Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సమైక్యవీరులు -1

ఈ మధ్య ఎటుచూసినా సమైక్యవీరులు కనబడుతున్నారు. వీళ్లను తయారుచేసిన ఘనత కాంగ్రెసుదే అని చెప్పాలి. పుట్టించేవాడు, గిట్టించేవాడు దేవుడే అన్నట్టు విభజనా, సమైక్యమూ రెండూ కాంగ్రెసు పుణ్యమే. నిద్రాణ స్థితిలో జారుకున్న తెలంగాణ అంశాన్ని జాగృతం చేస్తూ హఠాత్తుగా జులై 30న ప్రకటన చేయడమే కాక, సీమాంధ్రుల ఆందోళనను ఏ మాత్రం పట్టించుకోకుండా ‘మీరంటే ఖాతరు లేదు, మీరెలా చచ్చినా పట్టించుకోము’ అని బాహాటంగా చాటుతూ ఇన్నాళ్లూ ఆదమరచి నిద్రించిన సీమాంధ్రులను రెచ్చగొట్టింది. ఇక సమైక్య ఉద్యమం అంటుకుంది. ఆ మంట యీ లెవెల్లో వుంటుందని తెలియక యిన్నాళ్లూ తాత్సారం చేసిన నాయకులంతా వెంటనే ఆ ఉద్యమంలోకి దూకి నాయకత్వం వహించేద్దామని ఉబలాటపడ్డారు. కానీ ప్రజలు వాళ్లని దగ్గరకు రానివ్వలేదు. మిమ్మల్ని నమ్మి యిన్నాళ్లూ మోసపోయింది చాలు అంటూ దూరంగానే పెట్టారు. అధికారంలో వున్న కాంగ్రెసు వాళ్ల పరిస్థితి మరీ అన్యాయమై పోయింది. రాజీనామాలు ఆమోదింపచేసుకోకుండా వచ్చేరేం అని తరిమితరిమి కొడుతున్నారు. 

సమన్యాయం పాట అందుకున్న టిడిపి వాళ్లను పెద్దగా గౌరవించటం లేదు. హరికృష్ణ తప్ప తక్కినవాళ్లెవరూ రాజీనామాలు చేయలేదని తెలియగానే జనాలు ఆశ్చర్యపడ్డారు. అదేమిటని అడిగితే - మేం చేసి ప్రయోజనం ఏముంది, కాంగ్రెసువాళ్లు చేయాలి కానీ అంటున్నారు. అధికారంలో వున్నవాళ్లు రాజీనామా చేయడానికి తటపటాయించారంటే ఏదో స్వార్థం వుంటుందిలే అనుకోవచ్చు. కానీ ప్రతిపక్షంలో వున్నవాళ్ల కేమొచ్చింది, పదవీ లేదు, పాడూ లేదు. ఎంపీగా మిగిలిన సమయం కూడా కొద్ది నెలలే. గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు, ఉద్యమంకోసం త్యాగం చేశా అని పోజు కొట్టవచ్చు కదా. అది కూడా చేయలేదంటే ఎంత నాటకం ఆడార్రా బాబూ అనిపించింది. చంద్రబాబుగారు సమైక్య ఉద్యమానికి మద్దతు యిస్తానంటారు. కానీ నోటితో సమైక్యం అనరు. ఢల్లీిదాకా వెళ్లి దీక్ష చేశారు. ఏం సాధించారో తెలియలేదు. సోనియాకోసం ఇటాలియన్‌ పదాలు నేర్చుకున్నారు కానీ మనకోసం ఒక్క చక్కని తెలుగుపదం - ‘సమైక్యం’ నేర్చుకుని పలకటం లేదు. విభజనకు అనుకూలమే అంటారు, కానీ పద్ధతి యిది కాదంటారు, ఏదో చెప్పరు. మీది విభజనవాదమో, సమైక్యవాదమో చెప్పండి చాలు అంటే గందరగోళంగా మాట్లాడతారు. పైగా మా మాటల్లో క్లారిటీ వుంది అంటారు. ఆయన దృష్టిలో యిదే క్లారిటీ అయితే గందరగోళం ఎలా వుంటుందో వూహించడానికే భయంగా వుంది. 

తెలంగాణలో పార్టీకి దెబ్బ తగులుతుంది కాబట్టి జాగ్రత్తగా వున్నాం అని ఆంధ్ర టిడిపి నాయకులు సంజాయిషీ చెప్తారు. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలే లేవు. ఏమైనా వుంటే అవి సమైక్య వుద్యమానికి విఘాతం కలిగించేవే. సమన్యాయం జరిపేదాకా విభజన ఆపాలని కేసు వేసిన పయ్యావులను యర్రబెల్లి దుయ్యబట్టారు. ఆంధ్రులు బ్రిటిష్‌ వారి కంటె ఘోరం అంటారు రేవంత్‌. వీరిని కంట్రోలు చేయలేని చంద్రబాబును సీమాంధ్రులు ఎందుకు ఆదరిస్తారు? సోనియా పక్కనే బాబుకి సీటు వేస్తున్నారు. అది గమనించని టిడిపి సమైక్య ఉద్యమంలో వున్న వారందరిపై బురద చల్లుతూ పోతోంది. జగన్‌, కిరణ్‌, కెసియార్‌ అందరూ సోనియా ఏజంట్లే అంటోంది. కిరణ్‌, జగన్‌ సమైక్యం ముసుగులో విభజనకు సహకరిస్తున్నారని అంటుంది. కనీసం వాళ్లకు ముసుగైనా వుంది. టిడిపికి అదీ లేదు కదా. వాళ్ల దృష్టిలో సమైక్యవాదులంటూ ఎవరూ లేరు. మరి వాళ్ల పార్టీలో సమైక్యం అంటూ అడావుడి చేసే దేవినేని, పయ్యావుల వంటి నాయకుల మాట ఏమిటో చెప్పాలి. పోనీ ప్రజలైనా సమైక్యం పక్షాన వున్నట్లు బాబు గుర్తించారా? గుర్తించి వుంటే వారి పక్షాన నిలవాలి కదా! ఈయన చెప్తున్న ప్యాకేజీలు, రాజధాని నిర్మాణానికి కోట్లు.. వగైరాలు వాళ్లు విననప్పుడు, వాళ్ల మాటైనా యీయన వినాలి. ‘లేదు అరిచి గీ పెట్టినా వినను. ఎందుకంటే మేం గతంలోనే తెలంగాణకోసం లేఖ యిచ్చేశాం.’ అని అంటే ఎలా? ఇప్పుడు హోం శాఖ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తోంది. అనుకోకుండా మళ్లీ యింకో ఛాన్సు వచ్చింది టిడిపికి. కనీసం దాంట్లోనైనా టిడిపి మా విధానం సమైక్యం అంటుందా? అనలేకపోతే విభజన యీ పద్ధతుల్లో జరగాలి అంటూ బ్లూ ప్రింటైనా యివ్వాలి. లేకపోతే సీమాంధ్రుల్లో టిడిపి విశ్వసనీయత పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుంది.

టిడిపియే కాదు, ఏ పార్టీ ఐనా అనేకసార్లు పాలసీలు మార్చుకుంటూ వుంటారు. ఒకప్పుడు సమైక్యానికి నిలబడిన సిపిఐ యిప్పుడు విభజన అనలేదు. మద్యనిషేధం గురించి, రెండు రూపాయలకు బియ్యం గురించి టిడిపి తన విధానాలను మార్చుకోలేదా? సీమాంధ్రలో ఉవ్వెత్తున్న వచ్చిన ఉద్యమం చూసి జగన్‌ తన స్టాండ్‌ మార్చుకోలేదా? అధిష్టానం మాట శిరోధార్యం అన్న కిరణ్‌ కూడా మారలేదా? బత్స, పనబాక, చిరంజీవి, పళ్లంరాజు... యిలా చాలామంది గతంలో కంటె మెట్టు దిగి ‘కనీసం హైదరాబాదును యుటి చేయండి’ అని హై కమాండ్‌ను బతిమాలుకుంటున్నారు. ఇందరు మారగా లేనిది బాబు ఎందుకు మారకూడదు? ‘మీరేమనుకున్నా సరే, గతంలో నేను యిచ్చిన మాటకు కట్టుబడి వుండాల్సిందే’ అని మొండికేస్తే సోనియాకు, యీయనకు తేడా ఏముంది? సోనియా కూడా యిలాగే మాట్లాడుతోంది కదా! తమను నాశనం చేయడానికే సోనియా విభజన తలపెట్టిందని టిడిపి చెపుతూంటే నవ్వు వస్తుంది - వీళ్లేదో పెద్ద ఫోర్సు అని ఎలా అనుకుంటున్నార్రా అని. టిడిపి ఒకప్పుడు ఫోర్సు. ఇప్పుడు కేవలం ఫార్సు. రెండు చోట్లా వున్నాం అనుకుంటూ రెండు చోట్లా గుడ్‌విల్‌ పోగొట్టుకున్నారు. ఎన్టీయార్‌ ప్రవచించిన తెలుగు ఆత్మగౌరవం నినాదాన్ని, సమైక్య నినాదాన్ని వైకాపా తన్నుకుపోతే బాబు చూస్తూ వూరుకుంటున్నారు. 

‘కొత్త రాష్ట్రాలకు రాజధాని కట్టడం మా స్పెషాలిటీ. అభివృద్ధి చేయడంలో మమ్మల్ని తలదన్నేవారు లేరు, విడిపోయాక సమైక్యం అనే నినాదానికి అర్థం లేకుండా పోతుంది. అప్పుడు ఫోకస్‌ అంతా నిర్మాణం మీదనే. దానికి మమ్మల్నే పిలవాలి. ఈ కారణం చేత మమ్మల్ని యిరుప్రాంతాల్లో ఎన్నుకోక తప్పదు - యిదీ బాబు నమ్మకం,  ఆయన సమర్థకుల వాదన. ఏదైనా కట్టాలంటే కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవాలి. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం బాబుతో స్నేహం నెరపేది, బాబు మద్దతుపై ఆధారపడేది అయితేనే నిధులు వస్తాయి. బాబు పార్టీ అంటే పడని ప్రభుత్వం వస్తే నిధులు రావు. ఇక రెండో పాయింటు - నిర్మాణం చేయగల శక్తి బాబుకి మాత్రమే వుందనడం వింత వాదన. హైదరాబాదులో ప్రభుత్వ సంస్థల లిస్టు అంటూ వందకు పైగా సంస్థల పేర్లు యీ మధ్య ఫార్వార్డ్‌లో తెగ వస్తున్నాయి. బిఎచ్‌ఇఎల్‌, డిఫెన్సు లాబ్స్‌, ఆర్డినెన్సు ఫ్యాక్టరీ, నిమ్స్‌... యిలా బోల్డు వున్నాయి. వాటిలో తొమ్మిదేళ్ల బాబు హయాంలో వచ్చినవి ఎన్నో ఒక్కసారి పరికించి చూడండి. మీకే తెలుస్తుంది హైదరాబాదుకు ఖ్యాతి తేవడంలో యీయన పాత్ర ఎంత పరిమితమో! కాంగ్రెసు ప్రభుత్వాల హయాంలో ఎన్నో సంస్థలు వచ్చాయి. ఎన్‌టిఆర్‌ హయాంలోనూ కొన్ని వచ్చాయి. వాళ్లెవరూ కొట్టుకోనంతగా యీయన డప్పు కొట్టుకోవడం వలన బాబు లేకపోతే ఆంధ్రప్రదేశ్‌ అడుక్కుని తింటుందన్న బిల్డప్‌ యిచ్చే మీడియా తయారైంది. ఎన్నికలు దగ్గరపడిన కొద్దీ యీ విషయం తేటతెల్లం అయేసరికి టిడిపికి ఎన్నికల్లో యుఎస్‌పి ఏదీ లేకుండా తయారవుతుంది. సమైక్యనినాదం చేపట్టకపోతే ఎక్కడా ఉనికి లేకుండా పోతామన్న స్పృహ బాబుగారికి కలిగేదాకా ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2013)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?