cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అమ్మాయిలు ఇలా మారారు..జాగ్రత్త అబ్బాయిలూ!

అమ్మాయిలు ఇలా మారారు..జాగ్రత్త అబ్బాయిలూ!

ఒకప్పటికి, ఇప్పటికీ చాలా తేడా ఉంది. నిన్నటి తరం వరకూ మహిళల్లో ఓర్పుండేది. కుటుంబంలో ఎన్ని చికాకులున్నా ఒక ఏడుపు ఏడ్చి సర్దుకుపోయే పరిస్థితుండేది. 

అత్తమామలతో మనస్పర్థలు కావచ్చు, భర్త వ్యవహారశైలి విషయం నచ్చక కావచ్చు..దేన్నైనా స్నేహితురాళ్లతో చెప్పుకుని బరువు దించేసుకుని ఊరుకునే వాళ్లు. 

ఎందుకంటే అప్పట్లో దాదాపు అందరు మహిళల పరిస్థితి అలాగే ఉండేది. ఎక్కడో ఒకరిద్దరు విడాకులు తీసుకుంటే ఈ మహిళలే "అవ్వ..ఎంత పని చేసిందో..ఎంత అప్రతిష్ట.." అని చిరాకు పడేవారు తప్ప "పోనీలే..విముక్తి పొంది హాయిగా ఉంది" అని అనుకునే వారు కాదు.

ఇప్పుడదంతా మారింది. సమస్యలున్నా విడాకులు తీసుకోకుండా మగ్గుతున్న ఆడవాళ్లని చూసి సాటి ఆడవాళ్లే తక్కువగా చూస్తున్నారు. ఆడదాని ఓర్పుని ఇప్పుడు సమాజంలో కొత్తతరం మహిళలు ఆదర్శంగా చూడట్లేదు. 

"నచ్చకపోతే గుడ్ బై చెప్పేయాలి గానీ ఏవిటి సెంటిమెంటల్ నాన్సెన్స్" అనేవాళ్లు పెరుగుతూనే ఉన్నారు. 

దీనికి ముఖ్యకారణం ఆడవాళ్లు స్వయం సమృద్ధి చెంది బాగా సంపాదించుకోగలగడం. ఆ పైన చట్టాలు కూడా ఆడవాళ్ల పక్షాన బలంగా ఉండడం. 

ఇప్పటికీ నిన్నటి తరం మహిళల్లా ఏ స్థాయి సమస్యలున్నా సర్దుకుపోతున్న వాళ్లెవరైనా ఉంటున్నారంటే వాళ్లు కేవలం స్వయం ఉపాధి లేకనో, తమ తల్లిదండ్రులు బాధపడతారనో, పిల్లలకోసమో నెట్టుకొస్తున్నవాళ్ళే. 

అన్నిటికంటే ముఖ్యంగా ఆర్ధికంగా బలంగా ఉన్న కుటుంబాలనుంచి వచ్చిన మహిళలు మాత్రం ఏ రకమైన స్వేచ్ఛా హరణానికి, అవమానానికి సహించడంలేదు. 

సమంత విడాకుల విషయంలో తొలుత విడిపోవాలని కోరుకున్నది సమంతేనని నాగార్జున చెప్పినట్టు ప్రచారం జరిగింది. కానీ కొన్ని గంటల్లోనే నాగార్జున అది అసత్యమని ఖండించారు. 

ధనుష్-ఐశ్వర్య విడాకుల విషయంలో విడిపోవాలని కోరున్నది ఐశ్వర్యేనని తమిళనాడులో బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని రజినీ కాంత్ గాని, ధనుష్ కానీ ఖండించలేదు. 

మరొక పెద్ద తెలుగు హీరో రెండవ కుమార్తె విడాకుల విషయం కూడా ప్రస్తుతానికి పుకారుగా చలామణీలో ఉంది. అక్కడ కూడా నిర్ణయం ఆమెదేనని చెబుతున్నారు. 

కారణమెదైనా కావొచ్చు, పూర్వం మాదిరిగా మహిళలు అస్సలు స్పేర్ చేయట్లేదు. తమకు నచ్చినట్టు భర్తలు నడుచుకోకపోతే ఏదో ఒక రోజు అవతలికి పొమ్మనే స్థాయిలో ఉన్నారు. 

ఐశ్వర్య-ధనుష్ ల వివాహం ఎప్పుడో 18 ఏళ్ల క్రితం జరిగింది. పిల్లలు కూడా పెద్దవాళ్లౌతున్నారు. వీళ్లది సమంత-నాగచైతన్య జంటలాగ కాదు. అయినా సరే భరించే ఓపిక లేక సెపెరేటైపోయారు. 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఈ ముగ్గురు స్త్రీలు ఆర్ధికంగా బలవంతులే. తమకంటూ ఒక నేపథ్యం, స్థాయి ఉన్నవారే. 

అలాగే ఒక సుప్రసిద్ధ దర్శకుడి భార్య భర్త వ్యవహారాలు నచ్చకపోయినా సర్దుకుపోయి జీవిస్తోంది. ఆమె నిన్నటితరం మహిళ. ఆర్ధికంగా పూర్తిగా భర్తమీదే ఆధారం. అందుకే ఆమె విడాకుల నిర్ణయం తీసుకోలేదు. 

మరొక సుప్రసిద్ధ సినీప్రముఖురాలు పేరు, డబ్బు గడించే వరకు భర్తతోనే ఉంది. ఆ రెండూ వచ్చాక ఇద్దరి మధ్యలో మనస్ఫర్థలు వచ్చాయి. ఆమె స్వేచ్ఛని ఇతను భరించలేకపోయాడు. ఇతని లేని తనాన్ని, తన మీదే ఆధారుపడుతున్న వైనాన్ని ఆమె సహించలేకపోయింది. అంతే మొదట ఆమెనే గుడ్ బై చెప్పింది. తర్వాత వదలద్దొని అతను ప్రాధేయపడ్డాడు. ఆమె ఎలా ఉన్నా తాను నడుచుకుంటానన్నాడు. అయినా సరే ఒకసారి మనసు విరిగాక మళ్లీ వెనకడుగు వేయలేదామె. చేసేది లేక కొన్నేళ్లకు ఆమెకు విముక్తి ప్రసాదించవలసివచ్చింది అతనికి. 

స్వయంప్రతిభ ఉన్నా, ఆర్ధిక బలం ఉన్నా స్త్రీలు అణిగిమణిగి బ్రతకడానికి అస్సలు తావు ఇవ్వట్లేదు. భర్తలు మేల్ ఇగోని పక్కనబెట్టి వీళ్లతో సర్దుకుపోగలగాలి. అది కష్టమైతే ఏదో ఒకనాడు విడాకులు తప్పకపోవచ్చు. ఇప్పుడలా ఉంది పరిస్థితి. 

సెలెబ్రిటీలని పక్కన బెడితే.. ఎన్నో ఆశలతో పెళ్లిళ్లు చేసుకునే అమ్మాయిలుంటారు. 

ఉదాహరణకి ఒకమ్మాయి ఏదో పీజీ చదివి ఉద్యోగం చేసే ఆలోచన మాత్రం లేకుండా నెలకి రెండు లక్షలు సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుందనుకుందాం. 

ఆమె ఆలోచనలన్నీ ఎప్పుడెప్పుడు భర్తకి ఆన్సైట్ వస్తే అమెరికా చెక్కేద్దామా అని ఉంటుంది. ఆ భర్తకి ఆన్సైట్ ఆఫర్లు రాకపోవచ్చు. వచ్చినా అతనికి ఇష్టం ఉండకపోవచ్చు. తన తల్లిదండ్రుల్ని చూసుకోవాలనో మరొకటో చెప్పి అతను ఇక్కడే ఉండొచ్చు. అతనికి సెటిల్ కాని తమ్ముడు, పెన్షన్ రాని తల్లిదండ్రులు ఉంటే నెలకి వచ్చే మొత్తంలో చాలావరకు అటు పోతుంది. ఈ అమ్మాయి కలలు గన్నట్టుగా కార్లు, గేటెడ్ కమ్య్యొనిటీ ఇల్లు, అమెరికా పయనం పెళ్లయ్యి పదేళ్లయినా నెరవేరకపోవచ్చు. 

తన తోటి స్నేహితురాళ్లు మాత్రం అమెరికాలో కొందరు, లోకల్ గానే గేటెడ్ కమ్యూనిటీల్లో కొందరు సెటిలౌతుంటారు. అక్కడే కంపారిజన్ సిండ్రాం మొదలయ్యి భర్త మీద అసంతృప్తి పెంచుకుంటుంది. అతనినొక చేతకానివాడిగా చూస్తుంది. చిన్నదానికే అపరకాళిగా మారి నానా గొడవలు చేస్తుంది. కానీ విడాకులిస్తానని మాత్రం అనదు. ఎందుకంటే తనకు ఆర్ధిక పరిపుష్టితో విడిగా బతికే శక్తిలేదని తెలుసు. అలాగని మొగుడ్ని ప్రశాంతంగా మాత్రం బతకనీయదు. 

పైన ఉదాహరణకి ఏకవచనంలో ఒకానొక మహిళ గురించి చెప్పినట్టు చెప్పినా, ఇలాంటి కేసులు నూటికి 80 ఉంటున్నాయని మేరేజ్ కౌన్సిలింగ్ వాళ్లు చెబుతున్నారు. 

హైదరాబాదులో ఉద్యోగం చేయని ఒకమ్మాయి మేరేజ్ కౌన్సెలింగులో, "నా భర్త నెలకి రూ 40000 చేతిలో పెట్టి ఊరుకుంటాడు. దాంతోనే ఇల్లు నడిపాలంటాడు. అందులో మిగిలినదాంతో ఏదైనా కొనుక్కోమంటాడు. రూ 10000 మిగులుతాయి. ఏం చేసుకోను బోడి పదివేలు. అందుకేనా నేను నల్లగా ఉన్నా కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని చేసుకున్నది? నాకు విడాకులు కావాలి" అని చెప్పిందట. 

ఆ తెల్లగా ఉన్న అమ్మాయిని వెండి చెంచాతో పుట్టిందేమో అనుకుని అనుకుని "ఏవమ్మా మీ నాన్నగారేం చేస్తారు?" అనడిగితే, "ఏలూరులో ఇన్సూరెన్స్ ఏజెంటు" అని చెప్పిందట. 

ఇక ఆ అమ్మాయికి సుదీర్ఘమైన క్లాసు తీసుకుని రూ 10000 విలువ ఏమిటో వివరించి ఇంటికి పంపామని చెప్పారు కౌన్సెలింగిచ్చిన వారు. 

ఇక్కడ విషయమేంటంటే విపరీతమైన ఎక్స్పోజర్ ఉన్న సెలెబ్రిటీలు గానీ, అమాయత్వంతో ఉండి తమ అందమే పెద్ద ఆస్తి అనుకునే సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయిలు గానీ మానసికంగా ఓపికని ప్రదర్శించలేకపోతున్నారు. వీళ్లు భర్త తమకు నచ్చినట్టుగా ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. ఉండకపోతే గెటౌట్ మంత్రం జపిస్తున్నారు. 

మారుతున్న కాలంలో పెళ్లీడుకొస్తున్న అబ్బాయిలకి, వారి తల్లిదండ్రులకి ఇదొక సమాచారం. బహుశా కొన్నేళ్లల్లో వివాహవ్యవస్థకు సంబంధించి పురుషుల హక్కులతో కూడిన కొత్త చట్టాలు కూడా వెలుగులోకొస్తాయేమో. 

- కె. పద్మజారావు

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?