Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సమైక్యవీరులు -3

ప్రస్తుతం నడుస్తున్న పాలన చూస్తూంటే యుపిఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎంతటి ఆశావాదీ చెప్పలేడు. ధరలు పెరిగిపోయాయి, అవినీతి ఆరోపణలు పెచ్చుమీరాయి. మన్‌మోహన్‌ కీర్తి మసకబారింది. అవతల మోదీ దూసుకుంటూ వస్తున్నారు. అందువలన కేంద్రంలో కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి రాదని సర్వే ఫలితాలు చెపుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలలో స్థానిక నాయకుల కారణంగా కాంగ్రెసు బలంగా వుండి కొన్ని సీట్లు తెచ్చుకుంటుంది. మోదీకున్న యిమేజి కారణంగా బిజెపి గణనీయంగా సీట్లు పెంచుకున్నా, ప్రధానిగా మోదీ ఆమోదయోగ్యుడు కాకపోవచ్చు. అందువలన ప్రాంతీయపార్టీలన్నీ కలిసి బేరాలాడుకుని ఓ కూటమి తయారుచేస్తే దానికి కాంగ్రెసో, బిజెపియో బయటనుండి మద్దతు యివ్వవచ్చు. ఇలా ఏదైనా సంభవమే. అందువలన ప్రాంతీయపార్టీలన్నీ తమ బలం పెంచుకోవడంపై దృష్టి సారిస్తాయి. వైకాపా కూడా అదే దృక్పథంతో వుంది. 'సోనియాకు తోక' అనే ముద్ర పడితే ప్రజలు ఛీకొడతారు. అందువలన పోనుపోను జగన్‌ సోనియాపై మరింత ఘాటు విమర్శలు చేయడం తథ్యం. సోనియా విభజన చేశారు కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా నిలబడడానికి సమైక్యజపం మరింత ధాటీగా చేస్తారు, చేస్తున్నారు. సోనియా విదేశీయత గురించి పదేపదే ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని ఇటలీ వెళ్లిపోమంటే బాధగా వుండదా? అని అడుగుతున్నారు.

ఇప్పుడు సమైక్యత కోసం అంటే ఢిల్లీ ప్రయాణం కట్టారు. అన్ని పార్టీలనీ కలుస్తారట. మంచిదే. ఇతరులెంతమందిని కలిసినా బిజెపిని కలిసి ఒప్పించడమే ముఖ్యం. బిజెపి తలచుకుంటే బిల్లు ఆగిపోతుందని అందరికీ తెలుసు. బిజెపి విధానాలంటే సరిపడని సమైక్యవాది సైతం యిప్పుడు బిజెపి కేసే ఆశగా చూస్తున్నాడు. గుండెల్లో సమైక్యం వున్నా తన నోటితో సమైక్యం అనలేని చంద్రబాబు బిజెపి ద్వారా మళ్లీ విభజనను ఆపిస్తారని చాలామందికి అనుమానం. విభజన వలన తన బావుకునేది లేదని గ్రహించిన బిజెపి బాబు మాట వినవచ్చు కూడా. ఎందుకంటే టిడిపి-బిజెపి పొత్తులో చాలా సమంజసత వుంది. ఎన్నికల తర్వాత యుపిఏ ప్రభుత్వంలోకి రాని పక్షంలో (దానికే ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి) బిజెపి నేతృత్వంలో ఎన్‌డిఏ అధికారంలోకి వస్తే బాబు మద్దతు యివ్వవచ్చు. వాళ్లు తీసుకోనూ వచ్చు. అలా మద్దతిచ్చిన బాబు రాష్ట్రంలో తనకు పక్కలో బల్లెంగా వున్న జగన్‌ను మళ్లీ జైలుకి పంపాలని కోరవచ్చు. మరిన్ని కేసులు బనాయించాలని కోరనూ వచ్చు. ఈ భయంతో జగన్‌ యిప్పుడు బిజెపిని కలిసి 'టిడిపి కంటె నాకు ఎక్కువ సీట్లు వస్తాయి. బాబును దూరం పెడితే నేనే మద్దతు యిస్తాను చూస్కోండి. నా పై కాంగ్రెసు కేసులు పెట్టినట్టు బాబుపై కూడా పెట్టాలి మరి' అనవచ్చు. బిజెపి యిద్దరికీ భుజం తట్టి ఎన్నికల తర్వాత ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారివైపు మొగ్గి యింకోరి భరతం పట్టవచ్చు. చేతిలో సిబిఐ వుంటే చాలు, ఏమైనా చేయవచ్చుగా. 

2014 ఎన్నికల తర్వాత మూడో ఫ్రంట్‌కు గాని, యుపిఏకు గాని మద్దతు యిస్తాను తప్ప మతతత్వ పార్టీ అయిన బిజెపితో ఛస్తే కలవను అని ప్రకటించిన జగన్‌ యీరోజు రాజకీయావసరాలకై యిలా బిజెపివైపు మొగ్గడం ఎబ్బెట్టుగానే వుంటుంది. అందుకే సమైక్యం అనే బ్యానర్‌పై కలుస్తున్నాడు. గతంలో నానాగోత్రాల వాళ్లూ కలిసి మూడో ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పరచారు. దరిమిలా యుపిఏకు మద్దతు యిచ్చారు. ఎందుకు? అంటే ఒకటే సమాధానం - 'అవినీతి, అసమర్థత కన్న మతతత్వం చాలా ప్రమాదకరమైనది. బిజెపి మతతత్వ పార్టీ కాబట్టి దాన్ని అధికారం నుండి దూరంగా వుంచడానికి మేం మాకిష్టం లేకపోయినా సెక్యులరిస్టు పార్టీ అయిన కాంగ్రెసుకు మద్దతిస్తున్నాం, లేదా జనతాదళ్‌కు యిస్తున్నాం..' యిలా చెప్పుకునేవారు. మీడియా కూడా లాలూ, ములాయం, మాయావతి, జయలలిత యిలాటి వాళ్లపై కూడా ఆదరం చూపుతుంది - ఎందుకంటే వాళ్లు సెక్యులరిస్టులు! సెక్యులరిజం అనే పేరు చెపితే చాలు ఎవరినైనా, ఎన్ని లోపాలున్నా వాటేసుకోవచ్చు యీ దేశంలో! ఇప్పుడు జగన్‌కు అలా సమైక్యం దొరికింది. సమైక్యం కోసం బిజెపితో కలుస్తున్నా అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 'మోదీ పరిపాలనాదకక్షుడు, మతతత్వం కాస్త తగ్గించుకుంటే మంచి నాయకుడు' అని ఓ కితాబు - పడి వుంటుంది కదాని- పడేశాడు. 

మోదీని యిలా పొగడుతున్న నోటితోనే సోనియాను నానా తిట్లూ తిడుతోంది వైకాపా. 'మేం విభజనను అడ్డుకోలేము, కేంద్రమీదే భారం వేసి వుంచాము. హస్తినవాసినీ తల్లీ, తండ్రి వలె మమ్మల్ని చూడుము, సమన్యాయము చేయుము అని బతిమాలాము' అని నిన్నటిదాకా చెప్పిన ధోరణికి, యీనాటి ధిక్కారధోరణికి హస్తిమశకాంతరం వుంది. మెజారిటీ తెలుగు ప్రజల్లో సమైక్యానికి డిమాండు వుందని, విభజన అవకతవకగా జరగడం పట్ల తెలుగువారందరూ ఆగ్రహిస్తున్నారనీ గ్రహించినమీదట వచ్చిన ధీమా యిది. సమైక్య ఛాంపియన్‌గా వెలిగిపోవడానికి జగన్‌ ఏ ఛాన్సూ వదలటం లేదు. తనవరకూ ప్రయత్నించుకుంటే తప్పు లేదు. కానీ అదే చేత్తో యితర సమైక్యవాదులను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్‌. తను తప్ప తక్కిన అందరూ కుహనా సమైక్యవాదులే అని, వాళ్లు చేసేదంతా కుట్ర అనీ, బయటకు సమైక్యవాదం అన్నా లోపలంతా విభజనవాదమే అనీ చూపించడానికి సర్వయత్నాలూ చేసి వెగటు పుట్టిస్తున్నారు జగన్‌. ఆయన టార్గెట్లు యిద్దరు - బాబు, కిరణ్‌. 

బాబు సిద్ధాంతరీత్యా సమైక్యవాది అయినా ఓట్లకోసం విభజనవాదం వల్లిస్తున్నారని అందరికీ అనుమానం. కాంగ్రెసు తెలంగాణ యివ్వదన్న ధీమాతో వేరుతెలంగాణ వైపు చాలా దూరం వెళ్లిపోయారనీ, మళ్లీ వెనక్కి రావడానికి, మాట మార్చడానికి అవస్థపడుతున్నారని, బింకం కొద్దీ పాత లేఖకు కట్టుబడి వున్నారు కానీ  తనకు చెడ్డపేరు రాకుండా విభజన ఆగిపోతే అంతేచాలని ప్రార్థిస్తున్నారనీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారూ నమ్ముతారు. లేఖ యిచ్చినా తెలంగాణలో టిడిపి ఏమీ పుంజుకోలేకపోవడానికి యిదే కారణం. వచ్చే నాలుగూ ఓట్లూ టిడిపికి ఎప్పటినుండో వున్న ఓటు బ్యాంకు కారణంగా వస్తున్నాయి తప్ప వేరుతెలంగాణా వాదులెవరూ టిడిపికి ఓటెయ్యడం లేదు. తెరాసతో పొత్తు పెట్టుకోవడం తను చేసిన ఘోరతప్పిదంగా బాబు  పలుమార్లు చెప్పుకున్నారు. ఎన్‌డిఏ హయాంలో బిజెపితో చెప్పి తెలంగాణ ఆపించానని కూడా చెప్పుకున్నారీమధ్య. ఇప్పుడు తెలంగాణ కల సాకారం కాబోయే తరుణంలో పయ్యావుల, సిఎం రమేష్‌ వంటి బాబు ఆత్మీయులు కోర్టుకు వెళ్లారంటే ఆయన ఆశీస్సులు లేవని ఎవరు నమ్మగలరు? కాంగ్రెసుపార్టీలో ఎవరు పడితే వాళ్లు ఏది కావాలంటే అది మాట్లాడతారు. సబ్‌ కుఛ్‌ చల్తా. కానీ టిడిపి కాంగ్రెసు వంటి పార్టీ కాదు. అధినాయకుణ్ని దాటి ఎవరూ వెళ్లలేరు. ఒక్క తెలంగాణ విషయంలో తప్ప తక్కినవాటిలో టిడిపి వారందరిదీ ఒకటే మాట. తెలంగాణ విషయంలో మినహాయింపు ఎందుకంటే రెండు చోట్లా రెండు రకాల సెంటిమెంట్లు వున్నాయి కాబట్టి! 'ఎవరు ఏం మాట్లాడినా అవేమీ లెక్కలోకి రావు. నేను చెప్పినదే ఫైనల్‌' అని బాబు ఎప్పుడో హెచ్చరించారు. ఆయన ఏమీ చెప్పరు. ఒకవేళ చెప్పినా అర్థమయ్యేట్లు చెప్పరు. అందువలన బాబుని టార్గెట్‌ చేయడం యీజీ. పైగా అవిశ్వాస తీర్మానం పెట్టలేదని, ఎఫ్‌డిఏ బిల్లుకు అనుకూలంగా వ్యవహరించారని.. వంటి ఉదాహరణలు చూపి బాబు, సోనియా కుమ్మక్కయ్యి ఉమ్మడి శత్రువైన తనను జైల్లో పెట్టించారనీ జగన్‌ ఎప్పణ్నుంచో ఆరోపిస్తున్నారు. పైగా బాబు బాహాటంగా సమైక్యం అనటం లేదు. అందువలన ఆయనను సమైక్యవాది కాదని నిరూపించడం కష్టం కాదు. (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌

                                           Click here for part-2

                                           Click here for part-1

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?