cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఒక యోగి ఆత్మకథ

ఎమ్బీయస్: ఒక యోగి ఆత్మకథ

ప్రముఖ రచయిత పోరంకి దక్షిణామూర్తి గారు ఫిబ్రవరి 6న తన 86వ ఏట మరణించారు. ఆయన కథకుడు, నవలాకారుడు. వ్యాసకర్త, అనువాదకుడు, సమీక్షకుడు, వీటన్నిటిని మించి తెలుగు అకాడమీలో వుండగా భద్రిరాజు కృష్ణమూర్తిగారికి సహాయకునిగా వుంటూ వృత్తి పదకోశాలు రూపకల్పన చేశారు. 40 వేల పదాలతో ఇంగ్లీషు-తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు సంకలనం చేశారు. తెలుగు కథానిక పుట్టుక గురించి సి నారాయణరెడ్డిగారి పర్యవేక్షణలో డాక్టరేటు తీసుకున్నారు. ఉస్మానియాలో తెలుగు రీడర్‌గా పనిచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పుట్టి హైదరాబాదులో మరణించిన యీయన కోస్తా, రాయలసీమ, తెలంగాణ మాండలికాలు మూడిట్లో తలో నవలా రాశారు. పరమహంస యోగానంద రాసిన ‘ఒక యోగి ఆత్మకథ’ ను తెలుగులో యీయనే అనువదించారు. దానికి ఉమ్మడి రాష్ట్రం ఉత్తమ అనువాద పురస్కారాన్ని యిచ్చింది. ఇప్పుడు ఆ పుస్తకం గురించే చెప్పబోతున్నాను. ముందుగా రచయిత గురించి చెప్తాను.

పరమహంస యోగానంద (1893-1952) అసలు పేరు ముకుందలాల్ ఘోష్. స్వామి యుక్తేశ్వర గిరి అనే సన్యాసి వద్ద సన్యాసం స్వీకరించి, యోగ ప్రక్రియ ద్వారా ఆత్మసాక్షాత్కారం పొంది, 1920లో అమెరిగా వెళ్లి క్రియాయోగాన్ని అక్కడ వ్యాప్తి చేశారు. ఈయనకు క్రైస్తవం మీద కూడా గౌరవం వుంది. మూలక్రైస్తవానికి, మూల హైందవానికి కల పోలికల గురించి చర్చిస్తూ, అమెరికాలో యోగా ఉద్యమాన్ని ఎంతో ఎత్తుకు తీసుకుని పోయారు. 1927లో అప్పటి అమెరికా అధ్యక్షుడు కూలిడ్జ్ ఆయనకు అతిథ్యమిచ్చాడు. ఇటీవలే యోగాని పాశ్చాత్యులు ఆదరిస్తున్నారని ప్రచారం చేసేవాళ్లు యీ విషయాలను తెలుసుకోవాలి. లాస్ ఏంజిల్స్ టైమ్స్ ఈయన్ని ‘’20 వ శతాబ్దపు సూపర్‌స్టార్ గురు’’ అని వర్ణించింది. 1952లో ఆయన మరణించే నాటికి ఇండియా, అమెరికా కలిపి 100 సెల్ఫ్‌రీలైజేషన్ సెంటర్లు స్థాపించారు. 1946లో ఆయన తన ఆత్మకథ రాశారు. అది ఇప్పటిదాకా 40 లక్షల కాపీలు అమ్ముడుపోయింది. 100కి పైగా విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథంగా వుంది. స్టీవ్ జాబ్స్ ఒక సమావేశానికి 500 కాపీలు తెప్పించి అతిథులకు పంచాడట.

ఇండియాలో ఇంగ్లీషు పుస్తకాన్ని ప్రచురించిన జైకో పబ్లిషింగ్ వాళ్లే తెలుగు అనువాదం కూడా పబ్లిష్ చేశారు. నా దగ్గరున్నది 1987 ప్రతి. దానిలో అనువాదకర్త పేరు లేదు. పోరంకి నివాళి వ్యాసాల ద్వారానే అనువాదకర్త ఆయన అని తెలిసింది. ఆ సందర్భం ఉపయోగించుకుని ఆ పుస్తకంలో రెండు, మూడు ఘట్టాలు పాఠకులతో పంచుకుంటున్నాను. సాధారణంగా అతీంద్రియ శక్తుల గురించి చదవడం ఉత్సాహకరంగానే వుంటుంది కానీ నమ్మాలో లేదో తెలియదు. ఇప్పటిదాకా నేను దయ్యాల్ని కానీ, అద్భుతశక్తులను కానీ స్వయంగా చూడలేదు. వాటిని స్వయంగా చూశామని చెప్పేవాళ్లూ నాకు కనబడలేదు. ‘మా వూళ్లో చిన్నపుడు యిలా జరిగింది-ట’ అని చెప్పేవాళ్లే అందరూ. పునర్జన్మల గురించి 30, 40 ఏళ్ల క్రితం చాలా హడావుడి చేసేవారు. ఇటీవల కాలంలో కమ్యూనికేషన్స్ పెరిగిపోయిన తర్వాత ఆ కథలు వినబడడం మానేశాయి.

‘నేను క్రితం జన్మలో యుపిలోని రాంపూర్‌లో ఓ గృహిణిని. చెరువు మెట్ల మీద నుంచి మా అత్తగారు తోసేసింది.’ అని ఎవరైనా పదేళ్ల బాలిక చెపితే వెంటనే టీవీ ఛానెల్ వాడు ఆ వూళ్లో వున్న రిపోర్టరును లైన్‌లోకి తెచ్చి అక్కడి చెరువుకి మెట్లు వున్నాయో లేదో మన ప్రేక్షకులకు చూపించు అనవచ్చు. అందుకని యివన్నీ బంద్ అయిపోయాయి కాబోలు. ఇప్పటికీ పునర్జన్మల ఉదంతాలు అని రాసేవాళ్లు 1920లో బిహార్‌లోని కుగ్రామంలో.. అని మొదలుపెడతారు. అప్పట్లో మీడియా ఎంత ప్రాథమిక స్థాయిలో వుండేదో వూహించుకోవచ్చు. అందుచేత యివన్నీ సరదాగా చదవడమే తప్ప, నమ్మే పని పెట్టుకోలేదు నేను. నమ్మినా మనం చేసేదేమీ లేదు, ఓహో అనుకోవడం తప్ప. ఆయనెవరో 400 ఏళ్లు బతికాట్ట అంటే అలాగా అనుకోవడమే తప్ప మనం ఎలాగూ బతకబోయేది లేదు. అలా బతకడానికి కుండలినీ శక్తిని జాగృతం చేయాలి అని చెప్తే సూర్యోదయానికి ముందు నేను లేవడమే కష్టంగా వుంది, లోపలున్న శక్తిని లేపడం మన వల్ల కాదు అనుకుంటాను. అయినా అయినవాళ్లందరూ గతించాక, అంతకాలం ఉండి ఉద్ధరించేదేముంది?

ఈ పుస్తకంలో యోగానంద తనకు తారసిల్లిన గురువులు చెప్పిన ఉదంతాలను చెప్పారు. వాటితో బాటు తన స్వానుభవాలను కూడా చెప్పారు. అవి కూడా చెప్పి, చివర్లో అల్లావుద్దీన్ అద్భుతదీపం వంటి కథతో ముగిస్తాను. ముందుగా యోగానంద గురువు యుక్తేశ్వర గిరి గారు చెప్పిన అనుభవం. ఓ రోజు ఏసు క్రీస్తు- లాజరస్ కథ యోగానంద, తదితర శిష్యులకు చెప్తున్నారు. లాజరస్ జబ్బుపడి, మృత్యుముఖంలో వున్నాడని తెలిసినా ఏసు వెళ్లలేదు. ‘ఇది చావుకై వచ్చినది కాదు, నా మహిమ చూపడానికి వచ్చినది’ అంటా ఆ వూరు వెళ్లడం ఆలస్యం చేశాడు. లాజరస్ చనిపోయిన నాలుగు రోజులకు వెళ్లి అతన్ని బతికించాడు. అతను నిద్రలోంచి మేల్కొన్నట్లు మేలుకొన్నాడు. ఈ కథ చెప్పి నాకూ మా గురువు లాహిరీ గారితో యిటువంటి అనుభవం జరిగింది అంటూ యుక్తేశ్వర్ చెప్పారు.

యుక్తేశ్వర్, రాము యిద్దరూ మిత్రులు. ఆశ్రమవాసులు. రాముకి ఏసియాటిక్ కలరా జబ్బు వచ్చి చావబోతున్నాడు. వైద్యులు వచ్చి వైద్యం చేస్తున్నారు. యుక్తేశ్వర్ లాహిరి గారి వద్దకు వెళ్లి రాముని కాపాడమని అడిగారు. ‘వైద్యులు చూస్తున్నారుగా’ అని గురువుగారు చిరునవ్వు నవ్వారు. యుక్తేశ్వర్ హమ్మయ్య అనుకుని తిరిగి వెళితే రాము కొనవూపిరితో వున్నాడు. కొంతసేపటికి తనకు మృత్యువు ఆసన్నమైందని గ్రహించిన రాము ‘అంత్యక్రియలు జరిగేలోగా నా దేహాన్ని దీవించమని గురువుగారిని అడుగు’ అని చెప్పి చచ్చిపోయాడు. యుక్తేశ్వర్ గురువుగారి నివాసానికి వెళ్లి అతని చావు గురించి చెప్పాడు. ఆయన ‘నువ్వు మనస్సు చిక్కపట్టుకుని, కాస్సేపు ధ్యానం చేయి.’ అంటూ సమాధిలోకి వెళ్లిపోయారు. ఆ రోజు మధ్యాహ్నం, రాత్రి అలాగే గడిచిపోయాయి.

మర్నాడు తెల్లవారుఝామున గురువుగారు యుక్తేశ్వర్‌తో ‘రాముకి ఏదో ఒక మందు రూపంలో ప్రత్యక్ష సాధనం నా నుంచి ఆశిస్తున్నట్లు నాకెందుకు చెప్పలేదు?’ అంటూ ‘అదిగో మూల వెలుగుతున్న దీపపు ప్రమిదలోని ఆముదం చిన్న సీసాలో ఒంపుకుని ఏడు చుక్కలు రాము నోట్లో పోయి.’ అన్నారు. ‘నిన్న మధ్యాహ్నం పోయిన వ్యక్తికి యిప్పుడీ ఆముదం పోసి ప్రయోజనమేమిటి?’ అనుకుంటూనే యుక్తేశ్వర్ గురువు చెప్పినట్లే చేశారు. రాము లేచి కూర్చున్నాడు. ‘ఒక ప్రచండ కాంతిలో లాహిరీగారు కనబడి ‘లే, నీ నిద్ర కట్టిపెట్టు. యుక్తేశ్వర్‌తో కలిసి నన్ను కలుసుకో’ అని ఆజ్ఞాపించారు.’ అని చెప్పాడు. యుక్తేశ్వర్ ఆ అనుభవం చెప్పగానే శిష్యుల్లో ఒకరు ‘ఆ ఆముదానికి వున్న ప్రత్యేకత ఏమిటి?’ అని అడిగాడు. దానికి యుక్తేశ్వర్ ‘దానికి ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదు. నేను వారి దగ్గర్నుంచి భౌతికమైనదేదో ఆశించినందువలన, నాలో విశ్వాసాన్ని మేలుకొలపడానికి వస్తురూపమైన చిహ్నంగా, దగ్గర్లో వున్న చమురును ఎన్నుకున్నారు.’ అని జవాబిచ్చారు. తాయెత్తు, కాశీతాడు, సాయిబాబు విబూది యిలాటివన్నీ సింబాలిక్‌యే అనుకోవాలి.

ఇక యోగానంద స్వానుభవాల గురించి. ఆయన శ్రీరాంపూర్‌ కాలేజీలో బిఏ చదువేటప్పుడు దిజేన్ అనే రూమ్మేటు వుండేవాడు. దగ్గర్లోనే యుక్తేశ్వర్ గారి ఆశ్రమం వుండేది. వీళ్లు తరచుగా వెళుతూండేవారు. ఓ రోజు కలుద్దామని వెళితే గురువుగారు కలకత్తా వెళ్లారని తెలిసింది. మర్నాడు గురువుగారి వద్ద నుంచి యీయనకో పోస్టు కార్డు వచ్చింది. ‘నేను బుధవారం పొద్దున్న కలకత్తాలో బయలుదేరుతున్నాను. నువ్వూ, దిజేన్ పొద్దున్న తొమ్మిది గంటల బండికి శ్రీరాంపూర్ స్టేషన్‌కి వచ్చి కలుసుకోండి.’ అని. బుధవారం పొద్దున్న ఎనిమిదన్నరకు యీయనకు గురువుగారి నుంచి మానసిక సందేశం (టెలిపతీ అందాం) అందింది – ‘నాకిక్కడ ఆలస్యమైంది. తొమ్మిది గంటల బండికి రాకండి.’ అని. ఆ ముక్క దిజేన్‌కు చెపితే అతను నవ్వేశాడు. ఆయన కార్డులో రాసినదాన్నే నమ్ముతాను నేను అంటూ స్టేషన్‌కి వెళ్లిపోయాడు.

ఈయన గదిలోనే కూర్చుని వుంటే హఠాత్తుగా కిటికీలోంచి వస్తున్న సూర్యకాంతి తీక్ష్ణంగా ప్రకాశించింది. కిటికి ఇనుపచువ్వలు మాయమై పోయి, యుక్తేశ్వర్ గారి భౌతికరూపం స్పష్టంగా కనబడింది. లేచి నమస్కరించాడీయన. ఆయన స్పర్శ కూడా స్పష్టంగా తెలిసింది. ‘‘ఇది నా ఛాయారూపం కాదు. నిజరూపమే. లోకంలో చాలా అరుదైన యీ అనుభవం కలిగించమని ఈశ్వరాజ్ఞ. నేను పదిగంటల బండికి వస్తున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న దుస్తుల్లోనే కనబడతాను. ఒక వెండి మరచెంబు పట్టుకుని వచ్చే కుర్రవాడు నా ముందుగా నడుస్తాడు.’ అని చెప్పారు. అంతలోనే ఆయన శరీరం కాంతిలో కరిగిపోసాగింది. చుట్టచుడుతున్న కాగితంలా పాదాలూ, కాళ్లూ, అలా ఒకటొకటీ అదృశ్యమై పోయాయి.

దిజేన్ స్టేషన్ నుంచి తిరిగి వచ్చాడు. ‘గురువుగారు 9 గంటల బండికి, 9.30 బండికి కూడా రాలేదు. ఇవాళ రారేమో’ అన్నాడు. ఈయన తన అనుభవం చెప్పి, 10 గంటల బండికి వస్తారు చూడు అంటూ స్టేషన్‌కి తీసుకెళ్లారు. అక్కడ వెండి మరచెంబు కుర్రవాడితో సహా అన్నీ చెప్పినట్లే జరిగాయి. అప్పటిదాకా ‘నువ్వు కలగంటున్నావ్’ అని అంటూవచ్చిన దిజేన్ నోరు వెళ్లబెట్టాడు. గురువుగారు దిజేన్ వైపు చూసి ‘నీకూ వర్తమానం పంపాను. కానీ నువ్వు గ్రహించుకోలేక పోయావు’ అన్నారు. గురువుగారు వెళ్లిపోయిన తర్వాత దిజేన్ నా పొరపాటేమిటి అని అడిగితే యీయన ‘నీ మనస్సనే అద్దం ఊగుతూ వుంది. దాంతో గురువుగారు పంపిన సందేశ కిరణం దానిమీద పడలేదు. నిశ్చలబుద్ధి అలవర్చుకో.’ అన్నారు. దీనితో బాటు పునర్జన్మ గురించి యోగానంద మరో అనుభవాన్ని రాశారు.

ఆయన రాంచీ ఆశ్రమంలో వుండే రోజుల్లో ఆయన శిష్యుల్లో 12 ఏళ్ల కాశీ వుండేవాడు. ఓ రోజు ‘నేను ఎప్పటికీ వైరాగ్యమార్గంలో మీతోనే వుంటానా?’ అని అడిగాడు. ‘లేదు, నువ్వు యింట్లో వాళ్లకు చెప్పకుండా వచ్చేశావు కాబట్టి, వాళ్లు బలవంతంగా తీసుకెళ్లిపోతారు. నువ్వు వెళితే మాత్రం పెళ్లి సైతం చేస్తారు. దాని తర్వాత త్వరలో చనిపోతావ్.’ అని యీయన చెప్పారు. అతను నిర్ఘాంతపోయాడు. తర్వాత విడిగా వచ్చి ‘నేను తప్పనిసరి పరిస్థితుల్లో మీ నుంచి విడిపోయి, దరిమిలా చచ్చిపోతే, తిరిగి నేను పుట్టినపుడు నన్ను మీరు కనుక్కుని మళ్లీ ఆధ్యాత్మిక మార్గంలో పెట్టండి’ అని కోరాడు. ఇది చాలా కష్టమైనది అంటూ యీయన తప్పించుకోవడానికి చూశారు కానీ శిష్యుడు మరీ పట్టుబట్టడంతో సరేనన్నారు.

తర్వాత ఆయన వూరు వెళ్లాల్సి వచ్చింది. కాశీని ఎవరూ తీసుకెళ్లకుండా చూడండి అని తక్కిన శిష్యులకు గట్టిగా చెప్పి వెళ్లారు. కానీ కాశీ తలిదండ్రులు కలకత్తా నుంచి వచ్చి అతన్ని బలవంతంగా తీసుకెళ్లడానికి చూశారు. తల్లి జబ్బు పడిందని, వచ్చి నాలుగు రోజులుండి వెళితే చాలని 15 రోజుల పాటు బతిమాలారు. చివరకు తండ్రి పోలీసులను తీసుకుని వస్తానని బెదిరిస్తే, తన కారణంగా ఆశ్రమానికి చెడ్డపేరు వస్తుందని భయపడి, వెళ్లి మళ్లీ వచ్చేస్తాననుకుంటూ, కాశీ తండ్రి వెంట వెళ్లాడు. వెళ్లగానే బలవంతంగా పెళ్లి చేశారు. తర్వాత అతను కలుషిత ఆహారం తిని, కలరా వచ్చి చనిపోయాడు. అనుకోకుండా కలకత్తా వెళ్లిన యోగానందకు యీ విషయం తెలిసి, చాలా బాధపడ్డారు. రాంచీ విడిచి వెళ్లకుండా వుంటే బతికేవాడు కదా అనుకున్నారు. జరగవలసినది జరిగిపోయింది. యిక శిష్యుడికి యిచ్చిన మాట నిలబెట్టుకోవాలని యీయన శ్రమించారు.

తీరని కోరికలతో స్పందిస్తున్న అతని ఆత్మ సూక్ష్మ మండలాల్లో అనేక లక్షల ప్రకాశమానమైన ఆత్మల మధ్య ఎక్కడో ఒక కాంతిపుంజంగా తేలుతున్నాడని గ్రహించారాయన. స్పందనశీల కాంతుల రూపంలో వున్న అనేక యితర ఆత్మలతో కూడి వున్న అతనితో సంపర్కం పెట్టుకోవడం ఎలా? ఒక రహస్య యోగప్రక్రియను ఉపయోగించి, తన కనుబొమల మధ్య అంతర్బిందువైన ఆధ్యాత్మిక నేత్రమనే మైక్రోఫోన్ ద్వారా కాశీ ఆత్మకు ఆయన తన ప్రేమను ప్రసారం చేశారు. అతనీపాటికి ఏ తల్లి గర్భంలోనో పిండంగా శరీరధారణ చేసి వుంటాడన్న నమ్మకంతో ఆ గర్భస్థశిశువు వున్న స్థలం ఏ దిశగా ఉందో గుర్తించడానికి చేతులు పైకెత్తి చేతివేళ్లను గ్రాహకాలు (యాంటినాలు)గా ఉపయోగిస్తూ తరచుగా గుండ్రంగా తిరుగుతూ వుండేవారు. ఏకాగ్రతా సంధానితమైన తన హృదయపు రేడియోలో అతని నుంచి వచ్చే ప్రతిస్పందన అందుకోవాలని ఆయన ప్రయత్నం.

కాశీ చనిపోయిన తర్వాత ఆర్నెల్లపాటు ఆయన యీ యోగప్రక్రియను ఉత్సాహంతో నిలకడగా సాధన చేశారు. ఓ రోజు పొద్దున్న కలకత్తాలో జనసమ్మర్దంగా వున్న బౌ బజార్‌లో కొంతమంది స్నేహితులతో కలిసి నడుస్తూ మామూలు పద్ధతిలో చేతులు పైకెత్తారు. మొట్టమొదటిసారిగా ప్రతిస్పందన వచ్చింది. వేళ్లలోంచి, అరిచేతుల్లోంచి, విద్యుదావేగాలు లోపలకి ప్రసరిస్తూ వుండడం కనిపెట్టి పులకించి పోయారు. ఆ విద్యుత్ ప్రవాహాలు ‘నేను కాశీని, నా దగ్గరకి రండి’ అనే ఒక ప్రబలమైన ఆలోచనగా రూపాంతరం చెందాయి. ఈయన ఏకాగ్రంగా దాన్ని విన్నప్పుడు కాశీకి సహజమైన బొంగురు గొంతుతో గుసగుసలాడినట్లు అనిపించింది. ‘ప్రతి ఆత్మ పరిశుద్ధ స్థితిలోనే వుంటుంది. కాశీ ఆత్మ, కాశీ అనే జన్మయొక్క సహజలక్షణాలన్నీ గుర్తుంచుకుంది కనుకు నేనతన్ని గుర్తు పట్టేలా చేయాలని అతని బొంగురు గొంతును అనుకరించింది’ అని ఆయన ఫుట్‌నోట్ రాశారు.

కాశీ దరిదాపుల్లో వున్నాడని తెలియగానే ఈయన గిరగిరా తిరగసాగారు. దగ్గర్లో వున్న ఒక సందువేపు తిరిగినప్పుడు వేళ్లలో విద్యుత్తరంగాలు ఝల్లుమనిపిస్తున్నాయని గ్రహించి ఆ సందులోకి నడిచారు. ఒక యింటి దగ్గరకు వచ్చేసరికి ఈయన చేతుల్లో స్పందనలు బలమై, వెనకటికన్న స్పష్టమయ్యాయి. ఏదో ఒక అయస్కాంత శక్తి రోడ్డుకు కుడిపక్కకు లాగింది. ఒక యింటి గుమ్మం దగ్గరకు వెళ్లేసరికి కాళ్లు స్తంభించి పోయాయి. వెళ్లి తలుపు తడితే ఆ యింట్లో గర్భవతి వుంది. ‘మీకు పసిమి చాయగల అబ్బాయి పుడతాడు. ముఖం వెడల్పుగా వుంటుంది. నుదుటికి పైన ఒక సుడి వుంటుంది. అతని ప్రవృత్తి ఆధ్యాత్మికవైపు మొగ్గి వుంటుంది’ అని యీయన చెప్పి వచ్చేశారు. ఈ జన్మలో కూడా కాశీకి పాతపోలికలు వుంటాయని ఆయనకు తోచింది.

తర్వాత కొన్నాళ్లకు పసివాణ్ణి చూడ్డానికి వెళితే అతను అలాగే వున్నాడు. తలితండ్రులు కాశీ అనే పేరే పెట్టారు. ఈయన్ని చూస్తూనే ఆ పసివాడి మొహంలో ఆప్యాయత కనబడింది. చాలా ఏళ్ల తర్వాత యువకుడిగా వున్న అతను అమెరికాలో వున్న యోగానందకు ఉత్తరం రాశాడు. సన్యాసిని కావాలని వుందని అడిగితే హిమాలయాల్లో వున్న ఒక గురువు దగ్గరకు పంపించారీయన. ఇక చివరి కథ - యోగానందకు ఆయన గురువు యుక్తేశ్వర్ చెప్పిన అఫ్జల్ ఖాన్ అనే ఫకీరు గురించినది. శ్రీరాంపూర్‌ కాలేజీలో చదివేరోజుల్లో యోగానంద వుండే వసతిగృహానికి వచ్చి ఆయన యీ గదిలోనే ఒక వింత జరిగింది అంటూ చెప్పారు. ఆ గారడీ చేసినది ఆ ఫకీరే.

అతను చిన్నపిల్లవాడిగా వుండగా ఒక హిందూ యోగికి సపర్యలు చేస్తే ఆయన ముగ్ధుడై పోయి, ‘నీకు ఒక యోగప్రక్రియ నేర్పుతాను. దానిద్వారా నీకు అగోచర మండలాల్లో ఒక జీవిపై అధికారం చిక్కుతుంది. ఆ మహత్తర శక్తిని సదుద్దేశానికే ఉపయోగించు. నువ్వు పూర్వజన్మల నుంచి విధ్వంసక ధోరణులనే విత్తనాలను తెచ్చుకున్నావు. మనసులో ఆ విత్తనాలు మొలకెత్తకుండా చూడు. మంచి పనులు చేయి.’ అంటూ ఆ విద్య నేర్పాడు. దాంతో యితను ఒక సూక్ష్మమండలంలోకి ప్రవేశించి, ఒక సూక్ష్మమండల జీవిని వశపరుచుకున్నాడు. అల్లావుద్దీన్ కథలో అద్భుతదీపం రుద్దగానే ఓ భూతం వచ్చి ఏ పని కావాలంటే ఆ పని చేసిపెట్టినట్లు, యితని వెంట ఒక అశరీరాత్మ తోడుగా వుండేది. ఏ పని చెప్పినా ఆ పని వెంటనే చేసేది. దాన్ని యితను హజరత్ అని పేరు పెట్టి పిలిచేవాడు. 20 ఏళ్ల పాటు ఆ ఫకీర్ చిత్తశుద్ధితో సాధన చేసి, తన విద్యను యితరుల ముందు ప్రదర్శించేవాడు.

ఆ తర్వాత అతనిలో దుర్బుద్ధి ప్రవేశించింది. తన శక్తిని దుర్వినియోగం చేసి, వస్తువులు దొంగిలించేవాడు. అతను ఏ వస్తువునైనా ఒకసారి ముట్టుకుని మళ్లీ అక్కడ పెట్టేస్తే చాలు, అతను అక్కణ్నుంచి వెళ్లిపోయిన కాస్సేపటికి ఆ వస్తువు మాయమై పోయేది. హజరత్‌ని పంపి అదృశ్యంగా తెప్పించేసే వాడన్నమాట. కలకత్తాలోని నగల దుకాణంలోకి అతను వెళ్లి కొన్నిటిని ముట్టుకుంటే చాలు, తర్వాత మాయమై పోయేవి. ఇక అతని చుట్టూ అనేకమంది చేరి, విద్య నేర్పమని అడిగేవారు. ఓ సారి రైలెక్కుతూ, టిక్కెట్లు కొనకుండా కౌంటర్‌లో టిక్కెట్ల బొత్తిని ముట్టుకుని వదిలిపెట్టేశాడు. వీళ్లు రైలెక్కేసరికి ఆ టిక్కెట్లన్నీ కౌంటర్‌లో మాయమై వీళ్ల జేబుల్లో ప్రత్యక్షమయ్యాయి. కలకత్తాలో దీనివలన ఆందోళన చెలరేగి, పోలీసులు యితన్ని పట్టుకోబోయారు. ఆధారం దొరికితే కదా! ఏదైనా తప్పిదారి దొరికినా యితను హజరత్ సహాయంతో దాన్ని మాయం చేసేసేవాడు.

ఇప్పుడు యోగానంద వుంటున్న భవనం ఒకప్పుడు యుక్తేశ్వర్ గారి మిత్రుడిదే. అఫ్జల్‌తో పరిచయమయ్యాక యీ గదికి తీసుకుని వచ్చి తన మిత్రుల్లో 20 మందిని పిలిచాడు. వారిలో 20 ఏళ్ల యుక్తేశ్వర్ కూడా వున్నారు. ఈయన్ని చూసి ‘నువ్వు తోటలో ఓ నున్నటి రాయి తీసుకుని, దానిమీద సుద్దతో సంతకం పెట్టి బలంగా ఎదురుగా వున్న గంగానదిలోకి విసిరేసి, తర్వాత యింటి ముంగిట ఓ కుండనిండా గంగాజలం పోయి’ అన్నాడు. ఈయన అలా చేసిన తర్వాత ‘హజరత్, ఆ రాయిని యీ కుండలోకి పట్టుకురా’ అన్నాడు. కుండలో వెతికి అదే రాయి కనబడింది. అందరూ ఆశ్చర్యపోయారు. వచ్చినవాళ్లలో బాబు అనే అతను ఓ బంగారు చేతి గడియారం పెట్టుకుంటే ఫకీర్ దాన్ని ముట్టుకున్నాడు. కాస్సేపటికి అది మాయం. దాంతో అతను అది మా పూర్వీకులది, ఇచ్చేయ్ అంటూ గోల పెట్టాడు.

కాస్సేపటికి ఫకీర్ ‘నీ యినప్పెట్టెలో ఐదు వందల రూపాయలున్నాయి, అవి యిస్తే గడియారం ఎక్కడ దొరుకుతుందో చెప్తాను.’ అన్నాడు. ఐదు వందలూ చేతిలో పడ్డాక ‘మీ యింటి దగ్గరున్న చిన్న వంతెన దగ్గరకి వెళ్లి హజరత్‌ను పిలిచి గడియారం తెచ్చి యిమ్మని అడుగు’ అన్నాడు. అతనలా చేయగానే గడియారం గాలిలో దొర్లుకుంటూ వచ్చి అతని కుడిచేతిలో పడింది. అతను వెనక్కి వచ్చి చెప్పగానే గదిలో వున్నవాళ్లందరూ పాలు కావాలని, పళ్లరసాలు కావాలనీ, విస్కీ కావాలనీ అడిగితే ఫకీర్ అన్నీ తెప్పించాడు. అప్పుడు మీ అందరికీ బంగారపు పళ్లాల్లో ఖరీదైన వంటకాలతో లంచ్ ఏర్పాటు చేస్తాను అంటూ అవన్నీ నిజంగా తెప్పించాడు. వీళ్లు గంటసేపు భోజనం చేసి, బయటకు వస్తూంటే బంగారపు పళ్లాలు దొంతర పెడుతున్నట్లు శబ్దాలు వినబడ్డాయి. వెనక్కి తిరిగి చూస్తే పళ్లాలూ లేవు, ఎంగిళ్లూ లేవు.

కథ వింటున్న యోగానంద అదేం? అని అడిగితే యుక్తేశ్వర్ ‘ఆ సూక్ష్మమండల జీవి సహాయంతో అతను, బలిష్ఠమైన తన సంకల్పశక్తితో చేసే ఒకానొక చర్యవల్ల ఆకాశశక్తి (ఈథరిక్ ఎనర్జీ) నుంచి ఏ వస్తువుకు సంబంధించిన అణువుల నైనా సరే ఆకర్షించగలిగేవాడు. అయితే ఆ విధంగా సూక్ష్మశక్తితో రూపొందించిన వస్తువులు నిర్మాణపరంగా క్షణభంగురమైనవి. వాటిని ఆట్టే కాలం నిలిపి వుంచలేం. అతను దైవసాక్షాత్కారం పొందిన వ్యక్తి కాదు. కానీ మర్త్యులైన మానవులు చనిపోయిన తర్వాత కానీ ప్రవేశించలేని సూక్ష్మమండలోంకి చొచ్చుకుపోయే అసాధారణ శక్తి కలవాడు. దాన్ని యిలా వృథా చేశాడు.’ అని జవాబిచ్చారు.

ఇలా అతను అహంకారంతో, నీతినియమాలు లేకుండా వర్తిస్తూన్న రోజుల్లో ఓ రోజు కలకత్తాలో రోడ్డు మీద ఒక కుంటి ముసలివాడు కనబడ్డాడు. అతని చేతిలో బంగారపు వస్తువేదే మెరుస్తోంది. ఇతను వెళ్లి అదేమిటి అని అడిగితే ‘నీలాటి ఫకీరుకి ఉపయోగపడని బంగారమిది. నీ శక్తులతో నా కుంటితనాన్ని పోగొట్టు’ అని అడిగాడు ముసలివాడు. ఇతను ఆ వస్తువుని ముట్టుకుని, తనకేమీ పట్టనట్లు వెళ్లిపోయాడు. కాస్సేపటికి ముసలివాడు ‘నా బంగారం పోయింది బాబోయ్’ అని అరుస్తూ వెంటపడ్డాడు. తన జేబులో ఆ వస్తువును తడుముకుంటున్న యితనేమీ పట్టించుకోలేదు. ఆ ముసలివాడు అంతలో ‘నన్ను గుర్తుపట్టలేదా?’ అని గర్జించాడు. ఇతను ఆశ్చర్యంతో చూస్తూండగా నిటారుగా నిలబడ్డాడు. పడుచుతనంతో మిసమిసలాడుతూ వున్నాడు.

తనకు విద్య నేర్పిన గురువే యితడు అని ఫకీర్ గుర్తించగానే ‘నీ శక్తుల్ని ఆర్తులకు సాయపడడానికి కాకుండా, దోచుకోవడానికి ఉపయోగిస్తున్నావని నా కళ్లారా చూశాను. నీ శక్తుల్ని యీ క్షణమే ఉపసంహరిస్తున్నాను. హజరత్ విడుదలై పోయాడు, ఇకపై నీ మాట వినడు.’ అన్నాడు. ఇతనికి పశ్చాత్తాపం కలిగింది. గురుదేవుడి కాళ్లపై పడి ఏడ్చి, కొండల్లోకి పోయి ఏకాంతంగా దైవధ్యానం చేసుకుంటానని మాట యిచ్చాడు. గురువు కరుణించి ‘కొండల్లో నువ్వు తపస్సు చేసుకునేటప్పుడు నీకు తిండీగుడ్డా హజరత్ తెచ్చి యిచ్చేట్లు వరం యిస్తున్నాను. అతని యింకే పనులూ చేయడు.’ అన్నాడు. ఫకీర్ కొండల్లోకి వెళ్లబోతూ ఒక ఒప్పుకోలు పత్రాన్ని పత్రికలకు విడుదల చేశాడు. అలౌకికమైన అద్భుత శక్తులు సంపాదించాలని చూసేవారికి నా జీవితం ఒక హెచ్చరికగా వుండాలి అని నా ఉద్దేశం అని స్పష్టంగా రాశాడందులో. ఈ కథలో నీతి ఏమిటంటే – అవసరానికి మించి ధనమున్నా, శక్తులున్నా బుద్ధి పెడత్రోవ పడుతుంది అని.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2021)
mbsprasad@gmail.com

 


×