Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: పికె కాంగ్రెసును ఉద్ధరిస్తాడా?

ఎమ్బీయస్: పికె కాంగ్రెసును ఉద్ధరిస్తాడా?

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెసు పార్టీలో చేరడం ఖాయం అనే వార్తలు వచ్చి పడుతున్నాయి. ఏ పోస్టు యిస్తారు, అతని మాట ఎవరు వింటారు? అసలు సోనియా కుటుంబమైనా అతన్ని సీరియస్‌గా తీసుకుంటుందా అనే ప్రశ్నలకు కొద్ది రోజుల్లో సమాధానం వస్తుంది కానీ యీలోపుగా నన్ను దొలుస్తున్న ప్రశ్న ఏమిటంటే అసలు ప్రశాంత్ కాంగ్రెసులోకి ఎందుకు వెళుతున్నట్లు? కాంగ్రెసును ఉద్ధరించడానికి అనుకుంటే ఏ విధంగా చేస్తే ఉద్ధారణ అవుతుంది? ఎన్నికలలో గెలిపిస్తే చాలా, ఓ సిద్ధాంతం పాడూ అనేవి అక్కరలేదా? అనే సందేహాల చుట్టూనే నా ఆలోచనలు తిరుగుతున్నాయి.

పికె కాంగ్రెసులో చేరడం చూస్తే ‘జబ్ గీదడ్‌కీ మౌత్ ఆతీ హై, తో వో శహర్‌కీ తరఫ్ భాగ్‌తా హై’ అనే సామెత గుర్తుకు వస్తోంది. ప్రస్తుతం దేశంలో పికెకు మంచి గిరాకీ ఉంది. క్లయింటు ఏ రాష్ట్రం వాడైనా కానీ, రైటు, లెఫ్టు, సెంటరు, ఏ సిద్ధాంతం వాడైనా కానీ తగిన సలహాలిచ్చి, గెలుపు సిద్ధించేట్లు తోడ్పడగలడు అనే ప్రతీతి వచ్చింది. అలాటివాడు పోయిపోయి కాంగ్రెసు ఊబిలో పడుతున్నాడెందుకు? కాంగ్రెసు పార్టీ అవస్థ చూస్తే పగవాడికి కూడా జాలి పుడుతోంది. కానీ మేం మారం అని భీష్మించుకుని కూర్చున్న కాంగ్రెసు అధినాయకత్వాన్ని చూస్తే అయినవాడికి కూడా అసహ్యం పుడుతోంది. అలాటి కాంగ్రెసుని దాని మానాన దాన్ని వదిలేస్తే పోయేదానికి యితనెళ్లి మిమ్మల్ని గెలిపిస్తానంటూ భుజాన వేసుకోవడం దేనికి? గతంలో ఒకసారి యీ ప్రయత్నాలు జరిగాయి. వాళ్లు 2022లో యుపిలో గెలిపించి చూపించి, ఆ తర్వాత మాట్లాడు అన్నారు. అది నా వల్ల కాదు అనేసి వచ్చేశాడు. ఇప్పుడు 2024లో గెలిపించి చూపిస్తా అంటూ వెళుతున్నాడు.

చూడబోతే మోదీ ద్వేషంతో పికె ఉచితానుచితాలు మర్చిపోతున్నా డనిపిస్తోంది. లేకపోతే కావాలని కాంగ్రెసు గోతిలో పడడమేమిటి? 2014లో బిజెపికి పని చేసిన తర్వాత, వాళ్లు మళ్లీ యితన్ని పిలవలేదు. ఇతనిచేత చేయించుకున్నపుడు యితని ట్రిక్కులన్నీ నేర్చేసుకున్నారు. వాళ్లకు ముందే యివన్నీ తెలుసు కానీ యితను మరి కాస్త సైంటిఫిక్‌గా చేసి ఉంటాడు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఎడాపెడా వాడేసుకోవడం బాగా నేర్పాడు. ఆ తర్వాత నీతో పని లేదు, మా వాళ్లకు తర్ఫీదు యిచ్చుకుని వాడుకుంటాం అనేశారు. అలాగే చేసి వరుస విజయాలను సాధిస్తున్నారు. ఇతను ఏ యెత్తులు వేస్తాడో వాళ్లకు ముందే తెలుసు కాబట్టి, ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఇటు పికెదీ అదే పరిస్థితి. బిజెపి బలాబలాలు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వాళ్లను ఎదిరించేవాళ్లకు సరైన సలహాలు యివ్వగలుగుతున్నాడు. 2014 తర్వాత అతను గెలిపించిన రాష్ట్రాలలో బిజెపితో తలపడినవి దిల్లీ, బిహార్, బెంగాల్, యుపి అనే చెప్పాలి. వీటిలో మొదటి మూడిటిలోనే యితని వ్యూహం పనిచేసింది. యుపిలో కాంగ్రెసు పక్షాన పనిచేసినా ఆ పార్టీ పరాజయం పాలయింది. ఇక అతను గెలిపించిన ఆంధ్ర, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో బిజెపి ఉనికి పెద్దగా లేదు.  

పికె మేధస్సు పతాకస్థాయికి చేరినది బెంగాల్‌లోనే. భారీ స్థాయిలో దాడి చేసి, బిజెపి అతన్ని హడలగొట్టేసినా, బెదరకుండా తృణమూల్ ఘనవిజయంలో పాత్ర వహించాడు. వీటన్నిటిని రంగరించి అతనే స్వయంగా చెప్పుకున్నాడు- జిగీష, గెలవాలనే కాంక్ష, ఫైటింగ్ స్పిరిట్ బలంగా ఉన్నవాళ్లనే నేను గెలిపించగలను. సలహాలు యివ్వగలను కానీ వాటిని అవతలివాళ్లు అమలు చేయడం పైనే ఫలితం ఆధారపడుతుంది అని. ఒక పార్టీ సాంప్రదాయికంగా కొన్ని పద్ధతుల్లో నడుస్తూ వుంటే, యితను వచ్చి సర్వేలు చేశాను, ప్రజాభిప్రాయం యిలా వుంది, ఈ మార్పులు చేస్తే మంచిది అని చెప్పగానే పార్టీలోని పాత నాయకులు భగ్గుమంటున్నారు. వాళ్లను పట్టించుకోకుండా పార్టీ అధిష్టానం యితన్ని సమర్థించి, సలహాలు అనుసరించిన కేసుల్లో నెగ్గుతున్నారు. 2017లో యుపిలో కాంగ్రెసుకి సలహాలిస్తే ఎవరూ పట్టించుకోలేదు. ఫలితం దారుణంగా వచ్చింది. పైగా మార్పులు చేసేందుకు, అవి కింద దాకా పెర్కోలేట్ అయి, తమ ప్రభావాన్ని చూపేందుకు తగినంత సమయం ఉండాలి. ఓ రెండు నెలలుండగా పిలిచి, ఏదీ నీ మ్యాజిక్ చూపించు చూదాం అంటే పికె ఏమీ చేయలేడు.

బెంగాల్ ఎన్నికల సమయంలో పికె చక్కటి పాజిటివ్ థింకింగ్ ప్రదర్శించాడు. శత్రువు బలాన్ని చూసి ముందే అస్త్రసన్యాసం చేసి పరాజయం పాలు కాకూడదన్నాడు. నాకు అది బాగా నచ్చి మెచ్చుకుంటూ వ్యాసం రాశాను కూడా. ఆశించిన దాని కంటె మెరుగ్గా ఫలితాలు రావడంతో పికెలో ఉత్సాహం పెరిగిపోయింది. దేశమంతా వ్యాపించేసి, మోదీకి వ్యతిరేకంగా అన్ని రకాల శక్తులనూ కూడగట్టేసి కృష్ణ పరమాత్మ ధర్మరాజు చేత రాజసూయయాగం చేయించినట్లు, మమత చేత తను చేయించేద్దా మనుకున్నాడు. కానీ అది చీదేసింది. తృణమూల్ తక్కిన చోట్ల ఎదగలేదు. ఆ యా రాష్ట్ర ఓటర్లు గడ్డిపరకలా తీసిపారేశారు. తను చాణక్యుడే కానీ మమత చంద్రగుప్తుడు కాడని పికె అనుకుని, రాహుల్ దరిన చేరాడు. అతను నందుడే తప్ప చంద్రగుప్తుడు కాడని తెలుసుకోలేకున్నాడు.

కాంగ్రెసుకైతే దేశవ్యాప్తంగా 20% ఓటు బ్యాంకుంది. ఆర్థిక వనరులున్నాయి, కార్యకర్తలున్నారు. కరక్టుగా చెప్పాలంటే అది చతికిలపడిన ఏనుగులా ఉంది. తను మావటీడై అంకుశం చేతపట్టి పొడిస్తే చాలు, తనంతట తనే లేచి మోదీ కోటగుమ్మాన్ని పగలగొట్టేస్తుంది. అజేయుడిగా వెలుగొందుతున్న మోదీని పరాజితుణ్ని చేసిన వ్యక్తిగా తన పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది అనుకుంటున్నాడని నా ఊహ. ఆశలుండడంలో తప్పు లేదు. లక్ష్యసాధనకు ఎంచుకుంటున్న ఉపకరణం గురించి అతనికి క్షుణ్ణంగా తెలిసి కూడా యీ సాహసం చేస్తున్నాడు. సోనియా, రాహుల్ ఎంత మొండి ఘటాలో, నాయకత్వాన్ని తమ చేతుల్లోంచి జారిపోనీయకుండా ఎంతకు తెగిస్తారో దేశమంతా ఏడేళ్లగా చూస్తూనే ఉంది. అంతర్గత ప్రజాస్వామ్యం కోసం, సంస్థాపరమైన ఎన్నికల కోసం పార్టీలో కొందరు గళమెత్తితే తన వందిమాగధుల చేత వారిని ఎలా వెంటాడి హింసిస్తున్నారో చూస్తూనే ఉంది.

రాహుల్, సోనియాలవి పేరుకు నామమాత్రమైన పదవులే. కానీ పెత్తనమంతా వారిదే. బాధ్యతలు లేవు, హక్కులు మాత్రం వారివే. ప్రశ్నిస్తే బిజెపి ఏజంటుగా ముద్ర కొడతారు. పరాజయాలు ఎదురవుతున్నా మార్పును రానివ్వరు, ఆ సూచన సైతం సహించరు. అహంకారానికి నిలువెత్తు ప్రతిరూపాలు. రాష్ట్రంలో ఓటమి ఎదురైతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని మారుస్తారు. తాము మాత్రం మారరు. తమ కుటుంబానికి అవతలి వ్యక్తికి బాధ్యత అప్పగించరు. ఎంతసేపూ తమ భజనే. అలా అని వాళ్లకు శక్తి, ఆసక్తి ఉన్నాయా? అనారోగ్య పీడితురాలైన సోనియా తన పదవి నుంచి తప్పుకుని, చురుకుగా ఉండే వేరొకరికి బాధ్యత అప్పగించాలి అని నేను గతంలో రాస్తే, ఆమె వృద్ధురాలు కాబట్టి తప్పుకోవాలన్నానని పొరబడి ఓ పాఠకుడు నన్ను తెగ సతాయించాడు. వయసు గురించి నేను ప్రస్తావించలేదు. అది ముఖ్యమే కాదు.

ఆడ్వాణీకి 94 ఏళ్లు.  సోనియా ఆరోగ్యంగా ఉండివుంటే 75 సం.లు రాజకీయాల్లో మరీ అంత ఎక్కువేమీ కాదు. మోదీ ప్రధానిగా ఉండి కూడా సాధారణ ఎన్నికలకు కూడా వచ్చి ప్రచారం చేస్తారు. సోనియా ప్రతిపక్షంలో ఖాళీగా ఉంటూ కూడా ప్రచారానికి రాలేరు. అనారోగ్య సమస్య. ఎవరైనా ఇంటికి వచ్చి మాట్లాడతానన్నా ఎపాయింట్‌మెంటు యివ్వలేని అవస్థ. ఇక రాహుల్ విదేశాలను పట్టుకునే తిరుగుతాడు. ఎన్నికలప్పుడు వచ్చి నాలుగు గుళ్లు తిరిగి, మాది దత్తాత్రేయ గోత్రం, శివభక్తుణ్ని, జందెం వేసుకుంటానట అని చెప్పుకుని హంగామా చేసి, ఓట్లు దండుకోవాలని చూస్తాడు. తక్కిన సమయాల్లో అగ్రనాయకులకు, ముఖ్యమంత్రులకు సైతం ఎపాయింట్‌మెంటు యివ్వడు. ఇచ్చినా మాట వినిపించుకోడు. కుక్కపిల్లతో ఆడుకుంటూ కూర్చుంటాడు. అప్పుడప్పుడు అర్థరహితమైన ప్రకటనలిచ్చి మోదీ సేనకు గ్రాసం అందిస్తాడు. చివరకు అలాచేసి, యిలాచేసి బిజెపి పాలిట వరప్రదాత, ప్రజల పాలిట బూచి అయ్యాడు. మోదీ వద్దంటే మీకు రాహులే గతి అని చెప్పి బిజెపి వాళ్లు ఓటర్లను దడిపిస్తున్నారు. ఒక్కో రాష్ట్రం చేజారిపోతూ ఉంటే మాతాసుతులు వేడుక చూస్తున్నారు తప్ప పద్ధతి మార్చుకోవటం లేదు. పైగా మార్పు కోరేవాళ్లను పార్టీ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు.

ఇదంతా తెలిసి కూడా పికె ఆ పార్టీలోకి వెళుతున్నాడంటే, వాళ్లు రానిస్తున్నారంటే దాని అర్థమేమిటి? పికె ఏం చెప్పి కన్విన్స్ చేసి వుంటాడు? ‘మీరు మీ పద్ధతులు మార్చుకోనవసరం లేదు. పార్టీలో తక్కినవాళ్ల తలకాయలు ఎగరకొట్టి, పైపై మార్పులు చేసి, ఏవేవో మాయోపాయాలు పన్ని, ప్రజలను మభ్యపెట్టి మీరు 2024లో అధికారంలోకి వచ్చేట్లు చేస్తాను. దానికి గాను నావి ఫలానాఫలానా కోర్కెలున్నాయి, తీర్చండి.’ అని. వాళ్లు ‘మన సీటుకి ఢోకా లేనంతకాలం ఛాన్సిచ్చి చూసినా తప్పు లేదు. ఇతని ఉపాయాలు ఫలించి లేస్తే పైకి లేస్తాం. లేకపోతే ఉన్నచోటే ఉంటాం, ఎందుకంటే మన పార్టీకి దిగడానికి కూడా మెట్లు లేనంత అధఃపాతాళంలో ఉన్నాం. మార్పులు చేయడం లేదు, లేకపోతే పార్టీ ఎక్కడికో వెళ్లిపోయేదంటూ కొందరు గొడవ చేస్తున్నారు. ఇప్పుడీ పికె ప్రయోగం విఫలమైతే ‘చూశారా, మార్పులు చేసి చూశాం, ఫలితం లేకపోయింది’ అని వాళ్ల నోరు మూయించవచ్చు. నిజంగా సఫలమైతే వాళ్ల నోళ్లు ఎలాగూ మూతపడతాయి. ఎలా చూసినా పార్టీ మన చేతిలోంచి జారిపోదు.’ అనుకుని ఉంటారు.

అంటే మొత్తం కీలకమంతా ఎన్నికలలో గెలుపు మీదే ఆధారపడి ఉందన్నమాట. పికె పార్టీలోకి వచ్చి తొలుతగా డిసెంబరులో జరగబోయే గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెసుకు ఓ మోస్తరు సీట్లయినా తెప్పించాలి. గుజరాత్‌లో పార్టీ నాశనమై పోయి చాలా ఏళ్లయింది. పునరుద్ధరించడానికి ఆర్నెల్ల సమయం తక్కువే అని చెప్పాలి. పైగా ఆప్ ఒకటి ప్రవేశించింది. 2023లో ఎన్నికలున్న రాష్ట్రాలు చూడబోతే, ఈశాన్య రాష్ట్రాలు కాకుండా బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటక, మధ్యప్రదేశ్, కాంగ్రెసు అధికారంలో ఉన్న (అప్పటిదాకా ఉంటుందన్న గ్యారంటీ ఏమీ లేదనుకోండి) రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెరాస అధికారంలో ఉండి బిజెపి బలపడుతున్న తెలంగాణ ఉన్నాయి. ఇవన్నీ సవాళ్లు విసిరే రాష్ట్రాలే. వీటిని బట్టి 2024 పార్లమెంటు, దానితో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల విషయంలో కాస్త అంచనా వస్తుంది.

గుజరాత్ ఎన్నికల తర్వాతనే పికెపై కాంగ్రెసులో అసంతృప్తి పెల్లుబుకవచ్చు. గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తున్న జి23 నుంచే కాదు, రాహులే తప్పు పట్టవచ్చు. ఎందుకంటే అతనికి కావలసినవి షార్ట్‌కట్స్. ప్రచారంలో నువ్వూ ఊరూరూ తిరగాలంటే ఎగిరిపడతాడు. బెంగాల్‌లో మమత చూడండి. ఒంటరి సివంగిలా రాష్ట్రమంతటా తిరిగింది, కాలు విరిగితే వీల్‌ఛెయిర్‌లో తిరిగింది. రాహుల్ అయితే మొహం చూపించడమే అరుదు. అనేక రాష్ట్రాల్లో పొత్తుదారుల నుంచి ఎక్కువ సీట్లు తీసుకోవడం, సొంత పార్టీ అభ్యర్థుల ప్రచారానికి సైతం వెళ్లకుండా ఎగ్గొట్టడం! ఫలితాలు వచ్చాక తప్పు రాష్ట్రాధ్యక్షులపై తోసేయడం! ఇప్పుడు పికెకు కూడా అదే గతి పడుతుందని ఊహించవచ్చు. సరే, అవన్నీ జరిగినప్పుడు విపులంగా మాట్లాడుకోవచ్చు కానీ యీ దశలో నా అసంతృప్తి ఏమిటంటే, పికె దృష్టి ఎంతసేపూ ఎన్నికలూ, అంకెలపైన మాత్రమే ఉందని! అతనికి ఫీజు యిచ్చినవాడు ఎలాటివాడైనా సరే గెలిపించడమే తన విధి అనుకుంటాడు తప్ప వారి గుణగణాలు అతనికి అనవసరం.

మోదీ వంటి హిందూత్వవాది, స్టాలిన్ వంటి ద్రవిడ నాస్తికవాది, మమత వంటి రౌడీ, జగన్ వంటి అవినీతి కేసుల్లో నిందితుడు.. ఎవరైనా సరే, అతనికి ఫర్వాలేదు. గెలిచిన తర్వాత వాళ్లు ఎలా పాలించినా ఫర్వాలేదు. ‘‘ముత్యాలముగ్గు’’లో కాంట్రాక్టరులా రైళ్లు పడగొట్టో, ఓడలు ముంచో, ఏదో ఒక విధంగా పని పూర్తి చేయడమే అతనికి కావాలి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా మోదీ తను బిసి అని కానీ, చాయ్‌వాలా అని కానీ, తల్లితో అనుబంధం గురించి కానీ చెప్పుకోలేదు. ప్రధాని పదవికి పోటీ పడాలంటే యీ యిమేజి ఉండాలని పికె చెప్పి ఒప్పించాడు. అలాగే మమత తను బ్రాహ్మణి అని కానీ, చండీ స్తోత్రం కంఠతా వచ్చని కానీ అంతకుముందెన్నడూ చెప్పుకోలేదు. పికె సలహాపై అవన్నీ చేసింది. ఇలా ప్రతీదీ కులాల శాతాలూ, ఏ పని చేస్తే, ఏ యిమేజి నిలబెట్టుకుంటే ఎంత స్వింగు వస్తుంది అనే లెక్కలే పికెకు ముఖ్యం.

ఇలాటి వాళ్ల గురించే నేను 1990 జులైలో ‘‘ద సెఫాలజిస్ట్’’ అనే ఇంగ్లీషు కథ రాశాను. ‘‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’’లో ప్రచురితమైంది. అప్పట్లో సెఫాలజిస్టుగా ప్రణయ్ రాయ్ పేరు మాత్రమే వినబడేది.ఆయన ఏ పార్టీకి సలహాదారుగా పనిచేయలేదు కానీ, చేసి వుంటే మానవీయ కోణం కంటె లెక్కలే పరమావధిగా బతికేవారని సూచిస్తూ రాశాను. దాని తెలుగు అనువాదాన్ని మీకు 27 బుధవారం నాడు అందిస్తాను. చదివితే మీకే తెలుస్తుంది, పికె వంటి వ్యక్తుల గురించి నా ఫిర్యాదు ఏమిటో! ఎవరైనా వచ్చి కాంగ్రెసులో వ్యవస్థాగతమైన మార్పులు తెచ్చి, సోనియా కుటుంబాన్ని వెడలనంపుతానంటే నేను సంతోషించేవాణ్ని. ఎందుకంటే కాంగ్రెసు పార్టీలో మంచి చెడూ రెండూ ఉన్నాయి. మంచి ఏమిటంటే ఇన్‌క్లూజివ్ పాలిటిక్స్. అన్ని వర్గాల వారికీ రాజకీయావకాశం కల్పించే వాతావరణం. ప్రాంతీయ పార్టీల్లో అది ఉండదు. మతతత్వ పార్టీల్లో ఉండదు.

ఇక ఐడియాలజీకి సంబంధించి చూస్తే బేస్ స్థిరంగా ఉండి, అటూయిటూ ఊగే బొమ్మలా, కాంగ్రెసు కాస్సేపు రైటు వైపు, కాస్సేపు లెఫ్ట్ వైపు, కాస్సేపు మధ్యేమార్గంలో ఉంటూ వచ్చింది. అందరికీ మేలు చేస్తున్నానంటూనే, ఎవరికీ పెద్దగా ఏమీ చేయకుండా కాలక్షేపం చేస్తూ వచ్చింది. అవినీతి విషయమంటారా? జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో కాంగ్రెసులో నిజాయితీ పరులూ ఉన్నారు, అవినీతిపరులూ ఉన్నారు. కొన్ని చోట్ల, కొంతకాలం పాటు అభివృద్ధీ జరిగింది, కొంతకాలం పాటు వినాశనమూ జరిగింది. ఒక్క ముక్కలో తేల్చడం కష్టం. అందుకే కాంగ్రెసంటే ప్రజలు భయపడరు. వారి పాలనలో ఛోటా నాయకులకు కూడా పలుకుబడి వుండి పనులు చేసిపెట్టగలుగుతారు. ప్రాంతీయ పార్టీలైతే అధికారం కేంద్రీకృతమై ఉంటుంది. వారికే పనులు జరుగుతాయి.

పైగా కాంగ్రెసులో ఎవరైనా ప్రధాని, ముఖ్యమంత్రి కావచ్చు. కులబలం లేని రోశయ్య, ఏ బలమూ లేని కిరణ్‌కుమార్ రెడ్డి, అంతకుముందు రోజుల్లో అంజయ్య, భవనం, యిలాటివాళ్లు ముఖ్యమంత్రులు కావడమే దానికి నిదర్శనం. ప్రధానులుగా కూడా లాల్ బహదూర్ శాస్త్రి, పివి, మన్మోహన్ అయ్యారంటే కాంగ్రెసులోనే సాధ్యం. ప్రాంతీయ పార్టీల్లో అయితే ఆ పార్టీ అధికారంలోకి వస్తే నాయకుడే ముఖ్యమంత్రి. అతని తర్వాత అతని కొడుకు. అందువలన ఆ పార్టీ నాయకుల్లో ఒక విధమైన నిరాశ ఉంటుంది. మహా అయితే మంత్రి అవుతాను తప్ప ముఖ్యమంత్రి ఎప్పటికీ కాలేను అని. అందువలన ప్రజాసేవలో ఒక హద్దుకి మించి మునిగితేలరు. కాంగ్రెసులో కనీసం ఆశైనా ఉంటుంది, రాష్ట్రస్థాయిలో! జాతీయ స్థాయిలో సోనియా ఉండేదాకా కాంగ్రెసు నాయకులెవరికీ ఆశా లేదు, ఆశయమూ లేదు.

ప్రజలందరికీ కాంగ్రెసు కల్చర్‌పై ఒక ఐడియా వుంది కాబట్టే ‘కాంగ్రెసు’ అనే పదంపై మోజు పోని వారు చాలామంది ఉన్నారు. (కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన పార్టీలు కూడా పేరులో కాంగ్రెసు అనే తోక తగిలించుకుంటున్నారు చూడండి, ఆ పేరుకి ఉన్న గ్లామరు అలాటిది) 2004-14 మధ్య కేంద్రంలో అవినీతి ప్రభుత్వం నడిపిన తర్వాత కూడా యింకా దేశం మొత్తం మీద 20% ఓటు బ్యాంకు ఉండడానికి, కొన్ని రాష్ట్రాలలో యించుమించు 35%కి మించి ఉండడానికి కారణమిదే! ఈ పార్టీ ప్రతిపక్షాలకు తప్పనిసరి తద్దినం అయిపోయింది. కాంగ్రెసు లేకుండా బిజెపి వ్యతిరేక కూటమి కడదామంటే బలం చాలదు. కాంగ్రెసుతో కలుద్దామంటే అది కోరుతున్న పెత్తనం యివ్వడానికి ఎవరూ సిద్ధపడటం లేదు.

దీనికి పరిష్కారం ఏమిటంటే ప్రస్తుత కాంగ్రెసు అధిష్టానం తన ఏటిట్యూడ్ మార్చుకోవడం. కానీ అది జరగటం లేదు. అందువలన దేశక్షేమం కోరే కాంగ్రెసు నాయకులు కాంగ్రెసులోంచి బయటకు వచ్చేసి, తమ తమ రాష్ట్రాలలో పార్టీలు పెట్టేసుకోవాలి. మమత, జగన్ యిత్యాదులను చూసి స్ఫూర్తి తెచ్చుకోవాలి. అప్పుడు కాంగ్రెసిజం నిలుస్తుంది, కాంగ్రెసు కనుమరుగవుతుంది. ఇప్పుడీ పికె అది జరగకుండా అడ్డుపడుతున్నాడు. కాంగ్రెసును గెలిపిస్తానంటూ యీ విచ్ఛిన్నాన్ని ఏడాది, రెండేళ్లు వాయిదా వేయిస్తున్నాడు. పికె తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీ అంటే ఎన్నికలు గెలవడమే లక్ష్యమా? ఆర్గనైజేషన్  అనేది ఉండనక్కర లేదా? ప్రజల్లో ఉంటూ వాళ్ల అవసరాలు గమనించ వలసిన అవసరం లేదా? సిద్ధాంతాలు పట్టవా?

బిజెపి పార్టీని చూసి తక్కిన పార్టీలు చాలా నేర్చుకోవాలి. ఎన్నికల సమయంలో వాళ్లు పన్నా ప్రముఖులను ఏర్పాటు చేస్తారనే రాస్తున్నారు తప్ప, తక్కిన సమయాల్లో కూడా దిల్లీ నుంచి నిరంతరం నాయకులు వస్తూనే ఉంటారు. క్షేత్రస్థాయి వాస్తవాలను అంచనా వేసి, హైకమాండుకి తెలియపరుస్తూనే ఉంటారు. జాతీయ నాయకులు తరచుగా పర్యటిస్తూ ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణావ్యాసాలు రాస్తూ వుంటే యీ విషయం కొట్టవచ్చినట్లు కనబడుతోంది. ఏదైనా రాష్ట్రాన్ని గెలవాలంటే 2,3 ఏళ్లకు ముందే ప్రణాళికలు వేసుకుని, దిల్లీ నాయకులను అక్కడకు పంపి, వాళ్లకు స్థానిక భాషలో తర్ఫీదు యిప్పించి... ఒకటా, రెండా పార్టీ అంటే నిరంతరం జీవలక్షణంతో తొణికిస లాడాలి. అనుబంధ సంస్థలన్నిటి ద్వారా విద్య, వైద్యం అందిస్తూ, మతపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గత 20 ఏళ్లగా బిజెపి అనుబంధ సంస్థలు గిరిజన ప్రాంతాల్లో సేవ చేస్తూ ఎలా బలపడుతున్నాయో గమనించండి. కాంగ్రెసుకు గతంలో విద్యార్థుల్లో, కార్మికుల్లో, వర్తకసమాజాల్లో, సేవారంగంలో, అనుబంధ సంస్థలన్నీ చురుగ్గా పనిచేసేవి. ఇప్పుడు అవన్నీ పడుక్కున్నాయి.

రాహుల్, ప్రియాంకాలకు యివన్నీ అనవసరం. ఎన్నికల సమయంలో వచ్చి గుళ్లో పొర్లు దణ్ణాలు పెడితే, నిలువెత్తు నామాలు పెట్టేసుకుంటే చాలనుకుంటారు. దుకాణం కట్టేశాక వచ్చే ఎన్నికల దాకా కలికానికి కూడా కనబడరు. ఇవన్నీ సవరించుకోవాలని పికె చెప్తాడా? చెప్తే వాళ్లు వింటారా? ఆంధ్రలో వైసిపితో చేతులు కలపాలని సూచించాడని వార్తలు వచ్చాయి, కాదన్నారు కూడా. ఈ లెక్కలకు బదులుగా, వాలంటీరు వ్యవస్థ దుర్వినియోగ మౌతోందా అనేది పర్యవేక్షించే కమిటీలను కాంగ్రెసు ఏర్పాటు చేయాలని సూచిస్తే బాగుండేది. కరోనా టైములో ప్రజలకు సేవ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చున్న కాంగ్రెసు నాయకుల పదవులు ఊడపీకమని సిఫార్సు చేసి వుంటే బాగుండేది.

ఎన్నికలున్నా లేకపోయినా బిజెపి ఏడాది పొడుగునా, అనునిత్యం హిందూత్వవాదాన్ని, మైనారిటీల పట్ల భయాన్ని, విపరీత జాతీయవాదాన్ని ప్రచారం చేస్తూ పోతోంది. ఎన్నికల వేళ అది ఆటోమెటిక్‌గా ఫలితాల నిస్తోంది. అది చూసి కాంగ్రెసు కూడా అదే ధోరణి మొదలుపెట్టింది. మతవాదానికి ఆమోదముద్ర కొట్టి, అదే బాటలో దాని కంటె నాలుగాకులు ఎక్కువ చదువుతున్నాను, నాలుగు ప్రదక్షిణాలు ఎక్కువ చేస్తున్నాను అంటోంది. కానీ యిది తాత్కాలికమైన హడావుడి కాబట్టి జనాలు నమ్మటం లేదు. బిజెపికే ఓటేస్తున్నారు. అది చూసి కాంగ్రెసు మతం డోసు పెంచుతోంది తప్ప, దానికి భిన్నంగా ఉండే తన సెక్యులర్, ఇన్‌క్లూజివ్ మార్గాన్ని నిలబెట్టుకోవటం లేదు.

బిజెపిని ఓడిద్దామని చూసే పార్టీలు సైతం యిలా జావకారడంతో, పోనుపోను యితర మతాలను తమతో సమానంగా చూసేవాళ్లు హిందువులే కాదనే ఆలోచనాధోరణి ప్రబలింది. ఇతర మతస్తులను అనుమానించకపోతే, అవమానించకపోతే దేశభక్తే కాదనే పరిస్థితికి వచ్చింది. సోషలిజం, కమ్యూనిజం, సెక్యులరిజం అనేవి తిట్టుపదాలుగా మారిపోయాయి. సమాజంలో వచ్చిన యీ మార్పు గణనీయమైనదనుకుంటే ఈ ఘనత మోదీకే కట్టబెట్టాలి. ఎందుకంటే వాజపేయి హయాంలో గాంధియన్ సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను బిజెపి వాడింది.

ఒకటి గమనించాలి. తెలంగాణ నినాదం తెరాస మొదలుపెట్టింది. తర్వాత ఎన్ని పార్టీలు ఆ పల్లవి అందుకున్నా, తెరాస కంటె తామే వీరతెలంగాణా వాదులమని గుండెలు బాదుకున్నా, మేం యివ్వకపోతే తెలంగాణ వచ్చేదా అని కాంగ్రెసు చెప్పుకున్నా, మేం కలిసిరాకపోతే తెలంగాణ వీలయ్యేదా అని బిజెపి అడుగుతున్నా, తెలంగాణ ఏర్పడ్డాక తెరాసకే ఓట్లు పడ్డాయి. టిడిపి, వైసిపి, సిపిఐ మాది సమైక్యవాదమే అని చెప్పుకుని దానికి కట్టుబడి వుంటే, తెలంగాణలో వాటి ఉనికి ఉండివుండేది. అబ్బే మాదీ విభజనవాదమే అనడంతో అయితే మీకెందుకు, ఒరిజినల్ విభజనవాదులకే ఓటేస్తాం అన్నారు. అలాగే ఇతర పార్టీలు హిందూత్వ బాట పట్టినంతకాలం బిజెపికే లాభం తప్ప, తక్కినవాటన్నిటిది ద్వితీయస్థానమే.

కాంగ్రెసు అధిష్టానానికి యిది తెలియ చెప్పేవారెవరు? వారి చుట్టూ ఉన్నవారిది ఎంత హ్రస్వదృష్టో ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చినపుడే తెలిసింది. వైయస్ మరణానంతరం జగన్‌కు ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో మద్దతిచ్చారని తేటతెల్లంగా తెలిసింది. కానీ మరో బలమైన రాష్ట్రనాయకుడు తయారు కాకూడదని అతన్ని దూరం చేశారు. పార్టీలోంచి బయటకు పంపితే దిక్కూమొక్కూ లేకుండా పోతాడని సలహాదారులు చెపితే నమ్మారు. ఆ తర్వాత సానుభూతి యాత్రల్లో అతనికి వస్తున్న స్పందన చూసి బెదిరారు. మొత్తం రాష్ట్రంతో రిస్కు తీసుకోలేమని భావించి, జగన్‌ను ఆంధ్రకే పరిమితం చేస్తే అక్కడ సీట్లు తగ్గినా, తెలంగాణ యిస్తే, అక్కడ సీట్లు పెరుగుతాయని లెక్క వేశారు. ఆదరాబాదరాగా తెలంగాణ ప్రకటన చేశారు. దానికి ఆంధ్రలో వచ్చిన తీవ్రమైన రియాక్షన్ చూసి, బెదిరి, నాటకాలు మొదలుపెట్టారు.

రాష్ట్రవిభజన అనగానే హైదరాబాదు ఎటు పోతుంది అనేదే ప్రధాన ప్రశ్న. పెట్టుబడులన్నీ ఒకే చోట పెట్టడం చేత రెండు ప్రాంతాల వాళ్లూ దానిపై తమ పట్టు పోకూడదనుకున్నారు. తమ ప్రాంతంలో ఉంది కాబట్టి తమదే అని తెలంగాణ వారంటే, కేంద్రపాలితం చేసి ఎవరికైనా నివసించే అవకాశం యివ్వాలని ఆంధ్రులన్నారు. ఈ చర్చలు జరుగుతూండగానే జగన్ ఉపయెన్నికలలో నెగ్గసాగాడు. ఇక ఆంధ్రను అతను పట్టుకుపోతాడనే భయం వేసింది. హైదరాబాదుతో సహా తెలంగాణను ఏర్పాటు చేస్తే కెసియార్ గాంధీభవన్ మెట్ల మీదకి వచ్చి దండం పెడతాడని తెలంగాణ కాంగ్రెసు నాయకులు చెప్పిన అబద్ధాలు నమ్మారు. అందుకని మొత్తమంతా తెలంగాణకు కట్టబెట్టి, ఆంధ్రకు తిరుక్షవరం చేశారు. తాము యిప్పట్లో గెలిచే అవకాశం లేదు కాబట్టి ఆంధ్ర ఎలా నాశనమై పోయినా ఫర్వాలేదని అనుకున్నారనేది స్పష్టంగా కనబడే వాస్తవం.

ప్రత్యేక హోదాపై మన్‌మోహన్ హామీ అనేది ఎప్పుడు వచ్చింది? లోకసభలో బిల్లు పాసయిపోయాక! బిజెపి పట్టుబట్టాక! బిల్లులో అది పెట్టనేలేదు. ఇక వైజాగ్ రైల్వే జోన్ వగైరావగైరాలన్నీ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామనే రాసారు తప్ప, తప్పక యిస్తామని ఎక్కడా లేదు. ఇప్పుడు బిజెపి అదే ఎడ్వాంటేజి తీసుకుంది. అప్పట్లో మోదీ, ఆడ్వాణీలతో సహా కొందరు బిజెపి నాయకులకు విభజన యిష్టం లేదు. అయినా యీ దుష్టకార్యం కాంగ్రెసు చేతుల మీదుగా జరిపించేస్తే, తెలంగాణలో బలపడవచ్చు, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఎన్నటికీ ఛాన్సుండదు అని తక్కిన బిజెపి నాయకులు కన్విన్స్ చేశారు. ఇప్పుడదే జరుగుతోంది. ఆంధ్రలో బిజెపి కంటె తెలంగాణలో బిజెపి ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. అధికారం చేతిలో ఉన్నపుడు కాంగ్రెసు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో రాష్ట్రవిభజన బిల్లు తయారు చేసినప్పుడు కానీ, పార్లమెంటులో పాస్ చేయించినప్పుడు కానీ అందరికీ తెలిసివచ్చింది. ఫలితం ఏమైంది? ఎక్కడ చూసినా ఆ పార్టీకి గుండుసున్నా! సోనియా, రాహుల్ చుట్టూ ఉన్న సలహాదారుల క్వాలిటీ యిది!

ఈ పరిస్థితిని పికె మార్చగలడా? మార్చాలంటే పార్టీలో తలమునకలుగా దిగాలి. అడుగడుగునా అధిష్టానంతో ఘర్షించాలి. చూడబోతే పికెకు ఆ ఉద్దేశమే లేనట్టుంది. ఎందుకంటే తెరాస వంటి తక్కిన పార్టీలకు సలహాలివ్వడం మానడట. అంటే యిక్కడ పార్ట్‌టైమ్ జాబే! ‘ఎన్నికల్లో ఏ 150య్యో, 200లో సీట్లు తెప్పిస్తాను. అది పెట్టుకుని బేరాలాడుకుని, మీరు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి’ అని చెప్పివుంటాడు. ఆ 150, 200 రావడానికి కావలసిన టక్కుటమార విద్యలు నేర్పుతాను అని ఫీజు పుచ్చుకుంటున్నాడు. తన మాటకు పార్టీ నాయకులు గౌరవం యివ్వాలి కాబట్టి ఓ పోస్టోటి తగలేయండి అని ఉంటాడు. ఇంతకు మించి పార్టీని ప్రక్షాళన చేసే ఉద్దేశం కానీ, ఉబలాటం కానీ పికెలో నాకు కనబడటం లేదు. శ్రీశ్రీ ఎప్పుడో అన్నాడు – ‘కాంగ్రెసుకింకా ఎందుకు కాయకల్పచికిత్స, దాని పేరు చెపితేనే మేరలేని జుగుప్స’ అని.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?