cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: త్రిపుర నాయకత్వంలో మనస్పర్ధలు - 2/3

ఎమ్బీయస్‌: త్రిపుర నాయకత్వంలో మనస్పర్ధలు  - 2/3

రాజకీయంగా చూస్తే మొదటి నుంచి 1977 వరకు త్రిపురలో కాంగ్రెసు గెలుస్తూ వచ్చేది. గిరిజనుల్లో ప్రాబల్యం సంపాదించి, తర్వాత బెంగాలీలలో కూడా పలుకుబడి సంపాదించిన సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ పుంజుకుంటూ వచ్చింది. ఎమర్జన్సీ అనంతరం దేశమంతా కాంగ్రెసు ఓడిపోయిన తరుణంలో, జనతా పార్టీ నెగ్గి కొన్ని నెలలు పాలించింది. 1978లో సిపిఎం 60 సీట్లలో 56 నెగ్గి, అధికారంలోకి వచ్చింది. సిపిఎం ముఖ్యమంత్రి నృపేన్‌ చక్రవర్తి పదేళ్ల పాటు చక్కగానే పాలించాడు. 1983లో సిపిఎంకు 37 వచ్చాయి. ప్రత్యేక రాష్ట్రం కోరే గిరిజనుల పార్టీ ఐన త్రిపుర ఉపజాతి యువ సమితి కాంగ్రెసుతో కలిసి 27 గెలిచింది.

1988లో వచ్చేసరికి ఆ రెండూ కలిసి 31 స్థానాలు గెలిచి సిపిఎంను ఓడించాయి. 1993 వచ్చేలోగా ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. ఎన్నికలలో వాళ్ల బలం 19కి పడిపోయింది. సిపిఎం 41 స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చింది. దశరథ్‌ దేబ్‌ ముఖ్యమంత్రి అయ్యాడు. 1998లో మళ్లీ గెలిచింది. 49 ఏళ్ల మాణిక్‌ సర్కార్‌ ముఖ్యమంత్రిగా వచ్చి 20 ఏళ్లగా పాలిస్తున్నాడు. నిరాడంబర జీవితంతో, సమర్థపాలనతో అతను అందర్నీ ఆకట్టుకుని తన పార్టీకి 45-48% ఓటింగు తెచ్చుకుంటున్నాడు. కానీ దానితో పాటు  కమ్యూనిస్టు వ్యతిరేక ఓటు ఎప్పుడూ 34-37% ఉంటూ వచ్చింది. అది కాంగ్రెసుకు వెళ్లినా సీట్ల విషయంలో వెనకబడేది. 1998, 2003, 2008, 2013లలో సిపిఎంకు 38, 38, 46, 49 రాగా, కాంగ్రెసుకు 13,13,10,10 వచ్చాయి. సిపిఎం మిత్రపక్షమైన సిపిఐకు 1.5% ఓట్లతో 1 సీటు ఎప్పుడూ వచ్చేది. 

మాణిక్‌ పాలన - ఇక మాణిక్‌ ఇమేజే అతనికి బలం. ఆర్భాటాలు లేవు, అవినీతి లేదు. టైలరు కొడుకు. భార్య కేంద్రప్రభుత్వోద్యోగినిగా చేసి రిటైరయింది. సొంత యిల్లు లేదు. సొంత కారు లేదు. జీతమంతా పార్టీకి యిచ్చేసి, నెలకు రూ.10 వేలు వాళ్ల దగ్గర్నుంచి అలవెన్సుగా తీసుకుంటాడు. అందరికీ అందుబాటులో ఉంటాడు. ముఖ్యంగా అతను రాష్ట్రానికి శాంతిని తెచ్చాడు. బంగ్లాదేశ్‌ కేంద్రంగా తీవ్రవాదులు హింసకు పాల్పడి, త్రిపురలో అల్లకల్లోలం సృష్టించేవారు. 1997లో అతి క్రూరమైన 1958 నాటి ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ (స్పెషల్‌ పవర్స్‌) చట్టం అమల్లోకి తెచ్చారు. నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర, ఆల్‌ త్రిపుర టైగర్‌ ఫోర్స్‌ అనే వేర్పాటు వాద సంస్థలు ఇండియా నుంచి విడిపోవాలనే డిమాండ్‌తో పోరాటాలు చేసేవి.

1956 తర్వాత వచ్చిపడిన బెంగాలీలందరినీ తరిమివేయాలని, వారి భూములు లాక్కుని స్థానిక గిరిజనులకు పంచేయాలనీ వారి డిమాండ్‌. మారణాయుధాల వాడకంలో వాళ్లు బంగ్లాదేశ్‌లో తర్ఫీదు పొందేవారు. బంగ్లాదేశ్‌తో 856 కి.మీ.ల సరిహద్దు ఉంది. దాని పొడుగునా గస్తీ కాయడం అసాధ్యం. ఈ తీవ్రవాదం కారణంగా, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ చట్టం కారణంగా గిరిజనులు అవస్థలు పడేవారు. 1992-2008 మధ్య 3500 మంది పౌరులు మరణించారు. తీవ్రవాదులను అణచివేసి గిరిజనులు నమ్మకాన్ని చూరగొన్నాడు మాణిక్‌. (2015 మేలో యీ చట్టాన్ని తీయించివేశాడు). 

అందరికీ విద్య, వైద్యం -శాంతిభద్రతలు నెలకొల్పాక మాణిక్‌ విద్యపై దృష్టి పెట్టాడు. ఏడేళ్లకు పైబడిన వారిలో అక్షరాస్యత 2001లో 73% ఉంటే 2011 నాటికి 87%కి పెరిగింది. ఈనాడు త్రిపురలో అక్షరాస్యత 97%. మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేయించి, వైద్య సదుపాయాలు అందేట్లు చూశాడు. పదేళ్ల క్రితం వరకు క్రూరమృగాలు సంచరించే అరణ్యాల్లో సైతం మోటారు వాహనాలు వెళ్లే రోడ్లు వేయించాడు. కుగ్రామాల్లో కూడా తాగునీటి వసతి, విద్యుత్‌ సౌకర్యాలు ఏర్పరచాడు. ప్రతి గ్రామానికి బడి ఉంటేట్లు చూశాడు. పాఠశాలల నాణ్యత పెంచాడు.

1100 గ్రామ పంచాయితీలుంటే ప్రతీ దాంట్లో కనీసం ఒక హెల్త్‌ సబ్‌సెంటర్‌ ఉండేట్లు చూశాడు. 12 సబ్‌డివిజనల్‌ ఆసుపత్రులు, ఆరు జిల్లా స్థాయి ఆసుపత్రులు, ఆరు రాష్ట్రస్థాయి ఆసుపత్రులు యీరోజు త్రిపురలో ఉన్నాయి. ఆహారభద్రతకు పెద్దపీట వేశాడు. ఎన్‌రేగా పథకం పక్కాగా అమలైన రాష్ట్రాలలో త్రిపుర అగ్రస్థానంలో ఉంది. గత ఐదారేళ్లలో  ఎన్‌రేగా పథకం కింద ఏడాదిలో పని కల్పించిన రోజులు జాతీయ స్థాయిలో సగటున 40-50 ఉంటే, త్రిపురలో 80 ఉంది.  2015-16లో అది 94కి చేరింది. (ఇప్పుడు కేంద్రం దాని నిధుల్లో కోత పెట్టింది కాబట్టి యీ అంకె తగ్గుతుంది.) 2004-11 మధ్య బిపిఎల్‌ (దారిద్య్రరేఖకు దిగువ ఉన్నవారు) పేదల సంఖ్య 62% తగ్గింది. 2005-06లో శిశుమరణాలు వెయ్యికి 51 ఉంటే 2015 నాటికి అది 20 అయింది.  రాష్ట్ర జిడిపిలో 18% విద్య, వైద్యం, సంక్షేమ పథకాలపై ఖర్చు పెట్టాడు. 

ఉద్యోగులు ఉసూరుమన్నారు- గత నాలుగేళ్లలో జాతీయస్థాయిలో నెట్‌ డొమెస్టిక్‌ ప్రోడక్ట్‌ ఏడాదికి 5% చొప్పున పెరిగితే త్రిపురలో స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రోడక్ట్‌ ఏటా 9-10% చొప్పున పెరిగింది. 1998లో సోషల్‌ పెన్షన్‌ 63,500 మందికి అందితే 2017 నాటికి అది 4.32 లక్షలకు చేరింది. ఇరిగేషన్‌ సౌకర్యాలు తక్కువే ఐనా ఋణబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఒక్కడూ లేడు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం తక్కువే అయినా వచ్చినదాన్ని యిలాటి మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టాడు. దీనికోసం ప్రభుత్వోద్యోగులకు జీతాలు పెద్దగా పెంచలేదు. అది వాళ్లకు కోపకారణమైంది.

(దేశమంతా ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జీతాలు యిస్తూండగా త్రిపుర ప్రభుత్వోద్యోగులకు మాత్రం నాలుగో వేతన సంఘం సిఫార్సులే అమల్లో ఉన్నాయి, అది కూడా 2017 జూన్‌ నుంచి మాత్రమే. ఇది ఉద్యోగులకు అస్సలు నచ్చలేదు. ఏడో కమిషన్‌ అమలు చేసి ప్రభుత్వోద్యోగి జీతం 20వేల నుంచి 35 వేలకు పెంచుతామని బిజెపి మానిఫెస్టోలో హామీ యివ్వడంతో రెండున్నర లక్షల ఉద్యోగులు బిజెపికి పూర్తిగా సహకరించారు. పోలింగు సమయంలో ప్రభుత్వోద్యోగులు అనుకూలంగా ఉంటే 1-2% మొగ్గు ఉన్నట్లే! తాజాకలం ఏమిటంటే - అధికారంలోకి వచ్చాక, హామీని వెంటనే అమలు చేయకుండా జీతం ఎంత పెంచాలో తేల్చండంటూ విప్లవ్‌ ఓ కమిటీ వేసి, వ్యవహారాన్ని సాగదీస్తున్నాడు) 

 నిరుద్యోగుల్లో నిస్పృహ-ఉద్యోగుల బాధ యిలా ఉంటే, ఉద్యోగార్థుల వేదన మరోలా ఉంది. విద్యార్జన పెరగడంతో నిరుద్యోగులు పెరిగారు. ఆ నిష్పత్తిలో ఉద్యోగాలు కల్పించడానికి రాష్ట్రంలో తగినన్ని అవకాశాలు లేవు. నిజానికి గత 20 ఏళ్లలో 92 వేల ప్రభుత్వోద్యోగాలు కల్పించడం జరిగింది. అవి చాలక ఉద్యోగార్థులు దూరప్రాంతాలకు వెళ్లవలసి వస్తోంది.  దాంతో వాళ్లు కమ్యూనిస్టు పాలనపై కోపం పెంచుకున్నారు. వాళ్లు పెరిగి విషయాలు అర్థం చేసుకునే వయసుకి వచ్చేసరికి తీవ్రవాద ఛాయలు ఏమీ లేవు. అందువలన గతంలో మాణిక్‌ శాంతిస్థాపనకు ఏం చేశాడో వాళ్లకు తెలియదు, తెలిసినా పట్టించుకోలేదు. గతతరాల్లో వాళ్లు సమాజంలో అన్ని వర్గాల వారి సంక్షేమం గురించి ఆలోచించేవారు. ఈ తరం తనకు వ్యక్తిగతంగా ఏం లాభం అనే ఆలోచిస్తుంది. నాకు ఉద్యోగం రాలేదు, ఏదో పల్లెటూళ్లో ఆసుపత్రి పెడితే నాకేమిటి? అనే యువత అనుకుంటోంది. నిజానికి రాష్ట్రంలో 5వేల స్మాల్‌ స్కేల్‌ యిండస్ట్రీస్‌ ఉన్నాయి. వాటి ద్వారా 67వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి.

చిన్న వ్యాపారస్తుల కోసం స్వావలంబన్‌ స్కీము ద్వారా 16 వేల మందికి సాయం అందించారు. కానీ యివేమీ యువతకు ఆనలేదు. వాళ్లకు కావలసినది ఆధునిక సౌకర్యాలు, విదేశాల్లో ఉద్యోగాలు, కళ్లు మిరిమిట్లు కొల్పించే జీతాలు. దేశంలో మోదీ అవన్నీ తెస్తానంటూంటే యీ చాదస్తపు, సాధారణ జీవితపు, కమ్యూనిస్టు ప్రభుత్వం మోకాలొడ్డుతోంది అని భావిస్తున్నారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కులసమీకరణాలతో బిహార్‌ నెగ్గుతూ వచ్చాడు. ఆధునికత అంటే వెక్కిరించేవాడు. 2005లో నీతీశ్‌ 'బిహార్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తాను, మీకు ఉద్యోగాలు వచ్చేట్లు చేస్తాను' అని వికాస్‌ పురుష్‌ యిమేజితో లాలూతో తలపడ్డాడు. బిహారీలు నీతీశ్‌ వెంట నడిచారు. అలాటిదే యిక్కడా చేయాలి అని అనుకున్నాడు సునీల్‌. ఎందుకంటే 18-33 వయసులో ఉన్నవాళ్లు ఓటర్లలో 40% ఉన్నారు. 

ప్రతిపక్షాలు - సిపిఎంకు ప్రధాన ప్రత్యర్థిగా నిలవాల్సిన కాంగ్రెసు నీరసించింది. అధిష్టానం దృష్టిలో అక్కణ్నుంచి వచ్చేవి రెండు పార్లమెంటు స్థానాలు మాత్రమే. అసెంబ్లీ ఎలాగూ చేజిక్కదు. ఇంకెందుకు అని త్రిపుర యూనిట్‌ను పట్టించుకోవడం మానేసింది. దాంతో 6గురు కాంగ్రెసు ఎమ్మెల్యేలు 2016లో తృణమూల్‌ కాంగ్రెసులో చేరారు. ఇక తన పార్టీ వరకు వస్తే 1998లో 6% ఓట్లు వచ్చినా తర్వాతి ఎన్నికలలో 1.5% లోపే వచ్చాయి. ఎప్పుడూ ఒక్క సీటు కూడా రాలేదు. 2013లో పోటీ చేసిన 50 స్థానాల్లోనూ డిపాజిట్లు దక్కలేదు. 1.87% ఓట్లు వచ్చాయి.

పార్టీ కార్యకర్తలంతా వరుస పరాజయాలతో కుదేలై ఉన్నారు. సిపిఎం విజయపరంపరకు అడ్డు లేకుండా ఉంది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో 64% ఓట్లతో రెండు స్థానాలూ గెలిచింది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ముందంజలో ఉంది. 2015 పంచాయితీ ఎన్నికలలో గ్రామ పంచాయితీల్లో 75% గెలిచింది. బెంగాల్‌లో సిపిఎం పారిశ్రామికీకరణ చేసి ఉద్యోగాలు సృష్టిద్దామని ఉబలాటపడి, అధికారం పోగొట్టుకుంది. మళ్లీ కోలుకోవటం లేదు. కానీ యిక్కడ అలాటి ప్రమాదమేమీ కనబడటం లేదు.  

సునీల్‌ దీక్ష - పరిస్థితులు ఆకళింపు చేసుకున్న సునీల్‌ మార్పు రావాలంటే నేను యిక్కడే ఉండాలి, రకరకాల వ్యూహాలు రచించాలి అనుకున్నాడు. 2014 నవంబరు నుంచి సునీల్‌ అక్కడే నెలలో 15 రోజులు గడపసాగాడు. 2015 జులై నుంచి పూర్తిగా అక్కడే మకాం పెట్టుకున్నాడు. అతనికి అప్పటికే బెంగాలీ వచ్చు. త్రిపుర జనాభాలో 31% మంది ఉన్న గిరిజనుల భాష ఐన కోక్‌బొరాక్‌ను కూడా నేర్చుకున్నాడు. వాళ్ల ఆహారపు అలవాట్లు అలవర్చుకున్నాడు. వారిని తన పార్టీలో చేర్పించి ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాడు.

ఈ ప్రయత్నాలతో స్థానిక ఎన్నికలలో బిజెపి ఓటు 14.7% అయింది. 2014 నాటి 1.54%తో పోలిస్తే యిది దాదాపు పది రెట్లు!సునీల్‌తో టీమ్‌లో మరో యిద్దరు ప్రముఖులున్నారు. ఈశాన్య రాష్ట్రాలన్నిటికీ యిన్‌చార్జిగా వున్న తెలుగువాడు రామ్‌ మాధవ్‌ ఒకడు. ఆరెస్సెస్‌ కార్యకర్తగా వుండి 2014లో బిజెపిలోకి వచ్చాడు. కశ్మీర్‌తో సహా అనేక కీలకమైన రాష్ట్రాలలో అసాధ్యమనుకున్నవి సుసాధ్యం చేశాడు. ఇక రెండో వ్యక్తి అసాంలో కాంగ్రెసుకు వ్యూహకర్తగా ఉన్న హిమంత విశ్వశర్మ 2015లో ఆ పార్టీ వదిలి బిజెపిలో చేరాడు. అసాం, మణిపూర్‌, అరుణాచల్‌లలో బిజెపి ప్రభుత్వాలు ఏర్పరడడంలో ప్రధాన పాత్ర అతనిదే. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా సరైన కాండిడేట్‌ ఎవరా అని వెతికితే విప్లవ్‌ దేవ్‌ పేరును ఆరెస్సెస్‌ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ కృష్ణ గోపాల్‌ సూచించాడు. విప్లవ్‌ దేవ్‌ 1971లో త్రిపురలోని గోమతి జిల్లాలో పుట్టాడు. తలిదండ్రులు బంగ్లాదేశ్‌ (అప్పటి తూర్పు బెంగాల్‌)నుంచి వలస వచ్చారు. ఆరెస్సెస్‌ అభిమానులు. విప్లవ్‌ స్కూలు, కాలేజీ చదువు త్రిపురలోనే. తర్వాత 20 ఏళ్ల వయసులో ఆరెస్సెస్‌లో చేరడానికి దిల్లీ వెళ్లాడు. కృష్ణగోపాల్‌కు శిష్యుడయ్యాడు. బిజెపి జనరల్‌ సెక్రటరీ గోవిందాచార్య వద్ద పనిచేశాడు. వాజపేయి ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రమంత్రి రీటా వర్మ సిబ్బందిలో చేరాడు. తర్వాత సాత్నా (మధ్యప్రదేశ్‌) బిజెపి ఎంపీ గణేశ్‌ సింగ్‌కు అసిస్టెంటుగా కూడా పనిచేశాడు. త్రిపుర ట్రైబల్‌ ఏరియాస్‌ ఆటోనమస్‌ డిస్ట్రిక్ట్‌ కౌన్సిల్‌ ఎన్నికలలో బిజెపి తరఫున కాన్వాస్‌ చేయడానికి 2015లో బిజెపి జన సంపర్క్‌ ప్రముఖ్‌గా వచ్చాడు. అతన్ని 2016లో త్రిపురకు తీసుకుని వచ్చి అధ్యక్షుణ్ని చేశారు. 

నాయకుల దిగుమతి - రాజకీయ వ్యూహాలకు వస్తే యిప్పటికిప్పుడు పార్టీని నిర్మించడమంటే కష్టం. అందువలన కాంగ్రెసు నుంచి, తృణమూల్‌ నుంచి ఎడాపెడా నాయకులను దిగుమతి చేసుకున్నాడు. కాంగ్రెసు నుంచే వచ్చిన హిమంత, తృణమూల్‌ నుంచి బిజెపిలోకి దూకిన ముకుల్‌ రాయ్‌ దానికి బాగా పనికి వచ్చారు. మాజీ కాంగ్రెసు ముఖ్యమంత్రి సమీర్‌ రంజన్‌ బర్మన్‌ కొడుకు, కాంగ్రెసు ద్వారా 2013లో గెలిచి 2016లో తృణమూల్‌లో చేరిన సుదీప్‌ రాయ్‌ బర్మన్‌  పేరుని హిమంత సూచిస్తే సునీల్‌, రామ్‌ మాధవ్‌ వద్దన్నారు. పోటీగా ఎదుగుతాడన్న భయంతో విప్లవ్‌ ససేమిరా కుదరదన్నాడు.

రాష్ట్రపతి ఎన్నికలో రామనాథ్‌ కోవింద్‌కు త్రిపుర తృణమూల్‌ సభ్యుల మద్దతు కావలసి వచ్చింది. అప్పుడు హిమంత అమిత్‌ షాతో బేరాలాడాడు. 2017 జులైలో సుదీప్‌, మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కోవింద్‌కు ఓటేశారు. ఆగస్టులో వాళ్లని బిజెపి పార్టీలో చేర్చుకుంది. (వీళ్లందరూ 2018 ఎన్నికలలో పెద్ద మార్జిన్లతో నెగ్గారు) మొత్తం మీద 8 మంది తృణమూల్‌ వాళ్లు బిజెపిలో చేరారు. సుబల్‌ భౌమిక్‌ అనే కాంగ్రెసు నాయకుడు ఉన్నాడు. 2013 ఎన్నికలలో ఓడిపోయి, విడిగా వచ్చి 'త్రిపుర ప్రగతిశీల్‌ గ్రామీణ్‌ కాంగ్రెస్‌' అనే పేర ఓ పార్టీ పెట్టుకున్నాడు. సునీల్‌ కోరికపై దాన్ని బిజెపిలో విలీనం చేశాడు. సిపిఎంతో కొట్లాటల్లో అతను ముందువరుసలో నిలుస్తూ వచ్చాడు. ఫిరాయించి వచ్చినవారికి సునీల్‌ పార్టీలో పెద్ద బాధ్యతలే యిచ్చాడు.

అన్నిటి కంటె ముఖ్యమైనది సిపిఎంకు గిరిజనుల్లో ఉన్న పట్టు. గిరిజన ఓట్లు వాళ్ల ప్రాంతం (టిటిఎఎడిసి - త్రిపుర ట్రైబల్‌ అటానమస్‌ ఏరియాస్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌) లో ఉన్న 20 రిజర్వ్‌డ్‌ సీట్లలోనే కాదు, యింకో 16 సీట్లలో కూడా ప్రభావం చూపుతాయి. ఈశాన్య రాష్ట్రాలన్నిటిలో ఏదో రకమైన శాంతిభద్రతల సమస్య ఉంది. ఏ సమస్యా లేని రాష్ట్రంగా త్రిపురను మార్చిన ఘనత మాణిక్‌దే. దానివలన గిరిజనుల్లో కూడా సిపిఎం బలపడింది. అక్కడ 20 అసెంబ్లీ స్థానాలుంటే వాటిలో కనీసం 18 గెలుస్తూ వస్తోంది. 2008, 2013లో 19 గెలిచింది. కౌన్సిల్‌ ఎన్నికలలో కూడా సిపిఎం గిరిజన విభాగమైన గణముక్తి పరిషద్‌ 15 ఏళ్లగా గెలుస్తూ వస్తోంది. దానిలో 28 సీట్లుంటే 2005, 2010, 2015 ఎన్నికలలో అన్ని సీట్లూ అదే గెలిచింది. ఈ గిరుల్లో ఎలా పాగా వేయాలనేది సునీల్‌ ముందున్న మరో పెద్ద సమస్య.  (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com