Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: పండితులు సినిమాలకు నప్పరా?

ఎమ్బీయస్‌:  పండితులు సినిమాలకు నప్పరా?

సినిమా రచన అనేది విలక్షణమైనది. పాండిత్యం ఉన్నంత మాత్రాన, సృజన సాహిత్యంలో నిష్ణాతులైనంత మాత్రాన సినిమాల్లో రాణిస్తారని లేదు. సినిమా రచయితలకూ పాండిత్యం ఉంటుంది. కానీ వాళ్లు తమ పాండిత్యాన్ని, సృజనాత్మకతను సామాన్యుడికి అందించే కళలో నైపుణ్యం సాధిస్తారు. విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి మహానుభావులకు కూడా యీ విద్య అబ్బలేదు. ఆ వైనం ఏమిటో సినీరచయిత డి.వి.నరసరాజు గారు తన ఆత్మకథ ''ఒక అదృష్టవంతుని ఆత్మకథ''లో రాశారు.

జంధ్యాల గౌరీనాథ శాస్త్రి అని గొప్పనటుడు ఉండేవాడు. చాలా ధనికుడు. వాళ్ల మావగారు గుంటూరులో పెద్దలాయరు. కె వి రెడ్డిగారు వాహినీ పిక్చర్స్‌ కోసం తొలిసారిగా డైరక్టు చేసిన ''భక్త పోతన'' (1942) సినిమాలో ఈ గౌరీనాథ శాస్త్రి శ్రీనాథుడి వేషం వేసి అదరగొట్టేశాడు. సినిమా సూపర్‌హిట్‌ అయింది. కెవి రెడ్డి డైరక్షన్‌పై అప్పట్లో వాహినీవారికి నమ్మకంలేదు. బిఎన్‌ రెడ్డి గారిని దర్శకత్వ పర్యవేక్షణకు పెట్టాడు. అయితే గౌరీనాథ శాస్త్రి కెవి రెడ్డికి మంచి మద్దతు యిచ్చాడు.

ఆయనే కనక 'ఈ కుర్రాడికి ఏం తెలుసు? బిఎన్‌ గారినే పెట్టండి' అని ఉంటే కెవికి డైరక్షన్‌ ఛాన్స్‌ పోయి వుండేది. ఆ కృతజ్ఞత కెవికి ఉంది. కొన్నాళ్లు పోయాక 1952లో కెవి, డివి నరసరాజు గారిని సినిమారంగానికి పరిచయం చేస్తూ ఆయన చేత వాహినీ వారికే ''పెద్దమనుషులు'' (1954) రాయించుకున్నారు. దానిలో తేనెపూసిన కత్తి లాటి మునిసిపల్‌ చైర్మన్‌ పాత్రను సృష్టించారు. దాన్ని మొదట ఎస్‌వి రంగారావుగారికి యిద్దామనుకున్నారు కానీ చివరకి గౌరీనాథ శాస్త్రికి యివ్వాలని కెవి నిశ్చయించారు. 

ఎందుకంటే కెవికి ఆప్తుడైన గౌరీనాథ శాస్త్రి మావగారు వచ్చి ''మా అల్లుడు ''గీతాంజలి''(1948) ''ఆకాశరాజు'' (1951) అని సినిమాలు తీసి ఆస్తి అంతా పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. మీరు సాయం చేయండి'' అని అడిగారు. పైగా కెవికి ''భక్త పోతన'' నాటి కృతజ్ఞత ఉంది. అందుకని యీయనకు వేషం యిచ్చాడు. ఆ పాత్రకు గౌరీనాథ శాస్త్రి జీవం పోశాడని ఆ సినిమా చూసిన ప్రతీవాళ్లూ అనాల్సిందే. అయితే ''పెద్దమనుషులు'' సినిమా మొదలై రెండు మూడు సెట్లు షూటింగు అయ్యాక యిబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు.

ఆయనకు తన ఫ్లాప్‌ సినిమా 'ఆకాశరాజు''కి ఏవైనా రిపేర్లు చేసి మళ్లీ విడుదల చేయించాలని కోరిక పుట్టింది. డబ్బు కోసం విజయా డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళితే ''ఆ చేసే మార్పులేవో కెవి రెడ్డిగారు చేసి, మళ్లీ షూట్‌ చేస్తానంటేనే డబ్బు పెడతాం'' అన్నారు. ఈయన వెళ్లి కెవిని మార్పులు చేయమని అడిగాడు. కెవి అప్పటికే ''పెద్దమనుషులు''కు ఎదురైన నిర్మాణపరమైన చిక్కులతో సతమతమవుతున్నారు. ''నా వల్ల కాదండి'' అన్నారు. దాంతో గౌరీనాథ శాస్త్రి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు.

డైలాగులు సరిగ్గా చెప్పకపోవడం, అదేమంటే మనసు బాగా లేదండి అనడం సాగించాడు. మంచి చేయబోతే చెడు ఎదురైందని గ్రహించినా, ఏమీ చేయలేక కెవి ''ఈ షెడ్యూల్‌ అయిన తర్వాత మీ పిక్చరు మీద పనిచేద్దాం'' అని మాట యివ్వవలసి వచ్చింది. ఇక అప్పణ్నుంచి పగలు ''పెద్దమనుషులు'' షూటింగు, రాత్రి భోజనానంతరం కెవి యింట్లో ''ఆకాశరాజు'' సినిమా మార్పులు, చేర్పుల చర్చ. గౌరీనాథ శాస్త్రికి విశ్వనాథ సత్యనారాయణగారు మంచి స్నేహితుడు. ఆయన రాసిన నవల ఆధారంగానే ''ఆకాశరాజు'' తీశారు. ఆయన్నూ చర్చలకు పిలిచాడు.

కెవి గారు తనకు సన్నిహితుడైన నటుడు ముదిగొండ లింగమూర్తిగారిని కూర్చోబెట్టారు. ఒకరోజు ఓ కొత్త సీను అనుకున్నారు. హీరో హీరోయిన్ల మధ్య ఒక శృంగార ఘట్టం. మర్నాడు రాసుకొస్తాను అన్నారు విశ్వనాథ. ''మాధవీ! నేను చచ్చిన వెనుక, నా ఆత్మ నీ చుట్టూనే తిరుగుచుండును' అంటాడు హీరో. 'శృంగారం రాయమంటే వాక్యం చావుతో మొదలుపెడతాడేమిటి యీయన' అని అనుకున్న కెవికి ఎలా చెప్పాలో తెలియలేదు. గొప్ప రచయితే కానీ సినిమాలకు పనికి రాడు అనుకున్నారు. ఆ విషయమే మర్నాడు నరసరాజుగారితో చెప్పారు. అలా మరికొన్ని రాత్రులు చర్చలతోనే గడిచాయి.

చివరకి విశ్వనాథ వారే పరిస్థితి గ్రహించి 'నా వల్ల కాదయ్యా! మీ ఏడుపు ఏదో మీరే ఏడవండి' అని లేచిపోయారు. ఆ ''ఆకాశరాజు'' సినిమా మార్పుల కథ అంతటితో ముగిసింది. (గమనిక - డివి నరసరాజు గారు తన పుస్తకంలో 'ఆకాశరాజు'కి బదులు దానికి మూడేళ్లకు ముందే విడుదలైన ''గీతాంజలి'' అని రాశారు. 'ఆకాశరాజు'' 1951లో రిలీజైంది కాబట్టి దానికి మార్పులు చేసి 1952లో మళ్లీ రిలీజు చేయాలనుకోవడం సహజం. పైగా అది విశ్వనాథగారి నవలే కాబట్టి ఆయన్ని పిలిచి ఉంటారు)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?