50 రోజులు.. ఐదు వేల ప్రశ్నలు.!

ఒకటి కాదు రెండు కాదు.. పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత నేడు యాభయ్యవ రోజు. 50 రోజుల సమయమివ్వండి.. దేశ ప్రజల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతాం.. దేశానికి కొత్త భవిష్యత్తును చూపిస్తాం.. నల్లధనాన్ని అంతమొందిస్తాం..…

ఒకటి కాదు రెండు కాదు.. పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత నేడు యాభయ్యవ రోజు. 50 రోజుల సమయమివ్వండి.. దేశ ప్రజల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతాం.. దేశానికి కొత్త భవిష్యత్తును చూపిస్తాం.. నల్లధనాన్ని అంతమొందిస్తాం.. తీవ్రవాదాన్ని తరిమేస్తాం.. అవినీతిని పారద్రోలుతాం.. అంటూ ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించి 50 రోజులు నేటితో పూర్తయిపోతోంది. కానీ, అప్పటికీ ఇప్పటికీ పెద్ద పాత నోట్ల రద్దుపై సమాధానం లేని ప్రశ్నలు ఇంకా అలాగే వుండిపోయాయి. 

కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌, 'యుద్ధం' ముగిసింది అని నిన్ననే.. అదీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా నిన్ననే, 'గురి చూసి కొట్టాం.. గురి తప్పలేదు.. తగలాల్సిన వారికే దెబ్బ తగిలింది.. ఒకే దెబ్బకి పలు పిట్టలు రాలాయి..' అంటూ ఘనంగా ప్రకటించేసుకున్నారు. నిజమేనా.? పెద్ద పాత నోట్ల రద్దుతో అంతా మంచే జరిగిందా.? దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడ్తోందా.? దేశం నుంచి అవినీతి మాయమైపోయిందా.? నల్ల కుబేరులంతా జైల్లో కూర్చున్నారా.? తీవ్రవాదులు దేశం విడిచి పారిపోయారా.? ఇవి కీలకమైన మూడు ప్రశ్నలు. కానీ, దేనికీ సమాధానం 'ఔను' అని మాత్రం రావడంలేదు. 

కాశ్మీర్‌లో తీవ్రవాదులు బ్యాంకుల్ని లూటీ చేస్తున్నారు. దానర్థం తీవ్రవాదం తగ్గిపోలేదని. ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. కొత్త నోట్లు లంచంగా ఇస్తే తప్ప పని జరగదని అవినీతిపరులు తెగేసి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కొత్త సచివాలయంలోనే ఓ అవినీతి జలగ దొరికింది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఆ లెక్కన, అవినీతి ఇంకా అలాగే వుందన్నమాట. ఇక, నల్ల కుబేరుల విషయానికొస్తే.. పట్టుమని పది మంది నల్లకుబేరులు కూడా అరెస్ట్‌ కాలేదు ఇంతవరకూ.! మరి, నల్ల దొంగలు పిట్టల్లా రాలారని నరేంద్రమోడీ చెబితే నమ్మేదేలా.? 

ప్రశ్నలు ఇంకా చాలా చాలా వున్నాయి. పిట్టల్లా రాలింది జనం.. కాదని, ఏ బీజేపీ నాయకుడైనా చెప్పగలడా.? అసలు దేశంలో నల్లధనం ఎంతుందో లెక్కలు తేలకుండానే నల్లధనమ్మీద పోరాటమంటూ పెద్ద పాత నోట్ల రద్దు అంశాన్ని తెరపైకి తీసుకురావడం మూర్ఖత్వమే కదా.? అన్న సామాన్యుడి ప్రశ్నకి అధికార బీజేపీ వద్ద సమాధానమే లేదు. ఇప్పటిదాకా ఒక్కడంటే ఒక్క రాజకీయ నాయకుడిపైనా ఐటీ దాడులు జరగలేదు. అంటే, రాజకీయ నాయకుల్ని 'నల్ల దొంగల' నుంచి మినహాయించారా.? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారు.? 

చిన్న చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, కూలీలు, కార్మికులు.. వీళ్ళంతా నోట్ల రద్దుతో తీవ్ర ప్రభావానికి గురయ్యారు. వీరి బతుకులు దాదాపుగా రోడ్డున పడిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ సంక్షోభం లోంచి సామాన్యుడు బయటపడాలంటే ఏడాదే పడుతుందో, రెండు మూడేళ్ళే పడుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. మరి, నరేంద్రమోడీ చేపట్టిన 'ఆపరేషన్‌'తో బాగుపడ్డదెవరు.? నష్టపోయిందెవరు.? 

ఇంతకీ, 50 రోజుల తర్వాత భవిష్యత్‌ బాగుంటుందని కేంద్రం ఇచ్చిన భరోసా నిజమేనా.? అన్న ప్రశ్నకీ సమాధానం తెలియని పరిస్థితి. 50 కాదు, 500 కాదు, 5 వేల ప్రశ్నలు ప్రధాని ముందున్నాయి. కానీ, సమాధానం చెప్పే ధైర్యం ఆయనకు వుందా.? లేకనే కదా, పార్లమెంటుకే మొహం చాటేశారు. త్వరలోనే తీపి కబురు.. అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్నారు. డయాబెటిస్‌ పేషెంట్‌కి తీపికబురు చెప్పి ఏం లాభం.? అన్నట్టుగా వుందిప్పుడు పరిస్థితి. 'తీపి కబురు', 'భవిష్యత్‌ బాగుంటుంది' అన్న మాటలు బీజేపీ తనకు తాను చెప్పుకుంటే మంచిదేమో.. అంతే తప్ప, తాను మంచి అనుకున్నది ప్రజలకు మంచి ఎలా అవుతుంది.? 

'పిట్టల్లా రాలుతున్నారు..', 'గురి చూసి కొట్టాం..' అన్న మాటలు, వేటగాడు జింకని ఉద్దేశించి అంటున్నట్లుంది తప్ప, ఓ దేశ ప్రధాని, బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నట్లు లేదు. ఇది నూటికి నూరుపాళ్ళూ అహంకారమే, వికటాట్టహాసమే.!