డల్లాస్‌ లో రాయలసీమ వనభోజనాలు

డల్లాస్‌ ఏరియా రాయలసీమ అసోసియేషన్‌ వారు మొదటిసారిగా డల్లాస్‌ లో నిర్వహించిన రాయలసీమ వనభోజనాల కార్యక్రమం గత ఆదివారం విజయవంతంగా జరిగింది. ఈ వనభోజనాలకి 300 మంది పైన రాయల సీమ ప్రాంతానికి చెందిన…

డల్లాస్‌ ఏరియా రాయలసీమ అసోసియేషన్‌ వారు మొదటిసారిగా డల్లాస్‌ లో నిర్వహించిన రాయలసీమ వనభోజనాల కార్యక్రమం గత ఆదివారం విజయవంతంగా జరిగింది. ఈ వనభోజనాలకి 300 మంది పైన రాయల సీమ ప్రాంతానికి చెందిన వారు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో రాయల సీమలో సహజంగా చేసుకొనే అన్ని రకాల వంటలను  అక్కడే చేయడం జరిగింది. రాగి సంగటి,మటన్‌ కూర, కోడి పులుసు, పరమాన్నము,దోసలు,ఎర్ర కారం, వుగ్గాని/ బొరుగుల చిత్రాన్నం, ఉడకబెట్టిన చనక్కాయలు, మెంతుల పప్పు, సాంబారు, వంకాయ వేపుడు, రవ్వ లడ్డ్లు, పుచ్చకాయలు, మొక్క జొన్నలు,  ఇంకా రకరకాల ఘుమ ఘుమ లాడే వంటకాలను అక్కడే వండి ఆరగించడం జరిగింది. వంటకాలు మాయాబజార్‌ సన్నివేశాన్ని గుర్తుకు తీసుకురావడంతో పాటు షడ్రసోపేత భోజనం అందరికీ ముఖ్యంగా రాయలసీమను గుర్తుకు వచ్చేలా చేసింది.

ఆ తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్కడ నిర్వహించిన ఆటా పాటలలో మహిళలు, పిల్లలు,పురుషులు అందరూ పాల్గొనడం జరిగింది. అమెరికాలో పిల్లలు ఎప్పుడూ సోఫాలో కూర్చొని వీడియో గేములతో కాలం గడపడం సహజం.కానీ పిల్లలు ఆట స్థలంలో రకరకాల ఆటలు ఆడుకొని సేదదీరడం మళ్ళీ ఇండియాలో గడిపిన బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది.పెద్దలతో పాటూ పిల్లలు చక్కగా అన్ని ఆటలలో పాల్గొని సరదాగా సాయంత్రాన్ని గడిపారు. స్పూనులో పెట్టిన నిమ్మకాయ పడిపోకుండా నడిచే ఆట పిల్లలనే కాకుండా పెద్దలని కూడా సంబర పెట్టింది.టగ్‌ ఆఫ్‌ వార్‌ ఆటలో అబ్బాయిలూ, అమ్మాయిల ఆట చాలా రసవత్తరంగా సాగింది, చివరికి అమ్మాయిలే గెలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇక ఆలుమగలు కలిసి ఆడిన ఆటలు చాలా సరదాగా జరిగాయి. రాయలసీమకి చెందిన వాళ్ళంతా ఒక చోట చేరి ఆదివారం సాయంత్రాన్ని సరదాగా గడపడం అందరినీ ఆనందపరిచింది. 

కార్యక్రమం చివరలో సహర్ష్‌ ఎక్కడా తడబడకుండా చక్కగా జాతీయగీతాన్ని ఆలపించి అందరినీ మైమరపింపజేసాడు.తెలుగు సినీ గాయనీమణులు కోసల్య, రేవంత్‌, భార్గవి పిళ్ళై, సినీ నటి మాధవీలత మరియూ పాప్‌ సింగర్‌ మధు వనభోజనాలకి వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అందరినీ సరదాగా కాసేపు తమ పాటలతో అలరించారు. మంచు లక్ష్మి ప్రసన్నను అనుకరిస్తూ  పాప్‌ సింగర్‌ మధు చేసిన సందడి అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. వారికి డల్లాస్‌ ఏరియా రాయలసీమ అసోసియేషన్‌ వారి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు. 

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరి కృషి వుంది. ఇలాంటి కార్యక్రమాలను రాబోయే రోజుల్లో మరిన్ని చేయాలని అందరూ తలంచారు. ఈ వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ డల్లాస్‌ఏరియా రాయలసీమ అసోసియేషన్‌ వారి తరుపున పేరు పేరునా ధన్యవాదాలు.

రాబోయే రోజుల్లో ఇలాంటి వనభోజనాలను ప్రతి సంవత్సరం చేయాలని డల్లాస్‌ఏరియా రాయలసీమ అసోసియేషన్‌ వారు నిర్ణయించారు. టెక్సాస్‌ రాష్ట్రంలో వున్న ప్రతి రాయల సీమ వాసి కూడా ముందు ముందు జరుగబోయే రాయల సీమ వనభోజన కార్యక్రమాలలో పాల్గొనాలని డల్లాస్‌ ఏరియా రాయలసీమ అసోసియేషన్‌ వారి విజ్ఞప్తి.