నాలుగేళ్లప్పుడు వచ్చాడు…నలభై ఏళ్లకూ నచ్చాడు…

దాదాపు 36 సంవత్సరాల క్రితం తొలిసారి నీడ సినిమా కోసం కెమెరాను ఫేస్ చేసిన చిన్నారి … పదహారేళ్ల క్రితం రాజకుమారుడిగా పట్టాభిషిక్తుడై…  కోట్లాది మంది అభిమాన సంపద మూట గట్టుకున్న ‘శ్రీమంతుడి’గా వర్ధిల్లుతున్నాడు.…

దాదాపు 36 సంవత్సరాల క్రితం తొలిసారి నీడ సినిమా కోసం కెమెరాను ఫేస్ చేసిన చిన్నారి … పదహారేళ్ల క్రితం రాజకుమారుడిగా పట్టాభిషిక్తుడై…  కోట్లాది మంది అభిమాన సంపద మూట గట్టుకున్న ‘శ్రీమంతుడి’గా వర్ధిల్లుతున్నాడు. ఆగస్టులోనే పుట్టి, అదే నెలలో హీరోగా తొలి సినిమా చేసిన మహేష్‌బాబు, ఇదే నెలలో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టడం దాదాపు ఖాయమైంది. నేడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు బర్త్‌డే నేపధ్యంలో ఆయన కెరీర్ అవలోకనమిది…

వైవిధ్యం కోసం తపన.. అభిమానుల కోసం ఆలోచన…

సమకాలీన హీరోలలో చిన్నతనంలోనే నటుడిగా ప్రూవ్ చేసుకుని తనకంటూ మార్కెట్ సృష్టించుకున్న ఏకైక హీరో మహేష్. తన రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న లక్షలాది అభిమానుల్ని నిరాశ పరచకుండా… తొలి సినిమా ‘రాజకుమారుడు’ని పూర్తిగా అభిమానులను అలరించే అంశాలతో నింపేసి… ఆ తర్వాత తర్వాత తనదైన ప్రత్యేకత, వైవిధ్యం కోసం తపించాడు. తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు  బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. అంత మాత్రాన బెంబేలెత్తిపోయి తన పంధా మార్చుకోకుండా మురారి తో కమర్షియల్‌గానూ, అవార్డుల పరంగానూ సక్సెసయ్యాడు. 

ఒక్క విజయం ఇచ్చిన ఊపుతో రెట్టించిన ఉత్సాహంతో మరింత వైవిధ్యం కోసం యత్నించి, తెలుగులో కౌబాయ్ హీరో కొరత తీరుద్దామని చేసిన టక్కరి దొంగ ఫెయిలైంది. తర్వాత వచ్చిన బాబీ కూడా అదే బాట పట్టింది.  అయినా సరే… వైవిధ్య చిత్రాలకు పేరొందిన గుణశేఖర్‌తో సినిమాకు సిద్ధం అయ్యాడు. అయితే ఈసారి అభిమానుల ఆకాంక్షలకు మరింత విలువిచ్చాడు. ఈ జాగ్రత్తల ప్రతి రూపంగా తెరకెక్కిన ‘ఒక్కడు’ మహేష్ స్టార్‌డమ్‌ని అమాంతం టాప్‌కి చేర్చింది. అటు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ఈ చిత్రం మహేష్ నటనతో అవార్డుల పంట పండించుకుంది. 

తన ప్రతి చిత్రం ప్రేక్షకులకు ఏదో ఒక కొత్త అనుభూతిని అందివ్వాలని ప్రయత్నిస్తూ… తేజతో చేసిన ‘నిజం’ విమర్శకుల అభినందనలు పుష్కలంగా అందుకున్నా ఫ్లాప్ ముద్ర వేసుకుంది. అయితే ఆ సినిమాలో మహేష్ నటనను మెచ్చని వారు లేరనే చెప్పాలి. ఒక్క ఫెయిల్యూర్‌తో రూట్ మార్చుకునే తత్వం లేని మహేష్ మరోసారి తన సోదరి మంజుల నిర్మాతగా ‘నాని’ చేశాడు. స్వంతవారితో సినిమా కావడంతో మరింతగా తన వైవిధ్య భరిత ఆలోచనలను అందులో అమలు చేశాడు.  మరోసారి మహేష్‌కు తీవ్ర నిరాశే మిగిల్చిందా సినిమా.  అక్కని కాపాడుకోవడం కోసం తపించే తమ్ముడి పాత్రలో మహేష్ జీవించిన అర్జున్… కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా పంధా మార్చుకోని మహేష్… త్రివిక్రమ్‌తో ‘అతడు’ చేశాడు. 

ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లు సాధించిన  ఈ సినిమా… అత్యధిక సార్లు చిన్నితెరపై ప్రదర్శితమైన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది.  నటుడిగా మహేష్‌ను మరో మెట్టు ఎక్కించింది. అయితే నిర్మాతకు పెద్దగా లాభాలు తేలేకపోయింది. దీంతో మరింత కసిగా.. పూరి జగన్నాధ్‌తో చేసిన ‘పోకిరి’… అటు అభిమానులు ఇటు డిస్ట్రిబ్యూటర్లు అందరి ఆకలిని తీర్చేసింది. టాలీవుడ్‌లో రికార్డ్స్‌తో కొత్త చరిత్ర సృష్టించింది. అయితే ఆ తర్వాత వచ్చిన సైనికుడు ఆ జోరును కొనసాగించలేకపోయింది. ‘అతిధి’ కూడా అదే బాట పట్టడంతో… మహేష్ కొన్ని నెలల పాటు సినిమాలకు దూరమయ్యాడు. 

ఆ తర్వాత చాలా కష్టపడి చేసిన ఖలేజా… చూసిన వారందరూ బాగుందన్న, ఫ్లాప్ ‘వి’ చిత్రంగా నిలిచింది. ఇక అభిమానుల్ని పూర్తిగా అలరించాల్సిందే అని నిర్ణయించుకుని చేసిన దూకుడు… ఆశించిన పని  పూర్తి చేసింది. బిజినెస్‌మ్యాన్ కూడా మంచి బిజినెస్ రిజల్ట్ తెచ్చుకుంది. పాతికేళ్ల తర్వాత వచ్చిన తొలి తెలుగు మల్టీస్టారర్‌గా మరెన్నో అలాంటి చిత్రాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మహేష్ సాహసానికి మరో మచ్చుతునక. 

ఆ తర్వాత పూర్తి ప్రయోగాత్మకంగా తీసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘వన్’ నేనొక్కడినే… మరోసారి మహేష్‌లోని ప్రయోగాల ఆసక్తిని నిరూపించిందే తప్ప అపజయం కోరల నుంచి తప్పించుకోలేకపోయింది. ఆ తర్వాత అభిమానుల కోసం మరీ అతిగా ఆలోచించి  మూస దారిలో మరోసారి ‘దూకుడు’గా వెళ్లబోయిన ప్రిన్స్‌ను ‘ఆగడు’ ఆపేసింది. దాంతో తిరిగి తన దైన శైలిలో చేసిన ‘శ్రీమంతుడు’ మహేష్… అటు అభిమానుల్ని, ఇటు తన భిన్నమైన ఆలోచనల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తన రూట్‌లో తాను వెళితే విజయాలు ఆయన రూట్ పడతాయని నిరూపిస్తోంది.

కమర్షియల్‌గా విజయం సాధించిన సినిమాలకు అవార్డ్స్ రావడం కష్టమనే అపోహను తొలగించినా, ఫెయిల్యూర్ చిత్రాల్లోనూ నటనకు అవార్డులు దక్కించుకున్నా, యాడ్ వరల్డ్‌లో కార్పొరేట్ బ్రాండ్స్‌కు ప్రీతి పాత్రమైన ఏకైక టాలీవుడ్ హీరోగా ఘనత దక్కించుకున్నా, పోటీ హీరో చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనే ట్రెండ్ సృష్టించినా… ఇంకా ఎన్నో సాధించినా… వినమ్రతే ఆభరణంగా రాణిస్తున్నాడీ సూపర్‌స్టార్. ‘‘అపజయాలకు వెరవను. అభిమానులకు నచ్చేలా, నా శైలిలో సినిమాలే చేస్తాను’’ అని ఇటీవలే ప్రకటించిన ఈ ‘పదహారేళ్ల’ టాలీవుడ్ స్టార్… ఎవర్‌గ్రీన్ అందంతో… ఆకాశాన్నంటే అభినయ ప్రతిభతో ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే టూ యూ ప్రిన్స్.

 -ఎస్బీ.