ప్రతి ఏడాది జనవరిలో భారత ప్రభుత్వానికి చాలా టెన్షన్‌గా ఉంటుంది. ఈ నెలలో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతూ ఉంటుంది. ఇందుకు కారణం జనవరి 26న ఘనంగా జరిగే రిపబ్లిక్ డే ఉత్సవం. రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) ఆనందంగా జరుపుకునే ఉత్సవం కదా టెన్షన్ ఎందుకు? అనుకుంటున్నారా? నిజమే…సామాన్యులకు ఉండకపోవచ్చు. కాని భారత ప్రభుత్వానికి, సైన్యానికి, ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు, ముఖ్యంగా హోమ్ శాఖకు చాలా ఆందోళనగా ఉంటుంది. ఇందుకు కారణం రిపబ్లిక్ డే నాడు ఉగ్రవాదుల దాడులు జరుగుతాయనే భయం.
దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం ఎంతో వైభవంగా, త్రివిధ దళాల కవాతులతో, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన శకటాల ప్రదర్శనతో కన్నుల పండువగా జరుగుతుండటం మనకు తెలిసిందే. దేశ ప్రజలంతా ఉత్సవంలో మునిగివున్న సమయంలో దాడులు చేయడానికి ఉగ్రవాదులు సిద్ధంగా ఉంటారు. అందుకే రిపబ్లిక్ డే ఉత్సవానికి చాలా ముందు నుంచే సైన్యం, సరిహద్దు భద్రతాదళాలు, ఇంకా ఇతర దళాలు ఎంతో అప్రమత్తంగా ఉంటాయి.
సరిహద్దుల్లో జవానులు డేగ కళ్లతో అణువణువూ పరిశీలిస్తుంటారు. ఆ ప్రాంతాలను జల్లెడ పడతారు. భద్రతా దళాలది మామూలు కష్టం కాదు. అలాగే నిఘా విభాగం (ఇంటెలిజెన్స్) ఎంతో అప్రమత్తంగా ఉంటుంది. ఇక ఢిల్లీలో అయితే భద్రత సంగతి చెప్పనక్కర్లేదు. పోలీసులకు, సైన్యానికి కంటి మీద కునుకు ఉండదు. ఈసారి కూడా ఇదే అప్రమత్తత కొనసాగుతోంది. గణతంత్ర దినోత్సవం రోజు భారత్‌లోకి చొరబడి దాడులు చేసేందుకు 300 మంది ఉగ్రవాదులు సరిహద్దుల్లో పొంచి ఉన్నారని ఇంటెలిజెన్స్ సమాచారం.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ద్వారా భారత్‌పై దాడులు చేయాలని ఉగ్రవాదులు కాచుకొని ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పీవోకేలో లాంచ్‌ప్యాడ్స్ సిద్ధం చేశారు. పలు ఉగ్రవాద సంస్థలకు చెందినవారు ఇక్కడ ఉన్నారు. వీరిలో ఎక్కువమంది అఫ్గనస్తాన్‌కు చెందినవారని సమాచారం.
దాడుల్లో నిష్ణాతులైన 60 మంది కరడుగట్టిన ఉగ్రవాదులను పాకిస్తాన్ రిక్రూట్ చేసింది. వీరు జమ్ము కశ్మీర్‌లో దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అఫ్ఘాన్ ఉగ్రవాదుల కారణంగా కశ్మీర్‌కు ముప్పు ఉంది. కొందరు విదేశీ ఉగ్రవాదులు ఆల్రెడీ ప్రవేశించారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీంతో జమ్ముకశ్మీర్‌లో సెక్యూరిటీ చాలా కట్టుదిట్టం చేశారు. పాక్ నుంచి ద్రోణ్ దాడులు జరగవచ్చని అనుకుంటున్నారు. భారత్-పాక్ పశ్చిమ సరిహద్దులో 1900 కిలోమీటర్ల మేర సరిహద్దు (బీఎస్‌ఎఫ్) భద్రతా దళాలను మోహరించారు.