అమెరికాని ఉద్ధరించడం, రష్యాతో సంబంధాలు – వైరం, మహిళల అబార్షన్ హక్కులు, తుపాకీ సంస్కృతి, వ్యక్తిగత ఆరోపణలు.. ఇలాంటి అంశాలపై ముచ్చటగా మూడో డిబేట్లో ఆసక్తికరమైన చర్చ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన రిపబ్లికన్, డెమొక్రటిక్ అభ్యర్థులు డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ మధ్య జరిగింది. లాస్ వెగాస్‌లో జరిగిన ఈ డిబేట్లో ఇద్దరూ తమ తమ వాదనలు విన్పించారు. అంతిమంగా, హిల్లరీ అభిప్రాయాలకే ఎక్కువ సానుకూలత లభించినట్లు సర్వేలు చెబుతున్నాయి.
ఇక, అమెరికాతోపాటు రష్యా కూఆ అణ్వాయుధ దేశమే గనుక, వైరం కన్నా పలు అంశాలపై ఇరు దేశాలూ కలిసి పనిచేయడమే మంచిదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే రష్యా ఎప్పటికీ అమెరికాకి శతృదేశమేననీ, అమెరికా రహస్యాల్ని రష్యా దొంగిలిస్తోందని ఆరోపించారు హిల్లరీ. ఆమె ఆరోపణల్ని కొట్టి పారేస్తూ, రష్యానే ఆ పని చేస్తోందో, చైనా చేస్తోందో తెలియదు గనుక, ఆ విషయంలో తొందరపాటు వ్యాఖ్యలు అనవసరం అన్నది ట్రంప్ వాదన. ట్రంప్, రష్యాకి మిత్రుడిలా వ్యవహరిస్తున్నారని హిల్లరీ మండిపడ్డారు.
మహిళలకు అబార్షన్ చేయించుకునే హక్కు వుండాలనీ, తొమ్మిది నెలలు నిండిన పసిగుడ్డును అంతమొందించాలనే ఆలోచన మాత్రం తగదని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. మరోపక్క, మహిళలంటే ట్రంప్‌కి గౌరవమే లేదని హిల్లరీ ఎద్దేవా చేశారు. అమెరికాలో తుపాకీ సంస్కృతిపై దాదాపుగా హిల్లరీ, ట్రంప్ ఒకే అభిప్రాయానికొచ్చారు. తుపాకీల సంస్కృతి అమెరికా సంస్కృతిలో భాగమేనని, అయితే దానిపై కాస్త నియంత్రణ అవసరమని ఇద్దరూ వ్యాఖ్యానించడం గమనార్హం. తప్పదు మరి, అమెరికా అంటేనే గన్ కల్చర్.. ప్రాణాలు పోతున్నాసరే, గన్ను వీడలేనంత భయం అమెరికన్లది.
వ్యక్తిగత ఆరోపణల విషయంలో మరోసారి ట్రంప్, హిల్లరీ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఈ విషయంలో మాత్రం, అమెరికన్ల నుంచి ఇద్దరి పట్లా సమాన స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యింది. దేశ ఆర్థిక ప్రగతి ఒబామా హయాంలో బాగా దెబ్బతిందనీ, హిల్లరీ అధ్యక్షురాలైతే అమెరికా అధోగతి పాలవుతుందని ట్రంప్ ఆరోపిస్తే, ట్రంప్ అధికారంలోకి రావడమంటే అమెరికా పతనమేనని హిల్లరీ ఎదురుదాడికి దిగారు.
ఏదిఏమైనా, ఇదివరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జరిగిన డిబేట్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో వ్యక్తిగత విమర్శలు విన్పించలేదు. ఈసారి అమెరికా ఎన్నికలు మాత్రం, అధ్యక్ష పదవికి మచ్చతెచ్చేలానే జరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం.