బెదిరించారనీ! ఆ ఇవిఎంను కాన్పూరునుంచి తెచ్చారని, అక్కడ కూడా యిలాగే ఏం నొక్కినా అన్నీ కమలానికే వెళ్లడం చేతనే బిజెపి అంత మెజారిటీతో గెలిచిందని పుకార్లు వ్యాపించాయి. ఇక్కడ గమనించవలసిన దేమిటంటే సరిగ్గా పనిచేయనిది వివిపిఎటి. అది తప్పు ఫలితాలు యిచ్చింది. ఇవిఎం ఎలా పనిచేస్తుందో పరీక్షించలేదు. ఆవిడ నొక్కిన ప్రకారం ఫలితం వచ్చిందో లేదో చెక్‌ చేసినట్లు పేపర్లలో రాలేదు. 

ఈ వార్తలు రాగానే ఎన్నికల కమిషన్‌ మొహం మాడిపోయింది. పరువు పోయిందని ఫీలై ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఎలక్టొరల్‌ ఆఫీసర్‌ భవర్‌లాల్‌ను అక్కడకు వెళ్లి పొరపాటు ఎక్కడ జరిగిందో తేల్చమని ఆదేశించారు. ఆయన వెళ్లి ఆ ప్రింటర్‌ను యుపిలోని గోవిందనగర్‌ నుంచి తెచ్చారని, దీనికి ఎటాచ్‌ చేసేముందు ఫార్మాట్‌ (పూర్తిగా తుడిచివేయడం) చేయకపోవడం చేత మెమరీలో వున్న ఆ నియోజకవర్గ ఫలితాలనే చూపిస్తోందని తేల్చారు. తుడిచి వేయకుండానే పత్రికల ముందు పరీక్షకు రెడీ చేసిన 19 మందిని ఎన్నికల కమిషన్‌ బదిలీ చేసింది. ఏది ఏమైనా మానవవైఫల్యం వలన ఫలితాలు తారుమారు కావచ్చు అని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనకు బలం చేకూరింది. ఇక అరవింద్‌ కేజ్రీవాల్‌ రెచ్చిపోయారు. అతన్ని అదుపు చేయడానికి కాబోలు ఎన్నికల కమిషన్‌ భేషుగ్గా పనిచేస్తోందని కేంద్ర ప్రభుత్వం కితాబు నిచ్చింది. దాని మాట ఎలా వున్నా ఇవిఎంలలో కూడా యిలాటి మెమరీ వుండిపోతే...? అనే సందేహం తటస్థులకు కూడా కలగవచ్చు. భారత ఇవిఎంలకు ఒక ఎలక్ట్రిక్‌ పరికరాన్ని జోడించి దాన్ని సెల్‌ఫోన్‌ ద్వారా నియంత్రణలోకి తీసుకోవచ్చు అని మిచిగన్‌ యూనివర్శిటీ వారు డిమాన్‌స్ట్రేట్‌ చేసి చూపించారట. అయినా మా ఎవిఎంలు ఫూల్‌ప్రూఫ్‌, లోపరహితమైనవి అని ఎన్నికల కమిషన్‌ మొండిగా వాదిస్తోంది. సైబర్‌ క్రైమ్‌ పట్టుకోవలసిన పోలీసు వారి వెబ్‌సైట్‌లే హ్యేకింగ్‌కు గురి అవుతున్న యీ రోజుల్లో తమ ఇవిఎంలపై ఎన్నికల కమిషన్‌కు అంత ధీమా ఏమిటో తెలియదు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
- mbsprasad@gmail.com