దాసరి కిరణ్ కుమార్..బోలెడు వ్యాపారాలు వుండి కూడా, సినిమా మీద ఆసక్తితో నిర్మాతగా మారి, తనకు నచ్చిన సినిమాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నవ్యక్తి.
జీనియస్, రామ్ లీల, సిద్దార్థ…ఇవన్నీ ఆయన సినిమాలే. లేటెస్ట్ సంచలనం..వంగవీటి. ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయాల బేధాలు, రెండు వర్గాలకు నాంది పలికి, ఆఖరికి రెండు కులాల నడుమ చిచ్చు పెట్టిన కథాంశాన్నితీసుకుని, సినిమా చేయాలని అనుకోవడం అంటే కాస్త కత్తి మీద సామే.
ప్రస్తుతం వంగవీటి సృష్టిస్తున్న ప్రకంపనలు ఆంధ్రలోని కోస్తా జిల్లాల్లో పక్కాగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాసరి కిరణ్ కుమార్ తో ఇంటర్వూ.
…
వంగవీటి విడుదలయిన తరువాత తలెత్తిన పరిణామాల కారణంగా మీరు ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారని, కనిపించకుండా లోపల వుండిపోయారనీ..
అవునా..ఓ సినిమా తీసాక, దాన్ని పెద్ద సంఖ్యలో థియేటర్లలో విడుదల చేసాక, ఫోన్ స్విచాఫ్ చేసుకుని ఎలా వుండగలను? ఇప్పుడు మీతో ఫోన్ లోనే కదా మాట్లాడుతున్నాను. నాకు ఏ సమస్యా లేదు. నాకు వంగవీటి, దేవినేని రెండు కుటుంబాలతో మంచి సంబంధాలు వున్నాయి. ఎలాగైనా ఈ సినిమాను విడుదల చేసుకోగలను అన్న ధీమా వుంది కాబట్టే ప్రాజెక్టులోకి దిగాను.
అసలు ఈ ప్రాజెక్ట్ మీరు అనుకున్నారా? లేదా అందులోకి అనుకోకుండా వెళ్లారా?
వాస్తవానికి ఆర్జీవీతో ఓ సినిమా చేద్దాం అని అనుకున్నా. ఆయన దావూద్ ఇబ్రహీం మీద సినిమా తీస్తానంటే, ఆ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆయన పూర్తి లోకల్ ఫ్లేవర్ తో వున్న మరో మంచి సబ్జెక్ట్ వుంది అని ఇది చెప్పారు. నాకు కూడా చేయాలనిపించింది. పైగా ఆర్జీవీ మాత్రమే ఇలాంటి దానికి న్యాయం చేయగలరు. మరే డైరక్టర్ అయినా ఇది చేయకపోయేవాడిని.
ఆర్జీవీ మీద ఏమిటి అంత కాన్ఫిడెన్స్?
వర్మగారిని ఇలాంటి సబ్జెక్ట్ లు డీల్ చేయడంలో కొట్టేవారు లేరు. సర్కార్, రక్త చరిత్ర ఈ విషయం ప్రూవ్ చేసాయి. ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా ఆయన సినిమా తీయగలరు.
మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య? ఆర్జీవీ మీద కోస్తాలోని ఓ వర్గం ఎందుకు మండి పడుతోంది?
అంతే లేదు. రంగాగారు అంటే అన్ని చోట్ల అభిమానులు వున్నారు. కానీ విజయవాడలో మాత్రం రంగాగారి వీరాభిమానులు, ఆయన కుటుంబంతో చిరకాలంగా వుంటూ వస్తున్నవారు వున్నారు. వారు మాత్రం రంగా గారి గురించి మరో పది నిమషాలు చూపిస్తే బాగుండేది అని ఫీలయ్యారు. నాకు కూడా అలాగే అనిపించింది. ఓ నిర్మాత గా కూడా అలాగే అనుకున్నాను.
అసలు ఈ సినిమా ప్రారంభించినపుడు మీకు కథ చెప్పడం కానీ, స్క్రిప్ట్ చూపించడం కానీ జరిగిందా? మరి మీరేమైనా అభ్యంతరాలు చెప్పారా? సమస్యలు ఎదురవుతాయని అనుకోలేదా?
సినిమా స్క్రిప్ట్ మొత్తం నెరేట్ చేసారు. అభ్యంతరం చెప్పాల్సిన అవసరం రాలేదు. అన్నీ జరిగిన సంఘటనలే కదా? సమస్యలు అంటే..అన్నీ అందరికీ తెలిసినవీ, జరిగినవే కదా? ఇంకేముంటాయి? యదార్థాలను కాస్త సినిమాటిక్ గా విజువలైజ్ చేసి చూపించడమే కదా?
సినిమా ప్రకటించిన తరువాత ఈ కథకు సంబంధించిన రెండు వర్గాలు కానీ, రెండు కమ్యూనిటీలు కానీ, రెండు కుటుంబాల నుంచి కానీ, ఏమైనా ఎంక్వయిరీలు వచ్చాయా? ఏం తీస్తున్నారు..ఏం చూపిస్తారు? అని.
లేదు..ఎవ్వరూ ఏమీ అడగలేదు. మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నావు..మంచి డైరక్టర్ అని, ముందుకు వెళ్లమని అన్నారు తప్ప, అభ్యంతరాలు ఏవీ రాలేదు.
ఈ సినిమా టైటిల్ చాంబర్ లో రిజిస్టర్ చేయమని అన్నారట నిజమేనా?
అవును..నిజమే.తెలంగాణ చాంబర్ లో రిజిస్టర్ చేసాను. వీళ్లు ఎందుకు నో అన్నారో అర్థం కాదు. కానీ తెలంగాణ చాంబర్ సినిమాను సినిమాగా చూసి, టైటిల్ రిజిస్టర్ చేసింది.
సినిమా పూర్తయ్యాక ఫైనల్ ప్రొడక్ట్ చూసారా? వంగవీటి, దేవినేని ఫ్యామిలీలకు చూపించారా? అభ్యంతరాలు ఏమైనా వచ్చాయి?
నేను ఎప్పటికప్పుడే చూసాను. విజయవాడలో ఆ ఫ్యామీలీల్లో కొందరు చూసారు. అభ్యంతరాలు ఏమీ రాలేదు.
ఒక్క విషయం చెప్పండి..మీరు సినిమా తీసింది రెండు కుటుంబాలు, లేదా రెండు వర్గాలు.లేదా రెండు కమ్యూనిటీలకు సంబంధించి. మరి ఈ సినిమా మీద ఒక వైపు నుంచి ఎందుకు అభ్యంతరం వస్తోంది?
అది అభ్యంతరం ఏమీ కాదు. రంగాగారికి కొందరు హార్డ్ కోర్ అనుచరులు వున్నారు. వారికి తమ నాయకుడి గురించి మరి కాస్త చూపిస్తే బాగుంటుంది అనిపించింది అంతే. మరో వర్గం మాట్లాడడం లేదు అంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయం లేదా నిర్ణయం అయి వుండొచ్చు. అయినా ఒక్క విజయవాడలో తప్పితే మరెక్కడా సమస్య రాలేదుగా?
మరి రాజమండ్రిలో జక్కంపూడి నుంచి వచ్చిన కామెంట్లు సంగతేమిటి?
నాకు తెలిసి అనుచరులు ఎవరో ఏదో చెబితే అని వుంటారు కానీ, సినిమా చూసి వుండరు. సినిమా చూసిన వాళ్లు ఇలా మాట్లాడరు.
రంగా అనుచరులు, లేదా కాపులు, లేదా ఓ వర్గం అంటే ఒక సైడ్ నే చూపించినట్లు వుంది కదా?
అదేం లేదు..ఇక్కడ సమస్య ఏమిటంటే, రాధా కథ వరకు ఓకె. కానీ రంగా కథ స్టార్ట్ అయిన తరవాత స్క్రిప్ట్ పూర్తిగా ఎమోషన్ తొ నిండిపోతుంది. వాటి మధ్యలో సేవా కార్యక్రమాల లాంటివి ఇమడ్చడం కుదరలేదు అంతే.
సినిమా దేవినేని ఏంగిల్ లో, ఆయన పదే పదే ఇంటర్వూల్లో చెప్పే విషయాల ఆధారంగా తీసినట్లుందనే విమర్శకు మీ సమాధానం?
అబ్బే..అస్సలు సరికాదు. ఆర్జీవీగారి సంగతి మీకు తెలుసుగా. ఆయన ఎవ్వరి మాటా వినరు.
వంగవీటి సినిమాలో మీరు కొత్తగా చెప్పిందేమిటి? కొత్త విషయాలు అంటే జనాలకు తెలియని విషయాలు చెప్పడం కన్నా, మర్డర్ స్కెచ్ లు, వాటి అమలు ఇలాంటి వాటికే ప్రాధాన్యత ఇచ్చినట్లుంది కదా? తరచు వినిపించే మానవ సంబంధాలు, భావోద్వేగాలు వెనక్కి వెళ్లిపోయినట్లుంది కదా?
కొత్తగా ఏం చెబుతాం. అందరికీ తెలిసిందే కదా. అదే చెప్పాం. భార్య, భర్త, కొడుకు, తల్లి వాళ్ల సంబంధాలు ఇవన్నీ కూడా వున్నాయి కదా?
కానీ నాకు చాలా తెలుసు అని ఆర్జీవీ పదే పదే చెప్పారు కదా?
ఇందులో చూపించిన చాలా సంగతులు ఈ తరానికి తెలియనివే కదా? అందుకే ఆయన అలా అన్నారు.
మరి రంగా హత్య వెనుక ఎవరు వున్నారో? వుండి వుంటారో ఊహా మాత్రంగా ఎందుకు చెప్పలేదు? అప్పట్లో దీనిపై విపరీతమైన కథనాలు పత్రికల్లో వచ్చాయి కదా? వాటినెందుకు విస్మరించారు?
కోర్టు తీర్పుచెప్పి, నిర్దోషి అని చెప్పిన తరువాత, ఆ వ్యక్తి చేసి వుంటాడు అని ఎలా చెప్పగలం?
సినిమా విడుదలయ్యాక వంగవీటి రాథాతో మాట్లాడారా?
మాట్లాడాను. కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాను. కానీ అయినట్లు కనిపించలేదు. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చెప్పండి..సినిమాలో ఎక్కడయినా ఒక్క సీన్లో అయినా రంగా గారిని కించపరిచినట్లు వుందా? చూపించండి.
దాదాపు నాలుగు కోస్తా జిల్లాల్లో ఊరూరా విగ్రహాలు వున్న నాయకుడి పేరుతో సినిమా తీస్తున్నపుడు, ఆయన అభిమానులు లేదా వర్గీయులు ఏం కోరుకుంటారో అంచనా వేయలేదా ముందుగా?
ఇది బయోపిక్ కాదు. ఒక వ్యక్తినే ఎలివేట్ చేసి, హీరోయిజం తేవడానికి. వాస్తవ సంఘటనల సమహారం అంతే. మొదట్నించీ వర్మ గారు అదే చెబుతూవచ్చారు.
కానీ కామన్ గా వంగవీటి అనగానే, రంగా గురించిన కథ, ఆయనే హీరోగా చూపించే కథ తీస్తున్నారు అనుకుంటారు కదా? అక్కడ వచ్చిందంటారా? అసంతృప్తి?
అయి వుండొచ్చు. కానీ మేం మొదటి నుంచీ క్లారిటీగా చెబుతూనే వున్నాం. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా తప్ప, ఓ వ్యక్తి సినిమా కాదు అని. పైగా వంగవీటి కావచ్చు, దేవినేని కావచ్చు. ప్రజల మనుషులు. వారి ప్రొఫైల్ వారికి వుంది. వారిని గౌరవించాల్సిందే.
మరి రత్నకుమారి పాత్ర ధారిణి అలా డ్యాన్స్ చేసినట్లు, ఓ హీరోయిన్ ను చూపించినట్లు..ఎందుకలా? ఆమె ఓ నాయకుడి భార్య..ఓ ప్రజా ప్రతినిథి కదా?
చెబుతున్నా కదా? ఇది బయోపిక్ కాదు. కాస్త సినిమా లిబర్టీ తీసుకున్న వాస్తవ సంఘటనల సినిమా. కొద్దిగా లిబర్టీ తీసుకున్నాం అంతే.
సినిమా విడుదలయ్యాక, డైరక్టర్ ఆర్జీవీ ఇచ్చిన ప్రకటనలు మరింత రెచ్చగొట్టేవిగా వున్నాయి కదా?
ఇకపై అలాంటివి వుండవు. అన్నీ సెటిల్ చేసాను. ఈ విషయంలో ఇరువైపులా మరే ప్రకటనలు వుండవు.
కానీ ఆయన ప్రకటనల ప్రభావంతో కోస్తాలో మళ్లీ ఒక వర్గం ఆవేశపడి వుంటే పరిస్థితి ఏమిటి? ఓ తెలివైన దర్శకుడిగా సంయమనం పాటించాలి కదా?
ఇప్పుడు ఎవరి బిజీ వారిదండీ. ఎవరో రెచ్చగొట్టేస్తే రెచ్చిపోరు ఎవరూ? అవతలి వాళ్లు ఏదో అనడంతో వర్మగారు కూడా ఆవేశపడినట్లున్నారు..అంతే. ఇకపై అవేవీ వుండవు.
ఇంతకీ సినిమా విజయవంతం అయినట్లేనా?
కచ్చితంగా.మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పటికీ మంచి కలెక్షన్లు వున్నాయి. అయినా నేను డబ్బుల కోసం సినిమాలు తీయడం లేదు. నాకు ఇష్టమై తీస్తున్నా. నా వ్యాపారాలు నాకు వున్నాయి.
విఎస్ఎన్ మూర్తి