సచిన్‌.. ‘రత్న’మేగానీ.!

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇకపై భారతరత్న పురస్కారాన్ని తన ముందు చేర్చుకోబోతున్నాడు. కేంద్రం సచిన్‌కి భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం విదితమే. సచిన్‌కి భారతరత్న పురస్కారం రావాలనే డిమాండ్‌ చాలాకాలంగా వుంది. అదే…

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇకపై భారతరత్న పురస్కారాన్ని తన ముందు చేర్చుకోబోతున్నాడు. కేంద్రం సచిన్‌కి భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం విదితమే. సచిన్‌కి భారతరత్న పురస్కారం రావాలనే డిమాండ్‌ చాలాకాలంగా వుంది. అదే సమయంలో సచిన్‌కి భారతరత్న ఏంటి.? అనే వివాదాలూ అనేకం విన్పించాయి.

వివాదాల సంగతెలా వున్నా, సచిన్‌ నూటికి నూరుపాళ్ళూ భారతరత్న పురస్కారానికి అర్హుడే. అయితే ఈ పురస్కారం ఆయనకు అందే టైమ్‌ విషయంలోనే మళ్ళీ వివాదాలు విన్పిస్తున్నాయి. క్రికెటర్‌గా సచిన్‌ సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం క్రికెట్‌లో అతను సృష్టించిన రికార్డుల కారణంగా కాదు, కొత్త తరం క్రికెటర్లు రావడానికీ.. భారత క్రికెట్‌ జట్టు ప్రపంచంలో మేటి జట్టు అవడానికీ అతను మార్గదర్శి అయ్యాడంటే.. అది చాలు అతనికి భారతరత్న పురస్కారం ఇవ్వడానికి.

సచిన్‌ ఇప్పుడు ఎంపీ. రాజ్యసభ సభ్యుడు. ఇటీవలే ఆ పదవి అందుకున్నాడు సచిన్‌. రాజ్యసభకూ హాజరవుతున్నాడు. స్పోర్ట్స్‌ కోటాలో సచిన్‌కి ఆ పదవి వచ్చినా, ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ కావడంతో సచిన్‌ని కాంగ్రెస్‌ మనిషిగానే పరిగణించాలి. అలా ఓ పార్టీకి చెందిన వ్యక్తికి.. క్రికెట్‌లో సాధించిన విజయాలకు గుర్తింపుగా.. అంటూ పురస్కారం ప్రకటించడమే సచిన్‌ అభిమానుల్ని ఆవేదనకు గురిచేస్తోంది.

సచిన్‌ అనే ఓ క్రికెటర్‌కి భారతరత్న పురస్కారం దక్కితే అభిమానులు చేసుకునే పండగ అలా ఇలా వుండేది కాదు. ఇప్పుడూ సంబరాలకు తక్కువేం కాకపోయినా, ఓ వెలితి, ఓ మచ్చ.. సచిన్‌ మీద వేసేసింది రాజకీయం. రేప్పొద్దున్న సచిన్‌, కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారానికి దిగితే.. అతను ఖచ్చితంగా కొందరివాడే అయిపోతాడు.