కాలేజీ అంటే ర్యాగింగ్ ఎలాగో, ఎన్నికలంటేనే రిగ్గింగ్ అన్నట్టు.! రిగ్గింగ్ ఒకప్పుడు హింసాత్మకంగా జరిగేది, ఇప్పుడు హింసకు పెద్దగా తావు లేకుండా జరుగుతోంది. అంతే తేడా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు వచ్చాక రిగ్గింగ్లో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ఓటర్ ఓ బటన్ నొక్కితే, ఓటు ఇంకో బటన్ వైపు వెళుతుంది. ఇదే మరి మ్యాజిక్ అంటే. ఇదేం లొల్లి.? అని ఓటేసిన ఓటరు వాపోయినా, 'టెక్నికల్ ప్రాబ్లమ్..' అంటూ చేతులు దులిపేసుకుంటారు. 'సమస్యను సరిదిద్దాం..' అని చెబుతారు, తెరవెనుక పనైపోతుందంతే. అబ్బే, అదేం లేదు.. ఈవీఎంల ట్యాంపరింగ్కిగానీ, అందులో లోటుపాట్లకుగానీ ఆస్కారమే లేదన్నది ఎన్నికల కమిషన్ వాదన. అంత సీన్ లేదు బాబు, ఇదిగో ట్యాంపరింగ్.. అంటూ అనేకమంది మీడియా ముందుకొచ్చి, ట్యాంపరింగ్ వైనాన్ని వెల్లడించారు కూడా.
ఇప్పుడిదంతా ఎందుకంటారా.? అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇలాంటి 'మాయలు' జరుగుతున్నాయట. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. సిమాంటెక్ అనే సంస్థ, ఓటింగ్ మాయను బయటపెట్టింది. ఏంటీ, అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఇలాంటి మాయలా.? అని అతా ముక్కున వేలేసుకుంటున్నారిప్పుడు. అమెరికాలో జరిగితే ఆశ్చర్యమే, అదే ఇండియాలో జరిగితే మామూలే.! ఎందుకంటే మనకి అలా అలవాటైపోయిందంతే.!
ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి ఏళ్ళ తరబడి కేసులు నడుస్తుంటాయి. శతృచర్ల విజయరామరాజు 'కులం' గురించి పెద్ద రచ్చే జరిగింది చాన్నాళ్ళ క్రితం. తీర్పు లేటుగా వచ్చింది. ఆయన్నుంచి ఎమ్మెల్యేగా పొందిన జీతభత్యాల్ని రికవరీ చేసేందుకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అంతేనా.? ఇంకేమీ లేదా.? ప్చ్, చేసిన పెద్ద నేరానికి, శిక్ష ఇంత చిన్నదా.? ఇలాగైతే వ్యవస్థ మీద ఎవరికైనా గౌరవం, భయం ఎలా వుంటాయట.!
చెప్పుకుంటూ పోతే, ఇలాంటి ఎన్నికల చిత్రాలు ఇక్కడ చాలా చాలానే. ఒక్క ఓటు తేడాతో గెలిచినోళ్ళు కోర్టును ఆశ్రయిస్తే, ఐదేళ్ళ తర్వాత తీర్పు వస్తుంది.. ఓడినోడు గెలిచాడని. ఏం చేసుకోవాలి.? అప్పటికే పదవి పూర్తయిపోతుంది. ఇంకెందుకు, కోర్టుకు వెళ్ళడం.? ఓ వైపు ట్యాంపరింగ్ మోసాలు, ఇంకో వైపు ఇదిగో, ఇలాంటి అక్రమాలు. వెరసి, ఎన్నికల వ్యవస్థ అంటేనే చాలామందికి అసహ్యం వేస్తోంది. అమెరికాలో అలాగట.. అని మనం ముక్కున వేలేసుకుంటున్నాం. కానీ, మన ఎన్నికల వ్యవస్థ కిందనున్న మచ్చల మాటేమిటి.? అమెరికాని చూసి ఆశ్చర్యపోదాం, మన వ్యవస్థని చూసి సిగ్గుపడదాం.!