cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

'ఇదే ఇదే మన రాజధాని...న్యూ అమరావతి'

'ఇదే ఇదే మన రాజధాని...న్యూ అమరావతి'

రాజధాని నగరం అనేది అమరావతి నుంచి తరలిపోతున్నదని కొందరు పనిగట్టుకుని ఆక్రోశించారు. దొనకొండలో రాజధాని పెట్టాలని జగన్ అనుకుంటున్నాడని.. వైకాపా వాళ్లంతా అక్కడ భూములు కొనుక్కున్నారని.. అందుకే ఇక్కడి రాజధాని గురించి అధికవ్యయం సాకులు చెప్పి.. మెల్లగా అక్కడకు మారుస్తారని అనేకమంది జోస్యం చెప్పారు.

చంద్రబాబు దోపిడీ కుట్రల్లో ఒకటైన స్టార్టప్ ప్రాజెక్టు ఒప్పందం రద్దయిపోగానే... జగన్ జాతికి ద్రోహం చేసినట్లుగా కొందరు కన్నీళ్లు కార్చారు. మీకందరికీ ఒక హెచ్చరిక లాంటి వాస్తవం... రాజధాని ఎక్కడికీ వెళ్లడం లేదు. అక్కడే ఉండబోతోంది. కాకపోతే దానిపేరు ‘న్యూ అమరావతి’!

రకరకాల పేర్లు చెప్పి రైతుల నుంచి వేలకు వేల ఎకరాలు లాక్కున్న చంద్రబాబు మాయలు మాత్రం ఇక ఉండవు. కోర్ కేపిటల్ కేటాయించిన చోటే ఉంటుంది. కాకపోతే ప్రధానంగా పరిగణించదగిన రాజధాని ప్రాంత నిర్మాణాలన్నీ... నాగార్జున యూనివర్సిటీ పరిధి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో గరిష్టంగా కేంద్రీకృతం అవుతుంది.
దీనికి సంబంధించి.. ఇంకా అనేకానేక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.

ఆయా వ్యవహారాలపై గ్రేట్‌ఆంధ్ర ఎక్స్‌క్లూజివ్ కథనం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది అమరావతినుంచి వేరే ఏ ప్రాంతానికీ తరలిపోవడం లేదు అనే వాదనకు సంబంధించిన సంకేతాలు.. అధికార పార్టీ వారినుంచి చాలా కాలం కిందటే వచ్చాయి. ఎప్పుడైతే రాజధాని విషయంలో.. తరలించేస్తున్నారు..  ఇక్కడ అమరావతిని మంటగలిపేశారు.. అనే తరహా విమర్శలు మిన్నంటాయో.. అదే సమయంలో.. తరలిపోదనే సంకేతాలు కూడా వచ్చాయి. అలాంటి సంకేతాలు ఇచ్చినది మరెవ్వరో కాదు.. అదే రాజధానికి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు.

‘‘రాజధాని అమరావతినుంచి తరలిపోతుందని మేము చెప్పామా? మీరు ఎందుకు అనుకుంటున్నారు? రాజధానిని తరలించే ఉద్దేశం ఉంటే మా నాయకుడు ఇక్కడే ఎందుకు సొంత ఇల్లు కట్టుకుంటారు?’’ అని ఆయన అన్నారు. ఆ వాదన చాలా సహేతుకమైనది! కానీ.. నెగటివ్ అంశానికి దక్కే ప్రచారం.. మంచి అంశానికి దక్కదు. అందుకే ప్రజలంతా కూడా ‘రాజధాని తరలిపోతుంది’ అనే కుట్రపూరిత పుకార్లనే నమ్మి ఆందోళన చెందారు. అలాంటి వారి ఆందోళనలన్నీ అర్థం లేనివని ఇప్పుడు తేలిపోతున్నది.

రాజధాని అదే ప్రాంతంలో ఉంటుంది. కాకపోతే... ప్రధానంగా ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రాంతం ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉన్న వైపునకు మళ్లుతుంది అనేది గ్రేటాంధ్రకు విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం. ఆ మేరకు జగన్ సర్కారు రాజధానిగా అభివృద్ధి చేసే ప్రాంతాన్ని ‘న్యూ అమరావతి’ గా వ్యవహరించబోతున్నారు.

అసెంబ్లీ ఎక్కడంటే..
నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం.. దాని వెనుకవైపున ఉన్న ప్రభుత్వ ఖాళీస్థలాల్లోనే నూతన శాసనసభ ఏర్పాటు కానున్నదని సమాచారం. ప్రధానంగా రాజధాని అంటే ప్రభుత్వ పరంగా కొన్ని భవనాల, కార్యాలయాల తత్సంబంధిత నివాసాల నిర్మాణాలు మాత్రమే. దానికి అనుబంధంగా విస్తరించే ఇతర నిర్మాణాలు, ప్రెవేటు వ్యాపారాలు గట్రా అన్నీ కలిసి.. ఒక సమగ్ర నగరం తయారవుతుంది. అయితే ప్రభుత్వ పరంగా అవసరమయ్యే భవనాలు, నిర్మాణాలకు గరిష్టంగా ప్రభుత్వ భూములే అందుబాటులో ఉండే ప్రాంతాన్ని ఎంచుకోబోతున్నారు.

ఆ ప్రయత్నంలో భాగంగానే నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో విస్తారంగా ఉన్న భూములను శాసనసభ సహా కీలక ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకుంటారు.

రాయలసీమకు ఇది వరమే...
పురాతన కాలం నుంచి రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని జగన్ సరిదిద్దబోతున్నారు. మదరాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర వేరుపడినప్పుడే.. అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధిని కాంక్షిస్తూ కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అప్పట్లోనే రాయలసీమ- ఆంధ్ర ప్రాంతాల్లో ఒకచోట రాజధాని ఉంటే, మరొకచోట హైకోర్టు ఉండాలని నిర్ణయించారు. ఆ ఒప్పందాల ప్రకారమే కర్నూలులో రాజధాని ఏర్పడగా, గుంటూరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటైంది. కానీ తెలంగాణ కలిసి ఆంద్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత.. ఆ ఏర్పాట్లన్నీ మంటగలిసిపోయాయి. అన్నిటికీ హైదరాబాదే కేంద్రమైంది.

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినప్పుడు.. ఆ లోపాలను చక్కదిద్దుకునేందుకు ఓపినంత అవకాశం కనిపించింది. తిరిగి ప్రాంతాల మధ్య అసమానతలు, అసమ ప్రాధాన్యాల అసంతృప్తులు రేగకుండా.. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రాధాన్యాన్ని కట్టబెడితే.. అందరూ సంతసిస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఈ విషయంలో తాము తొలినుంచి వివక్షకు గురవుతున్నామంటూ.. రాయలసీమ వాసులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. వారి గోడు పట్టించుకున్న దిక్కులేదు. తొలిసారి కొత్త రాష్ట్రాన్ని పాలించే అవకాశం వచ్చిన చంద్రబాబునాయుడు ఒంటెత్తు పోకడలతో వ్యవహరించారు.

హైదరాబాదు విషయంలో తప్పు చేసినట్టుగానే.. అన్ని రకాలుగానూ అమరావతి ప్రాంతంలోనే అభివృద్ధిని కేంద్రీకరించే దుర్మార్గానికి తెరతీశారు. కానీ.. అదృష్టవశాత్తూ ఆయన రాజధాని నిర్మాణంలో చెప్పుకోదగ్గ ముందడుగు వేయనేలేదు.

కానీ, జగన్ సర్కారు ఈ నష్టాలను చక్కదిద్దుతోంది. హైకోర్టును రాయలసీమకే కేటాయించనున్నారు. కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటవుతుంది. హైకోర్టు బెంచ్ ను తిరిగి గుంటూరులో ఏర్పాటుచేస్తారని తెలుస్తోంది. ఆ రకంగా రాయలసీమ వాసులు వివక్షకు గురయ్యే ప్రమాదం లేదు.

ఆ జాగా మాత్రం భద్రమే..
‘న్యూ అమరావతి’ ఐడియాతో.. నవీన ఆలోచనలకు రూపుదిద్దుతున్న జగన్ ప్రభుత్వం... కొంత పట్టువిడుపు ధోరణులను కనబరుస్తోంది. కోర్ కేపిటల్ కోసం అంటూ కేటాయించి.. కొన్ని పనులను ఇప్పటికే ప్రారంభించిన 1600 ఎకరాల ప్రాంతాన్ని మాత్రం.. డిస్టర్బ్ చేయకూడదని నిర్ణయించినట్లు సమాచారం.

రైతులనుంచి బలవంతంగా సేకరించిన ప్రాంతంలో ఆ 1600 ఎకరాలను మాత్రం మినహాయించి.. మిగిలిన భూములను ఎవరివి వారికే తిరిగి వెనక్కి ఇచ్చేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కోర్ కేపిటల్‌ను అభివృద్ధి చేసి.. మౌలిక వసతులకు మాత్రం రూపుదిద్ది.. భూములు రైతుల్లో ఎవరివి వారి ఆధీనంలోనే ఉంటే.. రైతులకు కూడా మరింతగా లబ్ధి జరుగుతుంది. దీనివల్ల ఎవ్వరిలోనూ ఎలాంటి అసంతృప్తి ఉండదు.

స్టార్టప్ అటకెక్కడమూ ఇందుకే...
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ పేరుతో ఒక డ్రామాకు తెరతీసింది. 33 వేలకు పైగా ఎకరాల నేలను సేకరించిన తర్వాత.. అనుకున్న ప్రకారం అయితే.. ప్రతిచోటా అభివృద్ధి ఇబ్బడిముబ్బడిగా జరగాలి. కానీ స్టార్టప్ ఏరియా అంటూ ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని సింగపూర్ కన్సార్టియంకు ధారదత్తం చేసేసినట్లుగా వంకర నిబంధనలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదంతా తెరవెనుక దోపిడీ బాగోతాలకు దారితీసేదే అని అప్పట్లో చాలా పుకార్లు వినిపించాయి. అలాంటి ఆటలు సాగకుండా... జగన్ సర్కారు దృఢంగా వ్యవహరించింది.
వారు అనుకున్నట్లుగా అనుకున్న నిర్మాణాలకు, అనుకున్న ప్రాంతంలో చోటు దొరక్కపోతే.. ఇక స్టార్టప్ మాయాజాలానికి విలువ ఉండదనే సంగతిని సింగపూర్ కన్సార్టియం గుర్తించింది. అందుకే ఒప్పందం రద్దు చేసుకోవాల్సి వచ్చినప్పుడు.. మన ప్రభుత్వం నుంచి భారీగా పెనాల్టీలు వసూలు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ వారు మిన్నకుండిపోయారు. జగన్ సర్కారు కనబరిచిన లౌక్యం వల్లనే.. సింగపూర్ కన్సార్టియం పెట్టిన ఖర్చులు వస్తే చాలనే ప్రాతిపదిక మీద ఒప్పందం నుంచి పక్కకు తప్పుకోవడం జరిగింది.

నిర్మాణాలు త్వరలోనే...
దీనికి సంబంధించిన ప్రణాళికలను ప్రస్తుతం తయారు చేస్తున్నారు. అయితే చంద్రబాబునాయుడు లాగా.. ప్రజలకు డిజైన్లు చూపించి మభ్యపెడుతూ రోజులు నెట్టేయకుండా.. ఒకసారి ఆలోచనలు నిశ్చితరూపానికి రాగానే.... నిర్మాణాలను ప్రారంభించేయాలని జగన్ సర్కారు భావిస్తోందని సమాచారం. కోర్ కేపిటల్ కు సంబంధించిన అన్ని రకాల నిర్మాణాలను అయిదేళ్లలోగా ఒక స్థాయి వరకు తీసుకువచ్చేస్తారు. కొన్ని కార్యాలయాలు ఈ ప్రభుత్వహయాంలోనే ప్రారంభం అయినా కూడా ఆశ్చర్యం లేదు. అలాంటి ప్లాన్ తో సర్కారు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

రాజధాని పేరుతో మాయమాటలు చెప్పడం, గ్రాఫిక్స్ డిజైన్లు చూపడం చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పు. అందుకే ప్రజలు ఆయన  ప్రభుత్వాన్ని తిప్పికొట్టారు.  తమ పాలన అయిదేళ్లలో అలాంటి పొరబాటు రిపీట్ కాగూడదని జగన్ అనుకుంటున్నారు. చంద్రబాబు కు తగిలిన దెబ్బలనుంచి పాఠాలు నేర్చుకునే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి.. ఐడియాలు ఫైనలైజ్ కాగానే.. నిర్మాణాలూ మొదలవుతాయని.. వీలైనంత త్వరలో పూర్తి కూడా అవుతాయని అభిజ్ఞవర్గాలు పేర్కొంటున్నాయి.

అదే బలం..
ఎక్కువగా మాట్లాడడం.. చేయబోతున్న పని గురించి.. ఆలోచించడంకంటె ముందునుంచీ.. గప్పాలు కొట్టుకోవడం జగన్ నైజం కాదు. అలాంటి అతితెలివితేటలే పాతప్రభుత్వపు పుట్టిముంచాయి. లోపం లేకుండా ఆలోచన చేయడం, ఒకసారి ఆ ఆలోచన రాష్ట్రానికి మంచి చేస్తుందని నమ్మిన తర్వాత.. ఇక ముందు వెనుకలు చూసుకోకుండా... దానికి విపరీతపు ప్రచారం కావాలనే ఆర్భాటాలు లేకుండా.. నమ్మిన ప్రమాణాలతో పనిచేసుకుంటూ పోవడం మాత్రమే జగన్ వైఖరి. రాజధాని నిర్మాణాల విషయంలోనూ అదే జరగబోతోంది.

రాజధాని అనేది అమరావతినుంచి మరెక్కడికో పారిపోవడం లేదు. అక్కడే ఉంటుంది. బాబు కలగన్నట్టుగా.. కలల్లో మాత్రం మిగిలే రాజధానిలా కాకుండా.. ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యే రాజధానిలా ఉంటుంది. దానిని తన ఈ పదవీకాలంలోనే జగన్ ప్రజలకు చూపిస్తారు. ఆ రాజధానిని అందరూ ‘న్యూ అమరావతి’ అని పిలుస్తారు..!!

 


×