Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: వెంకయ్య నిష్క్రమణతో సమీకరణాలు మారతాయా?

వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా వెళుతూండడంతో క్రియాశీలక రాజకీయాల్లోంచి తప్పుకున్నట్లయింది. ఆయన నిష్క్రమణ వలన తెలంగాణలో దిగులుపడుతున్న వారెవరూ కనబడటం లేదు. ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాడినా తమ పార్టీకి రావలసినంత ఆదరణ రాకపోవడానికి, ప్రజల దృష్టిలో కెసియార్‌తో తలపడగలిగిన స్థాయి గల నాయకుడు తమలో లేకపోవడానికి వెంకయ్యే కారణమని తెలంగాణ బిజెపి నాయకుల భావన! ఇకనుంచి అమిత్‌ షా ప్రోత్సాహంతో ఎదుగుతామన్న ఆశాభావం!! 

ఆంధ్రలో బిజెపికి యింత ఆశాభావం వుండే అవకాశం లేదు. తెలంగాణలో బిజెపికి ముందునుంచి నాయకులున్నారు. ప్రజాసమస్యలపై పోరాడిన చరిత్ర వుంది. ఆంధ్రకు సంబంధించి బిజెపి అంటే వెంకయ్య నాయుడు తప్ప వేరెవరూ గుర్తుకు రారు. వెంకయ్య ఆ జాగ్రత్త తీసుకున్నట్టుంది. ఆయన జాతీయ అధ్యక్షుడిగా వున్న రోజుల్లో కూడా సొంత రాష్ట్రంలో క్యాడర్‌ని, లీడర్లను తయారు చేయలేదు. మోదీ హవా ప్రారంభమై 2014 ఎన్నికలలో బిజెపి గెలుస్తుందని తోచగానే కొందరు నాయకులు టపటపా కాంగ్రెసు పార్టీ నుంచి బిజెపిలోకి దూకేశారు.

కాంగ్రెసుకు, బిజెపికి సిద్ధాంతరీత్యా చుక్కెదురు. కేవలం అవకాశాల కోసం ఫిరాయించారు తప్ప భావసారూప్యంతో కాదన్నది స్పష్టం. విభజన నిర్ణయం తర్వాత ఆంధ్రలో కాంగ్రెసుది మునిగే పడవ అని గ్రహించిన కాంగ్రెసు నాయకులు బాబు వైపు మళ్లుదామనుకుంటే ఆయనే వారిని బిజెపి నాయకుల రూపెత్తమని సలహా యిచ్చారన్న పుకారూ వుంది.

పొత్తులో భాగంగా బిజెపికి సీట్లు యిచ్చినట్లూ వుంటుంది, లోపాయికారీగా వాళ్లు తన మనుషులే  అయివుంటారు. బాబు మూడేళ్ల పాలనలో ఎన్నో అవకతవకలున్నా బిజెపి ప్రజల పక్షాన తగినంతగా స్పందించకపోవడానికి యిదే కారణమని నమ్మవచ్చు. ఏదైనా జరిగితే ఆ ఘనత టిడిపికి పోతుంది. ఆ చర్యల వలన ప్రజాగ్రహం రగిలితే అది ప్రతిపక్షంలో వున్న వైసిపికి లాభిస్తుంది తప్ప బిజెపికి చేకూరదు. 

వెంకయ్య వ్యతిరేకులకు ఛాలెంజ్‌ - ఈ విధంగా ఆంధ్ర బిజెపి రెండిందాలా నష్టపోతూ వుంది. ఈ పరిస్థితి మారాలని కొందరు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ వున్నా వెంకయ్య వారిని గదమాయించేశారు. బాబు భజన చేస్తూ ఆయన యిమేజి పెరగడానికే దోహదపడ్డారు. బిజెపి హై కమాండ్‌ కూడా యీ విషయంలో ఉపేక్ష వహించింది. చివరకు మేల్కొంది. వెంకయ్యను రంగంలోంచి తప్పించింది. సొంతంగా ఏ మేరకు ఎదుగుతారో ఎదిగి చూపించండి అని వెంకయ్య వ్యతిరేకులకు ఛాలెంజ్‌ విసిరినట్లే. 

ఎన్నికలకు రెండేళ్ల సమయం కూడా లేదు. ఈ లోగా అర్జంటుగా బిజెపి ఎదగగలదా? బాబుకి, జగన్‌కి దీటుగా నిలవగల నాయకుణ్ని తయారు చేయగలదా? సందేహమే! ఇన్నాళ్లూ జవసత్త్వాలు లేకుండా మూలన పడి వుండి, యిప్పుడు హఠాత్తుగా పరిగెట్టమంటే వాళ్ల తరమా? 2019 ఎన్నికలలో ఒక పక్క టిడిపి, మరో పక్క వైసిపి తలపడితే మధ్యలో విడిగా పోటీ చేస్తే నిలదొక్కుకోగలరా? అసలు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు దొరుకుతారా? సమయం తక్కువుంది కాబట్టి ఎవరో ఒకరితో చేతులు కలపాలి. టిడిపితో పొత్తు కొనసాగిస్తే బాబు ఛాయలోనే ఎదగాలి. ఎదగనిస్తారా? ఎదగనిస్తే యిన్ని ఫిర్యాదులెందుకు? వెంకయ్యను మార్చడమెందుకు? 
వెంకయ్యను తప్పించి ఆంధ్ర పగ్గాలు రామ్‌ మాధవ్‌కు అప్పగిస్తారనే వార్తలు రావడంతోనే యథాతథ పరిస్థితి కొనసాగదనేది తథ్యమైంది. పొత్తు స్వభావంలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిర్వహణలో ఎక్కువ వాటా అడగవచ్చు. తమ నాయకులకీ పబ్లిసిటీ కోరవచ్చు. లేదా ఫ్రెండ్లీ అప్పోజిషన్‌ పార్టీగా వుంటామంటూ ప్రత్యేక ఉనికి చాటుకుంటూ ఉద్యమాలు చేపట్టవచ్చు.   ఎన్నికలు దగ్గర పడేసరికి అప్పుడు మొగ్గు ఎటుందో చూసి వారితో పొత్తు పెట్టుకోవచ్చు. 

మీడియాకు సంకటం - అమిత్‌ షా పార్టీ క్యాడర్‌ను రిలాక్స్‌ కానిచ్చే మనిషి కాడు. ఏదో ఒకటి చేయమని తరుముతూ వుంటాడు. ఇన్నాళ్లూ వెంకయ్య సాకు పెట్టుకుని ఆంధ్ర బిజెపి నాయకులు విశ్రమించారు. ఇప్పుడు సొంత ప్రతిపత్తి చూపుకోవడానికి బాబు భజన మాని, ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలేవైనా చేపట్టి కాస్త జనంలో తిరగాలి. మోదీ ప్రాభవం యిప్పుడు దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో వెలుగుతోంది. మధ్యతరగతి ప్రజలకు, అగ్రవర్ణాలకు మోదీ డార్లింగ్‌లా వున్నారు.

బిజెపి ఏవైనా సభలు పెడితే, కార్యక్రమాలు చేపడితే యీ వర్గాలు తప్పకుండా స్పందిస్తాయి. వాటిని కవర్‌ చేయడం, హైలైట్‌ చేయడంలో తెలుగు మీడియాకు సంకటం వుంది. బిజెపిని ఆదరించే వర్గాలకు టిడిపిపై కూడా అభిమానం వుంది. అందువలన తెలుగు మీడియా (''సాక్షి''  కాకుండా) కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో బాబుని ఆకాశానికి ఎత్తేస్తూ హ్యాపీగా వుంది. ఇద్దరూ ఎదురుబొదురుగా నిలబడే సందర్భం వస్తే ఎవరి పక్షాన నిలవాలో వాళ్లకు అర్థం కాదు. టీవీ ఛానెల్స్‌లో ఎక్కువ భాగం బాబు వెంట నడిచినా ప్రింటు మీడియా బిజెపిని వ్యతిరేకించే సాహసం చేయదు. బిజెపి ఆంధ్రపై గట్టిగా చూపు సారించదలచుకుంటే దానికి అనుకూలమైన టీవీ గ్రూపులను తెలుగు వెర్షన్లను ప్రారంభించ మనవచ్చు.

ఇలా కొంతకాలం గడిచేసరికి బిజెపి ఏ మేరకు పుంజుకుందో వారి అధిష్టానానికి కూడా ఒక అంచనా ఏర్పడుతుంది. అప్పుడు టిడిపితో కాని, వైసిపితో కానీ ఎన్నికలకు ముందు కానీ, తర్వాత కానీ పొత్తు ఏర్పరచుకోవడం జరగవచ్చు. తనకు బలం చాలదనుకున్నపుడు బిజెపి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటూనే వుంది.  పార్లమెంటులో బలం ముఖ్యం కాబట్టి ఎంజీయార్‌ ఫార్ములా (జాతీయ పార్టీకి ఎంపీ సీట్లలో మూడింట రెండు వంతులు, ఎమ్మెల్యే సీట్లలో మూడింట ఒక వంతు)తో ముందుకు సాగవచ్చు. 

బిజెపి ప్లేటు ఫిరాయిస్తే? - టిడిపితో ఏడాది, ఏడాదిన్నర పాటు ఘర్షణ పడి, చివర్లో పొత్తు పెట్టుకుంటారా అని సందేహించనక్కరలేదు. అలాటివి గతంలో బోల్డు జరిగాయి. అలాగే అవినీతి ఆరోపణలపై కేసులు ఎదుర్కుంటున్న జగన్‌తో పొత్తు పెట్టుకుంటారా అనీ అనుమానించనక్కరలేదు. అవినీతి ముద్ర వున్న శివసేన, అకాలీ దళ్‌లతో పొత్తు పెట్టుకోగా లేనిది, కేసులింకా విచారణ దశలో ఉన్న జగన్‌తో పెట్టుకోవడానికి అభ్యంతరం ఏముంటుంది? ఇవి బిజెపి లెక్కలు కాగా జగన్‌ లెక్కలెలా వుంటాయి? జగన్‌ లక్ష్యం బాబుని పదవీభ్రష్టుణ్ని చేయడం! 2014 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి దెబ్బ తిన్నారు.

టిడిపి ఏమో బిజెపి, పవన్‌లను కలుపుకుని గెలిచేసింది. ఈసారి బిజెపి యిటు తిరిగితే గెలుపు ఖాయమని, పవన్‌ ఎటుమళ్లినా ఫర్వాలేదని జగన్‌ అభిప్రాయ పడవచ్చు. బిజెపిని మంచి చేసుకోవడానికి జగన్‌ శతథా ప్రయత్నిస్తున్నారు. ఆయన పత్రికలో, టీవీలో బాబుకి వ్యతిరేకంగా రాయడమే తప్ప కెసియార్‌కు, మోదీకి వ్యతిరేకంగా రాయరు.  (ఎబికె ప్రసాద్‌ కాలమ్‌ మాత్రమే మోదీ పాలనలో లోపాలు చూపుతుంది) కెసియార్‌ ఐతే శత్రువుకి శత్రువు అనుకోవచ్చు. మరి మోదీ శత్రువుకి మిత్రుడు కదా. ఆయన్నెందుకు స్పేర్‌ చేయాలి? జాతీయ పార్టీతో స్నేహంగా వుండకపోతే సిబిఐని ఉసి గొలుపుతారు.

కాంగ్రెసుతో ఎలాగూ చెడింది. బిజెపితో నైనా మంచిగా వుండకపోతే ఎలా? అందుకే బిజెపి హస్తాన్ని అందుకోవాలని ఉరకలు పెడుతున్నారు. ఈయన సంగతి సరే, అవతల మోదీ సంగతేమిటి? జగన్‌కు అపాయింట్‌మెంట్‌ యిచ్చి, బాబుకి యివ్వకపోవడంలో, ఆంధ్రకు నిధులు బిగబట్టడంలో, మోదీ ఆంతర్యం ఏమిటి? బాబుపై గోధ్రా నాటి కోపం పోలేదా? తనేం చేసినా మీడియా సహాయంతో బాబు అది తన ఖాతాలో పడేసుకుంటారన్న దుగ్ధా? మోదీ-అమిత్‌ ద్వయం శత్రువులనే కాదు, చిరకాల మిత్రులను కూడా ఎదగనివ్వరని శివసేన నిర్ధారిస్తుంది.

మహారాష్ట్రలో అన్న తమ్ముడయ్యాడు, తమ్ముడు పెద్దన్న అయ్యాడు. ఆంధ్రలో కూడా అలా తారుమారు చేయాలనే తలపు రావడంలో విడ్డూరం లేదు. అయితే మహారాష్ట్ర బిజెపికి గతచరిత్ర చాలా వుంది. ఆంధ్రలో అంత సీను కాదు కదా, దానిలో పదో వంతైనా లేదు. ఇక్కడ దీర్ఘకాలిక ప్రణాళిక వేయాలి. ఆ దిశగా అడుగులైనా పడాలి.

నింద వేయకపోతే సొంతంగా ఎదగలేరు - ఆంధ్రలో బిజెపి సొంతంగా ఎదుగుదామంటే ఓ చిక్కుంది. కేంద్రంలో అధికారంలో వున్నా మా రాష్ట్రానికి ఏమీ చేయలేదేం? అని ప్రజలు నిలదీస్తే వాళ్లకు సరైన సమాధానం చెప్పగలగాలి. ఇచ్చినదానికి రాష్ట్రప్రభుత్వం లెక్కలు చూపలేదని, రాజధాని ప్రాజెక్టు రిపోర్టు యివ్వలేదని, వేసిన క్వెరీలకు సమాధానం యివ్వలేదని, ముందస్తు అనుమతులు లేకుండా పట్టిసీమ కట్టిందని... యిలా టిడిపిపై నింద వేయాలి.

సహజంగా టిడిపి ఆ ప్రచారాన్ని తిప్పికొడుతుంది. అందువలన ఏ మేరకు సంయమనం పాటించాలో ముందుగా నిర్ణయించుకుని కానీ బిజెపి ప్రజల్లోకి వెళ్లలేదు. వెళ్లకపోతే మనుగడ లేదు. వెంకయ్యను తప్పించాక కూడా జనంలోకి వెళ్లకపోతే ఆ కసరత్తు వ్యర్థమే. ఎలా చూసినా టిడిపి-బిజెపి సంబంధాలు బెడిసేందుకే అవకాశముంది. అంతమాత్రాన వైసిపితో సంబంధాలు మెరుగు పడతాయనుకోవడానికి లేదు. బాబు పాలనతో విసుగు చెంది, జగన్‌ అంటే నమ్మకం కుదరకుండా వున్న ప్రజలు తమ కార్యక్రమాలకు స్పందిస్తే బిజెపి నాయకులకు ఆత్మవిశ్వాసం పెరిగి, సొంతంగా పోటీ చేద్దామనే కోరికా పుట్టవచ్చు.

అసెంబ్లీ సీట్ల పెంపుపై నిర్ణయాన్ని చాలాకాలంగా నానబెట్టి వుంచారు. దాని వలన ఏ ప్రయోజనం ఒనగూడు తుందనుకున్నారో కానీ విభజన బిల్లులో దాన్ని పెట్టారు. దాన్ని ఆశ చూపించి తెలుగు రాష్ట్రాలలో పాలకులు ఫిరాయింపుదార్లను చేర్చుకుని బలపడ్డారు. దాంతో బిజెపి రెండు యూనిట్లూ దెబ్బ తిన్నాయి. సీట్ల సంఖ్య పెంచవద్దని కేంద్రంతో మొత్తుకుంటున్నాయి. సొంతంగా బలపడే ప్రయత్నాల తీరుతెన్నులు చూశాక, అది తమకు లాభదాయకంగా వుంటుందని తోస్తేనే దానిపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని అనుకోవచ్చు. 

నంద్యాల ఓ దిక్సూచి - బిజెపి ప్రయత్నాలు ఎలా వున్నా యీలోగా వైసిపి సొంతంగా బలపడితేనే బిజెపి దానితో పొత్తు పెట్టుకుంటుంది. బిజెపితో పొత్తుపై అతిగా ఆశ పెట్టుకుని వైసిపి ప్రమత్తంగా వుంటే మోదీ-అమిత్‌ ద్వయం నిర్లక్ష్యం చేస్తుంది. బిజెపికి బలం పెద్దగా లేని వర్గాల ఓట్లు వైసిపి సంపాదించగలదన్న నమ్మకం కుదిరినప్పుడే ఆ పొత్తు ఏర్పడుతుంది. నంద్యాల ఉపయెన్నిక ఆంధ్ర  రాజకీయాల్లో వాటర్‌షెడ్‌ లాటిది. అందుకే టిడిపి సర్వశక్తులు, సకల ఉపాయాలు కుమ్మరిస్తోంది. అవి ఎదుర్కుని అక్కడ గెలిస్తే వైసిపిలో ఉత్సాహం పుంజుకుంటుంది. టిడిపిలోని అసంతృప్తులు, కాంగ్రెసులో మిగిలినవారు వైసిపి వైపు చూడడం మొదలుపెడతారు.

ప్రజలను, నాయకులను తమవైపు తిప్పుకునే ఉపాయాలు ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పగలగాలి. వాటిని జగన్‌ అమలు చేయగలగాలి. అప్పుడే బిజెపి కూడా వైసిపిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఉపయెన్నికలో ఓడిపోతే మాత్రం వైసిపి ఆత్మస్థయిర్యం దెబ్బ తింటుంది. తన సీటే తను నిలబెట్టుకోలేక పోయింది అని మాటపడుతుంది. జగన్‌ను నమ్ముకుని ప్రయోజనం లేదు అనుకుని అక్కడి నాయకులు అయితే టిడిపిలోకి, లేకపోతే బిజెపిలోకి వలసలు ప్రారంభిస్తారు.  బిజెపికి ధైర్యం పెరుగుతుంది. వైసిపి స్థానంలో తనే ప్రధాన ప్రతిపక్షంగా తయారు కావచ్చేమో అని ఆశపడుతుంది.  (ఫోటో  - రామ్‌ మాధవ్‌, అమిత్‌ షా)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com