Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: వాక్సినేషన్‌లో సాధ్యాసాధ్యాలు

ఎమ్బీయస్‍:  వాక్సినేషన్‌లో సాధ్యాసాధ్యాలు

మన దేశ జనాభాలో 94 కోట్ల వయస్కులు (18 ఏళ్లు దాటిన ఎడల్ట్) అందరికీ ఈ ఏడాది డిసెంబరు 31 నాటికల్లా వాక్సినేషన్ పూర్తి చేస్తామని ప్రభుత్వం అంటోంది. అంటే 188 కోట్ల డోసులన్నమాట. వేస్టేజి 5% వుంటుందనుకున్నా, 190-200 కోట్ల డోసులు కావాలి. ఇప్పటికే 43.51 కోట్ల మందికి వేశారు (ఆంధ్రజ్యోతి 270721) కాబట్టి ఇంకో 150 కోట్ల డోసులు కావాలి. దానిలో సాధ్యాసాధ్యాల గురించి చర్చించడం యీ వ్యాసం ఉద్దేశం. వస్తున్న సమాచారం, గణాంకాలు గందరగోళంగా వుంటున్నాయి. కొన్ని కరకు నిజాలను తొక్కి పెడుతున్నారని తెలిసిపోతూనే వుంది. ఎందుకలా అంటే ప్రజల మనోస్థయిర్యం దిగజారిపోకుండా, కావాలని వాళ్లను చీకట్లో పెడుతున్నారనిపిస్తోంది. మళ్లీ యింకో పక్క ఊహాగానాలతో అడలగొడుతున్నారు. అందువలన దీనిలోని సమాచారమంతా కరెక్టేనని గ్యారంటీ లేదు. కీలకమైన సమాచారాన్ని నేను ఎక్కణ్నుంచి తీసుకున్నానో సోర్స్ పక్కనే రాస్తున్నాను. అవగాహనాలోపం వుంటే చెప్పండి.

ముందుగా మెచ్చుకోవలసినది వాక్సిన్ పాలసీలో కేంద్రం చేసిన మార్పుని. జూన్ 21 నుంచి కొత్త విధానంలో అమల్లోకి వచ్చింది. మోదీ జూన్7న యీ విషయమై ప్రకటన చేసి, లోపభూయిష్టమైన పాత విధానాన్ని సరిదిద్దుకున్నారు. వాక్సిన్‌ల ఉత్పాదనలో 75% కేంద్రమే రూ.150 కి కొనుక్కుని, రాష్ట్రాలకు ఉచితంగా యిస్తానంది. (ఫ్రెష్‌గా యిచ్చే ఆర్డర్లలో కోవిషీల్డ్ డోసులకు రూ.205 చొప్పున,  కోవాక్సిన్ డోసులకు రూ.215 చొప్పున యిస్తానందని జులై 17 పేపర్లలో వచ్చింది. ఉత్పత్తి పెంచమని కేంద్రం అడిగితే 150 రేటుకి కిట్టుబాటు కాదని కంపెనీలు చెప్పాయి. అందుకే రేటు పెంచారుట) తక్కిన 25% ప్రయివేటు ఆసుపత్రులకు, కంపెనీలకు అమ్ముకోవచ్చని అంది. ప్రైవేటు వాళ్లు రూ.150 మాత్రమే ఎడ్మినిస్ట్రేషన్ ఖర్చుగా తీసుకోవాలని నిర్దేశించింది.

ఆ 25% కూడా ప్రభుత్వమే తీసేసుకుని, ఉచితంగా యివ్వాలని కొందరు వాదిస్తున్నారు కానీ నేను వారితో ఏకీభవించను. రోగం వస్తే ఆసుపత్రులకు లక్షలు ధారపోస్తున్నవారు టీకాకై 1-2 వేలు ఖర్చు పెట్టలేరా? ప్రయివేటు సెక్టార్‌కు కూడా భాగస్వామ్యం యివ్వకపోతే ప్రభుత్వాసుపత్రుల వద్ద రద్దీ పెరిగి, కోవిడ్ మరింతగా వ్యాపించవచ్చు. ప్రయివేటు వాళ్లకు తగినంత సంఖ్యలో టీకాలు అందించకపోతే, వాళ్లకు టీకా కేంద్ర నిర్వహణ కిట్టుబాటు కాదు. మధ్యలో టీకాల సరఫరా తగ్గిపోవడంతో ప్రయివేటు సెక్టార్‌లో కూడా అనేక సెంటర్లు మూసేయాల్సి వచ్చింది.

ఇక్కడే ధర విషయం కూడా ప్రస్తావిస్తాను. ప్రయివేటు పార్టీలకు కోవిషీల్డు రూ 630 లకు దొరుకుతోంది కానీ కోవాక్సిన్‌కై రూ.1260 పెట్టాల్సి వస్తోంది. కోవాక్సిన్ విషయంలో ప్రభుత్వం ఐసిఎమ్‌ఆర్ ద్వారా ఏనిమల్ స్ట్రెయిన్ యిచ్చింది, క్లినికల్ ట్రయల్స్ ఖర్చు భరించింది, ఇంకా కొన్ని ఖర్చులు భరించింది. అయినా యింత రేటెందుకు? అంటే భారత్ బయో వారు మాది ఉత్పత్తి చేసే విధానంలో ఖర్చు ఎక్కువ అంటున్నారు. కావచ్చు. మరి అలాగైతే ప్రభుత్వం కోవాక్సిన్‌ను కోవిషీల్డ్ కంటె ఎక్కువ రేటు పెట్టి కొనాలి కదా! అదే ధరకు కొంటామని దబాయించడమేమిటి? అన్యాయం కదా!  

గతంలో జనవరిలో ఆర్డరు పెట్టినపుడు కోవిషీల్డుకి 200, కోవాక్సిన్‌కు 295 యిచ్చారు. తర్వాత యిద్దరికీ 150 రూ.ల రేటే యిచ్చారు. ఇప్పుడు జులై మధ్యలో మళ్లీ కోవిషీల్డ్‌కు 205 అని, కోవాక్సిన్‌కు 10 రూ.లు మాత్రం ఎక్కువ యిస్తున్నారు. ప్రయివేటు వ్యక్తుల దగ్గరకు వచ్చేసరికి ధరలో రెట్టింపు తేడా వస్తోంది. వాళ్లకు కిట్టుబాటు అయ్యే ధర వాళ్లకు యివ్వకపోతే పరిశ్రమలు ఎలా మనగలుగుతాయి? వాళ్లు భవిష్యత్తులో రిసెర్చి ఎందుకు చేస్తారు? అబ్బే, వాళ్ల కయ్యే ఖర్చంతా మేం మదింపు వేశాం, మేమిచ్చే ధర సమంజసమైనదే అని ప్రభుత్వం అంటుందా, అలాటప్పుడు ప్రయివేటులో అంత ఎక్కువ రేటుకి అమ్మవద్దని కంపెనీకి చెప్పమనండి. ప్రభుత్వానికి యిచ్చే ధర కంటె ఏ 150% ఎక్కువ ధరకు ప్రయివేటులో అమ్ముకోండి అని ఒక కొలబద్ద పెట్టేయడం భావ్యం.

వాక్సిన్ల కొరతకు కేంద్రం ఎలా బాధ్యురాలో నేను గత వ్యాసాల్లో విపులంగా రాశాను. కేంద్రం పంపిణీ విధానంలోనే కాదు, విదేశీ వాక్సిన్ల దిగుమతిని అనుమతించడంలో, దేశంలో ఉత్పత్తి అయ్యే వాక్సిన్లను బుక్ చేయడంలో, వారికి అడ్వాన్సులిచ్చి ప్రోత్సహించడంలో చాలా చొరవ తీసుకుంది. ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి కారణం ప్రజల్లో వచ్చిన చైతన్యం. మోదీని ఆకాశానికి ఎత్తేసినవాళ్లు కూడా స్మశానాల్లో క్యూలు చూసి చెడామడా తిట్టేశారు. దెబ్బకి మోదీ దిగివచ్చారు. ఇలాటి చైతన్యం గతంలో కూడా చూపించి వుంటే అనేక అనర్థాలు జరిగి వుండేవి కావని, మోదీ వలన దేశ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ నాశనం కావడానికి ప్రజల్లోని అలసత్వమే ప్రధాన కారణమని మనం ఒప్పుకుని తీరాలి.

కరోనా టైములో వేలాది కోట్లు ఖర్చు పెట్టి సెంట్రల్ విస్టా ప్రాజెక్టేమిటి? అనే ప్రశ్నకు సమాధానంగా లోకసభ స్పీకరు ఓం బిర్లా ‘కొత్త పార్లమెంటు కడతామన్నపుడు ఎవరూ అభ్యంతర పెట్టలేదే’ అన్నారు. ఎవరో కొందరు పత్రికల్లో వ్యాసాలు రాసి వూరుకుంటే అది వాళ్లకు కనబడదు, వినబడదు. కరోనా విషయంలోలా సోషల్ మీడియాలో, వాట్సాప్‌ల ద్వారా మోదీని చెరిగేయాలన్నమాట. కోర్టులు కూడా యిప్పుడే మేల్కొన్నాయి. వలస కార్మికుల దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ ప్రభుత్వమే అన్నీ చూసుకుంటుంది, మేం తలదూర్చం అంటూ మొహమాటపడిన కోర్టు యిప్పుడు మాత్రం ‘మీ వాక్సిన్ పాలసీ అవకతవకగా వుంది’ అని కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. మేం పర్యవేక్షిస్తామంది. దానితో గత్యంతరం లేక మోదీ తన విధానాన్ని మార్చుకున్నారు. కోర్టుకి అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. ఇదే చైతన్యం కోర్టు అనేక విషయాల్లో చూపించి వుంటే పరిస్థితి యిక్కడిదాకా వచ్చేది కాదు. గుఱ్ఱం సరిగ్గా నడవకపోతే రౌతుదే తప్పంటారు. ప్రజలు మేల్కొని వుండకపోతే, అప్పుడప్పుడు అదలించకపోతే వారిదే తప్పు.

ఈ వాక్సిన్ పంపిణీ విధానాన్ని మారుస్తూ కూడా మోదీ తన తప్పేమీ లేదని చెప్పుకున్నారు. కేంద్రమే టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వుంటే దాన్ని వికేంద్రీకరించాలన్న డిమాండ్లు వచ్చాయిట. పోనీ కదాని వికేంద్రీకరిస్తే, దానిలో వున్న కష్టాలేమిటో అప్పుడు రాష్ట్రాలకు తెలిసి వచ్చిందట! దాంతో మీరే చూడాలి మహాప్రభో అనడంతో మళ్లీ కేంద్రం యీ పని చేపట్టిందట! ఎలా చెప్తున్నారో చూడండి! సెకండ్ వేవ్‌లో జనాలు ఎడాపెడా ఆసుపత్రి పాలై, మృత్యువు పాలవుతూంటే అప్పుడు కేంద్రం ‘ఆరోగ్యం రాష్ట్రాల బాధ్యత, మాదేం లేదు’ అనలేదా? టీకా కంపెనీలతో మాకిచ్చిన రేటు కంటె రాష్ట్రాలకు రెట్టింపు రేటుకి యివ్వండి అన్నదెవరు? మీ అంతట మీరే కంపెనీల నుంచి కొనుక్కోండి అని రాష్ట్రాలకు చెప్పినదెవరు? ఏ దేశంలోని లేని విధంగా వింతవింత పంపిణీ పాలసీ ప్రవేశపెట్టి, ఫెయిలయి, ఇప్పుడా నింద రాష్ట్రాల మీదకు నెట్టేయడం ఘోరం.

ఇప్పుడు కూడా ఏ రాష్ట్రానికి ఎన్ని యిస్తున్నారో సరిగ్గా చెప్పటం లేదట. కేంద్రం ఓ లెక్క చెపుతోంది. మాకు ఎన్ని వచ్చాయో చెపుదామనుకుంటే చెప్పడానికి వీల్లేదని కేంద్రం అంటోంది అని దిల్లీ ప్రభుత్వం అంటోంది. వాక్సిన్ వేస్టేజి విషయంలో కూడా ప్రతిపక్షపాలిత రాష్ట్రాలలో విపరీతంగా వృథా అవుతున్నాయని  కేంద్రం చెప్పే లెక్కలు తప్పని రాష్ట్రాలు అంటున్నాయి. కేంద్రం వాడే సాఫ్ట్‌వేర్ ప్రకారం కేరళలో వేస్టేజి మైనస్‌లో వుందట. అంటే వాళ్లకు పంపిన వాక్సిన్‌ల కంటె ఎక్కువ టీకాలు వేశారన్న అర్థం! ఇదెలా సాధ్యం? ఒక్క ఆర్నెల్లు రాజకీయాలు మానేసి, దేశాన్నంతటినీ సమదృష్టితో చూసి, ప్రాణాలు కాపాడాలన్న యింగితం లేకపోతే ఎలా? సొంత రాష్ట్రమని గుజరాత్‌కు, ఎన్నికలు వస్తున్నాయని యుపికి హెచ్చు టీకాలు పంపితే సరిపోతుందా? పక్క రాష్ట్రాల నుంచి టీకా వేయించుకోని జనాలు వెళ్లి వాళ్లకు కరోనా అంటించరా? ఆక్సిజన్ కొరత, కరోనా మరణాల సంఖ్య.. యిత్యాది విషయాల్లో కూడా రాష్ట్రాలదే తప్పు అని అనడం కేంద్రానికి పరిపాటి అయిపోయింది. ఇంచుమించు రాష్ట్రాలన్నీ బిజెపి పాలితమో, బిజెపి సన్నిహితుల పాలితమో కదా! అంటే బిజెపి ప్రధానిని వెనకేసుకుని వచ్చేవారు, బిజెపి ముఖ్యమంత్రులను తప్పు పడుతున్నారన్నమాట!

సరే టీకాకరణ లక్ష్యాల గురించి మాట్లాడదామంటే డిసెంబరు నెలాఖరుకి 190 కోట్ల డోసులు వేయాలి.  దానికి ముందు మైలురాయిగా జులై నెలాఖరుకి 50 కోట్ల డోసులు వేస్తాం, ఆగస్టు-డిసెంబరు 4 నెలల్లో తక్కిన 140 కోట్ల డోసులూ వేసేస్తాం అన్నారు వికె పాల్. చూడబోతే జులై 26 నాటికి 43.51 కోట్ల డోసులు మాత్రమే వేశారు. తక్కిన 5 రోజుల్లో 6.5 కోట్లు వేయాలంటే రోజుకి 1.25 కోట్లు వేయాలి. ప్రస్తుతం వేస్తున్నది రోజుకి 50 లక్షల లోపే! అందువలన 50 కోట్ల లక్ష్యం చేరడం అసాధ్యం. ఇక రాబోయే 4 నెలల్లో 140 కోట్ల డోసులు వేసేయగలరా అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే దీనితో పాటు మరో వ్యాసం కూడా చదవాల్సి వుంటుంది.

‘మోదీ హై, ముమ్‌కిన్ హై’ (మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే) అని వాట్సాప్‌లలో చెప్పేసుకోవచ్చు కానీ పార్లమెంటులో చెప్పుకోవడం కష్టం. జులై 24 హిందూ ప్రకారం ‘18 ఏళ్లు దాటినవారందరికీ డిసెంబరు 31లోగా టీకాలు పూర్తవుతాయని సుప్రీం కోర్టుకి చెప్పారు కదా నిజంగా అవుతాయా?’ అని పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ‘టీకా కార్యక్రమానికి ఒక నిర్ణీత గడువు అంటూ లేదని జులై 23న కేంద్ర ఆరోగ్యశాఖ లిఖితపూర్వకంగా చెప్పింది. ఆరోగ్యశాఖ సహాయమంత్రి ప్రవీణ్ పవార్ ‘ఆగస్టు-డిసెంబర్ల మధ్య 135 కోట్ల డోసులు వస్తాయని అనుకుంటున్నాము. ఇప్పటిదాకా రూ.9725 కోట్లు టీకా కార్యక్రమంపై (టీకా కొనుగోలు, వేయించడం కలిపి) ఖర్చు పెట్టాము. నెగ్‌వాక్ ఆదేశాలనుసరించి చేస్తున్నాము.’ అన్నారు. లోకసభలో ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ‘‘జులై 20 వరకు 32.64 కోట్ల మంది టీకాలు వేయించుకున్నారు. వారిలో 8.55 కోట్ల మందికి రెండు డోసులు అందాయి అన్నారు. అప్పటివరకు రాష్ట్రాలకు 34.83 కోట్ల డోసులు ఉచితంగా యిచ్చాము అన్నారు.

దీని ప్రకారం చూస్తే జులై 20 నాటికి యిచ్చిన మొత్తం డోసులు 8.55 కోట్ల మందికి రెండేసి చొప్పున అంటే 17.10 కోట్లు, తక్కిన 24.09 కోట్ల మందికి ఒక్కోటి చొప్పున అంటే మొత్తం 41.20 కోట్ల డోసులు వేశారన్నమాట. దీనిలో 34.83 ప్రభుత్వం యివ్వగా తక్కిన 6.40 కోట్లు ప్రయివేటుగా వేయించుకున్నారన్నమాట. మన దేశపు జనాభా పెద్దది కాబట్టి కోట్లలో అంకెలు చూస్తే ఘనంగానే కనబడుతుంది. కానీ శాతాల్లో చూస్తేనే అసలైన చిత్రం తెలుస్తుంది. అవర్ వ(ర)ల్డ్ ఇన్ డేటా వెబ్‌సైట్ ప్రకారం జులై 26 నాటికి జనాభాలో 25.4% మందికి సింగిల్ డోసు, 7.0% మందికి రెండు డోసులూ పడ్డాయి. అగ్రదేశాల మాట వదిలేయండి, ప్రపంచదేశాల సరాసరి ప్రకారం చూస్తే జనాభాలో రెండు డోసులు వేయించుకున్నవారి శాతం 13.9. అంటే మన కంటె రెట్టింపు!

మన దేశంలో వాక్సినేషన్ దశల తీరు చూస్తే లక్ష్యం చేరగలమో లేదో మనకే అర్థమవుతుంది. జులై 19 హిందూ ప్రకారం మొదటి దశ (జనవరి 16- ఫిబ్రవరి 17)లో రోజుకి 29 లక్షల మంది చొప్పున, రెండో దశ (ఫిబ్రవరి 18-మార్చి 17) లో రోజుకి 99 లక్షల మంది చొప్పున, మూడో దశ (మార్చి 18-ఏప్రిల్ 17)లో రోజుకి 27.60 లక్షల మంది చొప్పున, నాలుగో దశ (ఏప్రిల్ 18-మే 17)లో రోజుకి 20.6 లక్షల చొప్పున, ఐదో దశ (మే 18- జూన్ 17)లో రోజుకి 27.3 లక్షల చొప్పున, ఆరో దశలో (జూన్ 18-జులై 17) రోజుకి 45.3 లక్షల చొప్పున వేశారు. డిసెంబరు 31 నాటికి 190 కోట్ల టార్గెట్ చేరాలంటే జులై 18 నుంచి ఏడాది చివరిదాకా సగటున రోజుకి 89 లక్షల డోసులు వేయాలి. కానీ దానిలో యించుమించు సగమే వేస్తున్నారిప్పుడు. ఈ దశల్లో రోజువారీ సగటులో హెచ్చుతగ్గులు చూడండి. జూన్ 21న కొత్త పాలసీ వచ్చాక జూన్ 27 వరకు 4 కోట్ల డోసులు యిచ్చారు. జులై 5-11 వారంలో 2.3 కోట్లకు, యిచ్చారు. రోజుకి 60 లక్షలు యిచ్చే పరిస్థితి నుంచి రోజుకి 34 లక్షలే యివ్వడానికి దిగింది.

టీకాకరణ దేశమంతా ఒకేలా లేదు. 9 రాష్ట్రాలు లేదా యుటిలలో వయస్కుల జనాభాలో 15% కంటె ఎక్కువ మంది రెండూ డోసులు తీసుకున్నారు. యుపి, బిహార్‌లలో జనాభాలో 5% మంది కూడా తీసుకోలేదు. ఆ రాష్ట్రాలలో ఒక డోసు మాత్రమే తీసుకున్నవారి సంఖ్య కూడా 25% కంటె తక్కువ వుంది. దేశంలో చాలా రాష్ట్రాలలో 25-50% మధ్యలో వుంది. ఋణ మేలా అంటూ ఓ రోజు లోన్ల పంపిణీ పెట్టుకుని, మంత్రిగారిని పిలిచి పెద్ద హంగామా చేస్తారు. దాని కోసం ఓ నెల ముందు నుంచి లోన్లు ఆపేస్తారు. అన్నీ కలిపి ఆ రోజు రికార్డు స్థాయిలో యిచ్చామని ప్రచారం చేసుకుంటారు. అది జరిగిన వారం దాకా రెస్టు తీసుకుంటారు. లోన్ల పంపిణీకీ విరామం. అలాగే జూన్ 21న 87 లక్షల మందికి టీకా యిచ్చి రికార్డు సృష్టించారు. జూన్ 22 వచ్చేసరికి అది 53 అయింది. కానీ మర్నాటికి అది ఘోరంగా పడిపోయింది. మధ్యప్రదేశ్‌లో అయితే జూన్ 21న 17 లక్షల మందికి యిచ్చారు. జూన్ 22న 5 వేల మందికి యిచ్చారు!

రెండు డోసులు పూర్తి చేయడం కంటె ఏదో ఒక డోసు వేసి, జనాభాలో యింత శాతానికి టీకా వేసేశాం అని చెప్పుకోవడానికే ప్రభుత్వం తాపత్రయ పడుతూన్న కారణంగానే కోవిషీల్డ్ టీకాల మధ్య గ్యాప్ పెంచుకుంటూ పోతోందన్న అనుమానాలు బాహాటంగానే వ్యక్తమవుతున్నాయి. వ్యవధి పెంచడం చేత టీకాల ఒత్తిడి తగ్గుతుందనేది అందరికీ తెలుసు. అయితే వారికి పూర్తి రక్షణ లభించటం లేదన్న సంగతి సుస్పష్టం. టీకా వేయించుకున్న వారిలో దాదాపు 90% మంది కోవిషీల్డే వేయించుకున్నారు. వారంతా సెకండ్ డోస్ ఎప్పుడెప్పుడని అడుగుతున్నారు. మొదట్లో 4 వారాల వ్యవధి చాలన్నారు. తర్వాత 8 అన్నారు. ఆ తర్వాత 12 అన్నారు. ఇప్పుడు 16 వారాలు చేశారు. ఇలా పెంచడానికి మా దగ్గరున్న సైంటిఫిక్ డేటా యిది అని చూపించటం లేదు. కమిటీల మీద తోసేస్తున్నారు.

ఇవాళ రాజ్యసభలో దాని గురించి అడిగితే ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ‘యుకె, ప్రపంచ ఆరోగ్య సంస్థల డేటా చూసి నేషనల్ టెక్నికల్ ఎడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టాగి) సిఫార్సు చేసింది. వారి సమావేశంలో భిన్నస్వరాలు ఏవీ లేవు. ఆ సిఫార్సు మేరకు నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వాక్సిన్ ఎడ్మినిస్ట్రేషన్ (నెగ్‌వాక్) నిర్ణయం తీసుకుంది. దాన్ని మేం అమలు చేశాం.’ అన్నారు. దానిలో ఉన్న 14 మంది సభ్యులలో ముగ్గురు మాకు డేటా ఏమీ చూపించలేదని రాయిటర్స్ న్యూస్ సంస్థకు చెప్పారు కదా అని అడిగితే, వారు ఆ సమావేశంలో అసమ్మతి ఏమీ తెలుపలేదు అన్నారు మంత్రి. ఆ సమావేశంలో 16 వారాలన్న  వ్యవధి పెంపు గురించి చర్చే రాలేదని ఆ ముగ్గురూ అన్నారు. యుకె డేటా ప్రకారమే ఈ నిర్ణయం తీసుకుని వుంటే అక్కడా 16 వారాల గాప్ వుండాలి కదా! జులై 8న డా. శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ  ‘కోవిషీల్డు డోసుల మధ్య వ్యవధిని 8 వారాలకు బ్రిటనే తగ్గించింది. మనమూ అదే చేయాలి’ అన్నారు.

ఇక హెర్డ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతూ ‘టీకాలిచ్చాక యాంటీ బాడీలు ఏ స్థాయిలో అభివృద్ధి చెందాయన్నదానిపై స్పష్టత లేదు. అందువలన హెర్డ్ ఇమ్యూనిటీ గురించి చెప్పలేం. దేశంలో 60% మందికి టీకాలు (అనగా రెండు డోసులు) యిస్తే తప్ప ముప్పు తప్పదు’ అన్నారు. ఇప్పుడు 8%లో వున్నాం. 4 నెలల్లో 60కి చేరగలమా? టీకాల లభ్యత వుంటే చేరగలం. మొదట్లో వాక్సిన్‌ల పట్ల భయాందోళనల కారణంగా ఎవరూ ముందుకు రాలేదన్నమాట వాస్తవమే కానీ యీ రోజు చాలామంది ఎగబడుతున్నారు. కానీ కావలసినన్ని టీకాలు లేవు. ప్రభుత్వం యిస్తున్న హామీలకు, వాస్తవాలకు పొంతన ఎందుకు ఉండటం లేదో ‘వాక్సిన్ల లభ్యత’ అనే వ్యాసంలో చర్చిద్దాం. 

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?