ఇజ్రాయేలు ఏర్పాటులో వున్న ఔచిత్యాన్ని నేను ప్రశ్నించాను. పాఠకులు కొందరు నాతో విభేదిస్తూ అభిప్రాయాలు తెలిపారు. వాటిపై స్పందన తెలిపి ముందుకు సాగుతాను. నేను యూదుల కథను మధ్యలో మొదలుపెట్టానని ఒక పాఠకుడు అన్నారు. నేను మొదటి భాగంలోనే స్పష్టంగా రాశాను – 'యూదుల రాజ్యం బైబిల్లోని ఓల్డ్ టెస్ట్‌మెంట్ కాలం నాటిది. చరిత్ర ప్రకారం చూస్తే క్రీ.పూ.11 వ శతాబ్దంలో యూదు రాజ్యం ఏర్పడింది…' అని. ముస్లిముల కంటె ముందు ఆ రాజ్యం గ్రీకుల, రోమన్ల వశమయ్యాయని కూడా రాశాను. యూదులు సహజంగా వ్యాపారస్తులు కాబట్టి మన దేశంలో మార్వాడీల్లా, గుజరాతీల్లా ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి వెళ్లిన ప్రతీ చోటా కష్టపడి, తెలివితేటలతో వ్యాపారం చేసి, ఆర్థికంగా బలపడి స్థానికులకు అసూయ పుట్టించారు. అంతా కట్టకట్టుకుని ఒకే దేశం వెళ్లలేదు. వేలాది సంవత్సరాల క్రితం ఒక చోట రాజ్యం చేశాం కాబట్టి దాన్ని మళ్లీ మాకు అప్పగించాలి అనే వాదనను ఎంతవరకు అంగీకరిస్తాం అన్నది ఒక అంశం. అది మాకు పవిత్రస్థలం కాబట్టి అప్పగించాలి అనే వాదనను అంగీకరిస్తామా లేదా అన్నది మరో అంశం.
మొదటిదాని గురించి ఆలోచిద్దాం. సింధు నాగరికత ద్రవిడులదని, వారిని అక్కణ్నుంచి తరిమివేస్తే దక్షిణాదికి వచ్చారని కొందరు చరిత్రకారులు అంటారు. ఆ వాదన ఆధారంగా యిప్పుడు తమిళులు వెళ్లి పాకిస్తాన్లో వున్న మొహంజదారో, హరప్పాలను తమకు అప్పగించాలని అడిగితే సభ్యసమాజం అంగీకరిస్తుందా? ఆర్యులు మధ్యప్రాచ్యం నుండి వచ్చారని ఒక వాదన వుంది. మనం ఆర్యసంతతి కాబట్టి ఆ మధ్యప్రాచ్యం మాకు యివ్వాలి అంటే వాళ్లు ఒప్పుకుంటారా? గాంధారి పుట్టిల్లు అంటూ అఫ్గనిస్తాన్‌ను అప్పగించమంటే..? బాబర్‌ను ఉజ్బెకిస్తాన్ నుండి తరిమివేస్తే యిక్కడకి వచ్చాడు. మొఘల్ సామ్రాజ్యం స్థాపించాడు. ఆ వంశవారసులు యింకా వున్నారు. ఆ మధ్య ఓ పత్రికలో వాళ్ల ఫోటోలు కూడా వేశారు. ఇప్పుడు వాళ్లు అక్కడికి వెళ్లి మాది మాకిచ్చేయండి అంటే ఎలా వుంటుంది? ఇదంతా కన్ఫమ్ కాని చరిత్ర అంటారేమో, ఇరాన్ నుంచి పార్శీలను తరిమివేసిన యిటీవలి కాలానిదే. అందరికీ తెలిసినదే. భారతదేశానికి వచ్చిన ఆర్థికంగా బలపడిన పార్శీలు ఎందరో వున్నారు. మా మాతృభూమి మాకిచ్చేయండి అంటూ ఇరాన్ పాలకుల్లో కొందరికి లంచాలిచ్చి సగం దేశం తమ పేర రాయించేసుకుంటే ఎలా వుంటుంది?
తెలుగు బ్రాహ్మణుల్లో గోల్కొండ వ్యాపారులనే శాఖ వుంది. వారు తెలంగాణలో విస్తారంగా కనబడటమే కాదు, ఉత్తరాంధ్రలో కూడా కనబడతారు. ఇక్కడివారు అక్కడికి వెళ్లారో, అక్కడి వాళ్లు యిక్కడికి వచ్చారో నాకు తెలియదు. (విశాఖ జిల్లాలో గోలకొండ అనే చిన్న వూరు వుందని విన్నాను). ఉత్తరాంధ్ర గోల్కొండ వ్యాపారులు గోల్కొండ కోట మాదే, మాకు అప్పగించండి అని ఉద్యమిస్తే..? డబ్బు సేకరించి ఆ కోట కొనేయడానికి సిద్ధపడితే అంగీకరిస్తారా? కెసియార్ మూలాలు విజయనగరం జిల్లాలో వున్నాయంటారు. ఇప్పుడు ఆయన అక్కడకు వెళ్లి మూడు నాలుగు తాలూకాలు జబర్దస్తీ చేసి ఆక్రమిస్తే… లేక కొనేస్తే..? ఏదైనా ఆస్తి మనది కావాలంటే అది మనకు దఖలు పడడంతో బాటు మన స్వాధీనం అంటే అనుభవంలో కూడా వుండాలి. 13 ఏళ్లపాటు అది పరాయివాళ్ల ఆధీనంలో వుంటే మన హక్కు ప్రశ్నార్థకమే. అలాటి పరిస్థితుల్లో ఎప్పుడో వేలాది సంవత్సరాల క్రితం అది మేం వుండే చోటు అంటే ఎలా కుదురుతుంది? పోనీ అప్పుడున్న పెద్దమనిషి యొక్క వారసుణ్నని చూపే పత్రాలున్నాయా, ఆ పెద్దమనిషిదే ఫలానా స్థలం అనే రిజిస్ట్రేషన్ పాలస్తీనా రాజ్యంలో వుందా? ఆయనదీ, మాదీ ఒకటే మతం అంటే సరిపోతుందా? బిర్లాలదీ, మాదీ ఒకటే మతం అంటూ నేను బిర్లాల ఆస్తికి ఎగబడితే…?
ఇక రెండో అంశం – అది మాకు పుణ్యక్షేత్రం కాబట్టి మాకు అప్పగించాలనడం. ఒకే క్షేత్రం రెండు మతాల వారికి పవిత్రం కావడం చూస్తూ వుంటాం. మౌంట్ ఏబూ జైనులకూ పుణ్యక్షేత్రమే, హిందువులకు కూడా. బుద్ధుణ్ని విష్ణువు అవతారంగా ఆమోదించడం వలన బౌద్ధ క్షేత్రాలన్నీ హిందువులకు, బౌద్ధులకు యిద్దరికీ పవిత్రమే. ఇద్దరి మధ్య కలహం యిప్పుడు లేదు కాబట్టి అందర్నీ అనుమతిస్తున్నారు. శ్రీలంకలో బౌద్ధులకు, హిందువులకు పోట్లాట వచ్చినట్లు కొన్నాళ్లకు యిక్కడ కూడా వస్తే…? జైనులకు, హిందువులు కలిసి వున్న రోజులూ వున్నాయి, కలహించిన రోజులూ వున్నాయి.
తెలుగు రాజుల్లో భార్య జైన మతస్థురాలు, భర్త హిందువు అయిన సందర్భాలున్నాయి. రుద్రమదేవి తండ్రి గణపతిదేవుడు జైనులను సామూహికంగా చంపించిన రోజులూ వున్నాయి. జైన దేవాలయాలను హిందువులు ధ్వంసం చేసి తీర్థంకర విగ్రహాలను వీరభద్ర విగ్రహాలుగా మార్చిన సందర్భాలూ వున్నాయి. మన దేశంలో ప్రస్తుతం జైనులో సంఖ్యలో తక్కువగానే ధనబలంలో కలిగి వున్నారు. వాళ్లు డబ్బుతో పాలకవర్గాన్ని యిన్‌ఫ్లుయెన్సు చేసి ఫలానా క్షేత్రం జైనులకే ఎలాట్ చేసేయాలి, అక్కణ్నుంచి హిందువులను ఖాళీ చేయించాలి అని రూలు పాస్ చేయిస్తే హిందువులు ఆమోదిస్తారా? నేపాల్‌లో హిందూ దేవాలయం వుంది, మాకు పవిత్రమైనది అందువలన మేం అక్కడ బిచాణా వేస్తాం, నేపాలీలను తరిమివేస్తాం అని హిందువులంటే నేపాల్ ఒప్పుతుందా? ఒక పాఠకుడు చైనా చేష్టల గురించి రాశారు. ఇవాళ వాళ్లు మనకంటె ధనికదేశం. 'బుద్ధగయ మా బౌద్ధులకు పుణ్యక్షేత్రం, అందువలన దానికి 100 కి.మీ.ల వ్యాసార్థంలో వున్న ప్రదేశమంతా మాకు అమ్మేయండి. మేం స్థానికులను తరిమివేసి, చైనీస్ బౌద్ధులతో నింపివేస్తాం' అని ప్రతిపాదించి, మన ప్రభుత్వాన్ని నయాన్నో, భయాన్నో ఒప్పించి, బుద్ధగయను సొంతం చేసుకుని, యిక దాన్ని స్థావరంగా చేసుకుని బిహార్, యుపిలో వున్న బౌద్ధ పుణ్యక్షేత్రాలన్నీ మావే, ఆక్రమించుకుంటాం అంటూ దాడులు చేస్తే ఎలా వుంటుందో ఊహించి చూడండి. పోనీ మనం బలపడి మానససరోవరం, సాక్షాత్తూ పరమిశివుడు నివాసం వుండే కైలాసపర్వతం మాకు పరమ పవిత్రం అంటూ చైనా వాళ్లను అక్కణ్నుంచి తరిమివేస్తే ఎలా వుంటుందో చెప్పండి.
అరబ్-ఒంటె కథ చిన్నపుడు చదువుకుని వుంటాం. అరబ్బు వేసుకున్న గుడారంలోకి చలిగా వుందంటూ ఒంటె తలకాయ దూరుస్తుంది. అ తర్వాత కొద్దికొద్దిగా లోపలకి వచ్చేసి, చివరకు అరబ్బును గుడారం బయటకు నెట్టేసి, తను ఆక్రమించేస్తుంది. ఆ కథలో ఒంటె లాటిదే ఇజ్రాయేలు. అరబ్బు అరబ్బే! ఇవన్నీ పిట్టకథల్లా తోచవచ్చు కానీ సమస్యకు కీలకం అర్థం కావడానికి యిలా అన్వయించి చూసుకోవాలి. నేను రాస్తున్నది ఫిక్షన్ కాదు, హిస్టరీ! హిస్టరీ పుస్తకాల్లో ఎవరైనా చదవవచ్చు. హిస్టరీ చదివాక మనకు ఒక దృక్కోణం, ఒక పెర్స్పెక్టివ్ ఏర్పడాలి. అది ఏర్పరచుకోవడానికే నేను రకరకాల కోణాలతో రాసిన పుస్తకాలు, ఆర్టికల్స్ చదువుతాను. అవి చదివాక నాకు ఏర్పడిన అభిప్రాయాన్ని పాఠకుల ముందు వుంచుతున్నాను. వారు మిగతావాటితో బాటు నాది కూడా చదివి ఫైనల్‌గా ఏదో ఒక స్వతంత్ర అభిప్రాయం ఏర్పరచుకోవచ్చు. గత 67 ఏళ్లలో యిజ్రాయేలు పాలస్తీనాను ఎలా కబళిస్తూ పోయిందో చూపే యీ డయాగ్రమ్ ''ఔట్లుక్'' వీక్లీ సౌజన్యంతో యిస్తున్నాను. ఆకుపచ్చ భాగం ఇజ్రాయేలుది, పసుపుపచ్చది పాలస్తీనాది. ఇజ్రాయేలు దురాక్రమణ ఎవరికైనా సందేహాలుంటే దెబ్బకు తీరిపోవాలి. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)