Advertisement

Advertisement


Home > Articles - Special Articles

దారుణంగా ఉన్న అమెరికాలో ఉద్యోగాల పరిస్థితి

దారుణంగా ఉన్న అమెరికాలో ఉద్యోగాల పరిస్థితి

ప్రపంచవ్యాప్తంగా ఆర్ధికమాంద్యమేమో కానీ అమెరికాలో మాత్రం కోరలు చాపింది. లక్షలాది ఉద్యోగాలు పొతున్నాయి. అలా పోగొట్టుకుంటున్నవారిలో తెలుగువాళ్లు అనేకమంది ఉన్నారు. లెక్కల్ని బట్టి చూస్తే ఆర్ధికమాంద్యం నెపంతో ఐటీ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నవారిలో ఇప్పటివరకూ 40% మంది భారతీయులైతే వారిలో 30% మంది తెలుగువాళ్లట. 

ఇండియాలో ఉంటూ ఉద్యోగం పోతే పెద్దగా భయపడాల్సిన అవసరముండదు. నెమ్మదిగా ఇంకొకటి దొరుకుతుంది. లేదా ఉద్యోగం లేకుండా ఉన్నా ఏదో రకంగా బతికే అవకాశాలు, ప్రాధమిక అవసరాల నిమిత్తం ఆదుకునే చేతులు ఎక్కువ. కానీ అమెరికాలో అలా కాదు. మరీ ముఖ్యంగా హెచ్ 1 బి వీసా మీద ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నవారి పరిస్థితి దినదినగండంలా మారింది. ఉద్యోగమున్నంతవరకు పర్వాలేదు. కానీ ఎప్పుడు పిడుగులాంటి వార్త వినాల్సొస్తుందోనని నిద్ర పట్టక బీపీ పెంచుకుంటున్నవారు ఎక్కువౌతున్నారు. 

ఉదాహరణకి విజయవాడకు చెందిన ఒక యువకుడికి పూనేలో లక్షకు పైగా జీతమొస్తున్న ఐటీ ఉద్యోగాన్ని గత ఏడాది వదిలేసి, కొత్త కోర్సులు చేసి ఆగష్ట్ 2022లో అమేరికాలో ఉద్యోగం పొందాడు. ఏడాది కూడా తిరక్కుండా ఉన్నపళంగా ఉద్యోగం పీకేసి మార్చ్ 2023 కల్లా సర్దుకుని ఇండియాకి పొమ్మన్నారు. అతను హెచ్ 1 బి మీద ఉన్నాడు కాబట్టి ఉద్యోగం పోయిన రెండు నెలల్లో మరొక ఉద్యోగం పొందాల్సిందే. ఏకంగా 20 లక్షల వరకు ఖర్చుపెట్టి అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు రెండు నెలల్లో మరొక ఉద్యోగం రాకపోతే, ఇండియా వెళ్లి చేసే ఉద్యోగంతో అంత అప్పు తీర్చడం కష్టం. చాలా కాలం పడుతుంది. అతనక్కడ ఆ టెన్షన్ పడుతుంటే ఇక్కడ విజయవాడలోని అతని తండ్రి డిప్రెషన్లో ఉన్నాడు. 

ఇదిలా ఉంటే ఉద్యోగాలు పోయిన వాళ్లు సగం జీతాలకి కూడా పనిచెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని, ఏదో ఒక ఉద్యోగమిచ్చి తమ హెచ్ 1 బి వీసా స్టాటస్ ని కాపాడవలసిందిగా ప్రాధేయపడుతూ లింక్ డిన్ లో పెడుతున్నారు. 

ఈ పరిస్థితి ఎప్పటికి సద్దుమణుగుతుందో తెలియని పరిస్థితి. చాలా మంది తల్లిదండ్రులు అమెరికాలో తమ పిల్లల ఉద్యోగాల గురించి వర్రీ అవుతున్నారు. ఒకవేళ ఉద్యోగం పోయినా చెప్పకుండా తమలో తామే కుమిలిపోతున్నారా అనే అనుమానాలు కూడా కొందరి తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. అందుకే పలువురు ఐటీ ఉద్యోగులకి ఇండియాలో ఇంటినుంచి వస్తున్న సందేశం ఒక్కటే. "ఏ కారణం చేత ఉద్యోగం పోయినా అస్సలు వర్రీ కావొద్దు. హాయిగా ఇండియాకి వచ్చేయండి. ఇక్కడ అవకాశాలకి కొదవ లేదు. అంతే కానీ డిప్రెషన్ కి లోనవద్దు". 

ఏం చేసైనా అమెరికాలోనే ఉండాలి, అక్కడే బతకాలి అనే వన్సైడ్ ఆలోచనలో కొట్టుకుపోయి తేడాకొడితే కొట్టుమిట్టాడకుండా, ఇండియావైపుకి చూస్తే జీవితం మీద ఆశ కలుగుతుంది. కష్టకాలంలో ఆదుకోవడానికి సొంత దేశం ఎప్పుడూ చేతులు చాపి పిలుస్తుంది. అమెరికా స్థాయిలో డాలర్లు ఇవ్వలేకపోయినా, జీవించడానికి సరిపడా సంపాదనతో దర్జాగా ధైర్యంగా బతికే భరోసా మాత్రం ఇస్తుంది. కనుక అమెరికాలో ఉద్యోగం లేకపోతే జీవితం ఆగిపోయినట్టు కాదు. కనుక తేడా వస్తే "ఉందిలే మంచి కాలం ముందుముందున" అని మనసులో అనుకుంటూ "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి" అని పాడుకుంటూ ఇండియాకొచ్చేయండి! 

శివకృష్ణ వంకమామిడి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?