Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: మధ్యవయసు మబ్బులు

ఎమ్బీయస్‌: మధ్యవయసు మబ్బులు

పైలా పచ్చీసులో ఎంత హుషారుగా ఉన్నా మధ్య వయసు వచ్చేసరికి మనిషికి గాంభీర్యం వచ్చేస్తుంది. దిగాలు పడడం మొదలుపెడతారు. మధ్యవయసు అనేదానికి నిర్వచనం ఏమిటి? గతంలో అయితే 35 దాటితే మధ్యవయసు అనేవారు. ఇప్పుడు సగటు ఆయుర్దాయం పెరిగింది కాబట్టి 45-50 మధ్య అనవచ్చు. అన్ని రకాల సమస్యలు ఒక్కసారి చుట్టుముట్టే స్టేజి యిది. కెరియర్‌ పరంగా, కుటుంబపరంగా, ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ఒత్తిళ్లు వచ్చిపడతాయి.

కెరియర్‌ పరంగా చెప్పాలంటే-యవ్వనంలో ఉండగా ఎంతో ఉన్నత స్థాయికి చేరతాననే ఆశలుంటాయి. అందువలన జీవితంలో ఉత్సాహం ఉంటుంది. 45, 50 సంవత్సరాలు వచ్చేసరికి కెరియర్‌లో పీక్‌కి వచ్చేశామనీ, యింతకంటె పైకి వెళ్లే ఛాన్సు లేదని తెలిసిపోతుంది. దానితో వృత్తి పరమైన ఉబలాటం చచ్చిపోతుంది. అలా అని పనిచేయడం మానేస్తే కుదరదు.

గవర్నమెంటు ఉద్యోగాల్లో అయితే కాస్త రిలాక్స్‌డ్‌గా ఉన్నా ఫరవాలేదేమో కానీ, ప్రయివేటు ఉద్యోగాల్లో ఉద్యోగం నిలుపుకోవాలన్నా, యిక్కణ్నుంచి దిగజారకుండా ఉండాలన్నా మరింత కష్టపడ వలసి ఉంటుంది. మీకిచ్చే జీతంలో సగం జీతానికి మీ కంటె కుర్రాళ్లు, ఉత్సాహవంతులు వస్తారు అనే మేనేజ్‌మెంట్‌ బెదిరింపులను తట్టుకుంటూ నాలో యింకా శక్తి ఉంది అని నిరూపించుకోవడానికి అహోరాత్రాలు శ్రమించవలసి వస్తుంది. 

అదే సమయంలో కుటుంబ బాధ్యతలు కూడా కీలకమైన స్థితికి చేరతాయి. తలిదండ్రుల మరణం సంభవిస్తుంది. అమ్మానాన్న ఉన్నంతకాలం పైన ఒక గొడుగు ఉన్న ఫీలింగు ఉంటుంది. వాళ్ల మీద ఆధారపడకపోయినా, నిజానికి వాళ్లే తన మీద ఆధారపడినా, అమ్మానాన్నలను పోగొట్టుకున్నపుడు, ఏదో రక్షణ పోయినట్లు తోచి, దిగాలు ఆవరిస్తుంది. ఇక వరుసలో మనమే అనే స్పృహ కలిగి భయం వేస్తుంది.

ఇక భార్య విషయానికి వస్తే అప్పటివరకు తనపై ఆధారపడుతూ వచ్చిన ఆమె, రాటు దేలి స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెడుతుంది. భర్త నిర్ణయాలకు అడ్డు తగులుతూ ఉంటుంది. పిల్లల చదువుల గురించి, తిరుగుళ్ల గురించి, పెళ్లిళ్ల గురించి ఇద్దరి మధ్య వాగ్యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. పిల్లలకు కాలేజీకి వెళ్లే వయసులో ఉండి, శ్రద్ధగా చదవకో, సవ్యంగా ప్రవర్తించకో తలనొప్పులు తెచ్చిపెడుతూ ఉంటారు.

ఈ సమస్యలపై లోతుగా దృష్టి సారించే టైముండదు. ఆరోగ్యసమస్యలు కూడా యిప్పుడే తలెత్తుతాయి. బిపి, సుగర్‌లు పరిచయమౌతాయి. అప్పటిదాకా 'డాక్టరు దగ్గరకి వెళ్లడం నాకు అసహ్యం' అనేవాళ్లు కూడా క్లినిక్‌లకు తరచుగా వెళ్లవలసి వస్తుంది. శారీరక దారుఢ్యం తగ్గుతుంది. దాంతో నిస్పృహ, నిస్సత్తువ, చికాకు, కోపం ఆవహిస్తాయి. స్త్రీలకు యిది మెనోపాజ్‌ సమయం. దాని గురించి విస్తారంగా వ్యాసాలు వస్తూంటాయి. మగవాళ్లకు కూడా అలాటి సమస్యే - ఆండ్రోపాజ్‌ - వస్తుంది. 

ఇదే సమయంలో డబ్బు సమస్య కూడా కళ్లల్లోకి సూటిగా చూస్తూంటుంది. ఖర్చులు పెరుగుతూంటాయి. పిల్లల పై చదువులకు డబ్బెలా, పెళ్లిళ్లకు డబ్బెలా? అప్పు తెస్తే తీర్చడం ఎలా? చేతిలో ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తే రేపు రిటైరైతే ఎలా? ఈ లైఫ్‌ స్టయిల్‌ మేన్‌టేన్‌ చేయగలమా? పెన్షన్‌ లేకపోతే ఎలా? ఉంటే సరిపోతుందా? పెళ్లిళ్లు అయ్యాక కోడలు, అల్లుడు వస్తారు. ఉన్న యిల్లు సరిపోదు. అలా అని యిది అమ్మేసి పెద్దది కొంటే తట్టుకోగలమా? ఇలా ఎన్నో ఆలోచనలు. జీవిత చరమాంకం ఎలా ఉంటుందోనన్న బెంగ.

ఉన్నదంతా పిల్లల మీద ఖఱ్చు పెట్టేస్తే వాళ్లు వృద్ధాప్యంలో తమను పట్టించుకుంటారో లేదోనన్న సందేహం. ఈ సందేహంతో వాళ్ల అవకాశాలు, మంచి భవిష్యత్తు చెడగొడుతున్నామా అన్న డోలాయమాన స్థితి. ఈ టెన్షన్ల వలన ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది. కొంతమంది ఆలోచించి, ఆలోచించి ఏం చేయాలో తోచక, నిద్ర పట్టక పలాయనవాదంతో మద్యానికి అలవాటు పడతారు కూడా. ఉన్నదున్నట్లు చెప్పాలంటే యీ చింతకు పరిష్కారం లేదు.

రేపు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అందువలన భవిష్యత్తుపై విపరీతమైన ఆశ పెట్టుకోకుండా, మబ్బుల్లో విహరించకుండా, నేల మీదే ఉండి వాస్తవాలను పరిగణించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పిల్లల మీద ఎంత ఖర్చు పెట్టాలి అన్నదానిపై ఒక స్పష్టమైన దృక్పథం, అవగాహన ఉండాలి. వాళ్ల మీద పెట్టే ఖర్చుని పెట్టుబడిగా అనుకుని, వృద్ధాప్యంలో మనకు అది వడ్డీతో సహా తిరిగి వస్తుందని అనుకోవడం పొరబాటు ఆలోచన. పిల్లలను పెంచడం మన బాధ్యత. మనం ఎంతవరకు తూగగలమో అంతవరకే వాళ్ల చదువుపై, పెళ్లిళ్లపై ఖర్చు పెట్టాలి. ఉన్నదంతా ఊడ్చి పెట్టి ఆ తర్వాత వాళ్లు పట్టించుకోలేదని ఏడవడం బుద్ధితక్కువ. 

డబ్బు గురించి కొందరు చులకనగా మాట్లాడతారు. అది తప్పు. జీవితంలో డబ్బుకి చాలా విలువ ఉంటుంది. డబ్బున్నవాడికి ఉన్న విలువ లేనివాడికి ఉండదు. పిల్లలతో సహా ఎవరిపైనా ఆధారపడకుండా ఉండే స్థితిని మనం కోరుకోవాలి. ఆ దిశగా ప్రణాళికలు వేసుకోవాలి. రిటైరయ్యాక మన కేవేవో అవకాశాలు వచ్చేస్తాయని ఆశ పడడం అవివేకం. చాలా తక్కువ మందికే ఆ అదృష్టం.

ఉద్యోగంలో ఉండగా అనేక ఆఫర్లు వస్తూంటాయి కాబట్టి రిటైరయ్యాక కన్సల్టెంటుగా ఉండవచ్చని ఏవేవో ప్లాన్లు వేస్తాం. ఉద్యోగ విరమణ వయసు వచ్చేసరికి నీపై అవతలివాడికి మోజు పోతుంది. ఒకటి రెండు ఏళ్లపాటు ఒకటి రెండు చోట్ల పనిచేసేసరికి మొహం మొత్తుతుంది. జీతమో, గౌరవమో చాలకపోవడం చేత యింట్లో ఖాళీగా కూర్చోవలసి వస్తుంది. కొన్ని తరాల క్రితమైతే అయితే రిటైరైన రెండు, మూడేళ్లకు చావు ముంచుకు వచ్చేది.

ఇప్పుడు మధ్యతరగతివాళ్లు 75, 80 ఏళ్లు చులాగ్గా బతికేస్తున్నారు. అంటే రిటైరైన తర్వాత జీతం లేకుండా 15-20 ఏళ్ల పాటు జీవించవలసిన అవసరం పడుతోంది. ఆయుర్దాయం ఉంటోంది కానీ ఆరోగ్యం ఉండటం లేదు. కాబట్టి మందుల ఖర్చు పెరుగుతోంది. మధ్య వయసులో ఉండగానే '80 ఏళ్ల దాకా బతికితే ఎలా?' అని ప్రశ్న వేసుకుని దానికి తగ్గట్లుగా సొంత యిల్లు వంటి సరంజామా ఏర్పాటు చేసుకోవాలి. నెల ఖర్చుకి పిల్లలపై ఆధారపడే స్థితి లేకుండా ముందు నుంచే ప్లానింగు వేసుకుని దానికి తగినట్లుగానే యీరోజు ఖర్చు పెట్టాలి. ఈ పని మధ్యవయసులో చేయకపోతే వృద్ధాప్యం భారమౌతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?