cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ఇటాలియన్ మిడతంభొట్లు

ఎమ్బీయస్‍:  ఇటాలియన్ మిడతంభొట్లు

జ్యోతిషం తెలియకపోయినా ‘జాతకరత్న’గా చలామణీ అయిపోయిన వ్యక్తిని తెలుగునాట మిడతంభొట్లు అని, ఊహించి ఏదో చెప్పేసినా చెల్లుబాటు అయిపోయిన సందర్భాన్ని మిడతంభొట్లు జోస్యమనీ అంటారు. 18వ శతాబ్దంలో యూరోప్‌లో అలా చలామణీ అయిపోయిన ఒక వ్యక్తి గురించిన కథనం యిది. మిడతంభొట్లు మోసగాడు కాదు కానీ యీ జోసెఫ్ బల్సామో మోసగాడు. బంగారం తయారు చేస్తానని చెప్పి జనాలను మభ్యపెట్టి, దోచుకున్నాడు. ఈ దోపిడీలో అతని భార్య కూడా తోడయింది. అతని కథ ద్వారా ఆనాటి యూరోప్‌ సమాజంలోని చాదస్తాల గురించి, మూఢనమ్మకాల గురించి మనకు ఒక అవగాహన వస్తుంది. ఆ విధంగా యిది ఆసక్తికరమైన చారిత్రకగాథ.

బంగారం అనేది అప్పుడూ, యిప్పుడూ విలువైన లోహమే. అందరికీ దాని పట్ల వ్యామోహమే. అయితే బంగారుగనులు తక్కువ కాబట్టి, దాన్ని వెలికితీయడం కష్టమైన ప్రక్రియ కాబట్టి అడ్డదారుల్లో దాన్ని తయారుచేయడం ఎలా అనేదానిపై ప్రపంచ ప్రజలందరూ దృష్టి పెట్టారు. ఏదో ఒక ప్రక్రియతో ఒక పదార్థాన్ని మరో పదార్థంగా మార్చడాన్ని ఆల్కెమీ అంటారు. దీనిలోంచే కెమిస్ట్రీ (రసాయనశాస్త్రం) ఉద్భవించింది. పాదరసాన్ని కొన్ని రకాలైన ప్రక్రియలకు గురి చేస్తే అది బంగారంగా మారుతుందని అప్పట్లో అన్ని దేశాల ‘శాస్త్రవేత్తలు’ నమ్మారు. పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ చూస్తే పాదరసం (ఎచ్‌జి) ఎటామిక్ నెంబర్ 80, అనీ బంగారం (ఎయు) ఎటామిక్ నెంబర్ 79 అని తెలుస్తుంది. ఈ చార్ట్ తయారు కావడానికి ముందే పాదరసంలోంచి ఏదో ఒకటి తీసేస్తే బంగారం తయారవుతుందని అప్పటివాళ్లు గాఢంగా నమ్మారు.

మన దేశంలో రసాయనికి ప్రక్రియ ద్వారా బంగారం తయారు చేయడాన్ని రసవిద్య అనేవారు. పాశ్చాత్య దేశాల్లో ఆల్కెమీ అన్నారు. ఛార్లెస్ మేకే అనే స్కాటిష్ జర్నలిస్టు 1841లో రాసిన ‘ఎక్‌స్ట్రార్డెనరీ పాప్యులర్ డెలూజన్స్ అండ్ ద మేడ్‌నెస్ ఆఫ్ క్రౌడ్స్’ అనే పుస్తకం ప్రకారం బైబిల్ లోని నోవా (ఆర్క్ తయారుచేసినవాడు) కొడుకు కెమ్ అనేవాడు దీన్ని ప్రారంభించాడు కాబట్టి అతని పేరు మీదుగా ఆల్కెమీ అనే పేరు వచ్చింది. ఈజిప్టులో యిది వాడకంలో వుండగా మోజెస్ నేర్చుకున్నాడు. క్రీస్తు పుట్టుకకు 2 వేల సంవత్సరాలకు పూర్వమే చైనాలో వాడకంలో వుండేది. వీళ్లందరి ప్రయత్నమూ పరసువేదిని తయారుచేయడమే! దాన్ని ముట్టిస్తే నీచలోహం కూడా బంగారంగా మారుతుందని నమ్మకం. దీన్ని పాశ్చాత్యులు ‘ఫిలాసఫర్స్ స్టోన్’ అన్నారు. ఉత్తరభారతంలో ‘పారస్‌మణి’ అన్నారు.

దీనితో బాటు నిత్యయవ్వనాన్ని, చిరంజీవిత్వాన్ని కలగజేసే అమృతజలాన్ని కనిపెట్టడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. పాశ్చాత్యులు దాన్ని ఎలిగ్జిర్ వైటే లేదా వాటర్ ఆఫ్ లైఫ్ అన్నారు. ఇది చేసే తంత్రం మా దగ్గర వుందంటూ చాలామంది కుహనా శాస్త్రజ్ఞులు తరతరాలుగా రాజుల దగ్గర్నుంచి సామాన్యుల దాకా అందర్నీ మోసం చేస్తూ వచ్చారు. దీనితో బాటు భవిష్యత్తులోకి తొంగిచూసే శక్తులు వున్నాయంటూ చెప్పుకునేవారూ తయారయ్యారు. ఈ అతీతశక్తులన్నీ ఎలా కలగాపులగం అయిపోయాయంటే, ఒక విద్య వుందని చెప్పుకుంటే మరోటి కూడా తెలిసే వుంటుందని ప్రజలు అనుకునేవారు. అప్పుడే కాదు, యిప్పటికీ యిలాటి నమ్మకాలున్నాయి. లంకెబిందెలు ఎక్కడున్నాయో చెప్తామంటూ క్షుద్రపూజలు చేయించేవాళ్లు, ఫలానా జంతువు కొమ్మో, గోరో నూరి సేవిస్తే వీర్యవృద్ధి, ఆయుర్వృద్ధి కలుగుతాయని చెప్పేవాళ్లు యిప్పటికీ వున్నారు. వాళ్లని నమ్మి లక్షలకు లక్షలు ధారపోసేవారూ ఉన్నారు.

ఇప్పుడే యిలా వుంటే 18వ శతాబ్దంలో యూరోప్‌ దేశాల్లో పరిస్థితి ఎలా వుండేదో ఊహించండి. అప్పట్లో మంత్రగత్తెలు, సైతాను ఆరాధకులు వుండేవారని, వారికి తుపానులు తెప్పించే శక్తి వుండేదని, ఆత్మలతో మాట్లాడే శక్తి వుండేదని నమ్మేవారు కోకొల్లలు. దాన్ని సొమ్ము చేసుకున్న అనేకానేక వ్యక్తుల్లో ఒకడు జోసెఫ్ బల్సామో. 1743లో ఇటలీలోని పాలెర్మోలో బీదకుటుంబంలో పుట్టాడు. అడ్డాల్లో వుండగానే తండ్రిని పోగొట్టుకోవడంతో తల్లి బంధువుల పెంపకంలో రాయడం, చదవడం వరకు నేర్చుకున్నాడు. 15వ ఏట ఒక చర్చిలో చేరితే అక్కడ కెమిస్ట్రీ, ఫిజిక్స్ నేర్పారు. అది కాస్తకాస్తే వంటబట్టింది కానీ చెడుబుద్ధులు మాత్రం బాగా వంటబట్టాయి. కాస్త పెద్దయ్యాక చర్చిలోంటి బయటకు వచ్చేసి అల్లరిచిల్లరి బతుకు బతికాడు. థియేటర్ల వద్ద నకిలీ టిక్కెట్లు అమ్మేవాడు. తన దూరపుబంధువు విల్లు ఫోర్జరీ చేసి, డబ్బు సంపాదించాడు. వీధి గొడవల్లో యిరుక్కున్నాడు. దాంతో పలుమార్లు జైలుకి వెళ్లి రావలసి వచ్చింది.

మనదేశంలో ఒక నమ్మకం వుంది. శిష్టాచారం, అంటే ఆచారవంతులైన పూజారుల సాయంతో దేవిని పూజిస్తే ఫలితాలు చాలా ఆలస్యంగా వస్తాయని, అదే తాగుబోతులు, తిరుగుబోతులు అయిన అనాచారుల ద్వారా మకారపంచకం (మద్యం, మాంసం, మగువ లాటివి) ఉపయోగించి శ్మశానాల్లో అమావాస్య అర్ధరాత్రి క్షుద్రపూజలు చేస్తే (దీన్ని వామాచారం అని కూడా అంటారు) ఫలితాలు త్వరగా వస్తాయనీ అనుకుంటారు. అంటే మనిషి ఎంత భ్రష్టుడైతే క్షుద్రపూజలకు అంత బాగా పనికి వస్తాడన్నమాట. ఈ జోసెఫ్ విషయంలో కూడా అదే జరిగింది. వీడు తన ఆత్మను సైతానుకు అమ్మేసుకుని అతీంద్రియ శక్తులను సంపాదించాడని, దాని ద్వారా గుప్తనిధులను కనిపెట్టే శక్తి తెచ్చుకున్నాడని ఓ పుకారు పుట్టింది. అది నమ్మి ఓ కంసాలి యితని దగ్గరకు వచ్చాడు. ఇతను ‘ఒక గుహలో ఉన్న గుప్తనిధి గురించి తెలుసు. అక్కడికి తీసుకెళ్లి చూపిస్తాను. నువ్వు వెళ్లి తవ్వుకుంటే చాలు. చూపించగానే 60 ఔన్సుల బంగారం నాకు యిస్తే చాలు,’ అన్నాడు. కంసాలి ఒప్పుకున్నాడు.

ఓ అర్ధరాత్రి కంసాలిని ఊరి బయటకు తీసుకెళ్లాడు. జోసెఫ్ స్నేహితులు అరడజను మంది దెయ్యాల వేషాలు వేసుకుని అక్కడ నానా హంగామా చేశారు. వాళ్ల గౌన్లు, నెత్తిమీద కొమ్ములు, రాకాసి గోళ్లు, నోట్లోంచి వస్తున్న ఎఱ్ఱ అగ్నిజ్వాలలు చూసి కంసాలి మూర్ఛపోయాడు. వాళ్లు అతన్ని చితక్కొట్టి, వెంట తెచ్చుకున్న బంగారంతో బాటు ఒంటి మీద ఉన్న డబ్బు, ఉంగరాలూ దోచుకుని జీవచ్ఛవంలా వదిలేసి పారిపోయారు. మర్నాడు మెలకువ వచ్చాక, కంసాలికి కోపం వచ్చింది. న్యాయాధికారికి ఫిర్యాదు చేయవచ్చు కానీ దానివలన తన అత్యాశ బయటపడి, హేళనకు గురి కావచ్చు. అందువలన కిరాయి హంతకుణ్ని పెట్టి జోసెఫ్‌ను చంపించేద్దామనుకున్నాడు. అది చెవిన పడి, ఇటలీయే కాదు యూరోపే వదిలేసి పారిపోయి, అరేబియాలోని మదీనాలో తేలాడు జోసెఫ్.

అరేబియా అప్పట్లో అన్ని రకాల అధ్యయనాలకు వేదిక. ఆల్టోటాస్ అనే ఒక గ్రీకు పెద్దమనిషి, తూర్పు దేశాలలో తిరిగి అక్కడి భాషలు నేర్చుకుని, మదీనాకి చేరి, ఆల్కెమీలో ప్రయోగాలు చేస్తూండేవాడు. రకరకాల పుస్తకాలు చదువుతూ, మూసలు, కొలిములు పెట్టుకుని రసాయనిక ప్రక్రియలు నిర్వహించేవాడు. అతనికి ఒక అసిస్టెంటు కావలసి వచ్చాడు. ఈ జోసెఫ్ వెళ్లి అతని దగ్గర చేరాడు. ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఆల్టోటాస్ తన ప్రయోగాల్లో భాగంగా అవిసె గింజల నుంచి తయారుచేసిన వస్త్రాల నాణ్యతను మెరుగుపరిచే ఒక పదార్థాన్ని తయారుచేశాడు. అది ఆ బట్టలకు పూస్తే అవి పట్టువస్త్రాల్లా మెత్తగా అయ్యి మెరవసాగాయి. ‘పరసువేది వెనక్కాల పరిగెట్టే బదులు, దీని మీదే దృష్టి పెట్టి డబ్బు సంపాదించవచ్చు కదా’ అని జోసెఫ్ యిచ్చిన సలహా అతనికి నచ్చింది.

ఇద్దరూ కలిసి దాన్ని పెద్ద మొత్తంలో తయారుచేసి, అలెగ్జాండ్రియాకు పట్టుకెళ్లి, అక్కడ నలభై రోజులుండి సరుకు అమ్మి లాభాలు సంపాదించారు. ఆ తర్వాత ఈజిప్టులోని తక్కిన నగరాలకు, టర్కీకి, మాల్టాకి వెళ్లి అమ్మారు. అక్కడ పింటో అనే ఆల్కెమిస్టు దగ్గర చేరి తగరాన్ని వెండిగా మార్చే ప్రయత్నంలో పడ్డారు. జోసెఫ్‌కు యిదంతా వృథాశ్రమ అనిపించింది. ఆల్టోటాస్ నుంచి, పింటో నుంచి సిఫార్సు ఉత్తరాలు తీసుకుని రోమ్‌కు బయలుదేరాడు. తన ఊరు వదిలాక అతను అనేక పేర్లు మార్చుకుంటూ పోయాడు. రోమ్‌లో కౌంట్ ద కాగ్లియోస్త్రో పేరుతో ప్రవేశించాడు. ఆ తర్వాత నుంచి ఆ పేరుతోనే చలామణీ అయ్యాడు. తన సిఫార్సు ఉత్తరాల ద్వారా కులీనకుటుంబాలతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. తను ఏ లోహాన్నయినా బంగారంగా మార్చగల, అదృశ్యం కాగల, సర్వరోగాలను నయం చేయగల, వృద్ధాప్యం దరికి రాకుండా చేయగల అమృతజలం తయారు చేసే శక్తులు వున్నాయని వాళ్లను నమ్మించాడు. తన గచ్చాకుపుచ్చాకు వైద్యంతో కొందరు రోగులకు నయం చేశాడు కూడా. వాటిలో చాలా భాగం నమ్మకంతో రోగం కుదిరిన కేసులే!

ఇక్కడే అతని లోరెన్జా తారసిల్లింది. సౌందర్యవతి. ఆకర్షణీయంగా, చమత్కారంగా మాట్లాడగలదు. మంచి కాల్పనిక శక్తి వుంది. ప్రస్తుతానికి పేదరాలే కానీ ఒకప్పుడు ఉన్నత కుటుంబానికి చెందినది కాబట్టి మర్యాదమప్పితాలు తెలుసు. పైకి రావడానికి నీతిగా బతకాలన్న పట్టింపు లేదు కాబట్టి తనకు సరైన జోడీ అనుకున్న జోసెఫ్ ఆమెను పెళ్లాడి, తన ట్రిక్కులన్నీ నేర్పేశాడు. దేవుళ్లను, సైతాన్ని, ప్రేతాత్మలను ఆహ్వానించినట్లు నమ్మించడానికి కావలసిన మంత్రాలన్నీ వల్లె వేయించాడు. ఆ తర్ఫీదు తర్వాత యిద్దరూ కలిసి మూడు, నాలుగేళ్లలో రష్యా, పోలండ్, జర్మనీ చుట్టబెట్టారు. లోహాలను మార్చడం, జోస్యాలు చెప్పడం, ఆత్మలను జాగృతం చేయడం, అమృతజలాన్ని అమ్మడం... యిలా రకరకాల పనులు చేసి డబ్బు పోగేశారు. 1776లో లండన్ చేరారు. కౌంట్, కౌంటెస్ కాగ్లియోస్త్రో అని చెప్పుకుంటూ లండన్‌లో ఒక మంచి లొకాలిటీలో నివసించారు. ఇంగ్లీషు రాదు కాబట్టి, మదాం బ్లవరీ అనే పోర్చుగీసు యువతిని దుబాసీగా పెట్టుకున్నాడు. పరుసవేది తయారుచేస్తానంటూ ఇతను ల్యాబ్‌లో చేసే హడావుడి చూసి, ఆమె నిజమని నమ్మి అందరికీ యితని అతీతశక్తుల గురించి చెప్పేది.

పెద్దపెద్ద వాళ్లను యింప్రెస్ చేయడానికి యీమె చాలదనుకున్న జోసెఫ్, విటెలినీ అనే బహుభాషా కోవిదుణ్ని నియమించుకుని అతని ద్వారా ప్రచారం చేయించుకునేవాడు. ప్రచారం డోసు ఎక్కువై పోయి, జోసెఫ్ వద్ద డబ్బు మూలుగుతోందని అనుకుని నానారకాల వాళ్లూ చేరి, అతన్ని ఎలా దోచుకోవాలాని ప్లాన్లు వేశారు. వారిలో విటెలినీ ఒకడు. అతడు పండితుడే కానీ జూదమాడి డబ్బంతా పోగొట్టుకున్నాడు. తనలాగే దిబ్బయిపోయిన జూదరి ఒకణ్ని స్కాట్లండ్ కులీనుడంటూ జోసెఫ్‌కు పరిచయం చేశాడు. ‘నా పేరు లార్డ్ స్కాట్. స్కాట్లండ్‌లో చాలా ఆస్తులున్నాయి. అక్కణ్నుంచి డబ్బు తెప్పిస్తున్నాను. ఈలోగా 200 పౌండ్లు అప్పివ్వండి.’ అని అతను జోసెఫ్ దగ్గర వడేశాడు. పైగా ఫ్రై అనే ఒక యువతిని తన భార్య లేడీ స్కాట్‌గా పరిచయం చేసి, మీ ఆవిడకు చెలికత్తెగా పెట్టుకోండి అన్నాడు. వారి ద్వారా లండన్‌లో ధనికులందరి పరిచయాలను సంపాదించాడు. ఎందర్నో మోసగించిన జోసెఫ్ స్కాట్ పొగడ్తలకు మురిసి, అతన్ని మేపుతూ వచ్చాడు.

జూదరులందరిలాగానే స్కాట్‌కు కూడా మూఢనమ్మకాలు ఎక్కువ. ‘నా దగ్గర ఒక పురాతన రహస్యగ్రంథం వుంది. భాగ్యచక్రం (కేసినోల్లో కనబడే రూలే) లో, లాటరీలలో ఏ అంకెపై పందెం కాస్తే నెగ్గుతామో చెప్పే సంఖ్యాశాస్త్రం గురించి చెపుతుందది. దాన్ని అర్థం చేసుకోవడం నా తరం కావటం లేదు. నీకా పుస్తకం యిస్తా. నీకు యీ కళలో ప్రావీణ్యం వుంది కాబట్టి నవంబరు 6న నేను ఆడబోయే జూదంలో ఏ అంకె నాకు కలిసివస్తుందో చెప్పాలి.’ అని ప్రాధేయపడ్డాడు. జోసెఫ్‌కీ ఆ పుస్తకం బోధపడలేదు. ఏదో గాలివాటంలా ‘20’ అన్నాడు. ఖర్మకాలి దానిమీద కాసినదానికి రెట్టింపు లాభం వచ్చింది. దాంతో పై వారం అంకె కూడా చెప్పమని స్కాట్ పట్టుబట్టాడు. అదీ కరక్టుగా వచ్చింది. ఇక పై వారం.. ఆ పై వారం.. యిలా నెగ్గుతూ రావడంతో స్కాట్ యింకాయింకా చెప్పమని పీడించడం మొదలెట్టాడు. ‘నాకింత విద్య తెలిసినప్పుడు వీళ్లకెందుకు చెప్పడం? నేనే పందెం కాసుకుని లాభపడతాను.’ అనుకున్న జోసెఫ్ ‘ఇకపై చెప్పను.’ అని మొండికేశాడు.

దాంతో స్కాట్‌కు కోపం వచ్చింది. ‘నా నిజస్వరూపం తెలిస్తే యీ మాట అనే సాహసం చేయవు. నేను జమీందారునీ కాదు, వల్లకాడునీ కాను. పక్కా రౌడీని. నా పెళ్లాం అని మీ యింట్లో పెట్టినది ఓ వేశ్య. మర్యాదగా నేను చెప్పినట్లు విను. లేకపోతే డేంజరు.’ అని బెదిరించాడు. జోసెఫ్‌కు ఒళ్లు మండిపోయింది. స్కాట్ దంపతులను బయటకు తరిమివేశాడు. అతను కొందరు గూండాలను వెంటేసుకుని వచ్చాడు. అందరూ కలిసి జోసెఫ్‌ను బతిమాలారు, బెదిరించారు, వచ్చిన లాభాల్లో వాటాలిస్తామని ఆశ చూపారు. అతనికి అతీతశక్తులున్నాయని వారి భ్రమ. ఇప్పుడితను చెప్పడం మానేస్తే యిన్నాళ్లూ అనుభవించిన భోగభాగ్యాలకు ఫుల్‌స్టాప్ పడుతుంది. భవిష్యత్తులో పైసా పుట్టదు. అందుకే యీ వేషాలన్నీ వేశారు. ఏం చేసినా లాభం లేకపోయింది. జోసెఫ్ బయటకు పొమ్మన్నాడు. వాళ్లు బయటకు నడిచారు.

వాళ్లు భయపడినంతా అయింది. సొంత తెలివితో వాళ్లు కాసిన పందేలేవీ నెగ్గలేదు. కానీ విలాసాలు తగ్గకపోవడంతో కొన్నాళ్లకి అంతా అయిపోయింది. అప్పుడు ఫ్రై జోసెఫ్ భార్య లోరెన్జా దగ్గరకు వెళ్లి తిండికి లేక మాడిపోతున్నాను, ఏదైనా కాస్త విదల్చండి అని అడిగింది. పోనీ కదాని లోరెన్జా తిండి పెట్టి, డబ్బిచ్చింది. ‘డబ్బిచ్చినదానివి యింకో ఉపకారం కూడా చేయి. మీ ఆయన చేత ఒకే ఒక్కసారి లక్కీ నెంబరు చెప్పించు. జీవితంలో మళ్లీ యిబ్బంది పెట్టం.’ అని వేడుకొంది. లోరెన్జా కరిగిపోయింది. సరేనని జోసెఫ్‌ను అడిగింది. ‘నాకెంత తెలుసో నీకూ తెలుసు. అయినా నాకు తోచినది చెప్తాను. లాటరీ తగిలితే తగిలినట్లు, లేకపోతే లేనట్లు. మళ్లీ యిలాటి సిఫార్సులు తీసుకురావద్దు.’ అని గట్టిగా చెప్పి నోటికి వచ్చిన 8 అంకె చెప్పాడు. తమాషాగా ఆ సారి లాటరీలో అత్యధికంగా డబ్బు వచ్చిన అంకె 8యే! స్కాట్ దంపతులకు 1500 గినీలు వచ్చిపడ్డాయి.

కానీ దీనితో వాళ్ల ఆకలి చల్లారలేదు. జోసెఫ్ దగ్గర క్షుద్రవిద్యలులున్నాయన్న మాట పరమసత్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ యితన్ని చేజార్చుకోకూడదని నిశ్చయించుకున్నారు. వచ్చిన డబ్బులో ఫ్రై 90 గినీలు పెట్టి ఓ నెక్లెస్ కొంది. రెండు అరలున్న బంగారు పెట్టె కొని కింది అరలో నెక్లెసు దాచిపెట్టి, పై దాన్ని సుగంధనశ్యంతో నింపి లోరెన్జాకు బహుమతిగా యిచ్చింది. పెట్టె తెరవగానే నెక్లెసు కనబడకపోవడం చేత ఒట్టి నశ్యమే కదాని లోరెన్జా బహుమతి తీసుకుంది. ఇక అప్పణ్నుంచి ఫ్రై ముఠా జోసెఫ్ యింటికి మళ్లీ మళ్లీ రాసాగారు. అతని లాబ్‌లోకి దూసుకుని వెళ్లిపోయేవారు. వద్దు పొమ్మంటే మెట్ల మీద కూర్చునేవారు. నౌకర్ల చేత నెట్టించినా లాభం లేకపోయింది. ఓ రోజు విసిగిపోయిన జోసెఫ్ ఫ్రైను భుజాలు పట్టుకుని వీధిలోకి తోసేశాడు. దాంతో ఫ్రై అహం దెబ్బ తింది. పగ తీర్చుకుంటానని ప్రతిన బూనింది. ఇక అప్పణ్నుంచి జోసెఫ్‌కు కష్టాలు మొదలయ్యాయి.

జోసెఫ్ నాకు 200 పౌండ్లు బాకీ పడ్డాడంటూ దొంగ కేసు పెట్టి అతన్ని నగర షెరిఫ్ నిర్వహణలో నడిచే స్పాంజింగ్ హౌస్‌కి పంపింది. బాకీ వ్యవహారం తెమిలేదాకా ఋణగ్రస్తులను అక్కడ వుంచుతారు. రాజీ పడకపోతే కేసు, కస్టడీ వగైరాలుంటాయి. అతనక్కడ బందీగా వుండగానే స్కాట్ మనుషులు ఓ లాయర్‌ను వెంటపెట్టుకుని జోసెఫ్ ల్యాబ్‌లోకి చొరబడి, అతని దస్తావేజులు, పుస్తకాలు, అక్కడ కనబడిన పౌడర్లు అన్నీ పట్టుకుని వచ్చేశారు. అది లోహాలను మార్చేయగల పొడి అని, ఆ పుస్తకాల్లో రసవిద్య రహస్యాలున్నాయని వాళ్ల భ్రమ. ఆ తర్వాత ‘మాయమాటలు చెప్పి నా దగ్గర నుంచి నెక్లెసు కొట్టేసింది’ అంటూ లోరెన్జాపై ఫ్రై కేసు పెట్టింది. అంతేకాదు, యీ దంపతులు సైతానుతో కుమ్మక్కయి క్షుద్రదేవతారాధన చేస్తున్నారని, జోస్యాలు చెపుతున్నారని కూడా కేసులు పెట్టింది. వీటి కారణంగా జోసెఫ్ చాలా వారాల పాటు జైల్లో వుండాల్సి వచ్చింది. చివరకు బెయిలు దొరికింది. ఇరు పక్షాలూ రాజీ పడితే మంచిదని న్యాయమూర్తి అన్నాడు.

అప్పుడు రేనాల్డ్‌స్ అనే అనే ఓ లాయరు రాజీ కుదురుస్తానంటూ వస్తే జోసెఫ్ అతన్ని యింటికి రానిచ్చాడు. స్కాట్ అతని వెంటనే చాటుగా వచ్చి, తలుపు వెనక్కాల దాక్కుని, సంభాషణ జరుగుతూంటే హఠాత్తుగా బయటకు ఉరికి గుండెల మీద తుపాకీ పెట్టి ‘లక్కీ నెంబర్లు చెప్పే విద్య నాకు నేర్పకపోతే చంపి పారేస్తా’ అని బెదిరించాడు. ‘వీడెవడో పిచ్చాడిలా వున్నాడు. చెప్పేస్తే మంచిది కదా, లేకపోతే మీ ప్రాణాలకే అపాయం.’ అంటూ రేనాల్డ్‌స్ చెప్పాడు. అదంతా వాళ్ల కుట్రలో భాగమే. ‘నాకు ఏ విద్యలూ రావు బాబోయ్’ అని జోసెఫ్ మొత్తుకున్నా యిద్దరూ కలిసి అతన్ని కన్విన్స్ చేయడానికి చూశారు. ‘ఆ పౌడరుతో ఏ బంగారమూ తయారుచేయలేం. కొన్ని మందులు చేయగలమంతే. నా పుస్తకాలూ అవీ వెనక్కి యిచ్చేస్తే పోయిన డబ్బు పోయిందనుకుని ఊరుకుంటాను. నా జోలికి రాకపోతే మహబాగు అనుకుంటాను.’ అని జోసెఫ్ బతిమాలాడు. కానీ వాళ్లు నమ్మలేదు. చచ్చేటన్ని శాపనార్థాలు పెట్టి, నీ అంతు చూస్తామని బెదిరించి మరీ వెళ్లారు.

కేసు నడిచింది. విచారణ సందర్భంగా జోసెఫ్ గతమంతా బయటకు తవ్వారు. అతను పాలెర్మోలో చేసిన మోసం అందరికీ తెలిసిపోయింది. లండన్ నుంచి ప్రచురించే ఒక ఫ్రెంచ్ పత్రికలో అతని పాత గాథంతా సీరియల్‌గా వచ్చింది. దాంతో న్యాయమూర్తులకు స్కాట్ దంపతుల వాదన నిజమనిపించింది. రెండు వందల పౌండ్లు, నెక్లెస్ ఉన్న బంగారు పెట్టె వెనక్కి యివ్వాలని చెప్పారు. పరువు, డబ్బు పోగొట్టుకున్న ఇంగ్లండులో యిక ఉండకూడదనుకుంటూ జోసెఫ్ దంపతులు బెల్జియంలోని బ్రస్సెల్స్‌కు పయనమయ్యారు. ఇంగ్లండు వచ్చేటప్పుడు వాళ్ల దగ్గర 3వేల పౌండ్లుంటే యిప్పుడు 50 పౌండ్లు మిగిలాయి. తక్కిన కథ ‘‘అలనాటి బురిడీ బాబా’’లో! (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2021)

mbsprasad@gmail.com

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!