భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పాడు. ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా వైఫల్యాల నేపథ్యంలో కెప్టెన్ ధోనీ ఈ నిర్ణయం తీసుకుని వుంటాడనే ప్రచారం జరుగుతోంది.
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్ట్‌కి ధోనీ అందుబాటులో లేకపోవడంతో టీమిండియాకి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. రెండో టెస్ట్‌కి ధోనీ జాయిన్ అయ్యాడు. మూడో టెస్ట్‌కీ నేతృత్వం వహించాడు. మొత్తం 90 టెస్టుల్లో 4876 పరుగులు చేశాడు ధోనీ. మూడో టెస్ట్ డ్రాగా ముగియడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు.
రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునే మహేంద్రసింగ్ ధోనీ ఆస్ట్రేలియాలో అడుగు పెట్టాడనీ, సిరీస్ కోల్పోవడంతో మూడో మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడనీ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అయితే జట్టు వైఫల్యాలు, వ్యక్తిగత ప్రదర్శనలో వైఫల్యం బారిన పడ్డ సమయంలో ధోనీ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
అంతర్జాతీయ క్రికెట్లోకి వస్తూనే సంచలనాలు నమోదు చేశాడు ధోనీ. తక్కువ కాలంలోనే కెప్టెన్సీని కూడా చేపట్టాడు. ధోనీ నేతృత్వంలో టీ20 అంతర్జాతీయ కప్‌నీ, వన్డే వరల్డ్కప్నీ టీమిండియా సొంతం చేసుకుంది. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నా, టీ20, వన్డే క్రికెట్లో ధోనీ కొనసాగనున్నాడు.