కొత్త రాష్ట్రం సీమాంధ్ర రాజధాని ఎక్కడ?

‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం విడిపోవడం జరగదు. అడ్డుకుంటాం. రాజ్యాంగబద్ధంగా లేని ప్రక్రియ తుదికంటా ముందుకు వెళ్లే అవకాశం లేదు గాక లేదు..’’ ఇలాంటివన్నీ ముసలి వ్యాఖ్యలు అయిపోయాయి ఇప్పుడు. రాష్ట్ర విభజన ఖరారు అని…

‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం విడిపోవడం జరగదు. అడ్డుకుంటాం. రాజ్యాంగబద్ధంగా లేని ప్రక్రియ తుదికంటా ముందుకు వెళ్లే అవకాశం లేదు గాక లేదు..’’ ఇలాంటివన్నీ ముసలి వ్యాఖ్యలు అయిపోయాయి ఇప్పుడు. రాష్ట్ర విభజన ఖరారు అని తేలిపోయింది. ఇప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడినా సరే.. మాటల కత్తులు దూసినా సరే.. యాత్రల మాత్రలు ప్రయోగించినా సరే.. వారి ప్రయత్నాలు యావత్తూ.. విభజన అనంతర పరిణామాల్లో తాము గరిష్టంగా లబ్ధి పొందడం ఎలా? అన్న వ్యూహాల్లో భాగం మాత్రమే!

కాకపోతే వర్తమానంలో వాస్తవంగా జరుగుతున్న ఏకైక కసరత్తు రాష్ట్ర రాజధాని గురించి! పైకి మాట్లాడినా మాట్లాడకపోయినా.. నాయకులందరూ ఢిల్లీలో దేబిరిస్తున్నది తమకు అనుకూలమైన ప్రాంతాల్లో రాజధాని నగరం ఏర్పాటు చేయడం గురించి. అటు ఢిల్లీ పెద్దలు కూడా కుస్తీలు పడుతున్నది కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఏ నగరాన్ని ఎంపిక చేయాలనే విషయం గురించే! ఆ తలనొప్పిని ఏర్పడబోయే కొత్త రాష్ట్రం నెత్తిన రుద్దేసి తాము సుఖపడిపోవాలనే ఆలోచన కూడా వారికి ఉన్నది గానీ.. ప్రస్తుతం అటు  హస్తినాపురం, ఇటు భాగ్యనగరం.. ఇంకాలోనికి వెళితే.. సీమాంధ్ర ప్రాంతంలోని వాడవాడలా వేడిగా జరుగుతున్న చర్చ రాజధాని గురించే!

ఒంగోలు, విశాఖ, విజయవాడగుంటూరు మధ్య, విజయవాడ, మాచర్ల.. ఇలా చాలా కాంబినేషన్లు వినిపిస్తున్నాయి. కనీసం రాజధాని కూడా దక్కకపోతే రాయలసీమ నోట మట్టే అనే కోణంలోంచి అప్పుడే కయ్యానికి కాలుదువ్వే పోకడలు కూడా కనిపిస్తున్నాయి. కానీ రాజధాని అంటే అదేమీ చిన్న వ్యవహారం కాదు. చాలా విసృ్తతమైన కసరత్తు జరగాల్సిన వ్యవహారం. చాలా చాలా అంశాలను పరిశీలించాల్సిన వ్యవహారం. అందుకే రాజధాని గురించి కేంద్రం రాష్ట్రం లోని నాయకులు అనేకులు రకరకాల కసరత్తులు చేస్తున్తన వేళ.. ఏయే ఊర్లలో ఎలాంటి సానుకూల, ప్రతికూలాంశాలు ఇమిడి ఉన్నాయో విశ్లేషించే ప్రయత్నం చేస్తోంది గ్రేట్‌ఆంధ్ర.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలు కాబోతున్న సంగతి ఖరారు. అందరూ ఏదో మాయలో పడి కొట్టుకుంటూ కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నది అంటూ ఊదర గొడుతున్నారు గానీ.. నిజానికి కొత్తగా ఏర్పడుతున్నది సీమాంధ్ర రాష్ట్రమే. రాష్ట్రం అంటూ ఏర్పడుతున్నప్పుడు.. దానికి ఒక రాజధాని కూడా ఉండడం అవసరం. ఏదో ఆపద్ధర్మంగా వాన వెలిసే దాక మా పంచన నిల్చుని వెళ్లండి అని తెలంగాణ సోదరులు వారి ఔదార్యాన్ని చాటుకోవచ్చు గాక.. తెగనరికే గొడ్డలి వేటు వేసేస్తూ.. గాయానికి ఓ బ్యాండేజీ ఇచ్చినట్లుగా ఓ పదేళ్లు ఇక్కడ ఉండి వెళ్లొచ్చులే అని నయగారపు మాటలతో కేంద్ర నవవంచన పర్వానికి తెరలేపవచ్చు గాక.. పదేళ్లు ఎందుకూ? ఇవాళ ఉన్న టెక్నాలజీలో రెండేళ్లు చాలవూ అంటూ మరెవ్వరైనా సన్నాయి నొక్కులు నొక్కవచ్చు గాక… నిజానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన.. విభజన విషయంలో ఇక తాము చేయగలిగింది ఏమీ లేదనే క్లారిటీ వచ్చిన చాలామంది  ప్రముఖులు మాత్రం.. విభజనే జరిగిపోయేట్లయితే రెండు సంవత్సరాలు కాదు కదా.. రెండు రోజులైనా హైద్రాబాదులో అసలు ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించే క్రమంలో ఉన్నారు.  ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు గుడారాలు వేసి ప్రభుత్వ కార్యాలయాలు నడిపినట్లుగా ఇప్పుడు కూడా.. రోడ్డు మీద, మైదానాల్లో ఆఫీసులు పెట్టుకుని అయినా సరే.. మన రాజధానిని మనం నిర్మించుకుంటూ.. పనిచేసుకుంటూ బతుకుదాం అనే స్థిరాభిప్రాయానికి మొగ్గుతున్న వారే ఎక్కువ. ఇలాంటి రకరకాల అభిప్రాయాల నేపథ్యంలో కొత్త సీమాంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ? అనే చర్చ విసృ్తతంగానే జరుగుతోంది. 

ప్రధానంగా నాయకులు లేదా ప్రజాసంఘాలు లేదా మరో వర్గాల ద్వారా కొన్ని నగరాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరువిజయవాడ మధ్యలో, ఒంగోలు, మాచర్ల అనేవి ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు. రాజధానుల జాబితాలో ఆశ్చర్యకరంగా కొత్తగా చేరిన పేరు మాచర్ల. నిజానికి రాయలసీమ వాసులనుంచి రాజధాని తమ ప్రాంతంలోనే పెట్టాలనే డిమాండు కూడా ఒకటి చాలా తీవ్రంగానే వినిపిస్తోంది. అది కూడా చర్చనీయాంశమే. ముందుగా ప్రధానంగా పరిగణనలో ఉన్న నగరాలు, వాటి సంభావ్యతలను పరిశీలించాలి. 

ఏం ఆలోచిస్తున్నారంటే…

ఢిల్లీలోని మీడియా, రాజకీయ వర్గాల ద్వారా గ్రేట్ ఆంధ్రకు అందుతున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి.. ఒక్క విషయంలో  మాత్రం నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉంది. హైదరాబాదులో జరిగిన తప్పిదం మళ్లీ రిపీట్ కాకూడదని మాత్రం అనుకుంటున్నారు. అభివృద్ధిని సీమాంధ్ర రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు పంచేలా ప్లాన్ చేస్తున్నారు. కేంద్రం ప్రస్తుతానికి యోచిస్తున్న దాన్ని బట్టి.. విశాఖపట్టణంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి.. పారిశ్రామిక, అంతర్జాతీయ విపణి రాజధానిగా తీర్చిదిద్దుతారు. చిత్తూరు జిల్లాను ప్రత్యేకించి ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతారు. ఇందుకు గల అవసరాలకు ఉపయోగపడేలా రేణిగుంట విమానాశ్రయాన్ని కూడా అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు ఉన్నాయి. దీన్ని త్వరిగతిన పూర్తిచేస్తారు. దానితో పాటూ చెన్నై, బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలుల చిత్తూరు జిల్లాలోని ఏ ప్రాంతానికైనా కనిష్టంగా గంటనుంచి గరిష్టంగా 34 గంటల ప్రయాణ దూరంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు చెన్నైకు గంటదూరం కూడా ఉండని సత్యవేడు నుంచి, ఇటు బెంగుళూరుకు గంట దూరం కూడా ఉండని కుప్పం ప్రాంతం వరకు వివిధ ప్రదేశాల్లో ఐటీ హబ్‌ను అభివృద్ధి చేస్తారు. అలాగే పరిపాలన పరమైన రాజధానిని ఎక్కడ కేంద్రీకృతం చేయాలనే విషయంలోనే ఇంకా ఆలోచనలు నడుస్తున్నాయి. ప్రస్తుతానికి కేంద్రం సంకల్పిస్తున్న దాన్ని బట్టి.. విజయవాడగుంటూరు మధ్యలోనే ఏర్పాటుచేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. 

అయితే ముందుగా కేంద్రం పరిశీలనలో రాజధానికి యోగ్యమైనవిగా ఉన్న వివిధ నగరాలు, అక్కడి సాధకబాధకాలు, అనుకూల ప్రతికూలతలను ఒకసారి బేరీజు వేస్తే.. 

విశాఖపట్టణం : 

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులంతా కొత్త రాష్ట్రానికి రాజధానిగా విశాఖపట్టణాన్నే ఎంపిక చేయాలని కోరుతున్నారు. మంత్రి కొండ్రు లాంటి వాళ్లు అయితే సమైక్యం లేదా విశాఖ రాజధాని లేదా విశాఖ సహా ఉత్తరాంధ్రను తెలంగాణలో కలిపేయడం అనే ప్రతిపాదన చేసినవారే! అదే సమయంలో కేంద్రమంత్రి, సమైక్యవాదినని చెప్పుకోవడం మినహా ప్రజలకోసం గానీ, రాష్ట్రంకోసం గానీ… ఇప్పటిదాకా తానుచేసిన కృషి వీసమెత్తు కూడా లేని సీనియర్‌నాయకుడు కిశోర్ చంద్రదేవ్.. అందరికంటె తీవ్రమైన స్వరంతో విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రతిపాదిస్తున్నారు. ఆయన ఏకంగా అసలు అన్ని వసతులతో అనుగుణంగా విశాఖపట్టణం ఉండగా.. మళ్లీ రెండేళ్లయినా సరే హైదరాబాదులో రాజధాని పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అని నిలదీస్తున్నారు. అయితే విశాఖను రాజధానిగా ప్రతిపాదించే వారంతా రాష్ట్రానికి అభివృద్ధి పరంగా మరో ద్రోహం చేయడానికి కుట్ర పన్నుతున్న వారే అని భావించాలి. 

ఎందుకంటే రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం ఒకేచోట గుమ్మరించి, అభివృద్ధి మొత్తం ఒక్క హైదరాబాదులో కేంద్రీకరింపజేసిన దుష్ఫలితమే.. ఇవాళ రాష్ట్ర విభజన! హైదరాబాదు ఒక్కటే కాకుండా.. రాష్ట్రమంతా సమంగా అభివృద్ధి చెందిఉంటే గనుక.. తెలంగాణ వాదుల కన్ను కుట్టి వారు ప్రత్యేక రాష్ట్రాన్ని అడిగిఉండేవారే కాదేమో కూడా! అలాంటి నేపథ్యంలో.. విశాఖపట్టణంలో ఇతరత్రా సంభావ్యతల గురించి అవకాశాల గురించి కూడా తర్కించకుండానే.. ఇక్కడ రాజధాని ఏర్పాటును వ్యతిరేకించాలి. ఇప్పటికే ఏర్పడబోయే కొత్త సీమాంధ్ర రాష్ట్రం అంతటిలోకి ఎక్కువ అభివృద్ధి చెంది ఉన్న నగరం విశాఖ. రాజధాని కూడా అక్కడే ఏర్పాటుచేస్తే మిగిలిన రాష్ట్రం ఎందుకూ కొరగాకుండా పోతుందనడం నిస్సంశయం. అందుకే మిగిలిన అవకాశాలు ఎలా ఉన్నాయనే విషయంతో నిమిత్తం లేకుండా.. ప్రాక్టికల్‌గా ఆలోచించే నిష్పాక్షికంగా వాదించే వారు అక్కడ రాజధానిని వ్యతిరేకించాలి. 

విజయవాడ, విజయవాడగుంటూరు మధ్యలో :

ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు రాజధానులు అని అందరూ అంటుండేవారు. హైదరాబాదు రాష్ట్ర పరిపాలన రాజధాని అయితే.. పారిశ్రామిక రాజధాని విశాఖ అని, రాజకీయ రాజధాని విజయవాడ అని, ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి అని భాష్యం చెబుతుండేవారు. అయితే రాజకీయ రాజధానిగా  విజయవాడకు ఉన్న ముద్ర ఒకప్పటి నాటిదనిఅది కాస్తా చెరగిపోయి, ఇతరత్రా మచ్చపడే అనేక నెగటివ్ అంశాల రాజధానిగా పేరు తెచ్చుకుంటున్నదని వాదించేవారు ఉన్నారు. కానీ విజయవాడ నగరం గానీ.. గుంటూరు విజయవాడ మార్గమధ్యంలో గానీ రాజధాని ఏర్పాటు అనేది.. ఒకే రకమైన పర్యవసానాలను కలిగి ఉంటుంది. ఇప్పటికే రాజధానికి యోగ్యమైన స్థాయికి ఎదిగి ఉండే వరకు ఈ నగరాలు ఓ మేర ముందంజలో ఉండవచ్చు గానీ.. ఇక్కడ రాజధాని ఏర్పాటు ప్రాక్టికల్‌గా చాలా కష్టం అనే ఎక్కువ మంది భావిస్తున్నారు. 

ఇంత జనసమ్మర్దమైన నగరాల్లో కొత్తగా రాజధాని అనే ఒత్తిడి జతకావడం అంటే.. ప్రజాజీవితం గందరగోళంగా మారిపోతుందని ఎక్కువ మంది భయపడుతున్నారు. రాజధాని ఏర్పడడం అంటే కనీసం లక్ష ఎకరాల ప్రభుత్వ ఖాళీ భూముల లభ్యత అవసరం అని అందరూ అంటున్నారు. అంత స్థాయిలో స్థలాలు ఈ రెండు నగరాల పరిధిలో అసాధ్యం అని చెప్పగలిగే స్థాయిలో అవి ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్నాయి. 

పైగా రాజధాని అంటే కేవలం భూమితో సరిపోదు. రాజధానిగా ఎంపికయ్యే ప్రాంతంలో రమారమిగా లక్ష వరకు కొత్త కుటుంబాలు అక్కడ స్థిరపడాల్సిన అవసరం కూడా కొంత కుడిఎడమగా ఏర్పడుతుంది. అయితే అంత పెద్ద సంఖ్యలో కుటుంబాలకు ఏమాత్రం గూడు కల్పించగల స్థితిలో ఈ నగరాలు లేవన్నది నిజం. ఇప్పటికే ఈ నగరాల్లో ఇళ్ల అద్దెలు, ధరలు ఇత్యాది వ్యవహారాలు హైదరాబాదుతో పోటీ పడే విధంగా ఉంటున్నాయి. దానికి తోడు రాజధాని ఒత్తిడి కూడా తోడైతే.. ఇక ఇక్కడి పౌరజీవనం. దుర్భరంగా మారిపోవడం గ్యారంటీ. ఒకసారి జనజీవితం దుర్భరం అయ్యాక.. కొత్తగా వచ్చి స్థిరపడే వారికి మాత్రమే కాదు.. ఇక్కడ ఆల్రెడీ బతుకుతున్న వారి జీవితాలు కూడా హఠాత్తుగా పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లుగా మంటగలిసిపోయే ప్రమాదం ఉన్నదని పలువురు భావిస్తున్నారు. 

ఒంగోలు, మాచర్ల :

కనీసం కొత్త రాజధాని అయినా యావత్తు రాష్ట్రానికి సమానంగా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఒక మౌలికమైన ప్రాతిపదిక అయ్యేట్లయితే.. అందుకే ఈ రెండు ప్రాంతాలు అర్హమైనవిగా నిలుస్తాయి. ఒంగోలు కర్నూలు రహదారిలోని వేలాది ఎకరాల అటవీ భూమిని నిర్మూలనం చేసి.. అక్కడ రాజధాని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు నడుస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఒంగోలు కచ్చితంగా రాజధాని కాబోతున్నదనే ప్రచారంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొన్నమొన్నటి వరకు చాలా జోరుగా సాగింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రతిపక్షాలకు చెందిన నాయకులతో సహా.. అనేకమంది బినామీ పేర్లతో ఒంగోలు పరిసరాల్లో వందల ఎకరాలను కొనుగోలుచేసినట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఒంగోలుకు రాజధాని కావడానికి ఉన్న ప్రతికూలతలను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు.

అన్నిటికంటె పెద్ద ఇబ్బంది నీటి లభ్యత. ఇప్పటికే ఒంగోలు, ప్రతిపాదిత కర్నూలు వైపు మార్గాల్లో నీటిఎద్దడి విపరీతం. అక్కడి ప్రజలేక తాగునీళ్లే దొరకని స్థితి. ఇలాంటి నేపథ్యంలో అక్కడ రాజధాని పేరిట జనం ఒత్తిడి పెంచడం అంటే.. సామాన్య జనజీవనాన్ని ఛిద్రం చేసేయడమే అనే భయం పెక్కుమందిలో ఉంది. అలాంటప్పుడు సమీప ప్రత్యామ్నాయంగా మాచర్ల ప్రాంతం కూడా పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. 

అయితే ఈ రెండు ప్రాంతాలకు ఉన్న కొన్ని కామన్ ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి వీటిలో కొన్ని. ఈ ప్రాంతాలను ఎంపిక చేస్తే.. కేంద్రం అంటున్నట్లుగా కొత్త రాజధాని ఏర్పాటు పూర్తి కావడానికి పదేళ్ల సమయం పడుతుందనడంలో అతిశయం లేకలపోవచ్చు. అయినా రాష్ట్రం మొత్తానికి సమదూరంలో ఉండాలని అనుకుంటున్నప్పుడు.. ఈ ప్రాంతాలకు మించిన  మరో ప్రత్యామ్నాయం లేకపోవడం కూడా గమనించాలి. 

ఏది మంచిది? ఏది చెడ్డది? ఎందుకు??

విజయవాడ గుంటూరు జిల్లాలను రాజధానికి ఎంపిక చేసేట్లయితే అది రాష్ట్రానికి చేటును నిర్దేశించడమే అవుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతం యావత్తూ కృష్ణా డెల్టా భూములే విస్తారంగా ఉన్నాయి. సమృద్ధిగా సేద్యం సాగే ప్రాంతం. రాజధాని పేరిట ఈ ప్రాంతాన్ని ఎంపిక చేస్తే గనుక.. ముందుగా రియల్ ఎస్టేట్ అనే ముసుగు కింద సేద్యం సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే రొయ్యల చెరువులు, చేపల చెరువులు పేరిట చాలా వరకు సారవంతమైన డెల్టా భూములు సారహీనంగా మారిపోతున్నాయి. ఇలాంటి పులమీద పుట్రలా మళ్లీ రాజధాని కూడా అంటే.. పచ్చటి పంట పొలాలు దుర్గమమైన కాంక్రీటు అడవులుగా మారిపోయే ప్రమాదం ఉంది. 

నాణేనికి మరోవైపు కోస్తాంధ్ర ప్రాంతానికంతా కలిపి ఒంగోలు, మాచర్ల ప్రాంతాలు మాత్రమే వెనుకబడిన ప్రాంతాలు అవుతాయి. యావత్తు సీమాంధ్రలో వెనుకబడిన ప్రాంతాల విషయానికొస్తే.. అటు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు కూడా నిగ్గుతేలుతాయి. అయితే.. పూర్తిగా రాష్ట్రం రెండు చివర్లలో ఉండడం వలన రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాలుగా భావించడం కుదరని పని. అదే ఒంగోలు, మాచర్ల ప్రాంతాల్లో అయితే ఇక్కడ సేద్యాన్ని తగుమాత్రంగా అభివృద్ధి చేయడానికి నీటివనరులు కూడా లేవు. అవకాశం కూడా లేదు. ఈ ప్రాంతాల్లో రాజధాని రావడం ఆ ప్రాంతాల సమగ్ర వికాసానికి దోహదం చేసినట్లు అవుతుంది. 

సీమ డిమాండు ఏమిటి? ఎలా సాధ్యం?

భౌగోళికంగా.. ఏర్పడబోయే కొత్త సీమాంధ్ర రాష్ట్రానికి ఒక చివర్న అంచులా ఉండిపోవడం అనేది రాయలసీమ ప్రాంతానికి ఉన్న ప్రతికూలాంశంగా చెప్పుకోవాలి. నిజానికి వారు రాజదాని తమేక ఉండాలని డిమాండు చేయడంలో ధర్మం ఉంది. అదివరలో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని కర్నూలుగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక అది రూపుమాసిపోయింది. ఇప్పుడు కర్నూలు వారు మా రాజధాని మాకివ్వండి అని అడుగుతున్నారు కూడా. కానీ సీమ జిల్లాల వాళ్లు ఎక్కువగా కనీసం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు ఆస్కారం ఉన్న తిరుపతినైనా రాజధానిగా చేయండి అనే డిమాండును వినిపిస్తున్నారు. ఇది కూడా ప్రాక్టికల్‌గా ఇబ్బంది కరమైన సంగతి. 

సీమాంధ్ర రాష్ట్రం ఒక గీతలా ఉన్నదనుకుంటే ఒక చివర్న తిరుపతి ఉంటుంది. అటు చివరినుంచి ఉత్తరాంధ్ర వాసి రాజధానితో పని ఉండి రావాలంటే.. వారికి నరకం కనిపిస్తుందనడంలో సందేహం లేదు. పైగా ఇప్పటికే ప్రపంచంలోనే ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతి జనసమ్మర్దం దృష్ట్యా పరిసర ప్రాంతాలు ఊర్లు, పట్టణాలు అన్నీ కూడా ‘చిక్కగా’ తయారైపోయి ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాజధాని ఏర్పాటుకు అవసరం అని భావిస్తున్న దాదాపు లక్ష ఎకరాల ప్రభుత్వ భూముల లభ్యత అనేది తిరుపతి పరిసరాల్లో అసాధ్యం. ఇలాంటి నేపథ్యంలో రాజధాని కోసం రాయలసీమ వాసుల డిమాండు నెరవేరే అవకాశం కనిపించడం లేదు. 

అంతా బ్రోకర్ల పుకార్లే!

రాజధానిగా ఎవ్వరు ఏమాట చెబుతున్నా కూడా.. అంతా రియల్ ఎస్టేట్ బ్రోక్లర్ల దందా వ్యవహారాల్లాగానే కనిపిస్తున్నాయి. అచ్చంగా రియల్  బ్రోకర్లు మాయ చేసే తీరులోనే ప్రతి ఊరులోనూ ఇది రాజధానిగా ఎంపిక అయ్యే అవకాశం ఉందని అంటున్న వారు.. తమ తమ వాదనకు అనుగుణంగా.. కొన్ని డాక్యుమెంట్లను, పేపర్ కటింగులను, అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలు అంటూ కొన్ని ప్రభుత్వ సీళ్లు ఉన్న కాగితాలను చూపిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా  చూస్తోంటే.. కొత్త రాజధాని ముసుగులో రియల్ దందాలు చెలరేగిపోవడానికి పెద్దఎత్తునే కుట్ర జరుగుతున్నట్లుగా పలువురు భావిస్తున్నారు. 

రైతులనుంచి పొలాలు కొంటున్నప్పుడు ఎవ్వరూ ఏమీ డాక్యుమెంట్లను గట్రా చూపించరు, తాము పెద్ద కంపెనీలకు లేదా ఇతరులకు అమ్మదలచుకున్నప్పుడు మాత్రం ఇలాంటి డాక్యుమెంట్లను చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఒంగోలులో రాజధాని వస్తుందనే పుకార్లతో అక్కడ కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. పరిస్థితి ఎలా మారిపోయిందంటే అక్కడ ఇప్పుడు బిజినెస్ ఆగిపోయింది. రకరకాల అనుమానాలతో పాటూ, అక్కడ వ్యాపారం కూడా ఒక స్థాయికి చేరుకున్న తరువాత అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇప్పుడు తాజాగా ఇతర ప్రాంతాల పేరుతో రాజధాని ప్రచారం నడుస్తున్నదని కూడా కొందరు అనుమానిస్తున్నారు. 

కొత్త చికాకులకు తెరెత్తకుంటే చాలు!

కొత్త సీమాంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఏ ప్రాంతాన్నయినా ఎంపికచేయవచ్చు గాక.. కానీ ఇక్కడి ప్రజల మధ్య మళ్లీ కొత్త చికాకులు తగాదాలు రేగే ప్రమాదం లేకుండా ఎంపిక జరిగితే చాలు అని ఎక్కువమంది కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న తెలుగుజాతి ఇప్పుడు పరస్పరం ద్వేషించుకుంటున్నట్లుగా రగిలిపోతూ ఉంది. సరే.. ఎటూ ఈ రాష్ట్రం రెండు ముక్కలు అయిపోబోతోంది గనుక.. ఈ ద్వేషాగ్నులు చీలికతో చల్లారుతాయని అనుకోవచ్చు. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో అటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్రల మధ్య మళ్లీ మరో విద్వేషాగ్నిని రగిల్చకుండా కొత్త రాజధాని ఎంపిక జరిగితే చాలు. అదే పదివేలు అని జనం అనుకుంటున్నారు. 

ఏ నగరం ఎందుకు ఎంపిక అయినప్పటికీ.. అభివృద్ధి కేంద్రీకరణ పరంగా హైదరాబాదు విషయంలో చేసిన పొరబాట్లే మళ్లీ సీమాంధ్ర రాష్ట్రంలో రిపీట్ కాకూడదని వారు కోరుకుంటున్నారు. సకలం రాజధాని పదం కింద ఎంపిక చేసిన నగరంలోనే కాకుండా.. ఐటీ, పారిశ్రామిక రంగం, హైకోర్టు ఇలా.. కొన్ని కీలక ప్రధాన రంగాలను వేర్వేరు నగరాల్లో స్థిరపడేలా దృష్టి కేంద్రీకరించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి సమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

ఈ తరహా విన్నపాల్లో స్వార్థ రాజకీయ శక్తులకు ఎంత వరకు చెవికి సోకుతాయో.. ఎంతవరకు గాల్లోకలిసిపోతాయో తెలియదు. రాష్ట్రాన్ని చీల్చడానికి ఓటుబ్యాంకు ప్రాధాన్యాలను ఎంచుకుంటున్న ప్రభుత్వాలు/ పార్టీలు.. కొత్త రాజధాని ఎంపికలో మాత్రం నిష్పాక్షికంగా వ్యవహరిస్తాయని అనుకోవడం భ్రమ. నిర్ణయాధికారం చేతుల్లో ఉండే పార్టీలు నిష్పాక్షికతకు పాతరేసి, స్వార్థప్రయోజనాలే పరమావధిగా రాజధాని ఎంపికకూ తెగబడతాయి. ఇలాంటి కుట్రలు మంటగలసిపోయేలా, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రాజధాని ఎంపిక జరిగేలా ప్రజాసంఘాలు, ప్రజాందోళనలే పూనిక వహించాలి.

కపిలముని

[email protected]