Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: షర్మిల ఉదంతం చెప్పే నీతి

ఎమ్బీయస్‍: షర్మిల ఉదంతం చెప్పే నీతి

షర్మిల తన పార్టీని కాంగ్రెసులో కలిపేయబోతున్నారనే వార్త వచ్చినపుడు సెప్టెంబరు మొదటివారంలో ‘‘షర్మిల చేరే తీరం ఏది?’’  అనే వ్యాసం రాశాను. రెండు నెలలు తిరిగేసరికి కాంగ్రెసులో విలీనం హుళక్కి అని తేలింది. సోనియా, రాహుల్‌లతో ఫోటో దిగిన సంతోషం తప్ప ఆమెకు మరేమీ మిగల్లేదు. ఇప్పుడు ఆ ఊసే లేదు. కాంగ్రెసు వాళ్లు రమ్మంటున్నారనే హుషారులో ఎప్పణ్నుంచో తనను అంటి పెట్టుకుని ఉన్న కొండా రాఘవరెడ్డి గారి లాటి వాళ్లతో ఒక్క ముక్క చెప్పకుండా దిల్లీ వెళ్లిపోయింది. వారంతా యీమెను తిట్టుకుని వెళ్లిపోయారు. ఇప్పుడామె దగ్గర ఏమీ మిగల్లేదు. ఎప్పణ్నుంచో ఆశలు పెట్టుకున్న పాలేరులో కూడా నెగ్గుతుందన్న గ్యారంటీ లేదు. ఆటల్లో అరటిపండు స్థాయి కూడా ఉందో లేదో అన్న అనుమానం వస్తోంది.  

షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినపుడు యిక్కడ నెగ్గుకుని వచ్చే అవకాశాలు చాలా తక్కువనీ, ఎంతో శ్రమించాలని వ్యాసాలు రాశాను. ఫలానా వాళ్లు పనికి రారు అని ముందే తీర్మానించడం నా లక్షణం కాదు. చిరంజీవి కాదు, పవన్ కాదు, లోకేశ్ కాదు... ఎవరైనా సరే రాజకీయాల్లోకి వస్తున్నపుడు ‘మంచిదే, ఏదో కొంత మార్పు తీసుకురావాలి’ అని కోరుకుంటాను. లోకేశ్ తటపటాయిస్తూన్నప్పుడే  ‘వై నాట్ లోకేశ్?’ అని వ్యాసం రాశాను. నాయకుడిగా ఎదగడానికి అతనికి ఎన్ని అవకాశాలున్నాయో వివరించాను. అయితే మనం అనుకున్నట్లు అతనెందుకు ఉంటాడు? అతని చిత్తం అతనిది. పాదయాత్ర తర్వాత (తిట్లు తప్పిస్తే) ఎదుగుతున్నాడు అనుకుంటూ ఉంటే బాబు అరెస్టు జరిగింది. ఇతను దిల్లీ వెళ్లి కూర్చుని క్యాడర్ దృష్టిలో పతనమయ్యాడు. నా దృష్టిలో అది పెద్ద మైనస్.

బ్రాహ్మణి ప్రస్తుతానికి యింప్రెసివ్‌గా మాట్లాడలేదు. కానీ ప్రయత్నిస్తే ఆమెకూ ఛాన్సుందనే అంటాను నేను. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేది కవిసమయం మాత్రమే. తనను తాను మలచుకుంటూ, తప్పులు దిద్దుకుంటూ, కొత్తవి నేర్చుకుంటూ పోతేనే నాయకులుగా ఎదుగుతారు. తండ్రి తదనంతరం తనకే ముఖ్యమంత్రి పదవి కావాలని ఎగబడ్డ జగన్ రోత పుట్టించాడు. ఇతనికి నాయకత్వ లక్షణాలు బొత్తిగా లేవనిపించాడు. కానీ పదేళ్ల తర్వాత చూస్తే 175కి 151 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించాడు. అన్ని సీట్లు గెలిచే అవకాశాన్ని చంద్రబాబే కల్పించారన్నది వాస్తవమే అయినా, ఆ అవకాశాన్ని అందుకునే సామర్థ్యాన్ని యీ పదేళ్లలో తన పోరాటపటిమతో సంతరించుకున్నాడని ఒప్పుకోవాలి కదా.

తెలంగాణలో నిలదొక్కుకోవడం, వ్యాపించడం షర్మిలకు చాలా కష్టమైన పనే. కానీ లక్ష్యం అంటూ ఏర్పరచుకున్నాక సత్వర ఫలితాలకై ఆశ పడకుండా, పరిస్థితులకు అనుగుణంగా తన యేటిట్యూడ్ మార్చుకుంటూ శ్రమించాలి కదా. అబ్బే, అడ్డదారులు వెతికింది. తల్లిని ముందు పెట్టి తెలంగాణలో తండ్రి పేరును ఎన్‌క్యాష్ చేసుకోవాలనుకుంది. వర్కౌట్ కాలేదు. ఓపిక హరించి, కాంగ్రెసులో విలీనం కావాలనుకుంది. వాళ్లు ఆదరించినట్లే ఆదరించి జెల్ల కొట్టడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. 119 స్థానాల్లోనూ పోటీ చేస్తానని ఒక ప్రకటన. ఆ తర్వాత తను, తల్లి, భర్త అనిల్ పోటీ చేస్తారని మరో ప్రకటన. విజయమ్మ గారి పరిస్థితి దయనీయం. వైజాగ్‌లో నిలబెట్టి కొడుకు శృంగభంగం చేశాడు. ఇప్పుడు కూతురి వంతు కాబోలు.

షర్మిల భర్త అనిల్ సికింద్రాబాదు నుంచి పోటీ చేస్తాడని ఓ వార్త వచ్చింది. క్రైస్తవ జనాభా ఎక్కువున్నారని కాబోలు. పోనుపోను అనిల్ పేరు వినబడడం మానేసింది. తనూ, తల్లి అన్నారు. తను పాలేరు నించా మరో చోటు నించా అనే ఊగిసలాట చాలాకాలం సాగిసాగి చివరకు పాలేరే అంటున్నారు. తల్లిది యింకా ఖరారు కాలేదు. 119 సీట్లలోనూ పోటీ చేస్తామనే పాట వదలలేదు. ఇక తక్కిన చోట్ల అభ్యర్థులను వెతకాలి. తనకు వచ్చిన బైనాక్యులర్స్ గుర్తు నచ్చలేదు. తనకు దూరదృష్టి లోపించి, వాటిని తెచ్చుకుందని గేలి చేస్తారన్న భయమేమో! అగ్గిపెట్టె గుర్తు అడుగుతోందట. ‘కాగడాలా ప్రారంభమై అగ్గిపెట్టె  స్థితికి జారింది. అదీ తడిసిపోయింది. పుల్ల గీస్తే వెలగదు’ అని ప్రత్యర్థులు ఎద్దేవా చేసేందుకూ ఆస్కారముంది.

ఏతావతా షర్మిల పార్టీ అంటే ఓ జోక్‌లా మారిపోయింది. ఆమె తెలంగాణలోకి అడుగు పెట్టగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆమెను ఒక రుద్రమదేవిలా చిత్రీకరించారు. ఆమె గురించిన ప్రతి వార్తా కవర్ చేశారు. ఆమె తెలంగాణలో ఒక శక్తిగా ఎదిగిపోతూ ఉంటే, జగన్ కుట్రలు పన్ని ఆమెను తగ్గించడానికి విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఆమె కెసియార్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేస్తూ ఉంటే యువతను ఆకట్టుకుంటున్నారంటూ హంగామా చేశారు. చివరకు గుప్పెడు గట్టి అభ్యర్థులు లేని పార్టీగా మిగిలింది. విడిగా అఘోరిస్తే ఏదో చిన్న పార్టీగానైనా మిగిలేదేమో కానీ సోనియా గాంధీ కాంగ్రెసులో కలుపుకుంటామంటూ కబురు పెట్టి, రప్పించి, ఊరించి, ఆటలాడుకుని చివరకు ఆమెను జీరో చేసి వదిలిపెట్టింది.   

ఆ వదిలిపెట్టడం కూడా మామూలుగా వదిలిపెట్టలేదు. ఆమె పరువు తీసి మరీ వదిలిపెట్టింది. ‘పార్టీలో చేరడానికై ఆమె చాలా సీట్లు అడిగింది. అందుకే విలీనం కుదరలేదు.’ అని చెప్పి ఊరుకోవచ్చు. అప్పుడామెకు అనుయాయులైనా మిగిలేవారు. అబ్బే, ఆమెను దిల్లీ పిలిపించి, ‘వైయస్ మరణానంతరం ఆయన కుటుంబం పట్ల కాంగ్రెసు వ్యవహరించిన తీరుకి, సోనియా, రాహుల్‌లకు ఏ సంబంధమూ లేదు’ అని సర్టిఫికెట్టు యిప్పించేసి, మరీ వదిలారు. దాంతో ఆమె అనుచరులందరూ భగ్గుమని మండి, ఒక్కసారిగా విడిచి పోయారు. షర్మిలను అంటిపెట్టుకుని ఉన్నవాళ్లందరూ వైయస్ అభిమానులే! వైయస్ పట్ల తెలంగాణ ప్రజల్లో కాస్తోకూస్తో అభిమానం మిగిలి ఉందేమో, దాన్ని ఎన్‌క్యాష్ చేసుకుని ఓట్లు సంపాదించడానికి షర్మిల పనికి వస్తుంది అనుకుని కొందరు నాయకులు ఆమె చుట్టూ చేరారు. ఎందుకంటే తెలంగాణలో షర్మిల చేసిన ప్రజాసేవంటూ ఏమీ లేదు. ఇక్కడి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నదీ లేదు. వైయస్ యిమేజి (ఉంటేగింటే) ఒక్కటే వాళ్ల తురుఫు ముక్క.

వైయస్‌పై అభిమానమున్న ఓటర్లకు, ఆ ఓటర్లను నమ్ముకున్న నాయకులకు వైయస్‌పై కేసులు పెట్టించిన సోనియా, రాహుల్‌ అంటే మహా మంట. ఇప్పుడు షర్మిల యిలా క్లీన్‌చిట్ యిచ్చేయడంతో వారందరూ హతాశులై పోయారు. ‘రాహుల్‌ను ప్రధాని చేయడం మా నాన్న ఆశయం. దాన్ని నేను నెరవేరుస్తాను.’ అంటూ యీవిడ బయలుదేరడం వాళ్లు జీర్ణించుకోలేక పోయారు. తన మరణానంతరం ఏం జరుగుతుందో వైయస్‌కు తెలిస్తే ఆయన అలా అనేవాడా? తన రాజకీయ అస్తిత్వం కోసం షర్మిల తండ్రి పేరును ఎడాపెడా వాడేయడం బాధ కలిగించింది. వాళ్లంతా యీమెను యీమె కర్మానికి వదిలేసి వెళ్లిపోయారు. ఈ విధంగా తిరుక్షవరం చేసిన ప్రతిభ మాత్రం సోనియేదే!

కాంగ్రెసు వాళ్లు యీ విద్యలో ఆరితేరారు. దాని సుదీర్ఘ చరిత్రలో ప్రాంతీయ పార్టీలను, రాష్ట్రస్థాయి నాయకులను ఎన్నడూ మననీయ లేదు. కొందరు స్వతంత్రంగా పార్టీ పెట్టుకున్నవాళ్లయితే, మరి కొందరు కాంగ్రెసు లోంచి బయటకు వెళ్లి పార్టీలు పెట్టుకున్నవారు. మొదట్లో వారితో కలహించి, తర్వాత పొత్తు పెట్టుకుని, ఆ తర్వాత వారిలో కొందరు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, మరి కొందరిపై కేసులు పెట్టి, చివరకు నాయకుడికి గత్యంతరం లేకుండా చేసి, పార్టీని విలీనం చేయక తప్పని పరిస్థితి కల్పించేవారు. విలీనం చేసుకునేందుకు జరిగే చర్చల్లో సముచిత గౌరవం యిస్తామంటూ ఒప్పుకుని, ఒకసారి నిర్ణయం జరిగాక, క్రమేపీ మర్యాద తగ్గిస్తూ, చివరకు పట్టించుకోవడం మానేసి, అతని స్థాయిని, బలాన్ని పూర్తిగా హరించి వేసి, చివరకు కోపంతో బయటకు వెళ్లి పోయి మళ్లీ పార్టీని పునరుద్ధరిద్దామని చూసినా కుదరని స్థితికి తీసుకుని వస్తారు.

కాంగ్రెసు మింగేసిన ప్రాంతీయ పార్టీల జాబితా ఎవరికీ గుర్తుండక పోవచ్చు. కానీ తెలుగువాళ్లకు ప్రజారాజ్యం సంగతి గుర్తుంటుంది. చిరంజీవి దగ్గరున్న 18 మంది ఎమ్మెల్యేలకు వల విసురుతూ వచ్చారు. వాళ్లు చిరంజీవి వద్దకు వచ్చి ‘మీరు విలీనం చేస్తే సరేసరి, లేకపోతే మేం విడిగా ఫిరాయిస్తాం.’ అని బెదిరించే స్థితి తెప్పించారు. చిరంజీవికి వాళ్లను నిలబెట్టుకునే విద్య రాలేదు, పార్టీ నడపడానికి సమయం, నిధులు వెచ్చించడానికి మనసు రాలేదు. దాంతో విలీనానికి సై అన్నారు. ఇక అప్పణ్నుంచి కాంగ్రెసు ఆటలు మొదలెట్టింది. మొదట్లో రాహుల్ గాంధీ హైదరాబాదు వచ్చి పెద్ద సభ జరిపి, ప్రజారాజ్యంను విలీనం చేసుకుంటారని చెప్పారు. తర్వాత నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్నట్లు జరిగి, చిరంజీవియే దిల్లీ వెళ్లి రాహుల్ నివాసంలో కండువా కప్పించుకుని వచ్చారు. కేంద్రమంత్రి పదవి యిచ్చినా, ఏ ప్రాధాన్యతా లేదు. రాష్ట్రవిభజన సమయంలో ఆయన మాటకు విలువా యివ్వలేదు.

తెలంగాణ రాష్ట్రం యిస్తే కెసియార్ వచ్చి యిలాగే కాళ్ల మీద పడతాడని, గాంధీ భవన్ దగ్గర కాంగ్రెసు టిక్కెట్టు కోసం క్యూలో నిలబడతాడని తెలంగాణ కాంగ్రెసు నాయకులు సోనియా, రాహుల్‌లను నమ్మించారు. కెసియార్ అలాగే నటించారు. వైయస్ మరణానంతరం ఉమ్మడి రాష్ట్రంలో అంత స్టేచర్ ఉన్న కాంగ్రెసు నాయకుడు లేడు కాబట్టి, రాష్ట్రం మొత్తం అలాగే ఉంటే లాభం లేదని, ఆంధ్రలో జగన్, బాబులలో ఎవరో ఒకరు గెలిచినా, కనీసం తెలంగాణను కెసియార్ సాయంతో నిలబెట్టుకోవచ్చని అంచనా వేసి కాంగ్రెసు రాష్ట్రాన్ని చీల్చింది. చీల్చాక కెసియార్ సకుటుంబంగా సోనియా వద్దకు వెళ్లి ధన్యవాదాలు చెప్పి, విలీనానంతరం పార్టీలో తన స్థానం గురించి చర్చలు ప్రారంభించ బోయారు. కానీ అహంభావి ఐన సోనియా ఒక ప్రాంతీయ నాయకుడికి తనతో మాట్లాడే స్థాయి లేదని అనుకుని, ‘అవన్నీ ఆజాద్ లాటి వాళ్లతో మాట్లాడండి’ అని చెప్పింది. కెసియార్‌కు భవిష్యత్తు కళ్లకు కట్టినట్లయింది. విలీనం లేదు అంటూ కాంగ్రెసునే లక్ష్యంగా చేసుకుని, ఎన్నికలలో దిగారు. తెరాస గెలిచింది. తెలంగాణ యిచ్చిన కాంగ్రెసు పదేళ్ల తర్వాత కూడా అధికారంలోకి వచ్చేట్లు లేదు.

ప్రాంతీయ పార్టీ నాయకుడు ఎలా ఉండాలో కెసియార్ చూపించారు. 1969లో తెలంగాణ ప్రజా సమితి పార్టీ పెట్టి తెలంగాణ ప్రత్యేక ఉద్యమం నడిపిన చెన్నారెడ్డి బలమైన నాయకుడు. 1971 మార్చి పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో 14 పార్లమెంటు సీట్లలో 10 గెలుచుకున్నాడు. అంతే, ఇందిరా గాంధీ చెన్నారెడ్డిని పిలిచి, ఆశలు చూపించి పార్టీని విలీనం చేసేసుకున్నారు. ఒకసారి కాంగ్రెసులోకి వచ్చాక, చెన్నారెడ్డి పార్టీ అధిష్టానం చెప్పినట్లే నడుచుకోవలసి వచ్చింది. ఎమర్జన్సీ తర్వాత కాంగ్రెసు పార్టీ చీలిపోయి, యీయన ఇందిరా కాంగ్రెసులో చేరాడు కాబట్టి 1978లో ముఖ్యమంత్రిని చేశారు కానీ రెండున్నరేళ్లలోనే తీసేశారు. 1989 డిసెంబరులో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఏడాది పాటే పదవిలో ఉండగలిగాడు. ఇవన్నీ చూసే కెసియార్ తన సొంత ప్రతిపత్తి కాపాడుకున్నాడు కాబట్టి యీరోజు నాయకుడిగా వెలుగుతున్నాడు.

వీరందరినీ చూడకపోయినా షర్మిల తన తండ్రి, సోదరుడి సంగతులైనా గుర్తు చేసుకోవాల్సింది. సాటి క్రైస్తవుడు కాబట్టి సోనియా 2004లో వైయస్‌కు ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని అప్పగించిందని చాలా మంది పొరబడతారు. వైయస్‌ను పైకి రానీయకుండా ఎంతమంది కాంగ్రెసు వాళ్లు అడ్డుకున్నారో ‘‘యాత్ర’’ సినిమాలో చూపించారు. అదంతా వైయస్ స్వయంకృతమే. అతనికి విపరీతమైన పదవీలాలస. తను తప్ప ఎవరు ముఖ్యమంత్రి ఐనా సీటులో కుదురుగా ఉండనిచ్చేవాడు కాడు. నిరంతర అసమ్మతివాది. నెహ్రూ రోజుల్లో రాష్ట్రస్థాయిలో బలమైన నాయకులను ఉండనిచ్చేవారు కానీ ఇందిర ఎవరైనా బలంగా ఉంటే వాళ్లని తీసేసేదాకా నిద్రపోయేది కాదు. వాళ్ల స్థానంలో బలహీనుల్ని పెట్టేది. ముఖ్యమంత్రిని నియమించడంతో పాటు పార్టీలో అసమ్మతి నాయకుణ్ని కూడా నియమించేది. ఇక ముఖ్యమంత్రి నిత్యం భయంతో వణుకుతూ, ప్రతి చిన్నదానికి అధిష్టానంపై ఆధారపడుతూ బతికేవాడు. అయినా ఎవర్నీ రెండేళ్లకు మించి ఉంచేది కాదు.

వైయస్‌ను అసమ్మతివాదిగా అధిష్టానం ప్రోత్సహిస్తూ వచ్చింది. అందువలన అతనికి విశ్వాసపాత్రమైన అనుచరులు కొంతమంది ఉంటే, శత్రువులు అనేకులు ఉండేవారు. వైయస్ సొంతంగా నాయకుడిగా ఎదుగుదామని, పాదయాత్ర చేద్దామని అనుకున్నపుడు అధిష్టానం అనుమతి యివ్వకుండా వాళ్లు అడ్డుపడ్డారు. వైయస్ ప్రజలలో పాప్యులర్ కావడంతో గతి లేక అధిష్టానం 2004 తర్వాత ముఖ్యమంత్రిని చేసింది. సిఎం అయ్యాక వైయస్ అధిష్టానానికి కావలసినవి అన్నీ అందిస్తూనే, సొంత వ్యక్తిత్వం చూపుకుంటూ, సొంత యిమేజి పెంచుకుంటూ ప్రజల్లో పలుకుబడి సంపాదించుకున్నాడు. గతంలోలా అతన్ని యిష్టానుసారం తీసేసే వీలు లేకపోయింది అధిష్టానానికి. 2009 ఎన్నికలలో తెరాసతో పొత్తు పెట్టుకోమని ఒత్తిడి తెస్తే అయితే బెంగుళూరు వెళ్లి కూర్చుంటాను, ఎన్నికల సంగతి మీరు చూసుకోండి అని చెప్పాడట. గతిలేక సోనియా పళ్లు నూరుకుంటూ సహించింది.

వైయస్ పోవడంతో ‘హమ్మయ్య, రాష్ట్రంపై మళ్లీ హుకుం చెలాయించవచ్చు’ అనుకుంది. కానీ జగన్ రూపంలో అవరోధం ఏర్పడింది. సజీవ వైయస్ కంటె దివంగత వైయస్ బలంగా రూపొందాడు. ఇందిర విషయంలోనూ అదే జరిగింది. ఆమె హత్యానంతరం జరిగిన 1984 నవంబరు పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెసుకు 77శాతం సీట్లు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో అదే పరిస్థితి ఏర్పడబోతోందని అంచనా వేసి కాంగ్రెసు ఎమ్మెల్యేలలో అధికులు జగన్‌ను సిఎం చేయాలంటూ సంతకాలు పెట్టారు. దానికి ఒప్పుకుంటే వైయస్ స్థానంలో మరో మేకు తయారవుతుందని భయపడిన సోనియా, కూర్చోమంటే కూర్చుని, లేవమంటే లేచే రోశయ్యను సిఎం చేసింది. జగన్ కుటుంబం వెళ్లి అడిగితే కావాలంటే కేంద్రమంత్రి యిస్తానందిట.

జగన్‌కు పాలనానుభవం లేదు కదా, ముఖ్యమంత్రి పదవికై దురాశ పడకుండా వాళ్లిచ్చిన పదవి తీసుకుని, అనుభవం తెచ్చుకుని, తర్వాత బలం కూడగట్టుకుని, ప్రయత్నించవచ్చు కదాని నేనూ అనుకున్నాను. అప్పటి వ్యాసాల్లో ఆ విషయం రాశాను కూడా. తర్వాతి ఘటనలు చూస్తే నాకు బోధపడింది - సోనియా అప్పటికి కేంద్రంలో ఏ క్రీడల శాఖామంత్రిగానో పదవి యిచ్చి, అట్నుంచి అటు ఏ ఈశాన్య రాష్ట్రాలకో గవర్నరుగా పంపించి, ఉమ్మడి రాష్ట్రంలో నస్మరంతి గాడిలా చేసేదని! జగన్ మొండి వైఖరిని ఆమె పసిగట్టి, యితనిలో ఎప్పటికైనా బలమైన నాయకుడయ్యే లక్షణాలున్నాయని అనుమానించింది. అందుకే తన మాట వినలేదని కఠినంగా వ్యవహరించింది. జగన్ ఘర్షణమార్గాన్నే ఎంచుకున్నాడు. అష్టకష్టాలు పడ్డాడు. పదేళ్ల పోరాటం తర్వాత విజయం సాధించాడు. లేకపోతే అతనికి కూడా షర్మిల గతే పట్టి ఉండేది.   

ఈమె పరిస్థితి చూసి మేలుకోవలసినది పవన్ కళ్యాణ్ అని నా ఉద్దేశం. బిజెపి కాంగ్రెసు లక్షణాలన్నీ పుణికి పుచ్చుకుంది. అదీ జాతీయ పార్టీయే కాబట్టి ప్రాంతీయ పార్టీలను క్షీణింప చేస్తోంది. అమిత్ షా పవన్‌ను పిలిపించి ఏం మాట్లాడారో వారమైనా మిస్టరీగానే ఉంది. అది జనసేనకు బలం చేకూర్చేదో కాదో ఏమీ అర్థం కాకుండా ఉంది. దాని గురించి ‘పవన్‌కు యిచ్చిన రోడ్‌మ్యాప్’ అనే వ్యాసంలో చర్చిస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?