cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఎన్నికల ఫలితాల విశ్లేషణ- యుపి 01

ఎమ్బీయస్: ఎన్నికల ఫలితాల విశ్లేషణ- యుపి 01

ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినా అందరూ అత్యంతాసక్తి చూపినది మాత్రమే ఉత్తరప్రదేశ్ మీదనే. 2024 నాటి పార్లమెంటు ఎన్నికలకు ఒక సూచికగా పనిచేస్తుందని కొందరంటే, యోగి-మోదీ కాంబినేషన్ ఏ మేరకు ఫలితాలు చేకూరుస్తుందో చూద్దామని మరి కొందరనుకున్నారు. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికలలో యోగి ఫ్యాక్టరే కాదు. అంతా మోదీ భుజస్కంధాలమీదే నడిచింది. ఇప్పుడు యోగి వచ్చి చేరడం వలన డబుల్ ఇంజన్ అవుతుందా? లేక బోగీ భారం ఇంజను వేగాన్ని తగ్గిస్తుందా చూద్దామనుకున్నారు. 2017లో అఖిలేశ్ కాంగ్రెసుతో కలిసి చెడిపోయాడు కానీ లేకపోతే యింకా కొన్ని సీట్లు వచ్చేవే అనుకున్నారు. ఈసారి చిన్నా చితకా పార్టీలతో చేతులు కలిపి, ఏ మేరకు సాధిస్తాడు అనేది చూడాలని అనుకున్నారు. బిజెపి తరఫున హేమాహేమీలందరూ రంగంలోకి దిగగా, అఖిలేశ్ ఒంటి చేత్తో యింత సేనను ఎదిరించగలడా? అని పెదవి విరిచినవారూ ఉన్నారు.

ఎన్నికలు ప్రకటించిన దగ్గర్నుంచి బిజెపి గెలుపు ఖాయమని అందరికీ తెలుసు కానీ, ఎస్పీ ఏ మేరకు పుంజుకుంటుంది అనేదాని మీదనే పందాలు వేసుకున్నారు. గతంలో కంటె బిజెపికి సీట్లు తగ్గుతాయని పరిశీలకులు చెప్తూ వచ్చారు కానీ ఏ మేరకు తగ్గుతాయో కచ్చితంగా ఎవరూ చెప్పలేక పోయారు. చివరకు 57 తగ్గి 255 దగ్గర ఆగిపోయింది. 300, 325 వచ్చేస్తాయని చెప్పుకున్నదంతా బూటకమే అయింది. ఎస్పీకి కనీసం 150 వస్తాయని వేసిన అంచనాలు తల్లకిందులై 111 దగ్గర ఆగిపోయింది. ఓట్ల శాతం చూస్తే బిజెపికి 1.6% పెరిగి 41.3% వచ్చాయి. (2019 పార్లమెంటు ఎన్నికలలో యిది 50% ఉండింది, 62 సీట్లు వచ్చాయి) ఎస్పీకి 10.2% పెరిగి 32% వచ్చాయి. (2019 పార్లమెంటు ఎన్నికలలో యిది 18% ఉండింది, 5 సీట్లు వచ్చాయి). ఓట్ల శాతంలో 9% తేడాయే కానీ, సీట్ల దగ్గరకు వచ్చేసరికి 144 తేడా వచ్చింది. మొత్తం మీద చూస్తే యోగికి ఒకింత నిరాశ, అఖిలేశ్‌కు చాలా నిరాశ. వాళ్లు చేసిన పొరపాట్లు ఏమిటి అనేది విశ్లేషించి చూదాం. ముందే చెప్తున్నాను, దీన్ని ఎకడమిక్‌గా డీల్ చేస్తూ మూడు భాగాలుగా సుదీర్ఘవ్యాసంగా రాశాను. బిజెపి నెగ్గిందని తెలుసు కదా అని ఊరుకోకుండా, ఎందుకు అన్ని గెలిచింది, ఎందుకు అన్నే గెలిచింది అని తెలుసుకుందామన్న కుతూహలం బలంగా వుంటే తప్ప ముందుకు సాగకండి.

అన్నిటికంటె ముందు మెచ్చుకోదగ్గదేమిటంటే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ నెగ్గడం! ఆ విధంగా బిజెపి 37 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టింది. బిజెపి కూటమికి 2017లో 322 సీట్లు రాగా యీసారి 49 తగ్గి 273 మాత్రమే వచ్చాయి. ఎస్పీ కూటమికి 2017లో 52 రాగా యీసారి 240% పెరిగి 125 వచ్చాయి. బియస్పీ నిశ్చేతనం కావడంతో వీళ్లిద్దరి ఓట్ల శాతాలు పెరిగాయని అనుకోవాలి. ఎందుకంటే బియస్పీకి 2017లో 22.3% ఓట్లు వస్తే యీసారి 9.4% మాత్రమే వచ్చాయి. (2019లో 19% ఓట్లు, 10 సీట్లు వచ్చాయి) దాని ఓట్లు యీ రెండు కూటముల మధ్య ఏ నిష్పత్తిలో పంపిణీ అయ్యాయన్నదానిపై ఎవరి వ్యాఖ్యానాలు వారికున్నాయి. కానీ ఎక్కువ శాతం బిజెపికి వెళ్లినట్లే తేలుతోంది. 2007లో 30% ఓటుతో 206 సీట్లు తెచ్చుకున్న బియస్పీకి యీనాడు 1 సీటు మాత్రమే వచ్చింది. 2017లో కూడా దానికి 19 వచ్చాయి.

మాయావతి నిస్తేజానికి కారణమేమిటి అనేది ఎవరికీ అంతుపట్టని విషయం అయింది. ఆమెకు బిజెపికి ఒక రహస్య ఒప్పందం కుదిరిందని, దాని ప్రకారం ఆమె అవినీతి కేసులపై జాప్యం చేస్తానని బిజెపి మాట యిచ్చిందని, బదులుగా బియస్పీ ఓట్లు చీల్చకుండా తన ఓటు బ్యాంకులో కొంత భాగాన్ని బిజెపికి బదిలీ చేసిందని అంటున్నారు. దీన్ని బిజెపి సహజంగానే ఖండించింది. బిజెపిలో చేరిన యితర పార్టీ నాయకులపై అప్పటికే ఉన్న అవినీతి కేసుల విచారణలో జాప్యం కావడం చూస్తూనే ఉన్నాం. జగన్ కేసుల్లో లాగానే మాయావతి కేసుల్లో కూడా జాప్యం జరిగితే యీ ఒప్పందం జరిగిందని అనుమానించేందుకు ఆస్కారముంది. 

బియస్పీ కంటె అధ్వాన్న పరిస్థితిలో ఉన్న పార్టీ కాంగ్రెసు. బియస్పీ కేసులో ఎట్‌లీస్టు ఒప్పందమనే సాకు ఉంది. కాంగ్రెసుకు అదీ లేదు. సొంతంగానే 2.4% ఓట్లకు, 2 సీట్లకు (గతంలో 7 ఉన్నాయి) క్షీణించింది. ప్రియాంకా గాంధీ చాలానే చెమటోడ్చింది. యోగి కంటె ఎక్కువ ర్యాలీలు నిర్వహించింది. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి చాలా విన్యాసాలు చేసింది. వీటితో పాటు మజ్లిస్ (0.5% ఓట్లు), చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ఆజాద్ సమాజ్ పార్టీ అతీ, గతీ లేకుండా పోయాయి.

ప్రాంతాలవారీగా చూస్తే అవధ్, బుందేల్‌ఖండ్, పూర్వాంచల్ (తూర్పు, ఈశాన్య యుపి), రోహిల్‌ఖండ్, దోఆబ్ (పశ్చిమ, మధ్య యుపిలలోని కొన్ని ప్రాంతాలు)లలో రెండు ప్రధాన కూటములు ఓట్లు, సీట్లు పెంచుకున్నాయి. బిజెపి కూటమి కంటె ఎస్పీ కూటమి ఎదుగుదల ఎక్కువగా ఉంది. ఎందుకంటే బిజెపి 2017లోనే పీక్‌కు చేరి ఉంది. బుందేల్‌ఖండ్‌లో బిజెపి ఎదుగుదల 0.3% మాత్రమే ఉండగా, ఈశాన్య యుపిలో 6.2% ఉంది. ఎస్పీ కూటమి అన్ని ప్రాంతాలలో కంటె ఎక్కువగా తూర్పు యుపిలో 15.2% ఎదిగింది. అన్నిటికంటె తక్కువగా దోఆబ్‌లో దాని ఎదుగుదల 10.2% మాత్రమే ఉంది. ఎస్పీ కూటమి వెయ్యి ఓట్ల తేడాతో 9 సీట్లు, 3 వేల ఓట్ల తేడాతో 21 సీట్లు, పదివేల ఓట్ల తేడాతో 69 సీట్లు పోగొట్టుకుంది.

రైతుల ఆందోళన ఏడాది పాటు జరిగిన పశ్చిమ యుపిలో ఎస్పీ కూటమి అనుకున్నంత విజయం సాధించి ఉంటే 175 దాకా చేరి వుండేదని పరిశీలకులు వ్యాఖ్యానించారు. ఆందోళనకు కేంద్రంగా ప్రాంతాల్లో అది బాగానే గెలిచింది. 6 సీట్లున్న ముజఫర్‌నగర్‌లో ఆర్‌ఎల్‌డికి 3, ఎస్పీకి 1 వచ్చాయి. మూడు సీట్లున్న శామిలీలో మూడు యీ కూటమికి వచ్చాయి. 7 సీట్లున్న మేరఠ్‌లో ఎస్పీ 3, ఆర్‌ఎల్‌డి 1 గెలిచాయి. పశ్చిమ యుపిలోని తక్కిన నియోజకవర్గాల్లో కూడా కూటమి బిజెపికి గట్టి పోటీ యిచ్చింది. రైతు ఆందోళన జరిగింది కాబట్టే ప్రతిపక్షానికి యీ మాత్రమైనా సీట్లు వచ్చాయి లేకపోతే, బిజెపికి క్లీన్ స్వీప్ చేసేది అంటాడు యోగేంద్ర యాదవ్.

ప్రతిపక్షాలు, పరిశీలకులు అఖిలేశ్ యింతకంటె మంచి ఫలితాలు తెచ్చుకుంటాడని ఆశించారు కాబట్టి అతని వైఫల్యాల మీద ఎక్కువ చర్చ జరిగింది. మొదటిది అతను ప్రచారం చాలా ఆలస్యంగా ప్రారంభించాడు. బిజెపి ఎప్పణ్నుంచో సన్నిద్ధంగా ఉంది. యోగి అయితే ఏడాదిన్నరగా జాతీయ మీడియాలో కూడా పబ్లిసిటీ గుప్పిస్తూనే ఉన్నాడు. తర్వాత అఖిలేశ్ పొత్తు కుదుర్చుకోవడాలు చాలా ఆలస్యం చేశాడు. కరక్టుగా చెప్పాలంటే వాళ్లెవరూ యితని దగ్గరకి అంత త్వరగా రాలేదు, పెద్దగా నమ్మకం లేక! బిజెపి నుంచి చాలామంది వచ్చి కలుస్తారనుకుని వేచి చూసి, నిరాశ చెందాడు. వచ్చినవాళ్లు కూడా చిత్తుగా ఓడిపోయారు. వాళ్లు వస్తారేమోననుకుని తన పార్టీ నాయకులను వెయిటింగులో పెట్టి నిరాశ పరిచాడు. ఆఖరి నిమిషంలో హడావుడిగా సీట్లు ఫైనలైజ్ చేశాడు. రాంగ్ కాండిడేట్లకు సీట్లు యివ్వడం చేతనే ఆ పార్టీ నష్టపోయిందని అనేకమంది సాధారణ ఓటర్లు టీవీల్లో చెప్పారు. అభ్యర్థుల సెలక్షన్‌కై అతను ఐటీ విభాగం సలహాలపై ఆధారపడ్డాడు.

ఐటీ విభాగం సలహాలను క్రాస్‌చెక్ చేసుకునే తీరిక అతనికి లేకపోయింది. అన్నీ ఒంటి చేత్తో చూసుకోవలసి రావడంతో దేనిమీదా తగినంత శ్రద్ధ పెట్టలేక పోయాడు. అతని భాగస్వాములు తమతమ ప్రాంతాలకు పరిమితమయ్యారు. 24 కోట్ల జనాభా ఉన్న సువిశాలమైన యుపిని ఒక్కడే మేనేజ్ చేయడం తలకు మించిన భారమైంది. అటు బిజెపి అయితే అనేకమంది నాయకులున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి పని చేశారు. మోదీ సంగతి సరేసరి. మాటిమాటికీ వచ్చి ప్రచారం నిర్వహించాడు. పైగా భారీ యంత్రాంగం ఉంది. వర్క్ డివిజన్ ఉంది. ఇతనికి కుటుంబసభ్యుల మద్దతు కూడా లేదు. ఎస్పీకి సాంప్రదాయకంగా ఓట్లేసే ముస్లిం-యాదవ్ గ్రూపు యీసారీ ఆదరించారు. ముస్లింలు మెజారిటీలో ఉన్న రోహిల్‌ఖండ్, వాయువ్య యుపిలలో కూటమి, బిజెపి కూటమితో పోటాపోటీగా ఉంది. తూర్పు యుపి, అవధ్ ప్రాంతాలలో కూడా యీ ఫార్ములా పనిచేసింది కాబట్టి అఖిలేశ్ యీ మాత్రమైనా నెగ్గుకుని వచ్చాడు.

మోదీ-యోగి జంట హిందూత్వ దాడితో బెదిరిపోయిన ముస్లిములు ఎస్పీ కూటమి వెంట నిలిచారు. పశ్చిమ యుపిలో 2013 నాటి ముజఫర్‌పూర్ అల్లర్ల తర్వాత జాట్లకు, ముస్లిములకు బాగా చెడింది. 2017లో జాట్లందరూ ముస్లిములపై కోపంతో బిజెపికి ఓట్లేశారు. ఈసారి జాట్లలో కొందరు ఎస్పీవైపు మళ్లారు. జాట్ల పార్టీ ఐన ఆర్‌ఎల్‌డి 33 సీట్లలో పోటీ చేసి 8టిలో గెలిచింది. 2017లో 1టి మాత్రమే గెలిచింది. ఆ ప్రాంతంలో జాట్లతో బాటు గుజ్జర్లు, తేనీలు, కశ్యపులు, మౌర్యాలు కూడా ఎస్పీ కూటమికి ఓటేయడంతోనే యిది సాధ్యపడింది. కైరానా నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు తరలి వెళ్లిపోయారని ప్రచారం చేసిన హుకుమ్ సింగ్ కుమార్తె, బిజెపి అభ్యర్థి మృగాంకా సింగ్ ఓడిపోయారు. ఆ నాటి అల్లర్లలో ప్రధాన పాత్ర పోషించిన బిజెపి నాయకులు సంగీత్ సోమ్, ఉమేశ్ మాలిక్, సురేశ్ రాణా కూడా ఓడిపోయారు.

అసలైన ఆశ్చర్యం ఏమిటంటే బ్రాహ్మణ బిజెపి నాయకుడు కారు పోనిచ్చి నిరసనకారులను చంపేసిన లఖింపూర్ ఖేరీ జిల్లాలోని 8 సీట్లూ బిజెపి గెలుచుకుంది. బాధితులు శిఖ్కులు కావడం, ఆ జిల్లా బ్రాహ్మణులకు కంచుకోట కావడం వలననే యిది సాధ్యపడిందంటున్నారు. నిందితుడు బెయిలు పొంది యథేచ్ఛగా తిరుగుతూంటే రాష్ట్రప్రభుత్వం దానికి వ్యతిరేకంగా అపీల్ చేయకపోతే సుప్రీం కోర్టు మందలించింది. ప్రస్తుతానికి బెయిల్ రద్దయింది.

పూర్వాంచల్‌లో 2017లో బిజెపి కూటమిలోని ఎస్‌బిఎస్‌పికి 3 వచ్చాయి. ఈసారి ఎస్‌బిఎస్‌పి ఆ కూటమి వదిలి ఎస్పీ కూటమిలో చేరింది.  రాజభర్ కులానికి చెందిన ఎస్‌బిఎస్‌పికి బిజెపికి 2019 నుండి సంబంధాలు చెడిపోయాయి. చివరకు 2021 డిసెంబరులో దాని నాయకుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కూటమిలోంచి బయటకు వచ్చేసి ‘బిజెపి పని అయిపోయింది’ అన్నాడు. వెంటనే బిజెపి అతని అనుచరుడు పార్టీ లక్నో జిల్లా అధ్యక్షుడు బబ్బన్ రాజ్‌భర్‌ను తన పార్టీలో చేర్చేసుకుంది. కానీ ఓం ప్రకాశ్ ఎన్నికలలో 40 వేల మెజారిటీతో గెలిచాడు. ఘాజీపుర్ ప్రాంతంలో రోడ్డు, రైలు బ్రిజ్ కడుతున్నామని, ఎంతో అభివృద్ధి చేస్తున్నామని బిజెపి చెప్పుకున్నా, కులప్రాతిపదికన ఓట్లు పడి, అక్కడి అన్ని సీట్లనూ ఎస్పీ-ఎస్‌బిఎస్‌పి కూటమి గెలిచింది.

ఈ పార్టీతో బాటు ఎస్పీ కుశావహా, మౌర్య, లోనియా కులపు ఓట్లను పొందడానికి మహాన్ దళ్ వంటి చిన్న పార్టీలతో చేయి కలిపి కొన్ని సీట్లు గెలిచింది. యోగి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న కేశవ ప్రసాద్ మౌర్య ఎస్పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. బిజెపితో పొత్తు పెట్టుకున్న కులపార్టీలు అప్నాదళ్ (సోనేలాల్), నిషాద్ పార్టీ కూడా లాభపడ్డాయి. గతంలో 9 తెచ్చుకున్న అప్నాదళ్ (సో) యీసారి 12 తెచ్చుకుంది. గతంలో 1 తెచ్చుకున్న నిషాద్ యీసారి 6 తెచ్చుకుంది.  వీరి సహకారానికి, మోదీ పర్యటన ప్రభావం తోడై వారణాశిలో 8 సీట్లూ బిజెపి గెలిచింది. విశ్వనాథాలయానికి చక్కటి రోడ్లు వేసి వారణాశిని అభివృద్ధి చేసినందుకు ఓటర్లు ఆ విధంగా కృతజ్ఞత తెలుపుకున్నారు.

పశుసమస్య గురించి మన తెలుగు మీడియా పెద్దగా కవర్ చేయలేదు. ‘‘ఇండియా టుడే’’ ఫిబ్రవరి 28 నుంచి కొన్ని గణాంకాలు యిస్తాను. యుపిలో గోరక్షణ పేర చాలా ఆదాయం వస్తోంది, చాలా ఖర్చూ అవుతోంది. వీటికోసం 2019 జనవరి నుంచి కౌ సెస్ పేర ఆల్కహాల్ వంటి ఎక్సయిజ్ వస్తువులపై 0.5% సుంకం విధించింది. మండీ పరిషత్‌లపై 1% లెవీ విధించింది. రాష్ట్రంలో ఆవుల సంఖ్య 1.90 కోట్లు. ఎవరికీ చెందని (నిరాశ్రయ) ఆవుల సంఖ్య 11.80 లక్షలు. యుపిలో గోరక్షణ కేంద్రాల సంఖ్య 5617 (గతంలో 586 ఉండేవి), గోశాలలో ఉన్న ఆవుల సంఖ్య 7.89 లక్షలు. 3458 దాణా సెంటర్ల ద్వారా పంచిన దాణా 8.87 లక్షల క్వింటాళ్లు.. ‘‘నిరాశ్రిత బేసహారా గోవంశ్ సహభాగితా యోజనా’’ కింద ఒక ఆవు సంరక్షణ బాధ్యత తీసుకుంటే యిచ్చేది రోజుకి రూ.30! ఆ పథకం కింద 54 వేల మందికి పంచిపెట్టిన ఆవుల సంఖ్య 1.20 లక్షలు.

గత ఐదేళ్లలో మూయించేసిన అక్రమ కబేళాల సంఖ్య 150. ప్రస్తుతం నడుస్తున్నవి 35 మాత్రమే. గోవుల క్రయవిక్రయాలు ఆగిపోయి, పశు మండీలు మూతపడుతున్నాయి. ఎందుకంటే ఆవును కొంటే చంపడానికే అనే అర్థం తీస్తున్నారు గోరక్షకులు. దాంతో వట్టి పోయిన ఆవులను బజార్లో వదిలించుకుంటున్నారు. ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్నా నిరాశ్రయ గోవులు పెరిగిపోతున్నాయంటే దాని అర్థం ప్రభుత్వ గోశాలలు, ఆవులను పెంచుకుంటున్నామని తీసుకుంటున్న వారు వాటి ఆలనాపాలనా చూడటం లేదని! అనేక ఆవులు (వాటిని స్థానికులు ఆవారా పశు అంటున్నారు) చిత్తం వచ్చినట్లు రోడ్ల మీద, హైవేల మీదా తిరుగుతున్నాయి. వాటిని తప్పించబోయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అవి పొలాలలో పడి మేసేస్తూండడంతో, వాటి బారి నుంచి పంటలు కాపాడుకోలేక రైతులు నానా అవస్థా పడుతున్నారు. ఎమర్జన్సీ నడిచిన టైములో కుటుంబనియంత్రణ ఆపరేషన్లు తప్పించుకునేందుకు మగవాళ్లు పొలాల్లో దాక్కునేవారు. భార్యలు వాళ్లకు తిండి పట్టుకెళ్లేవాళ్లు. ఇప్పుడు యుపిలో మగవాళ్లు రాత్రులు పొలాల్లోనే గడపవలసి వస్తోంది.

కొన్ని సందర్భాల్లో ఆవులు, ఎద్దులు ప్రజలను పొడిచి చంపేస్తున్నాయి కూడా. తాము అధికారంలోకి వస్తే అలా మృతులైన వారి కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం యిస్తామని అఖిలేశ్ 2021 డిసెంబరులో ప్రకటించాడు. పశువులు పంట తినేసిన సందర్భాల్లో ఎకరాకి రూ.3వేల చొప్పున పరిహారం యిస్తామని కాంగ్రెసు రాష్ట్రాధ్యక్షుడు ప్రకటించాడు. యోగి ప్రభుత్వం వీటి మాట ఎత్తడం లేదు కానీ రాష్ట్రంలో 356 కేటిల్ మాఫియా గ్రూపులు ఉన్నాయని అంటూ యుపి గేంగ్‌స్టర్స్ అండ్ ఏంటీ-సోషల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) చట్టం కింద 1823 మంది మీద కేసులు పెట్టింది.

ప్రజలను యింటర్వ్యూ చేసిన జర్నలిస్టులందరూ ఒకే మాట చెప్తున్నారు. పశుసమస్యతో పాటు యోగి పాలనపై, ముఖ్యంగా కోవిడ్ సమయంలో జరిగిన లోటుపాట్లపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ధరవరలు పెరగడంపై కోపంగా ఉన్నారు. ఆలనాపాలనా చూడకుండా పశువులను పొలాల్లో వదిలేయడంపై ఆగ్రహంగా ఉన్నారు, ఇంకా అనేక రకాల ఫిర్యాదులున్నాయి. కానీ మళ్లీ యోగికే ఓటేస్తాం అని కచ్చితంగా చెప్పారు.

ఎందుకంటే, పాపం మాకు ఉచిత రేషన్లు యిచ్చాడు, ఉజ్జ్వల, ఆవాస్ యోజన వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు, వాటిలో వివక్షత చూపటం లేదు, అవినీతి లేదు అంటున్నారు. యుపి ప్రభుత్వం జనాభాలో ముప్పాతిక మందికి ఏదో ఒక పథకం ద్వారా డబ్బు పంపిణీ చేస్తోందని టీవీ చర్చల్లో ఒక వ్యాఖ్యాత అన్నాడు. పేపర్లలో వచ్చిన దాని ప్రకారం 36 పథకాల ద్వారా డిబిటి (నగదు బదిలీ పథకం) ఉపయోగించి ప్రజల ఖాతాల్లోకి డైరక్టుగా డబ్బులు వేస్తోంది. ఈ36టిలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఉజ్జ్వల యోజనా, పిఎం జన ఆరోగ్య యోజనా..లాటివి కొన్ని కేంద్రప్రభుత్వానివి. కొన్ని రాష్ట్రప్రభుత్వానివి. సంక్షేమ పథకాలు అందుకుంటున్నవారిని యుపి ప్రభుత్వం ‘లాభార్థి’ అంటోంది. నిజానికి దీనిలో అధికారపార్టీ కూడా లాభార్థే! (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)

[email protected]

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?