సస్పెన్స్‌కి తెరపడింది. అదృశ్యమైన ఎయిర్ ఏసియా విమానం సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని ఇండోనేషియా ప్రభుత్వం ధృవీకరించింది. విమాన శకలాల్ని గుర్తించినట్లు తెలిపిన అధికారులు, కొన్ని మృతదేహాల్నీ కనుగొన్నట్లు వెల్లడించారు.
రెండ్రోజుల క్రితం గల్లంతయిన విమానం గల్లంతయ్యింది. ఇండోనేసియాలోని సరబయ నుంచి సింగపూర్‌కి బయల్దేరింది ప్రమాదానికి గురైన ఎయిర్ ఏసియా విమానం. అందులో ప్రయాణీకులు, సిబ్బంది కలిపి మొత్తం 162 మంది వున్నారు. ఆకాశం దట్టమైన మేఘాలతో నిండిపోవడం, దానికి తోడు పిడుగులు పడటంతో విమానం కుప్పకూలిపోయినట్లుగా అధికారులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చారు.
ఏటీసీతో సంబంధాలు తెగిపోయిన సమయంలో విమానం వున్న ప్రాంతానికి అతి దగ్గరలోనే సముద్రంలో పది కిలోమీటర్ల పరిధిలో విమాన శకలాల్ని గుర్తించారు. గత రెండ్రోజులుగా ప్రపంచంలోని వివిధ దేశాలు ఎయిర్ ఏసియా ఆచూకీ కోసం తమవంతు సహాయ సహకారాల్ని అందిస్తున్నాయి. గాలింపు చర్యల్లో భాగంగా విమానం కుప్ప కూలిందని తేలడం, ఎవరూ బతికి వుండే అవకాశం లేదని తెలియడంతో ప్రయాణీకుల బంధువులు బోరున విలపిస్తున్నారు.
వీలైనంత త్వరగా విమానం కూలిన ప్రాంతానికి చేరుకునేందుకు పలు దేశాలకు చెందిన నౌకలు సమాయత్తమవుతున్నాయి.