Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సమైక్యవీరులు -4

ఇక కిరణ్‌ దగ్గరకు వచ్చేసరికి చాలా యిబ్బందులు వస్తున్నాయి. ఈనాడు ఎవరూ చెప్పనంత ధాటీగా కిరణ్‌ తను సమైక్యవాది అని చెప్పుకుంటున్నారు. ఇదంతా సోనియా ఆడిస్తున్న డ్రామానా అని మొదట్లో చాలామంది సందేహించిన మాట వాస్తవం. ఎందుకంటే కిరణ్‌కు స్వయం ప్రతిపత్తి లేదు. చిదంబరం ప్రాపు సంపాదించి సిఎం అయ్యాడనే అందరూ అంటారు. కాబినెట్‌లో సగం మంది వ్యతిరేకులే. ఎవర్నీ కలుపుకుని వెళ్లలేదు. రేపు సోనియా తీసేస్తే వెంట పదిమంది కూడా వస్తారన్న నమ్మకం లేదు. అలాటప్పుడు ఎలా ఎదిరిస్తాడు అని అందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ ఢిల్లీలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ పరిగెడుతున్న విధం చూస్తూ వుంటే సోనియా కిరణ్‌ చేత యిలా ఆడిస్తోందని అనుకోవడానికి ఆస్కారం లేకుండా వుంది. కిరణ్‌ ఢిల్లీ వెళ్లడమే మానేశారు. సమైక్యమే నా పాలసీ అని లిఖితపూర్వకంగా కాంగ్రెసు అధిష్టానానికి రాసి పంపించారు. ప్రభుత్వం నుండి వెళుతున్న నివేదిక కూడా విభజన ఎంత కష్టమో చాటి చెప్పేట్లు తయారు చేయించారు. విభజన సునామీని ఆపడానికి యావత్తు ప్రయత్నం చేస్తానంటున్నారు. నేను వున్నంతకాలం విభజన జరగదు అంటున్నారు. ఈయన్ని కట్టడి చేయడానికి దిగ్విజయ్‌ సింగ్‌ ప్రయత్నించినా లాభం లేకపోయింది. కిరణ్‌ విభజనకు ఒప్పుకున్నారు అని దిగ్విజయ్‌ చెప్పిన ఉత్తరక్షణంలో కిరణ్‌ ఖండించారు. దిగ్విజయ్‌ ఇంకేం మాట్లాడలేకపోయారు. ఉపముఖ్యమంత్రితో సహా తెలంగాణవాదులంతా కిరణ్‌ను నిత్యం తిడుతున్నారు. కిరణ్‌ను తీసేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేనికీ జవాబు చెప్పకుండా సహిస్తూ తన పని తను చేసుకుంటూ పోతున్నాడు.

ఇలాటి కిరణ్‌ మనసులో విభజనవాది అని జగన్‌ ఆరోపిస్తూ వుంటే హాస్యాస్పదంగా వుంది. నిజానికి పదవిలోకి వచ్చిన దగ్గర్నుంచి కిరణ్‌ విభజనోద్యమాన్ని అణచడానికి చూస్తూనే వున్నారు. నిజానికి రోశయ్య చేయలేకపోయినది, కిరణ్‌ చేసినదీ యిదే. రోశయ్య హయాంలో జరిగిన మిలియన్‌ మార్చ్‌లో టాంక్‌బండ్‌పై తెలుగుప్రముఖుల విగ్రహాలు కూలాయి. దోషులెవరో యిప్పటిదాకా గుర్తించలేదు, కేసు పెట్టలేదు. కిరణ్‌ హయాంలో జరిగిన మిలియన్‌ మార్చ్‌ పూర్తిగా నియంత్రించబడింది. ముందస్తు అరెస్టులు చేయడానికి గాని, అనుమతులు ఆఖరి నిమిషందాకా యివ్వకుండా వుండడానికి గాని, ఇచ్చినా షరతులు పెట్టడానికి గాని దేనికీ జంకలేదు కిరణ్‌. విభజనవాదులు కిరణ్‌ అంటే మండిపడుతూనే వచ్చారు. హై కమాండ్‌ అప్పట్లో విభజనకు వ్యతిరేకంగా వుంది కాబట్టి కిరణ్‌కు ఆదేశాలిచ్చి యిలా చేయించారని, దానిలో కిరణ్‌ ఘనత ఏమీ లేదనీ సులభంగా అనేయవచ్చు. వ్యక్తిగతమైన కన్విక్షన్‌, దృఢవిశ్వాసం వుంటే తప్ప ఆ ఆదేశాలను కిరణ్‌ చిత్తశుద్ధితో అమలు చేసి వుండేవారు కారు. రోశయ్యకూ యిలాటి ఆదేశాలే యిచ్చి వుంటారు. ఆయనా సమైక్యవాదే అయినా యిలా చేస్తే 'నా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో' అని ఆయన జంకి వుండవచ్చు. రాజకీయ చరమథలో వున్న రోశయ్య వెనకాడగా, యింకా పాతికేళ్ల భవిష్యత్తు వున్న కిరణ్‌ దాన్ని పణంగా పెట్టి ధైర్యంగా వ్యవహరించారు. అదీ కిరణ్‌ గొప్పతనం. 

ఈ గొప్పతనాన్ని వైకాపా గుర్తించడం లేదు. నిజానికి జగన్‌ కాంగ్రెసులో వుండగా తను సమైక్యవాది అని చూపించుకోవడానికి పార్లమెంటులో ప్లకార్డు పట్టుకోవడం తప్ప మరేమీ చేయలేదు. కిరణ్‌ ఏకంగా సమైక్యవాదమే నా నినాదం అంటూ లేఖ రాశారు. అది అసాధారణం - ముఖ్యంగా కాంగ్రెసు చరిత్రలో ! అంతిమంగా సోనియా మాటే చెల్లి రాష్ట్రం విడిపోవచ్చు కానీ విభజన వ్యతిరేకించిన ముఖ్యమంత్రిగా కిరణ్‌ చరిత్రలో మిగిలిపోతారు. 'కిరణ్‌ సమైక్యం గురించి యిప్పుడు చెప్తున్నారు. కాంగ్రెసు అధిష్టానం ముందు చెప్పాల్సింది. అక్కడ చెప్పకుండా మన దగ్గర బోగస్‌ కబుర్లు చెప్తున్నారు' అంటూ వైకాపా, టిడిపి నాయకులు చెప్తున్నారు. అధిష్టానం ముందు ఆయన యిచ్చిన ప్రజంటేషన్‌ పేపర్లలో విపులంగా వచ్చింది. దానిని ఎవరూ ఖండించలేదు. 'విభజిస్తే రాష్ట్రంలోని యిరు ప్రాంతాలకే కాక, పార్టీకి కూడా నష్టమే అని చెప్పాను. కానీ వారు వినలేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను.' అని కిరణ్‌ ప్రజల మధ్యకు వచ్చి చెపుతున్నారు. లేదు అబద్ధం చెపుతున్నాడు, అని ఢిల్లీ నుండి ఏ నాయకుడూ అనటం లేదు. బిల్లు అసెంబ్లీకి ఒకసారి వస్తుందా, రెండుసార్లు వస్తుందా అన్న విషయంలో కిరణ్‌ ప్రజల్ని తప్పుదోవ పట్టించాడని వైకాపా ఆరోపించింది. అప్పుడు కిరణ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పినదే తాను చెప్పానని ప్రకటించారు. విషయం అలా బయటపెట్టేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దిగ్విజయ్‌ షిండే మీదకు నెట్టేశారు. లేకపోతే అంతా కలిసి కిరణ్‌ పరువు తీయడానికే చూశారు.  

కిరణ్‌ మా మాట జవదాటరు అని ఢిల్లీ నాయకులు పాట పాడుతూనే వున్నారు. మరి విధేయుడైన వ్యక్తికి వ్యతిరేకంగా నాయకులను కూడగట్టడం దేనికి? కిరణ్‌ను మార్చం అంటూనే ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారని తోస్తూనే వుంది. అది అంత సులభమైన పని కాదు. కిరణ్‌ను తీసి తెలంగాణ వ్యక్తిని పెడితే సీమాంధ్రులకు మరీ కోపం వస్తుంది. అతడు ఏం చేసినా ద్రోహం చేస్తున్నట్లే తోస్తుంది. పోనీ ఆంధ్ర వ్యక్తిని పెట్టినా యితను ఢిల్లీ తొత్తు, కిరణ్‌ మనను కాపాడుతున్నాడని యితన్ని తెచ్చారు అనుకుంటారు.  'వేసేటప్పుడు వేపకొమ్మ, తీయబోతే అమ్మోరు' అని సామెత. ఎందుకంటే మధ్యలో వేపకొమ్మకు మహిమలు వచ్చేశాయని అందరూ నమ్మడం మొదలెడతారు. పీకి పారేయడం సాధ్యం కాదు. కిరణ్‌ విషయంలో అదే జరుగుతోంది. చిదంబరం పెట్టిన కాండిడేట్‌ కదా, దిగిపోమంటే దిగిపోతాడు అనుకున్నారు. నీలాటి అర్భకుణ్ని ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెసు పట్ల విధేయత లేదా? అంటే విధేయత వుంది, దానితో పాటు సమైక్యత పట్ల నిబద్ధత కూడా వుందని చెప్పారట కిరణ్‌. రాష్ట్రపతిపాలన పెడితే తప్ప యితన్ని దింపలేరు. అంతకంటె అప్రతిష్ట లేదు. ఓ మామూలు సిఎం సోనియాకు ఎదురు తిరిగాడని లోకానికి విదితం అయిపోతుంది. రేపు ఎన్నికల వేళ ప్రతీవాడూ తోక ఝాడిస్తాడు. టిక్కెట్టు యివ్వకపోతే చూస్కో అని బెదిరిస్తాడు. మాట వినని భార్య గురించి బయట చెప్పుకోలేని భర్తలా అయిపోయింది సోనియా పరిస్థితి. అందుకే తీవ్రచర్య తీసుకోవడానికి వెనుకాడుతూ దొడ్డిదార్లు వెతుకుతున్నారు. (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2013)

                                           Click here for part-3

                                           Click here for part-2

                                           Click here for part-1

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?