Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: తోడికోడళ్లు - 2/2

నవల, హిందీ సినిమా ప్రకారం చిన్న తమ్ముడు గ్రామానికి వెళ్లినా అతని దరిద్రం వదల్లేదు. అక్కడ వుద్యోగం ఏదీ దొరకలేదు. పైగా అక్కడ మనోహర్‌బాబు అనే విలన్‌ తయారయ్యాడు. అతను వీళ్ల భూములు చూస్తూ ఐవేజు దిగమింగేవాడు. ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు చిన్నతమ్ముడు వచ్చి లెక్కా డొక్కా అడిగేసరికి అతనికి ఒళ్లు మండింది. ఇతనికి పైసా యివ్వకుండా, పట్నంలో గిరీశ్‌ వద్దకు వెళ్లి చందర్‌కు డబ్బు యిచ్చానని చెప్పాడు. అతను అది నమ్మాడు. డబ్బు విషయంలో తమను మోసం చేస్తున్నాడు కాబట్టి బుద్ధి చెప్పాలని పెద్దన్నగారి పేరు మీదుగా చందర్‌పై కేసు నడిపించాడు. కేసు బలంగా వుండాలని తమ ఇంట్లోంచి వెళుతూ నగలు పట్టుకుపోయారని ఫిర్యాదులో చేర్చాడు. పల్లెటూళ్లో చందర్‌ వున్న యింటిని పోలీసుల చేత సోదా చేయించాడు. ఇల్లు ఖాళీ చేయించాడు. గత్యంతరం లేని పరిస్థితిలో భార్య నగలు అమ్మి చిన్న తమ్ముడు కేసు ఫైట్‌ చేశాడు. 'డబ్బు లేకపోతే చందర్‌ కేసు ఎలా ఫైట్‌ చేయగలరు, ఇంట్లోంచి డబ్బు ఎత్తుకుపోయారు' అని గిరీశ్‌ వదినగార్ని కన్విన్స్‌ చేశాడు. ఆవిడ నమ్మింది. నవలలో ఈ మనోహరబాబు పాత్ర గురించి స్పష్టంగా వుండదు. హిందీ సినిమాలో బాసు చటర్జీ డెవలప్‌ చేశారు. సన్నివేశాలు కల్పించి అన్నదమ్ముల మధ్య గొడవ ఎందుకు వచ్చిందో చెప్పారు. తెలుగులో యింకా చాలా చక్కగా మార్చారు. 

తెలుగు సినిమాలో చిన్నతమ్ముడు అర్భకుడు కాదు. అతనూ, అతని భార్యా కలిసి బంజరు భూములను సాగు చేయడం మొదలెట్టారు. అంతేకాదు, పని దొరక్క పట్నం వెళదామనుకుంటున్న గ్రామవాసులను అర్బనైజేషన్‌ వల్ల నష్టాలు చెప్పి అందరూ కలిసి భూమిని బాగు చేసుకుందామని పిలిచాడు. సహకార వ్యవసాయంలో లాభాల గురించి నచ్చచెప్పాడు. గ్రామాలను విడిచి పెట్టి బస్తీకి వెళ్లి అవస్తలు పడవద్దని ఈ సినిమాలో పదే పదే చెపుతూ 'బస్తీకి పోదామే డింగరీ..' పాట కూడా పెట్టారు. ఇక్కడ ఈ చిన్న తమ్ముడు యిలా దేశాభ్యుదయానికి పాటు పడుతూ వుంటే అక్కడ రేలంగి  సర్వవిధాలా భ్రష్టు పట్టిపోయాడు. దానికి కారణం అతని భార్య అసూయ, దురాశ. దాన్ని ఆసరా చేసుకుని జగ్గయ్య ఆడిన ఆట. తన భర్తను ప్రయోజకుణ్ని చేయించమని సూర్యకాంతం జగ్గయ్యను అడిగింది. ఓ యస్‌  వ్యాపారం చేయిస్తా అంటూ అతను ఆమె నుంచి డబ్బు పట్టుకెళ్లి రేలంగికి వ్యసనాలు అంటించాడు. తన ప్రియురాలిని అంటగట్టాడు. పేకాట ఆడించి డబ్బంతా లాక్కున్నారు. వ్యాపారానికి యింకా పెట్టుబడి కావాలి అంటూ సూర్యకాంతాన్ని ఒత్తిడి చేశాడు. వ్యాపారం కోసం కాబోలు అనుకుని ఆమె ఇనప్పెట్టెలోంచి డబ్బు కొట్టేసి వీళ్లకు యిచ్చేసింది. ఇవన్నీ నవలలో లేవు. తెలుగువాళ్లు కల్పించినదే. 

ఇది చివరకు ఎంత దూరం వెళ్లిందంటే పల్లెటూళ్లో వున్న వ్యాపారి చదలవాడ అన్నగారికై యిచ్చిన డబ్బుని రేలంగి పేకాటలో పోగొట్టుకుని అతను యివ్వమని గట్టిగా అడిగేసరికి పెద్దన్నగారి సంతకం ఫోర్జరీ చేసి ఆయన పేర ప్రోనోటు రాసేసేడు. తెలుగు సినిమాలో యీ ప్రోనోటు చాలా ముఖ్యమైన మలుపుకి కారణమైంది. నా ఫోర్జరీ ఎప్పటికైనా బయటపడుతుంది కదా గండం గట్టెక్కడం ఎలా? అని రేలంగి భయపడితే నీ భార్య నగలు ఎత్తుకు రా అని జగ్గయ్య సలహా చెప్పాడు. ఇతను తాగి వచ్చి భార్యను చితకతన్ని మర్నాడు నగలు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయినవాడు తన భర్తే అని తెలిసి సూర్యకాంతం గొల్లుమంది. కానీ జగ్గయ్య అక్కడా మోసం చేశాడు. నగలు అమ్మితే వెయ్యి రూపాయలే వచ్చిందని చెప్పాడు. ఆ వెయ్యీ కూడా రాజసులోచన కొట్టేసింది. రేలంగి కష్టాలు తీరలేదు. చదలవాడ తన ప్రోనోటు చెల్లింపుకై రంగారావు వద్దకు మనిషిని పంపించి అడిగినప్పుడు యిదేం నాకు తెలియదని పెద్దాయన తిట్టి పొమ్మన్నాడు. దాంతో చదలవాడ కేసు వేద్దామనుకుని నాగేశ్వరరావుతో చెప్తే సావిత్రి బావగారి బాకీ చెల్లింపు కింద తన నగలు యిచ్చేసింది. 

ఈ ఫైనాన్షియల్‌ గొడవలు ఓ పక్కన జరుగుతూంటే ఎమోషనల్‌గా ఎక్కువ నలిగినది పెద్దావిడ. నోటి దురుసుతనంతో చిన్నతోడికోడల్ని దూరం చేసుకుంది. తనకు మాలిమి అయిన వాళ్లబ్బాయి దూరం కావడం భరించలేకపోయింది. అర్ధరాత్రి భర్తను లేపి పిల్లాణ్ని అప్పగించమని కేసు పెట్టమంది. నీకేం మతి లేదా? పోయి పడుకో అన్నాడు మొగుడు. ఇక్కడ డ్రామా పెంచడానికి తెలుగులో సున్నివుండల సీను పెట్టారు. కన్నాంబ సావిత్రి పిల్లాడి కోసం సున్నుండలు చేసి గుమాస్తా చేత పంపించింది. కానీ సూర్యకాంతం అతనికి లంచం పెట్టి వాళ్లు తిప్పికొట్టారని చెప్పించింది. కన్నాంబకు రోషం వచ్చి వాళ్లపై మరింత కోపం పెంచుకుంది. జరిగిన మోసం తర్వాత పనిమనిషి ద్వారా బయటపడినప్పుడు కన్నాంబ సూర్యకాంతాన్ని తిట్టిపోసింది. భర్త దగ్గరకు వెళ్లి ఏదో గందరగోళం జరుగుతోంది మీరు వెళ్లి విషయాలు కనుక్కోండి అంది. 

పెద్దన్నగారు పల్లెటూరికి వెళ్లి విషయాలు స్వయంగా వెళ్లడంతో విషయాలన్నీ తేటతెల్లమవుతాయి. నవలలో, హిందీ సినిమాలో పిల్లవాడికి జ్వరం వచ్చినట్టుగా కల వచ్చిందని వెళ్లమని  పెద్దావిడ భర్తను కోరుతుంది. ఆమె మాట కొట్టేయలేక ఆయన చిన్న తమ్ముడిమీద భగభగలాడుతూ వెళ్లాడు. అతని సొంత తమ్ముడు యిచ్చిన కలర్‌ ప్రకారం - చిన్నవాడు పల్లెటూరిలో తమ యింట్లో మకాం పెట్టేశాడు. భూములమీద ఐవేజు అంతా తినేస్తున్నాడు. పైగా ఆస్తి తనదే అంటూ తనమీదే కేసు వేశాడు. నామీద కేసు వేస్తాడా వీడు? అన్న కోపంతో వెళ్లాడు. నిజానికి అక్కడ పరిస్థితి వేరేగా వుంది. తనమీద పెట్టిన తప్పుడు కేసు ఎదుర్కోవడానికి అతను కేసు ఫైట్‌ చేస్తున్నాడు. 

తెలుగు వెర్షన్‌లో కూడా అన్నా-తమ్ముళ్ల మధ్య కేసు వుంది. కానీ అది వాళ్ల ఆస్తి గురించి కాదు. సమాజం కోసం ఫైట్‌ చేసినట్టు చూపారు. భార్య నగలు దొంగిలించి తెగనమ్మినా రేలంగి కష్టాలు తీరలేదు కదా. అందుకని జగ్గయ్య సలహాతో అతను నాగేశ్వరరావు, రైతులు సహకార వ్యవసాయం చేస్తున్న భూములపై పడ్డారు. ఫలసాయం చేతికందే సమయానికి గూండాలను వేసుకెళ్లారు. రైతులు గూండాల్ని ఎదిరించారు. అప్పుడు రంగారావుకి నాగేశ్వరరావుగురించి చెప్పుడు మాటలు చెప్పేసి అతని పేర నోటీసు పంపారు - పంట స్వాధీనం చేసుకుంటామని. పోలీసులు వచ్చి జప్తు చేశారు. నాగేశ్వరరావు సిద్ధాంతాల కోసం కోర్టులో అన్నగార్ని ఎదిరిస్తానన్నాడు.

ఒరిజినల్‌ నవలలో, సినిమాలో పెద్దాయన గ్రామానికి వచ్చాడు. ఆ రోజే కోర్టు హియరింగ్‌ అంటూ తమ్ముడు ఆశీర్వాదం తీసుకుని వెళ్లాడు. వాడికి నాలుగు అక్షింతలు వేసి, యిటు షీలాకేసి చూసేసరికి తెల్లబోయాడు. మన యింట్లో లేరెందుకు? నగలేవీ? వాడు అమ్ముకు తినేశాడా? అని ప్రశ్నలు కురిపించాడు. అప్పుడామె ఏడుస్తూ కథంతా చెప్పేసింది. జరిగినది తెలియగానే పెద్దాయన తన పొరబాటుకు నిష్కృతి చేసుకున్నాడు. పల్లెటూరిలో ఆస్తంతా షీలా పేర రాసేశాడు. కేస్‌ విత్‌డ్రా చేసుకున్నాడు. అది విని రెండోవాడు హతాశుడయ్యాడు. భార్య అత్యాశే తననీ స్థితికి తీసుకుని వచ్చిందని గ్రహించి 'పద వెనక్కి పట్నా పోదాం' అన్నాడు. ఇన్నాళ్లూ కలతలు రేపినవాళ్లు వెళ్లిపోతూ వుంటే చందర్‌, షీలా వచ్చి చేరారు. ఒట్టి అయోమయం మనిషిలా కనబడే తన భర్త ఔన్నత్యాన్ని పెద్దావిడ గుర్తించి ఆయన కాళ్లకు నమస్కరించింది.

తెలుగులో రంగారావు వూరు వెళ్లేదానికి ఓ సందర్భం కల్పించారు. అతని కూతురు పెళ్లి నిశ్చయమైంది. నాగేశ్వరరావును, సావిత్రిని పెళ్లికి స్వయంగా వెళ్లి పిలవాలని భార్య పట్టుబట్టడంతో అతను వెళ్లాడు. ఆయన బయలుదేరగానే రేలంగికి గుబులు పుట్టింది - తను ఫోర్జరీ చేసిన ప్రోనోటు విషయం బయటపడుతుందని. ఆయన కంటె ముందుగా వూరు చేరి, ప్రోనోటు కాజేశాడు. నాగేశ్వరరావు పెంచుకుంటున్న కుక్క చూసి మొరిగింది. ప్రోనోటు వున్న బ్యాగ్‌ పట్టుకుని జగ్గయ్య స్కూటర్‌పై పారిపోతూండగా కుక్క వెంటాడింది. ఇంతలో నాగేశ్వరరావు, సావిత్రి వచ్చి రేలంగిని పట్టుకున్నారు. అదే సమయానికి వచ్చిన రంగారావు నాగేశ్వరరావును అపార్థం చేసుకున్నాడు. సావిత్రి బోసి మెడ చూసి బాధపడ్డాడు. మీరు రాసిన ప్రోనోటు గురించే అమ్మానని నాగేశ్వరరావు చెపితే రేలంగి అబద్దమని దబాయించాడు. నిజమైతే ప్రోనోటు చూపించమని ఛాలెంజ్‌ చేశాడు. ఈలోగా కుక్క బారిన పడ్డ జగ్గయ్య బ్యాగ్‌ను వంతెన మీద నుంచి కింద నదిలోకి విసిరేశాడు. కుక్క నీట్లోకి దూకి బ్యాగ్‌ నోట పట్టుకుంది. జగ్గయ్య కుక్కను చంపుదామని దాని మీద బండరాయి పడేస్తే అది కుంటుకుంటూ వచ్చి ప్రోనోటు తెచ్చి యిచ్చింది. అది చూడగానే రంగారావుకి విషయాలన్నీ తేటతెల్లమయ్యాయి. నవలలో లాగానే అక్కడి ఆస్తి సావిత్రి పేర రాసేశాడు. తెలుగులో అదనంగా రైతులందరికీ మేలు చేశాడు. కన్నాంబ భర్త ఔన్నత్యాన్ని మెచ్చుకుంది. చెరపకురా చెడేవు అన్న రీతిలో చెడిపోయిన సూర్యకాంతం భోరుమంది. క్షమాపణ కోరింది. తోడికోడళ్లందరం కలిసివుందాం అనే పెద్దావిడ అందర్నీ అక్కున చేర్చుకుంది.

చూశారుగా, మనవాళ్లు ఎంతబాగా ఇంప్రోవైజ్‌ చేశారో! ఒరిజినల్‌ నవలలో ఫోకస్‌ అంతా పెద్ద తోటికోడలు మీదనే వుంటుంది. ఆవిడ మనోభావాలు, వాటి పర్యవసానాలు -యిదే కథ. రెండో కోడలు చుప్పనాతిదే కానీ మరీ అంత కాదు. చివరిలో కూడా పశ్చాత్తాపం చూపదు. కానీ తెలుగులో రెండో కోడలు పాత్ర ఎంతో మార్చారు. పల్లెటూరిదాన్ని చేసి దురాశతో దొంగతనాలు కూడా చేసి, భర్తను భ్రష్టు పట్టించి, నాశనమయ్యాక చివర్లో మారినట్టు చూపారు. హిందీ సినిమాలో గిరీశ్‌ కర్నాడ్‌ పాత్రకు, తెలుగులో రేలంగి పాత్రకు పోలికే లేదు. జగ్గయ్య పాత్ర అదనంగా చేర్చి రేలంగి, జగ్గయ్య పాత్రల్లో విలనీ, హాస్యం రెండూ కలిపారు. ఇక కథానాయకుడి పాత్రలో చేసిన ఇంప్రోవైజేషన్‌ చెప్పనే అక్కర్లేదు. నవలలో కానీ, హిందీ సినిమాలో కానీ అతన్ని చూస్తే తన్నబుద్ధేస్తుంది. మానాభిమానాలు లేకుండా హాయిగా యింట్లో తిష్ట వేస్తాడు. పనీ పాటా లేదంటారేమోనని పని చేయకపోయినా పాటలు మాత్రం పాడుతూ కూచుంటాడు. తెలుగులో హీరో ఆదర్శాలు వల్లించడమే కాదు, ఆచరణలో పెట్టి చూపిస్తాడు కూడా. సామ్యవాదం గురించి, సహకారవ్యవసాయం గురించి, గ్రామాల స్వయం సమృద్ధి గురించి సందేశాలను కూడా యీ కుటుంబగాథా చిత్రంలో చొప్పించారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, నిర్మాతలు దుక్కిపాటి, అక్కినేని.(సమాప్తం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?