Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: ఆప్‌లో సంక్షోభం

ఆప్‌ పార్టీ అధినాయకత్వం అనగా అరవింద్‌ కేజ్రీవాల్‌పై అతని ఆత్మీయుల్లో కొందరు ధ్వజమెత్తారు. ప్రస్తుతానికి అరవింద్‌ డిఫెన్సులో పడ్డాడు. ఇంటా, బయటా పార్టీపై విమర్శలు గుప్పించేవారికి అందివచ్చినవి - యిటీవలి అసెంబ్లీ ఎన్నికలు, మరీ ముఖ్యంగా దిల్లీ మునిసిపల్‌ ఎన్నికలు. ఒక దశలో పంజాబ్‌లో ఆప్‌ అధికారాన్ని చేజిక్కించుకుంటుందనుకున్నారు కానీ అది చేసిన కొన్ని పొరపాట్ల వలన అంతిమంగా కాంగ్రెసుకు అధికారం దక్కింది.

కానీ ఆప్‌ అక్కడ కాలూనుకున్న వాస్తవాన్ని, 25% ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచిన నిజాన్ని విస్మరించరాదు. గోవాలో ఒక్క స్థానమూ గెలవలేదు కానీ 6% ఓట్లు తెచ్చుకుంది. ఇక 270 వార్డులలో ఎన్నికలు జరిగిన దిల్లీ మునిసిపల్‌ ఎన్నికలకు వస్తే ఉత్తర దిల్లీలో 28% ఓట్లతో 21 సీట్లు, దక్షిణ దిల్లీలో 26%తో 16 సీట్లు, తూర్పు దిల్లీలో 23%తో 11 సీట్లు గెలిచింది. దరిమిలా రెండు స్థానాలకు ఉపయెన్నికలు జరిగితే, వాటిలో ఒకటి ఆప్‌, మరొకటి కాంగ్రెసు గెలిచాయి.

రెండు చోట్ల బిజెపి ఓడిపోయింది. 272 వార్డుల దిల్లీ మునిసిపాలిటీలో ఆప్‌ ముందెన్నడూ లేదు. ఇదే ప్రథమం. మొదటిసారే సరాసరిన 25% ఓట్లకు పైగా తెచ్చుకుంది. దానికీ, కాంగ్రెసుకు కలిపి బిజెపి కంటె ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినా ఆప్‌ పని పూర్తయిపోయినట్లే అంటూ హడావుడి జరుగుతోంది. ఆప్‌ అసంతృప్త నాయకులు యిదే అదనుగా తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. ఇది కాస్త వింతగానే వుంది. 

దిల్లీ నగరపాలనలో చాలా సమస్యలున్నాయి. రోడ్ల సమస్య, డ్రైనేజీ సమస్య, నీటి కొరత, అక్రమ నివాసాల సమస్య... పరమ చెత్తగా వుంటుంది ఆ నగరనిర్వాహణ. దానికి బాధ్యత వహించాల్సింది పదేళ్లగా దాన్ని పాలిస్తున్న బిజెపియే. దాని కార్పోరేటర్లు అనేకమంది అసమర్థులుగా పేరుబడ్డారని, పైగా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారని దిల్లీ ప్రజలంతా ఫిర్యాదు చేస్తూనే వున్నారు. అందుకే బిజెపి చాలా స్థానాల్లో తన అభ్యర్థులను మార్చేసింది. 2007లో బిజెపికి 164 వుండేవి, 2012కి అవి 138కి తగ్గాయి. యీసారి ఎన్నికలలో మళ్లీ బిజెపిని 67% అంటే 184 సీట్లతో గెలిపించారు.

దానికి కారణం కార్పోరేటర్లపై అభిమానం కాదు, మోదీ హవా. మోదీ ప్రభావం ఒక్కోచోట ఒక్కోప్పుడు ఒక్కోలా పనిచేస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో ఓటర్లను వూపేసిన మోదీ హవా పంజాబ్‌లో ప్రభావం చూపించలేక పోయింది. దిల్లీలో కూడా 2015లో మోదీ హవా పనిచేయలేదు. రెండేళ్లు పోయాక పని చేసింది.   2007లో 67, 2012లో 77 తెచ్చుకున్న కాంగ్రెసుకు యీసారి 30 వచ్చాయి. బియస్పీ తన బలాన్ని కోల్పోతూ వచ్చింది. 2007లో 17 వార్డులున్న ఆ పార్టీకి 2012లో 15 వస్తే యీ సారి దాని గురించి ప్రస్తావనే లేదు. నిజానికి ఇవి కేవలం మునిసిపల్‌ ఎన్నికలు.

కానీ అరవింద్‌, మోదీ కలిసి వాటిని సిఎం వెర్సస్‌ పిఎం ఎన్నికలగా మార్చారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం నిర్వహించారు సరే, సాక్షాత్తూ ప్రధాని కూడా ప్రచారసభలకు హాజరయ్యారు. ఓడిపోయిన ఆప్‌ అభ్యర్థులు 'అప్పటిదాకా మా పట్ల సానుకూలంగా వున్న ఓటర్లు మోదీని చూడగానే తిరిగిపోయారు' అని చెప్పుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని అడగలేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ మోదీయే అభ్యర్థి అనుకుని ఓట్లేశారు. ఇక్కడా అన్ని వార్డుల్లోనూ మోదీని చూసే ఓట్లేశారుట. 

ప్రస్తుతం మోదీ కారణంగా దిల్లీ కార్పోరేషన్‌లో బిజెపి నెగ్గింది సరే, 2007లో, 2012లో మోదీ హవా లేదు. వేరే కారణాల చేత బిజెపి నెగ్గింది. అప్పుడు దిల్లీ అసెంబ్లీలోను, కేంద్రంలోను కాంగ్రెసు పార్టీయే వుంది. బిజెపి ఎన్నికైంది కాబట్టి కాంగ్రెసు పార్టీ కథ ముగిసిపోయిందని ఎవరూ అనలేదు. కానీ యిప్పుడు  ఆప్‌ గురించి మాత్రం యిలా మాట్లాడుతున్నారు. గోరంతలను కొండంతలు చేయడంలో మీడియా పాత్ర వుందని గ్రహించాలి. మీడియా, సోషల్‌ మీడియా మద్దతుతో పైకి వచ్చిన ఆప్‌ దాన్నే నమ్ముకుని పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోవటం లేదు.

తన శక్తిని అధికంగా వూహించుకుని గంతులు వేస్తోంది. బోర్లా పడుతోంది. గతంలో కాంగ్రెసు వ్యతిరేకించినందుకు ఆప్‌ను ఆకాశానికి ఎత్తేసిన మీడియా యిప్పుడు బిజెపిని వ్యతిరేకిస్తున్నందుకు పాతాళానికి తొక్కేస్తోంది. అది గుర్తించి దానికి విరుగుడు కనిపెట్టవలసిన అరవింద్‌ తనను తాను మోదీకి సమాన ప్రత్యర్థిగా వూహించుకుంటూ ప్రకటనలతో, ప్రలాపాలతో, ఆర్భాటాలతో  అంతకంతకు దిగజారుతున్నాడు. 2013లో దిల్లీలో బొటాబొటీ మెజారిటీతో నెగ్గిన ఆప్‌ తనే కాంగ్రెసుకు, బిజెపికి జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం అనుకుంటూ 2014లో దేశమంతా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది.

అరవింద్‌ తాను మోదీని ఓడిస్తానంటూ దిల్లీ విడిచిపెట్టి వారణాశిలోనే పోటీ చేసి అక్కడ ఓడిపోవటంతో పాటు, దిల్లీ కూడా పోగొట్టుకున్నాడు. 2015లో దిల్లీలో నెగ్గాడు. కేంద్రం పెట్టే బాధలు భరించలేక దిల్లీనే నమ్ముకుంటే లాభం లేదని పంజాబ్‌, గోవాలలో గోదాలోకి దిగాడు. పంజాబ్‌లో పరువు దక్కింది కానీ గోవాలో పోయింది. అయినా పాఠాలు నేర్చుకోలేదు. ఈవిఎమ్‌లదే తప్పంటున్నాడు, గుజరాత్‌, రాజస్థాన్‌లకు విస్తరిస్తాం అంటున్నాడు.

రాష్ట్ర ఎన్నికలలో స్థానిక నాయకులెవరైనా వుండి పని చేస్తూ వుంటే, పై నుంచి మార్గదర్శనం చేయడం వేరు. కానీ ఆప్‌ విషయంలో ఆ దిల్లీ నాయకులే అన్నిచోట్లకూ తిరగాలి. పంజాబ్‌ సిఎం కావాలనే కాంక్షతో, మాటిమాటికి అక్కడకు పర్యటిస్తూ అరవింద్‌ దిల్లీ పాలనను విస్మరించాడని దిల్లీ వాసుల అభిప్రాయం. అరవింద్‌ ఒక్కడే కాడు, ఆప్‌ నాయకులందరూ దిల్లీ, గోవా ఎన్నికలపై దృష్టి పెట్టి, తమను విస్మరించారని వారి అభియోగం.

వీళ్లు వెళ్లడం వలన పంజాబ్‌, గోవాలలో ఏమైనా ఒరిగిందా అంటే అక్కడ వీళ్లను పరాయివారిగా చూశారు. ఆప్‌ను గెలిపిస్తే దిల్లీ వాళ్లే పాలిస్తారని అక్కడి ప్రత్యర్థులు గగ్గోలు పుట్టించారు. ఈ విధంగా ఆప్‌ రెండిందాలా చెడింది. స్థానిక నాయకులను తయారుచేసుకోకుండా 2014 పార్లమెంటు ఎన్నికలలో దేశమంతా పోటీ చేసి, ఏ విధమైన తప్పు చేసిందో అదే తప్పు యింకా జరిగి, దిల్లీ కోట చేజారిపోతోంది. 

కార్పోరేషన్‌ ఎన్నికలలో ఆప్‌ యింతకంటె మెరుగైన ఫలితాలు రాబట్టగలిగేదా? ఒక విషయం మాత్రం నిజం. మోదీ ప్రభుత్వం ఆప్‌పై, ముఖ్యంగా అరవింద్‌పై పగ బట్టింది. అది సృష్టిస్తున్న అడ్డంకులకు అంతూ, పొంతూ లేకుండా వుంది. దానివలన అరవింద్‌పై సానుభూతి పెరగాలి. కానీ అతను తనకు అక్కరలేని విషయాలపై కూడా వ్యాఖ్యలు చేసి, వివాదాలు కొని తెచ్చుకుని, పేరు పోగొట్టుకుంటున్నాడు. అంతేకాదు, వ్యక్తిగతంగా తన యిమేజి పెంచుకోవడానికి విపరీతంగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నాడు.

సంప్రదాయ పార్టీలకు భిన్నంగా పార్టీ నడుపుతానంటూ రాజకీయాల్లోకి వచ్చి, వారి బాటలోనే నడుస్తూ పార్టీ ఫిరాయింపుదారుల్ని చేర్చుకుంటూ, ఎన్నారైలకు టిక్కెట్లు యిస్తూ నావల్టీ పోగొట్టుకున్నాడు. దిల్లీ మునిసిపల్‌ ఎన్నికలలో ఇంటి పన్ను రద్దు చేస్తానంటూ హామీ యిచ్చాడు! కొత్త మార్గం చూపుతాడని అతని మీద ఆశలు పెట్టుకున్న అనేకమందికి ఆశాభంగం కలిగించాడు. ఏ మాట కా మాట చెప్పుకోవాలంటే దిల్లీలో ఆప్‌ ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించింది. విద్యుత్‌, నీటి సరఫరా, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు విషయంలో కూడా ఫర్వాలేదనిపించుకుంది. అందువలన కార్పోరేషన్‌ ఎన్నికలలో యింతకంటె ఎక్కువ సీట్లు గెలిచి వుండవచ్చు. కానీ అది జరగలేదు. 

కానీ అంతమాత్రాన పార్టీ పుట్టి మునిగిపోయినట్లు కొందరు ఆప్‌ నాయకులు అలజడి రేపారు. ఇదే వింతగా వుంది. ఈ వింత జరగడంలో ఆప్‌ ప్రత్యర్థి - బిజెపి అని భావం - హస్తం వుందా అనేది అందరికీ వున్న సందేహం. తమను ధిక్కరించేవారి పార్టీల పట్ల బిజెపి ఎలా వ్యవహరిస్తోందో తమిళనాడు వ్యవహారాలు చూపుతున్నాయి. ఆప్‌ను కూడా ఖండఖండాలు చేసేవరకూ బిజెపి విశ్రమించక పోవచ్చు. వరుస ఓటములతో ఆప్‌ కృంగివున్న తరుణంలోనే  దెబ్బ కొట్టాలని చూడడం రాజకీయపరంగా అర్థం చేసుకోదగినదే.

అరవింద్‌ పట్ల కినుక వహించిన కొందరు నాయకులను చేరదీసి మీడియా ద్వారా వారికి విపరీతంగా ప్రాధాన్యత కలిగించి, అరవింద్‌ నైతికస్థయిర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా కుమార్‌ విశ్వాస్‌ ద్వారా అరవింద్‌ పదవికి ఎసరు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ''నేను పార్టీ చీలుస్తాను. మంత్రి కపిల్‌ మిశ్రా, అతనితో పాటు 33 మంది ఎమ్మెల్యేలు నాతో వస్తారు.'' అని  విశ్వాస్‌ ఏప్రిల్‌ 30న ఒక ఎమ్మెల్యేతో మాట్లాడితే అతను దాన్ని రికార్డు చేసి, అరవింద్‌కు వినిపించాడట. అరవింద్‌ అది విని వారం రోజుల తర్వాత కపిల్‌ మిశ్రాను తీసేశాడు తప్ప విశ్వాస్‌పై చర్య తీసుకోలేదు. ఎందుకంటే విశ్వాస్‌కు తక్కిన ఎమ్మెల్యేలలో బలం వుంది.

కాబినెట్‌ మంత్రి పదవి పోగానే కపిల్‌ మిశ్రా అరవింద్‌పై అవినీతి ఆరోపణ చేశాడు. ఐదుగురు ఆప్‌ లీడర్ల విదేశీ పర్యటనలపై ఖర్చు పెట్టిన నిధుల వివరాలను బహిర్గతం చేయాలన్నాడు. అంటూనే సిబిఐ వద్ద ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశాడు. దానితో బాటు ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌, వాటర్‌ మాఫియా అరవింద్‌కు రెండు కోట్లు యిచ్చారని, అది తను చూశానని ఫిర్యాదు చేశాడు. ఇతని వద్ద దృఢమైన ఆధారాలుంటే మీడియాకు తక్షణం అందించేసే వాడు. కోర్టులు లోతుగా విచారించి అటోయిటో తేల్చేలోపున మీడియా, మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా యీపాటికే అతన్ని ఉరి వేసేసి వుండేది.

అతని మాటలు పట్టించుకోనక్కర లేదని అరవింద్‌ అన్నాక కూడా అతను తన వద్ద వున్న ఆధారాలు బయటపెట్టలేదు. నీ కళ్లెదురుగా అంత అవినీతి జరిగినా అప్పుడు మెదలకుండా వున్నావేం? అని అన్నా హజారే అడిగితే కపిల్‌ వద్ద సమాధానం లేదు. అయినా ఆరోపణలపై దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నరు జనరల్‌ ఎసిబి విచారణకు ఆదేశించాడు. అరవింద్‌ సన్నిహిత బంధువులకు అక్రమ భూలావాదేవీల ద్వారా రూ. 50 కోట్ల ప్రయోజనం సమకూరిందని కూడా మిశ్రా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశాడు. ఆరోపణలున్న యితర ముఖ్యమంత్రుల పట్ల కేంద్రం ఎలా వ్యవహరిస్తోందో, అరవింద్‌ పట్ల ఎలా వ్యవహరించిందో కొట్టవచ్చినట్లు కనబడుతోంది. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వాలు యిలానే పక్షపాత బుద్ధితో వ్యవహరించాయి. అందుకే సిబిఐ చార్జిషీట్లు అంటే హాస్యాస్పదంగా తయారయ్యాయి. 

అరవింద్‌ ప్రస్తుతం ఎదుర్కుంటున్న గడ్డు పరిస్థితి అతను చేతులారా చేసుకున్నదే. ఒక ఉద్యమకర్తగా అతను ప్రారంభించాడు. అధికారం చేజిక్కాక  వివిధ రకాల ఆలోచనాపరులను కలుపుకుని ఉద్యమాన్ని విస్తరింపచేయాలి. దానికి బదులుగా అన్ని అధికారాలు తన చేతిలోనే కేంద్రీకరించుకున్నాడు. తనను వ్యతిరేకించినవారికి నచ్చచెప్పే ప్రయత్నం చేయలేదు, వారిని దూరం పెట్టేశాడు.

అలా అని కొత్తవారిని చేర్చుకోలేదు. గుప్పెడుమంది నాయకులతో దేశమంతా వ్యాపించి, అన్ని రాష్ట్రాల్లో చొచ్చుకుపోదామని చూస్తున్నాడు. ఈ ఉద్యమకర్తల స్వభావాలను ఎవరైనా మానసిక శాస్త్రవేత్త విశ్లేషిస్తే బాగుంటుంది. అసాం గణ పరిషత్‌ ఉద్యమాన్ని నడిపిన విద్యార్థి నాయకులుగా ప్రఫుల్ల మొహంతా, భృగు పూకాన్‌ మార్తాండుళ్లా వెలిగిపోయారు. ఉద్యమాన్ని పార్టీగా మార్చి అధికారం కైవసం చేసుకున్నాక యిక పతనం ప్రారంభమైంది. లోకసత్తా ఉద్యమంగా వున్నంతకాలం తెలుగునాట రాజకీయ పార్టీలన్నీ దాన్ని చూసి భయపడేవి.

హితైషులు వారిస్తున్నా, అనేకమంది కార్యకర్తలు వద్దంటున్నా జెపి దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. అంతే అప్పణ్నుంచి అది ప్రభావం కోల్పోయింది. లోకసత్తా అంటే జెపి తప్ప రాష్ట్రస్థాయి నాయకులెవరూ గుర్తుకురానంతగా అధికార కేంద్రీకరణ జరిగిపోయింది. ఇతర పార్టీల్లో జెపికి ఎత్తిచూపిన లోపాలు ఆయన పార్టీలోనే పునరావృతమయ్యాయి. నాయకులు బహిరంగంగా కలహించుకున్నారు. ఇప్పుడు ఆప్‌లో అదే జరుగుతోంది.

ఆప్‌ ఎన్నికల వైఫల్యానికి, పార్టీ నాయకుల ప్రతిస్పందనకు తూకం కుదరటం లేదు. ఇంత తీవ్రస్పందన వస్తోందంటే యితర పార్టీల ప్రమేయం వుందని కచ్చితంగా చెప్పాలి. ముందుగా బిజెపినే అనుమానించాలి కానీ కాంగ్రెసు హస్తం కూడా వుండి వుండవచ్చు. ఎందుకంటే అరవింద్‌ కాంగ్రెస్‌నే ఎక్కువ యాగీ పెట్టాడు. పైగా ఆప్‌ దిల్లీ రంగంలోంచి తప్పుకుంటే బిజెపి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం కాంగ్రెసుకే వుంది. ఆప్‌ నాయకుల్లో ఎవరు ఏ పార్టీ చేత ప్రభావితమవుతున్నారో యిప్పుడే తెలియదు.

వివాదాల్లో ప్రముఖంగా చర్చించబడిన వారిలో పార్టీ లోపాల గురించి వీడియోలో మాట్లాడిన కుమార్‌ విశ్వాస్‌ వున్నారు. విశ్వాస్‌ అరవింద్‌కు ఆత్మీయుడు. యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ తదితరులు అరవింద్‌పై తిరుగుబాటు చేసినపుడు అరవింద్‌ తరఫున వారిపై ఒంటికాలిపై లేచినవాడు అతనే. ఇప్పుడు యోగేంద్ర తదితరుల వాదనలే తను వినిపిస్తున్నాడు. అరవింద్‌కు అత్యంత ఆత్మీయుడు, విశ్వాస్‌కు బాల్యస్నేహితుడు ఐన మనీష్‌ శిశోడియా ''ఈ బహిరంగ చర్చ దేనికి?'' అంటూ మందలించాడు. అయినా విశ్వాస్‌ మొండిగానే వున్నాడు. 

విశ్వాస్‌ ఆరెస్సెస్‌-బిజెపి బంటని, పంజాబ్‌, గోవా ఎన్నికల సమయంలో పని చేయలేదనీ, అరవింద్‌ను తోసివేసి తన పార్టీ అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడని అతనిపై చర్య తీసుకోవాలని అమానుతుల్లా ఖాన్‌ అనే ఎమ్మెల్యే కోరినా అరవింద్‌ తొందరపడలేదు. తనపై యిలాటి ఆరోపణ చేసిన అమానుతుల్లా ఖాన్‌ను పార్టీ పదవుల్లోంచి తీసేయాలని విశ్వాస్‌ పట్టుదల.

సరే అలాగేలే అని పార్టీ లోంచి సస్పెండ్‌ చేసి, స్పీకర్‌ చేత దిల్లీ అసెంబ్లీ కమిటీలు అనేకవాటిలో సభ్యుడిగా వేశాడు అరవింద్‌. విశ్వాస్‌ని వదులుకోవడం యిష్టం లేక అతనితో రాజీపడి, రాజస్థాన్‌ వ్యవహారాలకు యిన్‌చార్జిగా నియమించాడు. అతని అనుచరులను అసెంబ్లీ కమిటీ సభ్యులుగా నియమించాడు. ఈ ఎత్తుగడతో పార్టీలో తిరుగుబాటు ప్రస్తుతానికి చల్లారిందని అనుకోవడానికి లేదు. విశ్వాస్‌ ఎప్పటికైనా తిరగబడవచ్చని పరిశీలకుల అంచనా.
- (ఫోటో - అరవింద్‌, కుమార్‌ విశ్వాస్‌, అమానుతుల్లా ఖాన్‌, కపిల్‌ మిశ్రా) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com